ఇందిర ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా హడావుడిగా వుంది. నౌకర్లు సామానంతా సర్దేశారు. నీరజ, మాధవరావు గారు ముందు హాలులో కూర్చుని ఉన్నారు.
"ఇందూ! అదేమిటలా వున్నావు?" ఆదుర్దాగా అడిగారు మాధవరావు గారు కూతురిని చూస్తూనే.
"ఏం లేదు డాడీ" వినోద్ వాళ్ళింటి కి వెళ్ళి వచ్చాను. చాలా దూరం కదూ? అంతే" గబగబా లోపలి కెళ్ళిపోయింది.
ఇందిర వెనకాలే నీరజ కూడా వెళ్ళింది. ఇందిర తన రూములోకి వెళ్ళి ఫాను వేసి కూర్చున్నది. ఇందిరకి ఎదురుగుండా నీరజ కూర్చున్నది. కళ్ళెత్తి నీరజను చూసింది ఇందిర. తెల్లని నుదుటి మీద యెర్రని బొట్టు, ముత్యాల్లాంటి స్వేద బిందువుల మధ్య, ప్రశాంత మైన కొలను లోని ఎర్ర తామరలా ఉంది.
నీరజ కు తనకు సహస్తం తేడా! తనకి బొట్టు గాజులు ఈ ఆచార వ్యవహారాలంటే అయిష్టం. తనకు పదహారు సంవత్సరాల వరకు విదేశాల్లో ఉండటం వల్ల భారతీయ సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్న నీరజకు తను పూర్తిగా వ్యతిరేకం. అయినా తను నీరజను విమర్శించదు. నీరజ తనను విమర్శించదు.
"ఏమిటలా చూస్తున్నావ్?" నీరజ ఆశ్చర్యంగా అంది.
"నీరజా!" గబుక్కున నీరజ ఒడిలో పడిపోయి పెద్దగా ఏడవ సాగింది ఇందిర.
"ఇందూ! ఏడవకు? ఎందుకే ! లే"
ఎంతోసేపటి దాకా అలాగే పడుకుంది ఇందిర.
"పోనీ నువ్వు ఉండిపోకూడదూ! పరీక్షలు అయిన తరువాత వెళ్ళచ్చుగా!" అంది నీరజ.
"వద్దు నీరూ! వద్దు! నాన్నగారు ఒక్కరూ ఉండలేరు" అని బాత్ రూము వైపు దారి తీసింది స్నానం చెయ్యటానికి.
నీరజ మాగ్ జైన్ చూస్తూ కూర్చున్నది. కొంతసేపటికి ఇందిర తలకు స్నానం చేసి వచ్చింది. లేత నీలి రంగు పట్టు చీర కట్టుకుని-- ఎఱ్ఱని బ్లౌజు వేసుకున్న ఇందిరను చూసి పకపక నవ్వింది నీరజ.
"ఏం? ఎందుకు నవ్వుతున్నావు?"
"ఏం లేదు -- ఈ చీర -- ఈ బొట్టు నిన్నూ చూస్తుంటే నాకు నవ్వాగటం లేదు"
"నీరజా! మొట్టమొదటి సారిగా ఈరోజే నా నుదుట కుంకుమ పెట్టుకున్నాను. నాకు ఆత్మీయులు నీవు తప్ప ఎవ్వరూ లేరు. నా కంటే పెద్దదానివేగా! నా సౌభాగ్యం చిరకాలం నిలవాలని నన్నాశీర్వదించు నీరజా!" వంగి కాళ్ళకు నమస్కరిస్తున్న ఇందిరను అర్ధం కాని దానిలా చూసింది నీరజ.
"ఏమిటిదంతా?' అయోమయంగా అడిగింది నీరజ.
"నాకదేం తెలియదు . నన్ను మరచిపోవు కదూ " ఇందిర కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు నిలిచినాయ్.
ఆ రాత్రే ఇందిర విశాఖపట్నం వెళ్ళిపోయింది తండ్రితో.
* * * *
కాలచక్రం తిరిగిపోతూనే ఉన్నది. కాలగర్భంలో ఏడు సంవత్సరాలు చిటికెల మీద దొర్లిపోయినాయ్. ఒక రోజు నీరజ పెళ్ళి శుభలేక వచ్చింది. ఆ మధ్య కాలంలో. కొన్ని అనివార్య కారణాల వల్ల , తండ్రి అనారోగ్యం వల్ల నీరజ పెళ్ళికి వెళ్ళ లేకపోయింది ఇందిర. తరువాత కొద్ది కాలం ఇద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయ్. తరువాత నీరజ జాడ తెలియలేదు. ఎన్ని ఉత్తరాలు వ్రాసినా సమాధానం రాలేదు. అన్నీ తిరిగి రాసాగినాయ్. ఇక ఆ ప్రయత్నం విరమించుకుంది ఇందిర.
ఆ ఏడు సంవత్సరాలల్లో ఇందిర -- డాక్టర్ ఇందిర అయింది.
తండ్రి కోరిక మీద డాక్టరు చదివింది. రక్తపు పోటుతో తండ్రి మంచం పట్టాడు.
"అమ్మా! ఇందూ" తండ్రి పిలుపుతో లేచి వెళ్ళింది.
తండ్రి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్నది.
"చూడు తల్లీ! ఏ రోజు యెట్లా ఉంటుందో! నువ్వొక ఇంటి దాని వయితే కాని నాకు మనశ్శాంతి ఉండదు! ఇదిగో ఈ ఉత్తరం చూశావా?" అంటూ మాధవరావు ఒక ఉత్తరం అందించారు.
ఇందిర కవరు తీసి చూసింది. అది మేనత్త కొడుకు రాజారావు దగ్గర నుంచి వచ్చింది.
అతనికి విశాఖపట్నం ట్రాన్సఫరయిందట-- అందుకని రెండు రోజుల్లో విశాఖపట్నం వస్తున్నాడట-- ఇది ఆ ఉత్తరంలో సారాంశం.
"మంచిదే డాడీ! మీకు కాస్త కాలక్షేపంగా ఉంటాడు" అంది ఇందిర ఉత్తరం మడిచి తండ్రి కిస్తూ.
"ఈ ముసలి తనంలో మనుమలతో కాలక్షేపం చెయ్యాలి గాని-- వాడితో నాకేం కాలక్షేపం తల్లీ! ఇంకో విషయం -- అతను వచ్చేలోపలే మనం ఆలోచించు కుంటే మంచిది , అతని గురించి నీ అభిప్రాయం ఏమిటి?"
"అతని గురించి ప్రత్యేకంగా నాకే అభిప్రాయమూ లేదండీ! మంచివాడు -- నాకు మేనత్త కొడుకు-- అంతే!"
ఇందూ! నీ మనసులో మాటేమిటో నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా? చిన్నప్పటి నుంచీ అనుకుంటున్నదేగా! అతనిగా తల్లీ తండ్రి లేరు. మనం కాకపోతే అతని మంచి చెడులు ఆలోచించే వాళ్ళేవరున్నారు?"
"దానికేం డాడీ! అతని మంచి చెడులు ఆలోచించటానికేం?"
"ఇందూ ఏమిటా సమాధానాలు? అతన్ని చేసుకోవటం నీకిష్టం లేదా!" నాకు సూటిగా సమాధానం చెప్పు"
"డాడీ! నాకు మనసులో ఏ కోరికా లేదు జీవితం ప్రశాంతంగా గడిచిపోతున్నది. అటు వంటప్పుడు అనవసరంగా సంసారమనే రొంపి లోకి దిగటం నాకిష్టం లేదు"
"నాకు వేదాంతం బోధిస్తున్నావా?" కోపంగా అడిగారాయన.
"డాడీ! నన్నర్ధం చేసుకోండి. నాకిప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేనప్పుడు నన్ను బలవంతం చేసి ఆ పెళ్ళి చేస్తే మాత్రం ఏం సుఖం.... మీరు విశ్రాంతి తీసుకోండి. అనవసరపు ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటే మీకు ఆరోగ్యం దెబ్బ తింటుంది. " వెళ్ళటానికి లేస్తూ అంది ఇందిర.
"ఇంకా నాకు ఆరోగ్యమెందుకమ్మా! ఏం చూచుకుని జీవించాలి? ఒక్కగా నోక్కకూతురు - పిల్లా పాపలతో కళకళ లాడుతున్నదనా? ఎందుకమ్మా నాకీ బ్రతుకు? పాడు ప్రాణం పోకుండా ఉంది." బాధగా కణతలు రుద్దుకోసాగారు మాధవరావు గారు.
"డాడీ" ఆందోళనగా ఆవేదనగా అంది ఇందిర.'
"అవునమ్మా! మీ అమ్మ అదృష్టవంతురాలు కాబట్టి ఈ బాధలన్నీ చూడకుండా దాటిపోయింది. నేనో....పాపీ చిరాయువని.... చూడమ్మా నా కిన్ని నిద్రమాత్రలు తెచ్చి ఇవ్వరాదూ. హాయిగా -- నిశ్చింతగా....
"డాడీ" వెక్కి వెక్కి ఏడవసాగింది ఇందిర
"ఇందూ! వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో! నా ఎదుటి నుంచి దూరంగా పో" కళ్ళు మూసుకుని పడుకున్నారు మాధవరావు గారు.
తెల్లవారి తొమ్మిది గంటలకు తండ్రి దగ్గర కెళ్ళి చూసింది -- అయన పేపరు చదువుకుంటూ పడుకున్నారు. దూరం నుంచే చూసి హాస్పిటల్ కి వెళ్ళిపోయింది ఇందిర.
తన రూములోకి వెళ్ళి కూర్చున్నది. ఇంతలో ఫోను మోగింది గణగణా.
"హల్లో ! డాక్టర్ రాధారాణి గారున్నారా" అవతలి కంఠం ఆదుర్దాగా వినిపించింది.
"డా|| ఇందిర స్పీకింగ్ , ఆవిడ ఇవ్వాళ రారు. లీవ్ లో ఉన్నారు." అంది ఇందిర.
"డాక్టర్ మీరైనా సరే! అర్జంటుగా మా ఇంటికి రావాలి? పేషెంటు చావు బతుకుల్లో ఉంది"
"విషయమేమిటో చెప్పండి. నేను డ్యూటీ లో ఉన్నాను. రావడానికి వీలుకాదు."
"రెండు రోజుల నుంచీ పెయిన్సు వస్తున్నాయిట. నాకు తెలియదు. ఇప్పుడే నాకీ విషయం తెలిసింది. ఆమె ప్రాణాన్ని ఎలాగైనా కాపాడాలి డాక్టర్. ఒక్కసారి....ఒక్కసారి.....మీరు రావాలి...డాక్టర్....ప్లీజ్........నేను వదిలి రావటానికి ఇక్కడ పరిస్థితి చాలా ప్రమాదంగా వుంది....డాక్టర్" అంది వెక్కుతూ అవతలి కంఠం.
ఇందిర కాసేపు ఆలోచించింది.
"సరే! ఎడ్రస్ చెప్పండి"
యడ్రాస్ ప్రకారం కారులో బయలుదేరింది. దూరంగా విసిరేసినట్టున్న చిన్న కొండ మీద ఆ ఇల్లు ముచ్చటగా వుంది. కారు పోవటానికి వీలుగా నునుపైన బాట యేర్పరచ బడి వుంది. బాట కిరువైపులా చక్కని గార్డెను. పార్టికో లోకి వెళ్ళి కారాపి కాలింగ్ బెల్ నొక్కింది. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి.
జుట్టు చెదిరిపోయి కళ్ళు లోపలకు పోయిన ఆ వ్యక్తీ "రండి డాక్టర్" అంటూ గిరుక్కున వెనక్కు తిరిగి మెట్ల మీద నుంచి పైకి పరుగెట్టింది. వెనకాలే వెళ్ళింది ఇందిర
మంచం మీద చామన ఛాయ రంగులో బక్క పలచగా ఉన్న యువతి నీర్జీవంగా పడి ఉంది. ఆదుర్దాగా పల్సు చూసింది ఇందిర. చటుక్కున కళ్ళెత్తి కోపంగా -- పక్కనే నిల్చుని ఉన్న ఆ స్త్రీ మూర్తిని చూసింది. ఆవిడ ఆశ్చర్యంగా మునిపంటితో పెదవి కొరుకుతూ ఇందిరనే చూస్తున్నది. ఇందిర కూడా కనుబొమలు చిట్లించింది.
"నువ్వు...నువ్వు....!"
