హోటల్లో కాలుపెట్టిన మధుమూర్తి దూరంగా మూలకూర్చుని ఇడ్లీ తింటున్న రమాకాంత్ ను చూడగానే పోల్చుకొన్నాడు. అతడి కెందుకో రమాకాంత్ మీద మొదటి పరిచయంలోనే సదభిప్రాయం ఏర్పడింది. ముఖ్యంగా అతడిని ఆకట్టుకొంది, ఆకర్షించింది రమాకాంత్ అందమైన విగ్రహం. మధు మూర్తి పక్కన సుధీర్ కూడా ఉన్నాడు. రమాకాంత్ ముందు ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, "నమస్తే! అనుకోకుండా మళ్ళీ కలుసుకొన్నాం" అన్నాడు చిరునవ్వుతో.
"నమస్తే!" అంటూ తానూ నవ్వి చేతిలో ఇడ్లీ ముక్కను నోట్లో వేసుకొన్నాడు రమాకాంత్.
సుధీర్ ను అతనికి పరిచయంచేసి, "మీరూ ఒంటరివారేనా?" అని సందేహంగా సంభాషణ ప్రారంభించాడు మధు.
"కాదండీ వివాహమైంది. ఇద్దరు పిల్లలు. ఈ ఊరు ట్రాన్స్ ఫరైంది. పదిహేను రోజులనుండి ఇంటికోసం తిరుగుతున్నాను. ఎక్కడా దొరకలేదు. ఇల్లు కుదరగానే ఫామిలీని తీసుకువస్తాను. మీకు తెలిసినంతలో ఖాళీ ఇల్లు ఉంటే చెప్పండి!"
"ఎక్కడో ఎందుకండీ? మా మధు ఇల్లంతా ఖాళీయే" అని, "ఏరా, మధూ, నీకు అంత ఇల్లెందుకు? కిందో, మేడమీదో వీరికి ఇవ్వకూడదూ?" అన్నాడు సుధీర్.
"మా ఇల్లా? అది అద్దె కిచ్చే అలవాటు లేదే?"
"లేకపోతే ఏం? నీ కంత అనవసరమైనప్పుడు ఎందు కివ్వకూడదూ?" రెట్టించాడు సుధీర్.
"ఎంతో పెద్దది అక్కర్లేదు, మధుమూర్తి గారూ! మూడు గదులు చాలు మాకు. మీకు ఎలాంటి ఇబ్బంది కలగనీయమని మాట ఇస్తున్నాను. అంతగా మీకు ఇష్టంలేకపోతే మరొక ఇల్లు దొరికేవరకు ఉంటాం." అడిగాడు నమ్రతగా రమాకాంత్. ఎందుకో అతని అభ్యర్ధన తోసిపుచ్చలేక పోయాడు మధు.
"సరే, అలాగే ఇప్పుడు వస్తారా? చూసుకొందురుగాని."
"అలాగే. చాలా థాంక్స్" అంటూ లేచాడు రమాకాంత్.
గేటు తెరిచి ముగ్గురూ కాంపౌండ్ లో ప్రవేశిస్తూ ఉండగానే రమాకాంత్ చుట్టూ కలయజూశాడు. రంగు రంగుల గులాబీలన్నీ రాశిపోసినట్లు ఒక పక్కన ఊగులాడుతూంటే వాటిని వెక్కిరిస్తూ తల ఎత్తుకు నిలబడినాయి చామంతులు మరొక పక్క రెండడుగులు వేసేటప్పటికి సన్నజాజుల గుబాళింపులు, సంపెంగల సౌరభాలు అన్నీ కలిసి మత్తు కలిగిస్తున్నాయి. సంపెంగ పాదాల క్రింద, సన్నజాజుల పందిరి క్రింద, రంగు రంగుల గులాబీల మధ్య ఉన్న సిమెంటు బెంచీలు ప్రేమతో ఆహ్వానిస్తున్నాయి. చెట్ల మధ్య తున్న లైట్లు సుస్వాగతం చెబుతున్నాయి. అందమైన, మనోహరమైన ఆ తోటను చూస్తూ నిలుచున్న రమాకాంత్ కళ్ళు తోట గేటుపై వేళ్ళాడుతున్న 'లలితా గార్డెన్' అనే అక్షరాలతో వెలుగుతున్న లైట్ల మీద పడ్డాయి. "లోపలకు రండి" సుధీర్ మాటతో ఈ లోకంలో పడి, "లలిత ఎవరూ?" అని అడిగాడు.

"మా అక్క" అన్నాడు మధు.
"ఆమె ఎంత అదృష్ట వంతురాలు! ఆమె పేరుతో ఇంత చక్కటి తోటను నిర్మించుకున్నందుకు ఆమె ఇంత చక్కటి తోటను నిర్మించుకున్నందుకు ఆమె నభినందించవలసిందే, మధుబాబూ. ఈ తోటలో కూర్చున్న ప్రతివాడూ ఏదో రచన చేయగలడు సుమా!" అన్నాడు.
"లేదు. నాకూ, రచనలకూ చాలా దూరం ఉంది లెండి. అయినా మీరు ప్రశంసిస్తున్న ఆ లలిత ఈ ప్రపంచాన్ని వదిలి రెండేళ్ళయింది. ఆమె వేసిన ఈ తోటకు స్మృతి చిహ్నంగా ఆ పేరు పెట్టాను." కంటి నిండుకు వచ్చిన నీరు అలాగే ఆగిపోయింది. జేబులో కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకొనే నెపంతో ఎవరూ చూడకుండా కళ్ళు కూడా తుడుచుకొన్నాడు. కాని, రమాకాంత్ చూడనే చూశాడు.
"ఐ యామ్ వెరీ సారీ. మీకు కష్టం కలిగించితే క్షమించండి" అన్నాడు బాధగా రమాకాంత్.
"ఫర్వాలేదు. గడిచిన విషాదం తలుచుకోవటంలో ఆనందం కూడా ఉంటుంది" అంటూ లోపలకు దారి తీశాడు. 'అది నిజమే' నన్నట్లు కుంపట్లలో ఆడవారి చీరెలనే ధిక్కరించే రంగులలో ఉన్న క్రోటన్సు ఒక్క సారి తల లూపాయి.
చక్కటి చిన్న మేడ. క్రింద పెద్దహాలు, నాలుగు గదులు ఉన్నాయి. మూడు గదుల అవుట్ హౌస్ లో పనివాడు ఉంటున్నాడు భార్యతో. క్రింది భాగాన్ని తృప్తిగా చూసి మరొక సారి ఇంత చక్కటి ఇల్లు ఇచ్చి నందుకు మధుమూర్తికి అభినందనలు తెలిపాడు రమాకాంత్.
"ఎప్పుడు ప్రవేశిస్తారు?" మధు అడిగాడు.
"ఎప్పుడోనా! తెల్లవారేటప్పటికి దిగనూ?" అన్నాడు సంభ్రమంగా.
"మరి, పిల్లల నెప్పుడు తీసుకొస్తారు?" సుధీర్ ప్రశ్న.
"నాలుగు రోజుల్లో వచ్చేస్తారు. మరి నే వెళ్ళొస్తాను" అని వెళ్ళిపోయాడు రమాకాంత్.
"మనిషి మంచివాడులాగే ఉన్నాడు." సుధీర్ అన్నాడు.
"మంచివాడి మాట అటుంచి అందమైనవాడు. చూచినకొద్దీ చూడాలనిపించే అందం."
"అదేమిట్రా! ఆడపిల్ల లాగ మగవాడి అందాన్ని మెచ్చుకొంటున్నావు?"
"ఎవరినైతేనేం? అందం అందమే. దాన్ని చూసి ఆనందించే హక్కు అందరికీ ఉంది."
"తెల్లవారుఝామున నేను మద్రాసు వెళుతున్నాను పనిమీద. నాలుగు రోజుల తరవాత వస్తాను."
'అలాగే' అన్నట్లు తల ఊపాడు మధు.
సుధీర్ వెళ్ళిపోయిన తరవాత అతడలాగే చాలాసేపు కూర్చున్నాడు. అందమైన రమాకాంత్ ముఖం మాటి మాటికి కళ్ళు ముందు మెదులుతూంది. ఆ ముఖం కనిపించినపుడు హృదయం అవ్యక్తమైన ఆనందం పొందుతూంది. మరికొంచెం సేపటికి గోవిందు వచ్చి "బాబూ! ఎనిమిది దాటింది. కారేజీ గదిలో పెట్టాను. భోజనం చేయరూ?" అన్నాడు వినయంగా.
"అబ్బబ్బ! నువ్వొకడివి. వేళ తప్పనీయవు. తిండికి." విసుక్కుంటూ లేచాడు మధు.
నవ్వుకొంటూ వెళ్ళిపోయాడు గోవిందు.
* * *
సాయంత్రం నాలుగయింది. ఆకాశంలోని మబ్బులు సూర్యుని మరుగునపరుస్తున్నాయి. క్రమేపీ ఆకాశ మంతా నల్ల నల్లని మబ్బులు కమ్ముకొన్నాయి. చల్లని గాలి వీస్తూంది. లత ముందు వరండాలో కూర్చుని పూలు మాల కడుతూంది. సుధ వాటిని అందిస్తూ కబుర్లు చెపుతూంది. కొంచెం దూరంలో రవి బొమ్మలతో ఆడుకొంటున్నాడు. గీత అక్కడకు వచ్చి, "లతా, కొంచెం త్వరగా స్నానం ముగించి డ్రెస్ చేసుకో. నా ఫ్రెండ్స్ వస్తారిప్పుడు" అని చెప్పి హడావిడిగాలోపలకు వెళ్ళింది. మరి కొంచెం సేపటికి పూలు కట్టడం పూర్తిచేసి లత కూడా లేచింది.
ఆ తరవాత నాలుగైదు కార్లు కాంపౌండ్ లోనికి రావటం, అందులో నుండి చిత్ర విచిత్రంగా అలంకరించుకొన్న స్త్రీలు దిగటం అంతా గదిలో కిటికీలో నుండి చూస్తున్న లతకు కనిపించింది. హాల్లో గలగలా నవ్వులు, హోరెత్తించే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా ఎందుకో లతకు వాళ్ళ మధ్యకు వెళ్ళాలనిపించలేదు. కాని అంతలోనే గీత "లతా, లతా" అంటూ పిలిచింది. ఇక లతకు అక్కడకు వెళ్ళక తప్పలేదు. లతను చూపిస్తూ, "మా వారి చెల్లెలు, లత" అని, "వీరంతా నా క్లబ్ మేట్స్, ఈమె సరోజ, వసంత, సుభద్ర, కమల..." అంటూ ఎనిమిది మందిని లతకు పరిచయం చేసి, "వీరంతా ఆఫీసర్ల భార్యలే" అంది హుందాగా గీత. ఆఖరి మాటలు లత చెవులకు ఎబ్బెట్టుగా, కటువుగా వినిపించినా అది కనపడనీయకుండా చేతులు జోడించింది చిరునవ్వుతో. అప్పటికే సరోజ ఒడిలో కూర్చున్న సుధ ఆమెతో కబుర్లు చెబుతూంది. ఆమెకు పిల్లలంటే ఇష్టం లాగుంది, సధ కబుర్లకు మురిసిపోయి ముద్దులు పెట్టుకొంటూంది. అసలే బొద్దుగా, అందంగా ఉన్న సుధ నవ్వుతూ కబుర్లు చెబుతూంటే మరింత అందంగా కనిపిస్తూంది లతకు.
"అబ్బ! ఈ రోజు అసలు రావటం పడదేమో నని భయంవేసింది. వంటవాడికి జ్వరం మాకు రాత్రికి కారేజీ తెమ్మని ఫ్యూనుకు చెప్పి రాబోతుండగా మా ఆడపడుచు ప్రత్యక్షం" అంటూ నవ్వింది సుభద్ర.
"మరేం చేశావ్?" అంది వసంత.
"ఆమె ఎవరో పెండ్లికి వచ్చిందట ఈ ఊళ్ళో చూచిపోదామని వచ్చింది. రాత్రికి మళ్ళీ అక్కడికే వెళతానంది. సరేనని వచ్చేశాను."
"నీవు ఆమెకు కొంచెం కాఫీ కూడా ఇచ్చి ఉండవు." ఎగతాళి చేసింది సుమతి.
"అసలు టైమేది, సుమతీ! తీరా కారు ఎక్కబోతుండగా వచ్చింది" అంది సుభద్ర.
"అయినా మీరు కొంచెం ఆగి మాట్లాడి రావలసింది. పాపం! ఆమె చిన్నబుచ్చుకోదూ?" అంది సరోజ సానుభూతిగా.
"నీకు తెలియదు, సరోజా, అలా నెత్తికెక్కించు కొని పూసుకుని తిరిగామంటే మాటిమాటికీ వచ్చి తిష్ఠ వేస్తుంది. అసలే ఆమె భర్త గుమాస్తా. చాలదు, చాలదంటూ మనల్ని పట్టుకొంటే..." అనుభవం గల నలభై ఏళ్ల సుభద్ర కుండ బద్దలు కొట్టినట్లు, తనకు సర్వం తెలుసుననే ధీమాతో చెప్పింది. సరోజ ఒక్కసారి నుదురు చిట్లించి ఊరుకొంది. లత గుండె ఒక్కసారి నుదురు చిట్లించి ఊరుకొంది. లత గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకోవటం ప్రారంభించింది. అయినా అలాగే కూర్చుంది.
"మీరు ఉంటారా కొన్నాళ్ళు?" ఆప్యాయంగా అడిగింది సుమతి లతను.
"ఒక వారం ఉంటావేమో? మా వారికి ఇల్లు దొరకగానే వెళ్ళిపోతాను."
"మీకు బదిలీ అయిందా?"
"అవునండి. ఆయన వెళ్ళి జాయిన్ అయ్యారు. ఇల్లు దొరకగానే నేనూ వెళతాను. ఈ లోపుగా ఇక్కడకు వచ్చాను."
"అదేం? మీకు క్వార్టర్స్ ఇవ్వరూ?" సుభద్ర ఆశ్చర్యం.
"పోనీ, ముందు టి. బి. లో దిగచ్చుగా?" నళిని వ్యంగ్యం.
"టి. బి. లో దిగటానికి వాళ్ళాయన ఆఫీసరేం కాదు." గీత జవాబు.
"మరి, బిజినెస్సా?" నళిని అడిగింది.
"కాదు. ఆయన ఒక ఎన్. జి. ఓ." ఒత్తి పలికింది ఆఖరి మాటలుగీత.
"అయ్యో, పాపం! మీకు వచ్చేది ఎలా సరిపోతుందమ్మాయి?" జాలి నటించి అడిగింది సుభద్ర.
"ఏం? ఎందుకు చాలదు? లోకంలో అంతా ఆఫీసర్లేనా ఉంది?" సుమతి కొంచెం కోపంగానే అంది.
"ఏమో, సుమతీ! ఏమి చాలటమో! ఇంతంత జీతాలొస్తూ మనమే ఇబ్బంది పడుతున్నామా? ప్రతిదీ ప్రియమేనయ్యె. వీళ్లిక ఏమి తింటారు? ఏమి బట్టలు కొంటారు?" నళిని అడిగింది.
"అది ఖర్చుపెట్టుకొనే తీరులో ఉంది. అంతే. ఎంత సంపాదించినా అప్పులు చేసుకొనే వారెంత మంది లేరు?" సరోజ కల్పించుకొంది.
"అది వేరేసంగతి. ఎక్కువ సంపాదించే వాళ్ళుఎలాగైనా తీరుస్తారు. ఎటొచ్చీ పాపం, ఎన్. జి. ఒ. లదే బాధ. అటు పాటక జనంలాగ బ్రతకలేరు; ఇటు మనలాగ ఉండాలని తాపత్రయపడి నవ్వులపాలౌతారు. ఇంతకీ, అమ్మాయ్, మీ ఆయన కూరలూ అనీ బాగా తెస్తాడా?" అందుకొంది సుభద్ర.
"లేదండి. మే మసలు అన్నమే తినము." లోపల చెలరేగుతున్న అవమానాన్ని, కోపాన్ని కనిపించనీయకుండా శాంతంగా చెప్పింది లత.
"మరి, ఏం తింటారు?" ఆదుర్దాగా అడిగింది నళిని.
"మట్టి." ఒత్తి పలుకుతూ విసురుగా లేచి వెళ్ళింది లోపలకు.
"అబ్బో! రోషం చాలా ఉందే!"
"డబ్బు లేనివారికి రోషం ఎక్కువే ఉంటుంది." ఈ మాటలు, ఆ వెనకాల ఎగతాళిగా నవ్వే నవ్వులు లత చెవులను చీల్చుకోని బద్దలు కొడుతున్నట్లు వినిపించినాయి. శరీరం సూదులతో గుచ్చినట్లు బాధ పెడుతూంటే హృదయం అవమానంతో దహించుకు పోతూంది. ఏమిటీ మనుష్యులు? వీరూ స్త్రీ లేనా? ఇల్లూ, వాకిలీ పట్టకుండా తిరుగుతూ, భర్తలకు సుఖ సంతోషా లందివ్వకుండా, వచ్చిన డబ్బులో సగం వినోదాలకూ, విలాసాలకూ ఖర్చుచేస్తూ గడిపే వీరు, సాటి స్త్రీని గౌరవించలేని వీరు, ఒక వ్యక్తిని డబ్బుతోనే తప్ప మరి దేనితోను పోల్చలేని వీరు, మనుష్యుల వ్యక్తిత్వాన్ని, అభిమానాన్ని గౌరవించలేని వీరు...ఎలా బాగుపడతారు? ఎప్పటికి ఇలాంటి వారిలో మార్పు వస్తుంది. ఛీ ! ఛీ! వీళ్ళూ స్త్రీలేనా? తలుచుకొన్నకొద్దీ అసహ్యం వేస్తూంది.
