సంజవెలుంగులో పసిడిచాయల ఖద్దరు చీరగట్టి నా
రింజకు నీళ్ళువోయు శశిరేఖవె నీవు; సుభద్రసూతినై
రంజితపాణిపల్లవము రాయుదునా - నిను మౌళి దాల్చి మృ
త్యుంజయమూర్తినై జమునితో తొడగొట్టి సవాలుచేతునా!
వైశాఖి
కుండలమీద పిచ్చుకలు గుంపులుగూడె; నఖండ చండ మా
ర్తాండుడు చేటలన్ జెరిగె నగ్నికణమ్ములు; వెండినీ రదే
కొండలు నెత్తిపై పులుముకొన్నవి, రమ్ము శయింత మీ లతా
మండపమందు, ప్రేమమయ మానసముల్ మధురించిపోవగన్.
బుడుత డుయేలలో నిదురవోవుచునుండెను; పొట్లపాదుపై
ఉడుత పదేపదే అఱచుచున్నది; పిట్టలు చెట్టుకొమ్మలన్
వడబడి కూరుచుండె; తలవంచెను చిట్టిగులాబి; గాడుపుల్
సుడిగొనుచుండె నో కుసుమసుందరి! మో మటు త్రిప్పబోకుమా!
ఉండుము - లేవబోకుము కృశోదరి! నీ నుదుటన్ శ్రమాంబువుల్
నిండెను; పై పయిం దుడువనీ - సుషమా సుకుమారమైన నీ
గండయుగమ్ము వాడె వడగాలికి; ఊయలలోన వచ్చి కూ
ర్చుండుము, స్వేచ్చమై కలసియూగుద మాశలుమిన్నుముట్టగన్.
ప్రాభాతి
రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధామధురైక భావముల్
ప్రోగులు వోయగా నిదురపోవు దయామయి! నా యెడందలో
ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెలో
దాగుడుమూతలాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా !
ఈ గిజిగానిగూడువలెనే మలయానిల రాగడోలలో
నూగుచునుండె నా తలపు లూరక; నీ కబరీభరమ్ములో
మాగిన కేతకీ సుమ సమంచిత సౌరభవీచి పైపయిన్
మూగి స్పృశించి నా హృదయమున్ కదలించుచునుండె ప్రేయసీ!
రాగము నందుకొన్నది తరంగణి; బాలమరీచిమాలికిన్
స్వాగతమిచ్చె పద్మిని; హసన్ముఖమై మన దొడ్డిలోని పు
న్నాగము కుప్పవోసె సుమనస్సులు; కోవెలలో విపంచికల్
మ్రోగెను; లెమ్ము పోదము! ప్రమోదముతో మన మాతృపూజకున్.
మధుర స్మృతి
ఆ మనోహర మధుర సాయంతనమున
ఉపవన నికుంజ వేదిపై నుంటి నేను;
చేత సుమరజ మూని వచ్చితివి నీవు
తిలకమును నా ముఖమ్ముపై దిద్ది తీర్ప.
ఒరగి ఒయ్యారమొలుక కూర్చుండినావు
అందములరాణివై అస్మదభిముఖముగ;
చేరె మునుముందు నీ కుడిచేయి నాదు
అలికఫలకమ్ము తిలకవిన్యాసమునకు.
పులకలెత్తించె తనువెల్ల చెలి! మదీయ
చిబుక మంటి పైకెత్తు నీచేతి వ్రేళ్ళు;
రాగరస రంజిత పరాగ రచ్యమాన
తిలక కళిక పరీమళమ్ములను జిమ్మె.
"ఐనది సమర్చ, సొగ సింక అద్దమందు
చూచుకొను" డంటి వీవు నాజూకుగాను;
"అటులనా" యంచు నటునిటు నరసి, నీదు
చెక్కుటద్దమ్ము కడ మోము చేర్చినాను.
"ఎంత ముద్దుగ దిద్దితి వేది యేది!"
యనుచు నొకరెండు ముద్దుల నునిచినాను;
పకపక మటంచు నవ్వి నీ పాణితలము
అడ్డ మొనరించితివి తళ్కుటద్దమునకు.
నాటి ప్రేమార్ధ్ర తిలక మీనాడు విజయ
దీక్ష నిప్పించు రక్తార్ధ్ర తిలకమయ్యె;
ప్రియతమా! రమ్ము చేయెత్తి పిలుచుచుండె
అమ్మ మనలను కరుణ కంఠమ్ముతోడ.
.jpg)
మానస సరోవరాంతర మధుకణాలు
మోసుకొని వచ్చి సేవలు చేసిపోవు
మంచుమలమీది యాదిమ మౌనిమణికి
మందమంద మందాకినీ మారుతములు.
స్వామి యర్ధ నిమీలితేక్షణములందు
ఏమి యాకాంక్షితమొ చెప్పలేము గాని
సర్వమంగళ పర్వతసార్వభౌము
పట్టి ముప్రొద్దు భక్తిమై పరిచరించు.
అమ్మునిరాజు గెల్చి విజయధ్వజ మెత్తెడి పూన్కి చెంగటన్
ద్రిమ్మరుచుండె మారుడు సతీయుతుడై సమయప్రతీక్షమై;
తుమ్మెదనారితో - చివురుతూణముతో - విరజాజిపూల వి
ల్లమ్ములతో -శుకీపిక బలమ్ములతో - అతిలోకశూరుడై!
ఉచిత పూజోపహారము లూని గౌరి
మూడుకన్నుల మునిమౌళిముందు నిలిచె;
వినయము భయమ్ము సిగ్గు ముప్పిరిగొనంగ
పలికె కలకంఠి చిగురుచేతులు మొగిడ్చి.
"వాచవులూరు పండ్లు గొనివచ్చితి స్వాములకోస; మిచ్చటన్
దాచుదునా ప్రభూ! మిసిమి తామరపాకులలోన; చక్కనౌ
మా చదలేటి ప్రక్క మధుమాస మనోజ్ఞ మహోదయమ్ములో
పూచెను క్రొత్తగా పొగడపూ లివి; మాలలుకూర్చి యిత్తునా!
వచ్చుచునున్న సూర్యభగవానుని చక్కిలిగింత కప్పుడే
విచ్చుచువిచ్చుచున్న అరవిందములందున పొంగి వెల్లువౌ
వెచ్చని తియ్యదేనియలు భృంగకుమారిక లంటకుండగా
తెచ్చితి దొన్నెలందు నిడి దేవరవారికి ఆరగింపుకై !"
అందము చిందిపోవ చెవియందలి చెందొవ జారుచుండ "పూ
లందుకొనుం" డటంచు సుమనోంజలి ముందుకు చాచి శైలరా
ణ్ణందన వంగె -చెంగున అనంగుని చాపము వంగె - వంగె బా
లేందుధరుండు కాన్కలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై.
ఇచట శాంతమ్ము నిండార ఈమెచేతి
పైడి క్రొందమ్ము లందుకొన్నాడు హరుడు;
అచట పంతమ్ము నిండార ఆమెచేతి
వాడి కెందమ్ము లందుకొన్నాడు మరుడు.
తియ్యవిల్కాడు వింట సంధించి విడిచె
అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము;
గౌరి కడకంటి చూపుతో కలసిపోయి
గ్రుచ్చుకొనె నది ముక్కంటి గుండెలోన.
