Previous Page Next Page 
అపస్వరం పేజి 4


                                       2
    పెదనాన్నగారి ఇంటికి వచ్చిన కొత్తలో మీర సంకోచ, దాక్షిణ్యాలతో, అందరితోనూ చనువుగా కలసి మెలసి తిరగలేకపోయేది. సూటిగా ఏమీ అనకపోయినా, పెద్డమ్మకు తనంటే ఇష్టం లేదన్న సంగతి మీర గ్రహించింది. కాని, పెదనాన్న ప్రేమవాత్సల్యాలు, నలుగురు అన్నయ్యల స్నేహం ఆమెనెంతో వూరడించేవి.
    చెల్లెలిని ఎంతో ప్రేమగా చూసేవారు. ఇంతవరకూ ఆడపిల్లలు ఇంట్లో లేకపోవడంవల్లో, మీర చలన వలనాలను వారెంతో కౌతుకంతో చూస్తుండేవారు. గోవిందు మీరకోసం గాలిపడగ కట్టి పెడితే, గోపాలం రాత్రి భోజనాలయ్యాక పిల్లలందర్నీ కూర్చో పెట్టుకొని, కమ్మని కథలు చెప్పేవాడు. శ్రీహరి మొదట మీరని పలుకరించడానికే సిగ్గుపడేవాడు. కాని, క్రమేణా, మీరతో చనువుగా మెలగసాగాడు. తన స్నేహితుల ఇళ్ళనుండి గులాబిపూలు తెచ్చి, చెల్లెలి కిచ్చేవాడు. శ్రీపాదం మీరా సమ వయస్కు లవటంతో, ఆటపాటలలో ఎప్పుడు కలిసే ఉండేవారు. పిల్లల నిష్కల్మషమైన స్నేహాన్ని చూసి, కృష్ణయ్యగారి మనస్సు ఆనందంతో నిండిపోయేది.
    కాని, కమలమ్మగారి మనసు, అనాధ మీరని తమ పిల్లలతో సమనంగా చూడటానికి ఎప్పుడూ అంగీకరించేదే కాదు. ఒకే ఈడు గల మీరనూ, శ్రీపాదునూ, ఆమె చూసే తీరులో చాలా తేడా ఉండేది. మీర చిన్న పిల్లయినా, ఇలాటివాటిని సులభంగా గ్రహించేది. మీరను కొట్టి, తిట్టి చేసే దైర్యం, ఆమెకు లేక పోయినా, సమయం దొరికినపుడు హేళనగా మాట్లాడి, ఆ పసి హృదయన్ని గాయపరిచేవారు. ఆలాంటప్పుడు మీర అమితంగా బాధపడినా, పెదనాన్న అన్నయ్యల ప్రేమ వాత్సల్యాలతో అన్నీ మరచిపోవడానికి ప్రయత్నించేది. వీలైనంతవరకు, పెదనాన్న, అన్నయ్యల వద్దనే కాలం గడుపుతూ, పెద్దమ్మకు దూరంగా ఉండిపోయేది.
    కమలమ్మగారు ఈ విషయం గమనించి ఉగ్రులై పోయేవారు. ఒకరోజు మీర గోపాలంతో సమానంగా బొంగరం ఆడుతూంది. భర్త ఇంటిలో లేని విషయం గమనించి మీరకు వివేకం చెప్ప బూనుకొన్నారు కమలమ్మగారు.
    "మీరా, నువ్వు ఆడపిల్లవి. ఎప్పుడూ ఇలా మగ పిల్లలతో ఆడుతూండటం ఏం బాగాలేదు. రేపు అత్తవారింటికి వెళ్ళాల్సిన పిల్లవు. ఇంట్లో కాస్త పనిపాట్లు నేర్చుకొని, నాకూ సాయంగా ఉంటే ముందు ముందు నీకు మంచిపేరు. నాకూ మంచి పేరు....." అని చెప్పుకుపోతున్నారు.
    బొంగరానికి తాడుచుడుతోన్న మీరా, తెల్లబోయి గోపాలంవేపు చూసింది.
    "ఇహ వూరుకోమ్మా నువ్వు. ఆడపిల్లలు ఇంటి పనులు చేయటానికి పెద్దగా నేర్చుకోవాలా? వంటా వార్పు ఇవన్నీ ఆడవాళ్ళకి రక్తగట్జంగా వచ్చిన విద్యలే. మీర ఇంకా చిన్నపిల్ల నెమ్మదిగా నేర్చుకుంటుంది. బాధ్యత మీదపడితే తనే నేర్చుకుంటుంది. ఇప్పుడో రెండు రోజులు పసిదానితో ఆడుకోనీయ్."
    గోపాలం ఈవిధంగా, తమకే ఎదురు తిరుగుతాడన్న సంగతి నిరీక్షించని కమలమ్మగారి మొహం కోపంతో ఎర్రబడింది.
    "చాల్లే, నోరుమూసుకో పెద్దగా వేదాంతం చెప్పొచ్చావు. వచ్చేఏడు కాలేజీకి వెళ్ళాల్సిన కుర్రాడివి. ఆడపిల్లతో బొంగరం ఆడుతూ కూర్చో. ఇహ బాగుపడినట్లే మీర నా శత్రువేం కాదు. దాని మంచికోసమేగా చెబుతున్నాను."
    "పెళ్ళయి, అత్తారింటికి వెడితే, ఇలాగే ఉంటుందేమమ్మా! ఇక్కడున్నపుడన్నా ఆడుకుంటే తప్పా!"
    "అంటే పనీ, పాట ఏమి నేర్చుకోనక్కర్లేదంటావా ఛీ"
    "నువ్వే వో రోజు చెప్పావుగా 'అత్తారింటికి వచ్చే సరికి నాకేం పనులు వచ్చేవికావని' ఇప్పుడు నీకు రానిపనే లేదు...."
    "ఇక ఆపురా బాబూ నీకో దండం, నీతో వాదించడంకన్న నోరుమూసుకుని పడి ఉండటం నయం" అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయారు. కమలమ్మగారు అక్కడ గిన్నెల మీద తమ కోపాన్నంతా చూపసాగారు. ఆ చప్పుళ్ళు విని గోపాలం చిరునవ్వు నవ్వాడు. ఇంతవరకు అంతావింటూ బిక్కమొహం వేసుకు నుంచున్న మీర, తాడు, బొంగరం గోపాలం చేతిలో పెట్టి,
    "ఇహ చాలన్నయ్యా, ఆట" అంది.
    గోపాలం చకితుడై "ఏం అప్పుడే విసుగెత్తిందా?" అన్నాడు.
    "వద్ధన్నయ్యా పెద్దమ్మకు కోపం వస్తుంది. నేనిక ఆడను" అంటూ కళ్ళల్లోని నీరు జారి క్రింద పడకమునుపే అక్కడినుండి పారిపోయింది. మీర అది గమనించి గోపాలం మీర వెనుకనే తనూ వెళ్ళాడు. మీర మవునంగా ఏడుస్తూ కళ్ళు తుడుచుకొంటూంది.
    "మీరా ఏడుస్తున్నావా!"
    మీర బదులు పలకలేదు.
    "ఛా ఈమాత్రానికే ఏడుస్తారా ఎవరైనా? నన్నూ అమ్మ తిట్టలేదూ? నే నేడుస్తున్నానా మరి!'
    మీరకు ఆ క్షణంలో అందరు పిల్ల
ల్లాగ తను ఉన్నట్టనిపించింది.
    "ఏడవకు మీరా, శ్రీపాదు వస్తున్నాడు."
    అంతలోనే ఉత్సాహంతో గెంతుతూ, శ్రీపాదు అక్కడికి వచ్చాడు.
    "మీరా, ఎన్ని జాంకాయలు తెచ్చానో చూశావా?" అని తన జేబుల్లో నింపుకున్న దోరకాయల్ని మీర ముందు పోశారు. మీర ఒక కాయ తీసుకొని కొరికి,
    "అన్నయ్యా, నువ్వు కూడా తిను. ఎంత తియ్యగా ఉందో!" అంది. కాసేపట్లోనే ఇంతకుముందు జరిగిందంతా మరచి కుర్రాళ్ళతో ఆడుకుంది.
    కాన్వెంటులో చేరిన కొద్ది రోజులలోనే మీర టీచరు మెప్పుదలకు పాత్రురాలయింది. తోటి పిల్లలు కూడ మీరా అంటే ఎంతో ఇష్టపడేవారు. మీరతో స్నేహానికోసం పోటీలు పడుతుండేవారు. సదా నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ, స్నేహార్ధ హృదయంతో అందర్నీ ఆకట్టుకునేది మీర.
    అందులో ఎక్కువ స్నేహంగా, ఎప్పడూ ఒకే జట్టుగా ఉంటున్నది మట్టుకు రాజేశ్వరీ, నర్మదా, చంపా, మీర బొద్దుగా పొట్టిగానున్న రాజేశ్వరిని 'ఏనుగుపిల్ల' అని ముద్డుగా పిలిచేవారు. నర్మద, డాక్టరుగా రమ్మాయి. ప్రవహించే నీటికన్న చంచలమైన మనసు. విశాలమైన కనురెప్పలుగల నర్మద అందమంతా నోరు మూసుకొన్నప్పుడే! వక్రమైన ఆమె పలువరస, తీర్చిదిద్ధినట్టున్న మొహంయొక్క అందాన్నంతా పాడు చేసేది. చంప నిలకడలేని పిల్ల. చిన్న చిన్న మాటలకంతా కోపం తెచ్చుకొని, జట్టు వదలేసేది. 'ఎన్మి'గా ఉండి మళ్ళీ కాస్సేపటికే జట్టు కడుతూండేది.
    నలుగురు స్నేహితురాళ్ళు సెలసరి 'టెస్టు'ల్లో మోఅతి మార్కులకోసం పోటీ పడేవారు. కాన్వెంటులో అప్పుడప్పుడూవేసే నాటకాల్లో మీరదే ప్రధాన పాత్ర.
    'అందాలు చిందే మొహం, సన్నధైనా, ఎంత దూరానికైనా స్పష్టంగా వినబడే కంఠం, భావోద్వేగాల ననుసరించి వెను వెంటనే మొహంలో భావాలను మార్చే చాతుర్యం ఇవన్ని చూసి, నాటకం వేయించే టీచరు ముగ్ధురాలయ్యేది. 'చిన్నారి నటి' అని మీరను ముద్దుగా పిలుస్తుండేది.
    గోపాల్ ఎస్. ఎస్. ఎల్. సి.లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయినపుడు, అందరికన్నా ఎక్కువ ఆనందించింది మీరా. రిజల్ట్స్ తెలిసిన వెంటనే "పెద్దమ్మా" అని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS