రామావతారం అదృష్టానికి ఆ క్షణంలో కాస్త అసూయనిపించింది.
మర్నాడు మధ్యాహ్నం తొందరగా భోజనాలుకానిచ్చి, 'నందన్ కానన్' బయలుదేరాం అందరం. పేక, ట్రాన్సిష్టర్, టిఫిన్ కారియరు నిండా ఫలహారాలు, కాఫీ, అన్నీ పట్టుకుని సరదాగా పిక్నిక్ బయలుదేరాం. ఒంటిగంటకి అక్కడకు చేరాం, ఎండ బాగా వుంటేగాని కలర్ ఫోటోలు సరిగా రావని ముందు ఫోటోల ప్రోగ్రాం పెట్టాను. పూల మొక్కల దగ్గిర, లేక్ దగ్గిర ఏనుగుపిల్లల దగ్గిర రకరకాల ఫోటోలు తీశాను అందరికీ. ఎండ తగ్గాక మూడున్నరకి కాఫీ ఫలహారాలు చేసి జంతువులను చూద్దామని పిల్లలని ఒప్పించి పెద్దవాళ్ళం నలుగురుం జంపుకానాపరచి చెట్టునీడక కూర్చుని పేక మొదలెట్టాం. పిల్లలు పరుగులు పెట్టి ఆడుతున్నారు గోలగా.
ఇదివరకు శాంతితో పిల్లలతో, బంధువులతో ఎన్నోసార్లు వచ్చాను, కాని ఎందుకో ఈసారి వున్నంత ఉత్సాహంగా ఎప్పుడూ లేను బహుశా మీనాక్షి కారణం అయివుంటుంది..
పేకాట ఆడుకున్నంతసేపూ మీనాక్షి జోకులు విసురుతూ, నవ్వుతూ 'ఏం బావా, అంటూ తొడమీదో భుజంమీదో చరుస్తూ చలాకీగా మాట్లాడుతుంది. మీనాక్షికి అతిమామూలుగా అనిపించే ఆ చర్య నాకు మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. మొదటిసారి మీనాక్షి స్పర్శ గిలిగింతలు పెట్టింది. బెరుకుగా రామావతారం వంక, శాంతివంక చూశాను, వాళ్ళు ఇదేం గమనించినట్టులేదు, గమనించినా మీనాక్షి సంగతి తెలిసినవాళ్ళు కనుక అంతగా పట్టించుకుని వుండరు! మీనాక్షికీ మరో ఉద్దేశం వుండకపోవచ్చు. యాదాలాపంగా ఎక్సైట్ మెంట్ లో ఆలాచేసి వుండవచ్చును. దానికి వేరే అర్థాలెందుకు అని సరిపుచ్చుకున్నాను. కొంతమంది ప్రక్కనున్న వాళ్ళని గిల్లడం, కొట్టడం, ఓ దురలవాటు. మగ ఆడ తేడా వుండదు వాళ్ళకి అ ఎక్సైట్ మెంట్ లో! మీనాక్షికీ అదే అలవాటేమో.
ఓ గంట ఆడాక అబ్బ 'కాసేపు నడుం వాలుద్దాం బాబూ' అన్నం తినగానే బయలుదేరాం!.. ఆవలిస్తూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. మీనాక్షి తలగడమీద ఒరుగుతూ అంది.
"మీరు పడుకోండి. పదినిమిషాలు!" శాంతి అంది ఓ తలగడ అందిస్తూ రామావతారానికి.
"అబ్బే మధ్యాహ్నం పడక నాకలవాటులేదండి మీరు పడుకోండి" అన్నాడు లేచి పిల్లల దగ్గరికి వెళుతూ, శాంతి మధ్యాహ్నం పడుకోదు. అలవాటున్న నేను ఎవరితో చెప్పించుకోకుండానే మరో తలగడ తలక్రింద పెట్టుకుని కాళ్ళు చాచుకున్నాను.
"అలా తిరిగివస్తాను. పిల్లలేం ఆడుతున్నారో చూసివస్తాను. మీరు పడుకోండి" శాంతి లేచి పిల్లలవైపు వెళుతూ అంది.
వాళ్ళిద్దరూ వెళ్ళాక ఓ క్షణం వూరుకుంది మీనాక్షి, చేయి చాస్తే అందే దూరంలో వున్న నా చేయి పట్టుకుని నావంక తదేకంగా ఓ క్షణం చూసింది. నా చేతివేళ్ళల్లో తన వేళ్లు దూర్చింది. "బావా!.. నాకు చాలా సంతోషంగా వుంది...' నీకేమనిపిస్తుందోగానీ అంది.
ఆమె చేతిలోవున్నా నాచేయి కొద్దిగా వణికింది. ఇబ్బందిగా చూశాను. బలవంతంగా నవ్వాను..." ఏమనిపించడం దేనికి?"
"అదేమిటి బావా, ఇన్నాళ్ళకి కల్సుకున్నాం ఇద్దరం. సంతోషంగా లేదూ నీకు?"
"అఫ్ కోర్స్.. అదా! ఇంకా ఏమిటో అనుకున్నాను.." సిగరెట్టు వెలిగించుకునే నెపంతో చెయ్యి లాక్కున్నాను.
"నిజంగా బావా, నీవెప్పుడూ గుర్తుకొచ్చేవాడివి. పెళ్ళయి వెళ్ళిపోయిన దగ్గిరనుంచి, ఎన్నిసార్లు నిన్ను ఎంతగానో చూడాలనిపించేది తెలుసా."
"నిజంగా నామీద నీకంత అభిమానం వున్నట్లు నాకెప్పుడూ తెలియలేదే.."
"పో, బావా!.. చిన్నప్పుడేదో దెబ్బలాడేదాన్నని అలా అంటున్నావు కాబోలు, మనసులో నీవంటే నాకెప్పుడూ ఇష్టమే బావా!....
"థాంక్స్!" నవ్వుతూ అన్నాను.
"హాస్యంకాదు బావా!.. నాపెళ్ళి.. ప్చ్! సరే, ఇప్పుడవన్నీ అనుకుని ఏం లాభం, టూ లేట్ కదూ.. నిజంగా నీవీ ఐ.ఏ.ఎస్. కాస్త ముందయివుంటే మన జీవితాలు ఇంకోలా వుండేవీనాడు... నాకు మనసులో ఒకటి, పైకొకటి చెప్పడం చేతకాదు బావా! ఎవరో ఏదో అనుకుంటారని మాట దాచుకోలేను.. ఇలా అంటున్నందుకు నీవేం అనుకుంటున్నావో?...."
"క్రొత్త సంగతులు నీ నోట వింటున్నాను ఇవాళ..." సిగరెట్టు పొగ పీలుస్తూ సాలోచనగా అన్నాను మీనాక్షి వంక చూస్తూ.
"నీకు క్రొత్త సంగతిగాని నాకు కాదు.. సర్లే. ఇప్పుడెందుకు ఆ గొడవ, నీకిద్దరు పిల్లలు, నాకిద్దరు పిల్లలు ఇద్దరం సుఖంగానే వున్నాంగా..." మొత్తంమీద....... నవ్వేస్తూ అంది.
"ట్రూ.. ఇలా జరిగితే బాగుండేది, అలా జరిగితే బాగుండును అనుకునేందుకు? టూలేట్? జరగనివి చర్చించి లాభం ఏమిటి?......"
"నిజమేలే.. అయినా నిన్ను చూస్తుంటే అలా అనుకోకుండా వుండలేను బావా!...." అంది అదోలా చూస్తూ. రామావతారం రావడం చూసి లేచి కూర్చున్నాను నేను.
"కాఫీ త్రాగుదామా, మూడు కావస్తుంది..." శాంతి, రామావతారం ఒక్కసారే వచ్చారు. పిల్లలు ఆకలి అంటూ వచ్చారు. మీనాక్షి, శాంతి క్యారియర్ విప్పి ప్లాస్టిక్ పళ్ళాలలో కజ్జికాయలు, జంతికలు సర్ది అందించారు. కాఫీలు త్రాగి బాస్కెట్లు సర్ది కారులో పెట్టేసి వచ్చారు. జూ అంతా తిరిగి రావడానికి బయలుదేరాం.
ఎన్నిసార్లో చూసిన ఆ పులులు, సింహాలమీద నాకేం ఇంట్రెస్ట్ లేదు. ముందు నడుస్తున్న మీనాక్షి, శాంతి వంక చూస్తూ కాస్త వెనగ్గా నడుస్తున్నాను. రామావతారం పిల్లలు నలుగురిని కష్టడీలోకి తీసుకుని అన్నీ ఓపిగ్గా వివరిస్తున్నాడు వాళ్ళకి, కాస్త ముందు నడుస్తూ.
వెనుకనుంచి మీనాక్షిని, శాంతిని చూస్తుంటే హఠాత్తుగా ఓ సందేహం వచ్చింది నాకు. మీనాక్షి శాంతి ఇద్దరిలో ఎవరందంగా వుంటారు!? జవాబు చెప్పడం ఎవరికైనా కష్టమే! విడి విడిగా చూస్తే ఇద్దరూ అందగత్తెలే! ఇద్దరిలో ఎవరెక్కువ అంటే ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేరు? సంపంగి పువ్వు, సన్నజాజిమొగ్గ ప్రక్క ప్రక్కన పెట్టి రెంటిలో ఏది ఎక్కువ బాగుంది అంటే జవాబు ఎవరు చెప్పగలరు! దేని అందం దానిది. దేని సౌరభం దానిదే! అలాగే మీనాక్షి శాంతి!.. మీనాక్షి అందంలో పొంకం, సౌష్ఠవం కనిపిస్తుంది! శాంతిలో సౌకుమార్యం, లాలిత్యం ఎక్కువ! సన్నజాజి మొగ్గలాగే ముట్టుకుంటే కందిపోయే నాజూకుతనం వుంది! మీనాక్షి గుండ్రంగా, నున్నగా, బింకంగా బంతిపువ్వులా వుంటుంది! మగవాళ్ళ కళ్ళతో చూస్తే మీనాక్షి సెక్సీగా వుందనిపిస్తుంది! మగాడిని కవ్వించే అందం మీనాక్షిది! అది శాంతిలో లేదు!
"ఆకుపచ్చ షిఫాన్ చీరమీద పెద్దపెద్ద గులాబీపూల ప్రింట్, లైట్ గ్రీన్ జాకట్టు, కళ్ళకి కూలింగ్ గ్లాసులు, స్కార్ఫ్ తో ముందు వెళుతున్న మీనాక్షి నడకలో వయ్యారం వుంది! సన్నంచు లేత, నీలం కంచి చీర, మోచెయ్యి జాకెట్టుతో శాంతి మీనాక్షి ప్రక్కన చాలా నిరాడంబరంగా కనిపిస్తుంది!.. శాంతి అంతే.. ఈ కాలం వాళ్ళలాగ తయారవదు. ఎన్నిసార్లు చెప్పినా అంతే!.. అన్ని విషయాలలో మీనాక్షి ముందు శాంతి తీసేసినట్టుగానే అనిపించసాగింది నాకు మీనాక్షిని చూస్తుంటే......
