రమేశుడి మాటలు విని, శాంతకు ప్రయాణం మానుకుందామనిపించింది. కాని, అంతా నిర్ణయించుకుని, తండ్రి కూడా వచ్చేశాక ఆఖరుక్షణాల్లో వెళ్ళనని చెప్పటం ఎలా?
"అయితే నన్ను వెళ్ళమంటావా, ఒద్ధంటావా?" అంది చిన్నబుచ్చుకుంటూ.
"అంతా నిశ్చయమయిపోయాక నన్నడిగితే నేనేం చెప్పను? ఇదిగో ఈ మాత్రలు రోజుకు రెండు తీసుకోండి. ఇవి ఇద్దామనే వచ్చాను. తల నొప్పి మరీ ఎక్కువగా ఉంటే, ఈ ములాము రాసుకోండి" అంటూ మాత్రలూ, ములామూ శాంతకు అందిచ్చాడు.
"చాలా థ్యాంక్స్ రమేష్!"
"తలనొప్పి ఎక్కువయితే ఇక్కడికే వచ్చేయండి - ఎంతయినా అది చిన్న ఊరు."
"అలాగే; నీ ఈ సలహాకు ఫీజు ఎంత?" అని చిలిపిగా అడిగింది శాంత.
"పదిహేను రోజుల్లోగా మీరు ఇక్కడికి వచ్చేయాలి. అదే నా ఫీజు."
"రాకపోతే?"
"రాకపోతే, మీ జట్టు వదిలేస్తాను. రవ్వ లడ్డుల వెన్న, సినిమా-ఏవీ నా కోపాన్ని పోగొట్టలేవు. గుర్తుంచుకోండి" అన్నాడు హెచ్చరిస్తున్నట్టు. "వెన్నెల- కాంతివంటి దేహచ్చాయగల అమ్మాయి?"
రమేశ్ తనను తానే మరిచిపోయాడు.
"చాలదు! చంద్రబింబంలాంటి మొహం, పద్మాల్లాంటి కళ్ళు, సంపంగి పూవులాటి........."
"రమేష్, ఇహ నాకు నిద్దరొస్తోంది. తెల్లార గట్టె లేవాలి గాని, ఇక వెళ్ళు బాబూ" అంటూ అతడిని బయటకు పంపించి తలుపు వేసుకుంది.
రమేశ్ తన కాబోయే భార్య వర్ణన సగంలోనే ఆగిపోయినందుకు బాధపడుతూ వెళ్ళిపోయాడు.
శాంత, "చూశారా భార్య అంటే ఎలా మురిసిపోతాడో" అంది భర్తతో.
"అంతే మరి; ఆ వయసులో నేనూ అలాగే ఉండేవాడిని. ఎన్ని కలలు కన్నానో. కాని, ఇప్పుడు అర్ధమయింది పెళ్ళామంటే ఏమిటో" అన్నాడు కృష్ణమూర్తి.
"పెళ్ళామంటే ఏమిటి?" కుతూహలంతో అడిగింది శాంత.
"ఒక కవి చెప్పాడు: 'స్త్రీ పెళ్ళికి ముందు పురుషుడికి ఓ రహస్యం; పెళ్ళయ్యాక ఓ సమస్య' అని."
"ఆఁ అయితే మీ కిప్పుడు ఓ సమస్యగా తయారయ్యానా ఏమిటి?"
"కాదా మరి? నీ తలనొప్పి నాకు నిజంగానే ఓ సమస్యగా పరిణమించింది" కృష్ణమూర్తి నవ్వుతూ న్నా, ఆమె ఆరోగ్యం గురించి అతడి మనసులో ఉన్న వ్యధ అతడి మొహంలోనే వ్యక్తమయింది.
"మరేం బెంగపడకండి. గాలి-మార్పుతో నా తలనొప్పి చెప్పీ-చెయ్యకుండా పారిపోతుంది" ని దైర్యం చెప్పింది శాంత.
మర్నాడు ఉహాయం రమేష్ నిద్ర లేచేసరికి సంత తన తండ్రితో ఊరికి వెళ్ళిపోయింది. అలారం గడియారం సహాయంతో నిద్ర లేచాడు. వదిన కబుర్లు లేక అప్పుడే చికాకు పడటానికి మొదలెట్టాడు. కాస్త త్వరగానే కాలేజీకి బయల్దేరాడు.
వెళ్ళిన మర్నాడే ఉత్తరం రాసింది శాంత. అమ్మా, నాన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు-అందర్నీ కలుసుకుని సంతోషంతో తలనొప్పిని కొద్ధిగా మరిచిపోగలుగుతున్నానని రాసింది. అది విని అందరూ సంతోషించారు. కాని, రమేశుడు మాత్రం ఎప్పటిలాగానే వ్యాఖ్యానించాడు.
"వదిన తలనొప్పి మరిచిపోగలుగుతున్నాననే రాశారు. కాని, తగ్గిందని కాదు. కాబట్టి అంత సంతోషం చాల్సిన విషయమేం కాదు"
సాయంకాలం ఇంటికి వచ్చిన కృష్ణమూర్తి: "అమ్మా, ఈమారు దసరాకు శేషగిరి వస్తున్నా డమ్మా! బొంబాయినుండి భార్యా, కూతురూ కూడా వస్తున్నారు. బహుశా ఎల్లుండి రావచ్చు" అని చెప్పాడు.
"శాంత కూడా లేదు కదా. బొంబాయిలో ఉండే వాళ్ళాయె. వాళ్ళకు తగ్గట్టుగా అన్నీ నాజూగ్గా నేనేం చేయగలను? అంత నాగరికత నా కెక్కడిది చెప్పు? ఇప్పుడేం చేయను?" అని వాపోయాడు సుశీలమ్మగారు.
"అయితే వెంటనే వదినను రమ్మని రాసేస్తాను ఇక ఏ బాధా ఉండదు" అంటూ, అందుకున్నాడు రమేష్.
"ఒద్దు రమేష్! ఇంకా ఇప్పుడేగా వెళ్ళింది. అప్పుడే రాస్తే బావుండదు" అని సుశీలమ్మగారు వారించినా, రమేష్ వినలేదు.
"వదినా! మీ ఇంటికి బొంబాయినుండి అతిథులు వచ్చారు. మీరు వచ్చి, ఆదర సత్కారాల భారం వహించాలి. అమ్మకు ఏమీ చేతకాదు" అని ఓ పోస్టుకార్డు గీచి పడేశాడు.
శాంత రాలేదు. కాని, రమేశుడి కో చిన్న ఉత్తరం వచ్చింది.
"నేను రాలేను. వారి ఆదర సత్కారాల బాధ్యతనీకు చెందింది."
చదివి, కోపంతో ఉత్తరాన్ని చింపి పారేశాడు.
శేషగిరి వస్తున్నాడని కృష్ణమూర్తికి చాలా సంతోషంగా ఉంది. వారిద్దరూ ఇంటర్ వరకూ కలిసే చదివారు. తరువాత వాళ్ళ వృత్తులు వేరు కావడంతోబాటు జీవితాలు కూడా వేరు మార్గాలలో సాగిపోయాయి. డాక్టర్ శేషగిరి బొంబాయి వెళ్ళి, అక్కడే ప్రాక్టీసు చెయ్యసాగాడు. స్నేహితులు కలుసుకోవటం చాలా అరుదైనా, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా పలకరించుకుంటూనే ఉన్నారు.
చాలా కాలానికి స్నేహితుడిని కలుసుకోబోతున్నం దుకు సంతోషంగా ఉన్నా, ఈ సమయంలో శాంత లేకపోవటం పెద్ద లోటనిపించింది కృష్ణమూర్తికి.
శేషగిరి-దంపతులు వచ్చేందుకు ముందురోజు రాత్రి కూడా తల్లీ కొడుకులు ఇదే విషయం మాట్లాడుకున్నారు.
"నేను పాతకాలందాన్ని. ఈ కాలపు నయం, నాజూకు నాకేం తెలుస్తాయి" అని చిన్నబుచ్చుకున్నారు సుశీలమ్మగారు.
"మనసు వచ్చినట్టే చేస్తే సరి" అన్నాడు రమేశ్.
"ఆ బొంబాయి - పిల్ల నా మొరటుతనానికి నవ్వుకుంటుందంతే."
"నవ్వుకోనీ, మాకు చేతనయ్యేది ఇలాగే అంటే సరి" అన్నాడు రమేశ్.
"నువ్వూరుకో. ఇక మాట్లాడకు" అని విసుక్కున్నారు సుశీలమ్మగారు.
కృష్ణమూర్తి "నువ్వేం బెంగపెట్టుకోకమ్మా! వాళ్ళేమీ అనుకోరు" అని ధైర్యం చెప్పాడు.
కృష్ణమూర్తి ఆఫీసుకు సెలవుపెట్టి స్నేహితుడికి స్వాగతమివ్వటానికి స్టేషనుకు వెళ్ళాడు.
ఇంటిముందు టాక్సీ ఆగగానే, సుశీలమ్మ గారు, శేషగిరిరావుగారు బయటకు వచ్చి నిలబడ్డారు. అందరూ టాక్సీనుండి దిగారు. కృష్ణమూర్తి తన స్నేహితుడిని, అతడి భార్యను తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. నాలుగేళ్ళ ఆశా కుతూహలంతో కొత్త మొహాలను చూస్తోంది.
శేషగిరి చుట్టూ చూసి, "మీ ఆవిడ కనిపించదేం?" అని అడిగాడు.
"ఊళ్ళో లేదు. పుట్టింటికి వెళ్ళింది."
"ఓ, అయితే మా కందరికీ మిఠాయి పంచుతానన్నమాట."
"అబ్బే, అదేంలేదు; ఊరికే వెళ్ళింది" అన్నాడు కృష్ణమూర్తి.
శేషగిరి-ప్రశ్న విని సుశీలమ్మగారి మనస్సు చిన్నబోయింది. కృష్ణమూర్తికి పెళ్ళయి పన్నెండేళ్ళకు పైగా అయినా, అ ఇంట్లో పసిపాపను చూసుకునే అదృష్టం నోచుకోలేదు. వృద్ధాప్యంలోకి అడుగు పెట్టిన ఆమెకు సహజంగానే మనవడిని ఎత్తుకోవాలని ఆశగా ఉంది.
కాని, కోడలి ఎదుట ఎప్పుడూ ఆ విషయాలు గురించి ఎత్తేవారేగాదు. వృధాగా కోడలి మనస్సు నొప్పించటం ఆమెకు ఇష్టం ఉండేదికాదు. వీటన్నిటి వల్లా అవ్యక్తమైన విచారం ఆ కాపురంలో చోటు చేసుకొని ఉంది.
సుశీలమ్మగారి మొహంలో క్షణకాలం కనిపించి మాయమయిన విషాద-రేఖను సూక్ష్మమతియైన రత్న గమనించింది. ఎంతయినా తనూ ఓ ఆడదే కదా!
"ఇంట్లో మీ రొక్కరేకదూ ఉండటం. మేమంతా వచ్చి, మీకు చాలా శ్రమను కల్పిస్తున్నాం',
