Previous Page Next Page 
వసంతం పేజి 4

   
    "నేను వెడతాను శేఖర్....మళ్ళీ కలుసుకుంటాను నిన్ను " అంటూ లేచాడు.
    "ఇవేళ నిన్ను ఉండమనే హక్కుకూడా లేదు గోపాల్....వసంతని క్షమించు....." అన్నాడు శేఖర్.
    "అలా ఏమీ బాధపడకు....నీ మనస్సు తేలిక పడుతుందంటే విషయం ఏమిటో చెప్పు - వీలయితే రేపు వొస్తాను" అని సెలవు తీసుకొని మెట్లదగ్గర హఠాత్తుగా జ్ఞాపకం వొచ్చి "వసంతతో చెప్పు" అని త్వరత్వరగా బయలుదేరాడు.
    శశిరేఖతో ఆరుగంటలకి వొస్తానని చెప్పేడు ఇంకా గంట వ్యవధి వుంది. ఇంటికి వెళ్లేం దుకు మనస్కరించలేదు. రామకృష్ణామఠందాకా వొచ్చి సిమెంటు బెంచీమీద కూర్చుని సముద్ర తరంగాలని చూడసాగాడు.
    పొంగి పొంగి వొచ్చి తీరాన్న తునాతునక లౌతున్న కెరటాలు తన ఆశల్నీ ఆశయాలనీ వెక్కిరిస్తున్నట్లనిపించింది అతనికి. కాని ఆగకుండా. అనంతంగా తోసుకొని వొస్తూన్న కెరటాలు తనకి నీతినీ బోధించుతున్నాయి. ఈ చిన్న చిన్న ఆశాభంగాలన్నీ కలిపితే ఓ జీవితం ఒక తరంగం.....అలాటివి అసంఖ్యాకంగా కలిపితే జీవితం-సముద్రం........అనిపించింది. గోపాలానికి.
    తన ఆలోచనలకి తనే నవ్వుకున్నాడు.
    ఒక్కసారి అతనికి వసంత జ్ఞాపకం వొచ్చింది... ఆ బట్టల్లో, అవధులుదాటి ప్రవహిస్తోన్న ఆమె సౌందర్యం మెరపులాగ మళ్ళీ జ్ఞాపకం వొచ్చింది. ఆ లేత బంగారు రంగూ. ముద్దుగా కట్టుకున్న తలా. కళ్ళల్లో దాచుకున్నా ఇమడని అందం....
    ఆమె కోపం, ఎందుకని? శేఖర్ ఏమీ అనలేదే! ఏదో విచిత్రంగా ఉంది.
    వసంత జ్ఞాపకం వొచ్చాక అతని ఆలోచన లన్నీ ఆమె మీదనే కేంద్రీకరించాయి. ఆమె దైహిక సౌందర్యం అతను మరచిపోలేక పోయాడు. హృదయం వొద్దని చెప్పినా, ఆలోచనలు మారడంలేదు.
    అక్కడ తానున్నది ఒక్క గంట. ఆ గంటలో తన బట్టలు నలిగిపోయాయి. ఆమె తన మనస్సుని గాయపరచింది. శేఖర్ బాధ చూస్తే తన హృదయం బాధపడుతోంది.
    ఏమిరోజు భగవాన్! అనుకున్నాడు.
    నెమ్మదిగా లేచాడు - టైమెంత ఐందో తెలియలేదు. చిట్టచివరి కెరటపు నురగలు చూడగానే అతనికి వసంత నవ్వుతోన్నప్పుడు జ్ఞాపకం వొచ్చింది త్వరగా నడక సాగించాడు శశిరేఖ ఇంటికి.

                              *    *    *

                                5

    అతను వెళ్ళేసరికి శశిరేఖ గుమ్మంలో నిలబడి ఎదురు చూస్తోంది. అతన్ని చూసేసరికి ఆమె ముఖం ఒక్కసారి వికసించింది.
    "ఆలశ్యంగా వొచ్చావు గోపాలం!..... కాని, వొచ్చావు!" అంది నవ్వుతూ.
    తెల్లటి సిల్కు చీరలో తలంటుకుని ఒదులుగా కట్టుకున్న జుత్తుతో, రోజూ కన్న చక్కగా కనిపిస్తోంది శశి- బహుశా అతను మళ్ళీ రావడం వల్ల కలిగిన సంతోషం ఆమెలో ఉన్న సౌందర్యాన్ని హెచ్చుచేసి వుంటుంది.
    "సారీ-పెందరాళే బయలుదేరాను - దారిలో ఆలస్యం ఐంది" అన్నాడు గోపాలం.
    ఈరోజున ఆమెలో కనిపిస్తోన్న ప్రత్యేకతని అతని కళ్ళు జాగ్రత్తగా పరీక్షించాయి, ముందర అతనికి సంతృప్తి కలిగింది. కాని,మరుక్షణం అతని ప్రయత్నమే లేకుండా వసంత భుజాలూ, చేతులూ జ్ఞాపకం వొచ్చాయి. క్షణ మాత్రం వాళ్ళిద్దరినీ సరిపోల్చుకుని ఏదో చెప్పలేని అసంతృప్తి ని అనుభవించాడు గోపాలం.
    లోపల కూర్చుని. అలా ఉన్నావేం గోపాలం?" అని అడిగింది శశిరేఖ.
    వెంటనే జవాబు ఇవ్వలేక, "ఎలాగ?" అన్నాడు గోపాలం.
    'అలిసిపోయినట్టు - ఇంకా నీ ఆలోచనలు కొంచెమూ మారలేదన్నమాట!......ఏం? అంది కొంచెం బాధగా.
    "సారీ" అన్నాడు గోపాలం. ఆ ప్రశ్న తన చేత పెద్ద అసత్యం చెప్పించకుండా తప్పించింది. ఆ సంతృప్తి వెనకే. అల్లకల్లోలంగా ఉన్న తన మనస్సు నడుస్తోన్న నల్లటి బాటలు అతనికి సిగ్గు కలుగజేశాయి. ఆమె మనసంతా తనది: తనకోసం బాధపడుతోంది..... తనకోసం కలలు కంటోంది తన తరగతి మనిషి శశి....
    వసంత ఎక్కడ? ఆమె పెద్ద లక్షాధికారికి గారాబు కూతురు- తనంటే ఎలాటి భావాలున్నా. అని శశిరేఖ భావాలలాటివికాదనే విషయం తనకి స్పష్టంగా తెలుసును. అదీకాక, ఆమె అందం తప్పిస్తే ఒక్క సద్గుణం తనకి కనిపించలేదు.
    శశిరేఖని ఎందుకు మోసం చేస్తున్నాడతను?
    -నేను ఈమెని మోసం చెయ్యలేదు అనుకున్నాడు వెంటనే. నేనేం చేశాను? ఏదో ఆలోచన తప్ప?-
    "కాఫీ తాగుతావా?"
    "ఆఁ..."
    ఆమె లోపలికివెళ్ళింది హఠాత్తుగా అతనికి జ్ఞాపకం వొచ్చింది-ఆమెకేదీ బహుమతి తేలేదని. కనీసం శుభాకాంక్షలైనా చెప్పలేదు:
    ఆమెరాగానే నిలబడి, "హేపీ బర్త్ డే శశీ!" అని. "ఏమీ తేకుండా వచ్చాను- గ్రీటింగ్ కూడా ఆలశ్యం చేశాను" అన్నాడు.
    ఆమె నవ్వి, "అందుకే నాకు సంతోషం...నువ్వెందుకు మరిచిపోయావో నాకు తెల్సును!" అంది.
    గుండె ఝల్లుమంది గోపాలానికి.
    "ఎందుకు?" అన్నాడు.
    "నీ మనస్సులో వెలితిలేదు-అందుకు" అంది.
    ఆమె ముఖంలో ఏ నటనా లేదు. బాధ పడ్డాడు గోపాలం. ఆమె చేతులు తీసుకుని, నువ్వు మామూలు మనిషిని కావు శశీ! అన్నిటినీ క్షమిస్తావు" అన్నాడు.
    క్షణమాత్రం అతనికి దగ్గరగా వొచ్చి, "అన్నీ క్షమిస్తానని అనుకోకు గోపాలం!" అంది శశి. వెంటనే అతనిచేతులు వొదిలించుకుని. "కాఫీ చల్లారిపోతోంది గోపాలం! తాగు" అంది.
    కాఫీ తాగేసరికి ఎవరో తలుపు తట్టేరు-మరో నిమిషంలో శశిరేఖా. ఆమె వెనకాల పెద్దపువ్వుల గుత్తీ. స్వీట్స్ పేకెట్ పట్టుకుని ఒక యువకుడూ లోపలికి వొచ్చేరు.
    "ఇతను రామానంద్-క్లాస్ మేట్. ఈయన గోపాలం-" అని పరస్పరం పరిచయం చేసింది శశి. గోపాలంవైపు చూసినప్పుడు ఆ యువకుడి రాక ఆమెకి ఆశ్చర్యం, అనిష్టం కలుగచేసిన విషయం ఆమె కళ్ళతో సూచించింది- కాని అతను అంత నాజూకైన విషయాలు గ్రహించే స్థితిలో లేడు.... అతని కళ్ళలో మిరుమిట్లు ఇంకా పోలేదు.

            
    "ఇవన్నీ ఎందుకు తెచ్చేరు మీరు? - అసలు ఇవేళ నా పుట్టిన రోజని ఎలాగ తెలిసింది?"అని అడిగింది శశిరేఖ రామానంద్ గ్రీటింగ్స్ విని అంత సుళువుగా మర్చిపోను మీ బర్త్ డే అందుకని ఇవి. కొంచెమూను" అన్నాడు చిరునవ్వుతో రామానంద్.
    ఈ జవాబు వినగానే శశికి చాలాసంతోషం కలిగిన విషయం గమనించాడు గోపాలం.
    ఆమె కాఫీ తేవడానికి లోపలికివెళ్ళింది. హఠాత్తుగా గది ఇరుకైపోయినట్టు అనిపించింది గోపాలానికి.
    "మీరు ఇక్కడే చదివారా? మిమ్మల్ని చూసిన గుర్తులేదు" అన్నాడు నిశ్శబ్ధాన్ని భరించలేక గోపాలం.
    "లేదండీ శశీ నేనూ కాకినాడలో ఇంటర్ చదివాము. తరవాత నాన్నగారికి నాగపూర్ ట్రాన్స్ ఫరైపోయింది. అక్కడే ఎమ్మే పూర్తి చేశాను- మొన్ననే కాంపిటిటివ్ ఎగ్జామ్స్ లో రాసి వొచ్చాను... మా నాన్నగారు ఇపుడు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఏజెంటు" అన్నాడు రామానంద్.
    "ఉంటారా ఇక్కడ?"
    "ఆఁ- ఇంకో పదిహేనురోజుల్లో రిజల్ట్సు రావాలి. అదే ఎదురుచూడ్డం...అదేదో తేలే దాకా ఇక్కడే ఉంటాను.
    కాఫీ పట్టుకుని వొచ్చి ఇచ్చింది శశిరేఖ.
    "థాంక్స్......ఎందుకింత శ్రమతీసుకున్నారు?" అన్నాడు రామానంద్.
    "శ్రమలేధండీ - మీరు తీసుకున్న శ్రమలో ఇదెన్నోవొంతు?" అంటూ అతనిచేత బలవంతంగా రెండు బిస్కట్లూ, స్వీటూ తినిపించింది.
    ఇది జరుగుతోన్నంతసేపూ గోపాలం ఏదో విచిత్రమైన అనుభూతి పొందుతున్నాడు. రామానంద్ రావడమే అతనికి ఇష్టంకాలేదు. అతని ఆదరణ కోసం శశిరేఖ తీసుకుంటూన్న ఇంటరెస్ట్ అతన్ని చాలా డిస్టర్బ్ చేస్తూంది.
    "-ఇందులో తప్పేమిటి ఉంది? స్నేహితుడిగా వొచ్చాడు- అతన్ని గౌరవం చేస్తూంది శశిరేఖ. అనవసరంగా బాధపడుతున్నాను" అని మనసులో నాలుగైదుసార్లు అనుకున్నాడు. కొంత ఉపశమనం కలిగింది. కాని, బాధ పూర్తిగా పోలేదు.
    రామానంద్ కాఫీతాగి, వక్కపొడి వేసుకుని లేచాడు వెళ్ళడానికి. "భోజనం చేసి వెళ్ళండి..." అంది శశిరేఖ.
    "వొద్దండీ కనీసం ఇవేళ. నాన్నగారి ఫ్రెండ్స్ ఎవరో డిన్నర్ కి వొస్తున్నారు. థాంక్స్ అన్నాడు.
    "మీరు భోజనానికి ఉండకుండా వెళ్ళిపోవడం బాగాలేదు. అనుకోకుండా-వచ్చారు. సంతోషించాను. కాని ఇలాగ వెళ్ళిపోడం బాగాలేదు" అన్నది శశిరేఖ, సిన్సియర్ గా.
    "థాంక్స్ ... ఇంకో రోజు వొస్తాను మీరు కావాలంటే - కాని. ఇవేళ క్షమించండి" అన్నాడు రామానంద్.
    "సరే! ఆ మాట మీద వెళ్ళనిస్తాను"
    సంతృప్తిగా చిరునవ్వునవ్వి సెలవుతీసుకుని బయటికి నడిచేడు రామానంద్. శశిరేఖ అతనితో గేటుదాకా వెళ్ళింది. అక్కడ రెండునిమిషాలు అతనితో మాట్లాడి లోపలికి వొచ్చింది.
    గోపాలం పుస్తకం ఏదో తీసుకుని పేజీలు తిరగేస్తున్నాడు. ఈ ఆగంతకుడి ఆగమనం కన్నా ఎక్కువ వ్యధ కలిగించింది అతని నిష్క్రమణం. అతనిలో కనిపిస్తోన్న ఏదో విచిత్రమైన ఆకర్షణకన్న శశిరేఖమీద దాని ప్రభావం ఎక్కువ బాధ కలిగించింది అతనికి.
    "చిన్న పిల్లాడిలాగ అలిగేవు" అని ఎవరో మందలించినట్లైంది అతనికి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS