Previous Page Next Page 
విరామం పేజి 4


    అక్కడ చాలా గుడారాలున్నాయి. ఒక పెద్ద గుడారంలోకి నన్ను సిపాయిలు తీసుకెళ్ళారు. అందులో వొక సుబేదార్ మేజరు పక్కపరిచి వున్న మంచంమీద కూచున్నాడు. నన్ను చూడగానే కుర్చీమీద కూచోమన్నాడు. అతనికి ఇంగ్లీషు వచ్చు. కథంతా విని చాలా విచారించాడు. వెంటనే నాకు పొడి డ్రస్సు యిప్పించేడు. మంచి టీ, ఆవిర్లోస్తూన్న చపాతీలు నాకోసం తెప్పించేడు. నేను తిరిగి మనిషి నయేను.
    ఆ రాత్రి అక్కడ పడుకోమన్నాడు. కాని నేను నా యూనిట్ చేరడానికి ఆతృతగా వున్నానని చెప్పేను. అతను నన్నర్ధం చేసుకున్నాడు. కాని టెలిఫోన్లింకా బాగా పనిచెయ్యడం లేదు. నా కొకట్రక్కు యిచ్చి నా యూనిట్ వెతుక్కో మన్నాడు. ఎనిమిది గంటలలోపున యూనిట్ దొరక్కపోతే తిరిగివచ్చి రాత్రి అక్కడే గడప మన్నాడు. నేను డ్రైవరు పక్కని కూచున్నా ట్రక్కు "మైనా మట్టీ" వేపు కదిలింది. బాగా చీకటి పడింది.
    "మైనా మట్టీ" దృశ్యం వేరు. విశాలమైన తిన్నని, నున్నని తారురోడ్లు, ఏ రోడ్డూ పది మైళ్ళకి తక్కువ పొడుగు లేదు. అక్కడే టెలిఫోను హెవీ ఎక్స్చేంజి. ఎయిరో డ్రోము మొదలయిన ముఖ్య మిలిట్రీ విభాగాలున్నాయి. అక్కడ పరిశుభ్రత తాండవిస్తూంది.
    ఆ నున్నటి రోడ్లమీద మా ట్రక్కు చాలా దూరం ముందుకీ వెనక్కీ తిరిగింది. ఎంత భోగట్టా చేసినా "యాకాక్" యూనిట్టే దొరక లేదు. సిపాయి డ్రైవర్ నా యూనిట్ని యెలా గినా పట్టాలని పట్టుగా వున్నాడు. సెంట్రీ ఔపించిన దగ్గరలా ట్రక్కు ఆపి, దిగివెళ్లి, సెంట్రీని, గార్డు కమాండర్ని కనుక్కుంటున్నాడు. తిరిగొచ్చి "నహీసాబ్" అని నాతో చెప్పి, వాళ్ళని పంజాబీలో బూతులు తిట్టుకునేవాడు.
    ఎనిమిదౌతూంది. నాకు నిరాశకలుగుతూంది. ఇంతలో ఎదురుగా ఒక పెద్ద మిలిట్రీ కట్టడం ఔపించింది. అది చేరగానే ట్రక్కు ఆపమని, నేనే దిగి అందులోకి వెళ్ళేను. అక్కడంతా తెల్ల వాళ్ళే వున్నారు. అది హెవీ ఎక్స్చేంజి.
    అక్కడ "F-N"లు (ఒక అశ్లీలమైన మాట) జోరుగా యెగురుతున్నాయి.
    "బిల్! F-N సిక్స్తిండియన్ హెవీ యాకాక్ నీకు తెలుసా? దాన్ని లైనులోకి తీసుకురాగలవా? దానికోసం యిక్కడొక మనిషున్నాడు. తిండిలేక, వానలో నాని, కుళ్ళిపోయిన యలకలా వున్నాడు పాపం..."
    ఆ ఉదయం నుంచి టెలిఫోను లైన్లు బాగుచేయడానికి అవకాశం చిక్కింది, క్రమేణా యూనిట్లు లైనులో కొస్తున్నాయి.
    "జానీ! ఇలా రా. ఇదిగో సిక్త్సిండియన్ మాట్లాడు," బిల్.
    అది మా వర్కుషాపు కాదు. తీగకవతల కొసని మాట్లాడుతూన్నది సార్జంటు స్మిత్,
    "ఏబుల్ బ్యాటరీ-"
    "నేను హవల్దార్ రావ్ ని మాట్లాడు తున్నా..........."
    "హవల్దార్ ఎవరు?"
    "రావ్.........."
    "వెల్...?"
    "నేను సిక్స్తిండియన్ హెనీ యాకాక్ వర్కు షాపుకి పోస్టింగు అయి వచ్చాను. హెవీ ఎక్స్చేంజి నించి మాట్లాడుతున్నా..."
    "ఆ యూనిట్టింకా పుట్టలేదు జానీ..."
    "పుట్టలేదు! కాని నీ యూనిట్టదే. నా దగ్గిర ఆర్దర్సున్నాయి. టెలిఫోన్లోంచి ఈలలు, పాటలు నవ్వులు వినిపిస్తున్నాయి.
    "సరే, అక్కడేదైనా ట్రక్కులదా?"
    "ఉందికాని. యిది ఒక సిక్కు డిటాచ్ మెంటుంది. డ్రైవరుకి సిక్స్తిండియన్ తెలీదు..."
    "తస్సదియ్య... పోనీ నువ్వక్కడే వుండు. పావుగంటలో ట్రాన్సుపోర్టు పంపుతున్నా-ఓకే?..."
    "ఓకే- థాంక్యూ..."
    నేను హెవీ ఎక్స్చేంజివాళ్ళకి చాలా థాంక్సు చెప్పి బైట కొచ్చా. సంగతి డ్రైవరుతో చెప్పా.
    "అయితే ఆ ట్రక్కు వచ్చేవరకూ నేను ఆగి వెళ్ళనా సాబ్?"
    "దయచేసి అలా చెయ్యి..."    
    "ఠీక్ సాబ్..."
    ట్రక్కొచ్చింది. డ్రైవరొక లాన్స్ బొంబార్డియరు హోదా వాడు. సిక్కు డ్రైవరు నా సామాను రెండో ట్రక్కులో వేసేడు. మేజర్ సాబ్ కి నా సలాం చెప్పమన్నా. అతను తన ట్రక్కు తిప్పుకు వెళ్ళిపోయేడు.
    "కమాన్ జానీ..." లా.కా.
    నేను డ్రైవరు పక్క సీటులోకి దూకా. ట్రక్కు పరుగు లంకించుకుంది. నున్నటి తడి రోడ్లమీద తేజో వంతమైన తన దీపాలకాంతిని మట్టుకుంటూ గాలిలా పోతూంది. లాకా అదే పనిగా ఏదో మాట్టాడుతున్నాడు, ట్రక్కుచప్పుడొకటి దానికి తోడు లా. కా. బాగా డోసు మీదున్నాడు నేను యస్ నో.లతో కాలక్షేపం చేస్తున్నా.    
    చర్రున బండి కుడి ప్రక్కకి కోసేడు మెటల్ రోడ్లు విడిచి బండి అడివి త్రోవ పట్టింది. రెండు ప్రక్కలా ఎత్తైన చెట్లు- మధ్య యిరుకైన బురదత్రోవ, బురదనీ తోవలో బడ్డ చెట్ల కొమ్మల్ని మట్టుకుపోతూంది ట్రక్కు. వెళ్ళి వెళ్ళి ముందువేపు కుడిచక్రం బురద గుంటలో కూరుకు పోయింది. బండి కదల్దు.
    డ్రైవరు "F-N"ల వర్షం కురిపిస్తూ చివాల్న బండి దిగి చక్రం పరిశీలించాడు. బురదగుంటలో సగం పైగా దిగబడిపోయింది. చక్రం కదుల్తుందిగాని బండి ముందుకి పోదు వెనక్కిరాదు. డ్రైవరు యిటూ అటూ వున్న మొక్కలు పీకి. చక్రం కింద దోసి వచ్చి కూర్చుని బండి స్టార్టు జేశాడు. గర్రు గర్రుమంటుంది కాని బండి కదల్దు. మళ్ళీ "F-N"ల వర్షం కురిపించి, కిందికదిగి. మరో కొంత రొట్ట పీకి. చక్రం కిందపెట్టి, సీట్లోకొచ్చి, స్టార్టు చేశాడు. మళ్ళీ అంతే. ఇలా చాలాసార్లు చేశాడు. లాభం లేకపోయింది. వచ్చి సీట్లో కూచుని. నావేపు చూసి నవ్వి. సిగరెట్లుతీసి నా కోటిచ్చి తనోటి ముట్టించేడు?
    "ఏం చేద్దాం" నేను.
    "సిగరెట్టు కాల్చు..." మళ్ళీ నవ్వి హాయిగా ఈలపాట పాడేడు.
    అలా భజన చేస్తూ పావుగంట యిద్దరం కూచున్నాం. అదంతా పట్టి అడివి. సరైన మార్గం కాదు. అక్కడికి యాభై గజాల దూరం లోనే అడ్డంగా ఒకరోడ్డుంది. అదికూడా కచ్చా రోడ్డే కాని కాస్త విశాలంగా వుంది.
    అప్పుడే అదృష్టవశాత్తు ఆ రోడ్డుమీంచి ఒక "బ్రేక్ డౌన్" వెళ్ళిపోతూంది. మా లా. కా, దాన్ని ఆపేడు. "ఏయ్ జోవ్! నాట్రక్కు యిక్కడే బురదలో కూరుకుపోయింది. దయ చేసి. ఆ జంతువుని బైటకి లాగిపారేస్తావా?"
    బ్రేక్ డౌన్ డ్రైవరు తన సీటులోంచి కాస్త వంగిచూసి "ఓకే" అన్నాడు. మా లా. కా. "ఓకే, ఓకే, అని దారి చూపిస్తూంటే బ్రేక్ డౌన్ రివర్సులో మా ట్రక్కు ముందు కొచ్చింది. వాళ్ళిద్దరూ "టౌ రోపు" దానికి తగిలించి సుళువుగా బైటకి లాగేశారు. బ్రేక్ డౌను వెళ్ళిపోయింది. మేము బైల్దేరేం.
    మరో పావుగంటలో ఏబుల్ బ్యాటరీ చేరాం. నేను వెంటనే ఆర్దర్లీ ఆఫీసర్ని కలిసేను. నా పేరు వగైరా అతనికి చెప్పేను. నేను పడ్డ అవస్తంతా చెప్పేను. అతను వెంటనే రెజి మెంటల్ హెడ్ క్వార్టర్సు లొ ఎడ్జటంటుతో ఫోన్లో మాట్లాడేడు.    
    "చూడు హవల్దార్ రావు! మీ వర్కుషాపు యూనిటింకా ఆరంభం కాలేదు. నువ్వే ఆదికి ముందొచ్చేవు. నువ్వే వెదుళ్ళు నరికి చీల్చి నిర్మాణం ఆరంభించాలి. కొద్దిరోజుల్లో నీ కెప్టెన్ ఆఫీసర్ కమాండింగు వస్తాడు క్రమేణా అంతా వస్తారు...! ఆర్డర్లీ ఆఫీసర్.
    అంతవరకూ నేనెక్కడుండేది?
    "ఆర్. హెచ్. క్యూలో, ఈ రాత్రి ఇక్కడ పడుకో. పొద్దున్న ట్రక్కులో అక్కడికి వెళుదువుగాని, భోంచేశావా?"
    "లేదు..."
    "కన్నియస్సన్!"
    "సాబ్..."
    "ఇతనికి ఖాళీగావున్న "బాషా" (వెదురు గది) చూపించు. భోజనం పెట్టించు."
    "వాంగో సార్..."
    కన్నియప్పన్ సిపాయి గన్నరు. నా గదికి దారి చూపించేడు, పక్క పరిచేడు, నేను కాళ్ళు చేతులు కడుక్కున్న తరవాత భోజనం తెచ్చేడు.
    భోంచేసి పడుకున్నా.
    మర్నాడుదయం ఏడుగంటలకి ఆర్. హెచ్ క్యూ చేరారు. అక్కడ సిక్కు మౌలాసింగ్, మళయాళీ "ప్రభు" నా పహ వుద్యోగస్తులున్నారు. నాకంటే బాగా సీనియర్లు. మంచివాళ్ళు.
    పది రోజులు పోయాక మా ఓసీ కెప్టెన్ విన్ స్టన్ వచ్చేడు. క్రమంగా కొంతమంది విదేశీ, స్వదేశీ సిబ్బంది వచ్చేరు,
    మా రెజిమెంటు బళ్ళు, గన్నులు మరమ్మత్తు చెయ్యడం. వాటన్నిటి నీ ఎప్పటి కప్పుడు "తయార్" గా వుంచడం మా వర్కు షాపు విధి,
    విమాన విధ్వంసక శతఘ్నులకి "రాడార్" ఆయువుపట్టు. అప్పుడు దాని చరిత్ర అతి రహస్యమైంది. పిడిక్టర్లు పాడైతే వాటిని అతి త్వరగా బాగు చెయ్యాలి. ఆ పని తెల్లవాళ్ళే చేసేవారు. బారతీయుల్ని ఆ జోలికి రానిచ్చేవారుకారు. ఆఫీసులో దానికి సంబంధించిన ఫైలు అతి రహస్యమైంది. అప్పట్లో దాన్ని "G. L." అనేవారు. అంటే గన్ లేయింగ్. ఈ జి. యల్ పరికరమే తరువాత రాడార్ గా మారింది. యుద్ధం వత్తిడి యెక్కువై. మనుషులు చాలని పరిస్థితిలో, క్రమేణా భారతీయ ఇన్ స్ట్రుమెంటు మెకానిక్కులకికూడా ఈ అతిరహస్యమైన సాంకేతిక విద్య నేర్పక తప్పలేదు. మనవాళ్ళు శతఘ్ని యెక్కడ పాడైందో కనిపెట్టడం. ప్రిడిక్టరు పానెల్సు యెలా విప్పాలో, అవి యెలా మరమత్తు చెయ్యాలో అన్న విషయాల్లో గొప్ప ప్రావీణ్యం సంపాదించారు. అందుకే కామోసు మొన్న పాకిస్తాన్ యుద్ధంలో సాబర్ జట్ విమానాల్ని పిట్టల్ని కొట్టినట్టు కాల్చి పారేశారు. అప్పటి అనుభవం ఈ తరంలో పనికొచ్చింది.

                                    4

    "ఓ బి దేశ బంథోరే! అమీ తొరే చాయ్ నా- జొఖౌన్ తీరె మొనేపొడీ. తాఖొస్ తొరె కాయ్ నా..." (దూరదేశంలో వున్న ఓ ప్రియుడా. నువ్వు నాకక్కర్లేదు. కారణం, నేను కావాలన్నప్పుడు నువ్వు లభించవు).
    నిశ్శబ్దాన్నీ, చీకటినీ చీల్చుకుని, తారా జువ్వలా, మిలమిలా మెరిసే చుక్కల్లోకి దూసుకుపోయింది కంఠం.
    పదకొండేళ్ళ కుర్రాడు పలచగా, నల్లగా వున్నాడు. మూరెడు చింకి కుళ్ళుగుడ్డ మొలకి చుట్టుకున్నాడు. ఎడంచేతిలో పొడుగాటి సన్నటి కర్రుంది, కుడిచేతిలొ నేనిచ్చిన సిగరెట్టుంది. కంచుగీసినట్టున్న కంఠంతో. కంఠంలో వొణుకుతో, జంకు కొంకులేకుండా నిబ్బరంగా విసిరేడు పాట, నా ఒళ్ళు ఝల్లుమంది.
    ఆర్, హెచ్, క్యూ. చిట్టడివిలో వుంది, అక్కడ వెదురు పొద లెక్కువ, పులులు, వెలుగుబంట్లున్నాయి. మా క్యాంపు నించి రెండు ఫర్లాంగు లెటువేపైనా వెడితేచాలు, యిక అడుగు పెడితే ముందేముందో అనిపించే అడివి అందం చూడొచ్చు. గార్డు రూముకి పక్కనే నా గది వుంది. తరుచు రాత్రుళ్ళు గార్డు కమాండరు "అడి అడి" (కొట్టు కొట్టు తమిళం) అన్నకేక వెంటనే రైపిలు పేల్చిన శబ్దంగా వినిపించేవి. నేను లేచి బైటకొచ్చి కనుక్కుంటే "పులి సార్ పులి అనే వాడు గార్డు కమాండరు.
    ప్రతిరోజూ సాయంత్రం ఆఫీసునించి వచ్చేకా, చెల్లో స్నానం చేసి, ఫలహారం తిని, నేను మేలాసింగ్. ప్రభూ షికారు వెళ్ళే వాళ్ళం- ఎక్కువ దూరం వెళితే ప్రమాదం.
    ఆ చుట్టుపట్ల చిన్న చిన్న గ్రామాలున్నాయి, అక్కడి ప్రజలు యెక్కువమంది ముస్లిములు. వాళ్ళెప్పుడూ ఉర్దూ, హిందీ వినలేదు. వాళ్ళు మాట్లాడేది బెంగాలీ, కాని అది తూర్పు బెంగాలు భాష. నాకు కొంచెం కూడా అర్ధంకాదు.
    నామీద ఆ గ్రామీణులందరికీ చాలా అభిమానం. నేను వాళ్ళతో చెట్టాపట్టాలేసి తిరిగే వాన్ని. వాళ్ళకది చాలా గొప్పగా వుండేది. వాళ్ళకి నా మాటలు బోధపడవు. నాకు వాళ్ళ మాటలర్ధం కావు. అయినా నవ్వుతూ మాట్లాడుకునే వాళ్ళం.
    మా యూనిటు నానుకునే వున్న వూరు షిరాజ్ వూరు. అక్కడ సుమారిరవై యిళ్ళున్నాయి. ఒకటి రెండు తప్పితే అన్నీ పూరి కొంపలే. చెరువుంది. అందులోనే మేం ప్రతి ఉదయం సాయంత్రం స్నానం చేసేవాళ్ళం.
    ఆ ఊరు పెద్ద అబ్దుల్. అతనికి నలభైయై దేళ్ళుంటాయి. నలుగురు భార్యలున్నారు. వాళ్ళకి యేమంత ఘోషాలేదు. చుట్టు పట్ల మిలిట్రీ వాళ్ళుండడం చేత వయసులో వున్న స్త్రీలు వొంటరిగా బైట మెసిలేవారు కారు.
    అబ్దుల్ నన్ను భుజం మీద చెయ్యేసి యింట్లో తీసుకెళ్ళేవాడు. టీ యిచ్చేవాడు. నిజానికా టీగుండ. పాలడబ్బా నే నిచ్చినవే.
    తినడానికి తిండిలేకపోయినా. బతుకొక యాతనైనా. ఆ గ్రామీణులు లేని సంతోషం తెచ్చుకుని జీవితం లాగిస్తున్నారు. పచ్చనిగుట్టలు, లెక్కలేనన్ని చెరువులు, చెట్లు చామలమధ్య ప్రశాంతంగా. అతి సామాన్యంగా బ్రతుకు వెళ్ళబుచ్చె వీళ్ళు, తమ ఉనికి మీదికి వేలకి వేలు మిలిట్రీ వాళ్ళు, నానా దేశాలవాళ్ళు, లారీలతో, టాంకులతో ఇతర భారీయంత్ర సామగ్రితో వచ్చి చెలరేగుతూంటే, నిస్సహాయంగా, దిస్సపోయి చూస్తున్నారు. పిల్లల ముందుగతి గురించి. స్త్రీల మానం గురించి బెంగపడి కుంగిపోతున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS