Previous Page Next Page 
నీరజ పేజి 5


    "ఎందుకు నవ్వుతున్నారు?"
    "నేను నమ్మటం వలన నీకు లాభంగాని. నమ్మకపోవటం వలన కలిగే నష్టం గాని ఏమైనా ఉందా!"
    "ఉంది మీరు నమ్మగలిగితే నాకు ఆనందం కలుగుతుంది."
    "అయితే చెప్పు!"
    "ఎందుకు? నా ఆనందంకోసం నమ్మినట్లు అబద్దమాడతారా?"
    "ఎంతపిచ్చిదానివి? మా ఆనందంకోసం మీరు అబద్దాలాడవలసిందేకాని, మాకేంకర్మ! మేం నిర్భయంగా నిజాలు చెప్పగలిగేచోటు ఇదే!"
    సుశీల ఒక నిట్టూర్పు విడిచింది-నిదానంగా అంది. "పాతివ్రత్యం అంటే నాకు తెలియదు. పతివ్రతగా ఉండే అవకాశమూ రాలేదు. కానీ మీరు నాకు తెలిసిన తరువాత...ఇంకెవరితోనూ గడపలేకపోతున్నాను. మరొకరి చెయ్యినామీదపడితే నరకం అనుభవిస్తున్నాను..."
    బాలూ ఏ సమాధానమూ చెప్పలేదు. 'నామాటలు నమ్మరా?' అని సుశీల అడగలేదు...
    సుశీల పక్కన పడుకున్న బాలూ చటుక్కున లేచాడు సుశీల బిత్తరపోయి చూస్తూ ఉండగానే తన జేబులోంచి నోట్లు తీసి సుశీలకిచ్చాడు...
    "ఇవి దేనికి?"
    "నేను మళ్ళీ పదిహీనురోజులకి గాని రాను. అప్పటివరకూ మిగిలిన నర్సుల బారినుండి నువ్వు తప్పించుకోవటానికి..."
    "ఈ డబ్బు మీరు నాకిచ్చినంత మాత్రాన మిగిలినవాళ్ళను నేను రానియ్యనని నమ్మకమేమిటి?"
    బాలూ గట్టిగా నవ్వాడు. అప్పుడప్పుడు అతను అలాగే నవ్వుతాడు. ఎదుటి వాళ్ళ తెలివితక్కువతనాన్ని చూసి జాలిగా నవ్వుతున్నట్లు ఉంటుంది అది. ఆ నవ్వంటే సుశీలకు చాలా ఇష్టం...
    "నేను ఈ డబ్బు ఇచ్చింది నిన్ను నాతో ఉంచుకోవటానికి కాదు. నువ్వు నరకం అనుకునే దానినుండి తప్పించుకోవటానికి..."
    "ఒకవేళ నేను మిమ్మల్ని మోసంచేస్తున్నానేమో!"...
    "అయినా బాధలేదు. నేను ఈ డబ్బు మోసంతో సంపాదించినదే!"
    "నేను నమ్మను? మీరు మోసం చెయ్యరు!"
    "నీ కెలా తెలుసు?"
    "మీరు మంచివారు! ఆ మాట మీ ముఖంమీద స్పష్టంగా వ్రాసి ఉంది..."
    మనసు కలుక్కుమంది బాలూకు! అందరూ ఇదే పాట! నువ్వు మంచివాడివి అని...'కాను...కాను...కాను' అని అతడు ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోతోంది. తను మంచివాడుకాదు! ఏ మాత్రమూ కాడు! మరి, తన ముఖం ఎందుకు మంచివాడి ముఖంలా ఉండాలి? తను ఇంకా ఎంత చెడ్డవాడైతే తన ముఖం చెడ్డవాడి ముఖంలా తయారవుతుంది? "నన్ను ఎన్ని తిట్లు తిట్టినా సహిస్తాను. కాని, 'మంచివాడు' అని మాత్రం అనకు..."
    చిరునవ్వుతోనే శాసిస్తున్నట్లుగా అన్నాడు. బాలూలో సుశీలకు వింతగా అనిపించేది అది ఒకటి..... ఉండుండి అతనేదో శాసిస్తున్నట్లు అంటాడు. చిరునవ్వుతోనే అంటాడు. అయినా ఆ మాట కాదనటానికి మాత్రం ఎవరికీ దమ్ములుండవు.
    "నమ్మాను!"
    "ఒక వేశ్యను! డబ్బుకోసం ఎలాటి మాటలైనా మాట్లాడగలిగిన దానిని నా మాటలు నమ్మగలిగారా?"
    "నమ్మగలిగాను - నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అర్ధంచేసుకున్నాను గనక..."
    సుశీల ముఖం వింతకాంతితో వెలిగింది.
    "నేను మిమ్మల్ని...సరే, ఎప్పుడు అర్ధంచేసుకున్నారు?"
    "నీకు నేను 'సుశీల' అని పేరుపెట్టిన రోజు..." సుశీల మనసు ఆనందంతో నిండిపోయింది.
    బాలూ అందగాడు. బాహ్య సౌందర్యాలకు మురిసిపోయే దశ ఏనాడో దాటి పోయింది సుశీలకు. ఇప్పు డావిడకు, అందగాడూ, వికారీ...అందరూ ఒకటే! బాలూ తరచు వచ్చేవాడుకాదు-నెలకొకసారి వస్తే గొప్ప....వచ్చినప్పుడల్లా సుశీల దగ్గరకే వచ్చేవాడు.
    సుశీల ఒకసారి సరదాగా "ఎప్పుడూ నాదగ్గిరకే వస్తారు. నేను అంత అందంగా ఉంటానా?" అంది.
    "నీకంటే అందమైన వాళ్ళను లక్షమందిని చూసాను!"
    "మరి?..."
    "నీలో ఏదో పోలిష్డ్ నేచర్ ఉంది. బహుశః పెద్దింటి పిల్లవు అయివుంటావు..."
    "ఓహో! పెద్దింటి పిల్లననే గౌరవంతో వస్తున్నారా?" అక్కసుగా అంది.

                     
    "కాదు. నీ దగ్గర మరొక మనిషితో....సాటి మనిషితో కాలం గడిపిన సంతృప్తి కలుగుతోంది నాకు-అందుకని వస్తున్నాను..."
    తెల్లబోయి చూసింది సుశీల....'సాటి మనిషితో కాలం గడపగలిగిన సంతృప్తి....సాటి మనుష్యులతో కాలం గడపగలిగే అవకాశం ఇతనికి లేదా? ఇంత డబ్బున్న ఆసామికి....'
    మరొకసారి బాలూ సుశీలను దగ్గరకు అదుముకోబోతోంటే 'అబ్బా' అంది సుశీల.
    "ఏం?" అన్నాడు బాలూ.
    "ఉదయం జారిపడ్డాను. నడుము కొద్దిగా పట్టింది. ఫరవాలేదులెండి!"    
    సుశీల తనే దగ్గరగా రాబోయింది. బాలూ సుశీల చేతులు మృదువుగా తొలగించి "నిద్రపో? నిద్రలో అదే సర్దుకుంటుంది" అన్నాడు.
    తెల్లబోయింది సుశీల.
    "అయితే మీ డబ్బు మీ కిచ్చేస్తాను."
    "నేను వెళ్ళిపోవటంలేదు. ఇక్కడే ఉంటాను. అంచేత ఆ డబ్బు తీసుకోలేను..."
    అటువైపు తిరిగి కొన్ని క్షణాలలోనే హాయిగా నిద్రపోయాడు బాలూ.
    నిద్రపోతున్న బాలూను చూసిచూసి నెమ్మదిగా అతనికి మెలకువ రాకుండా మీద చెయ్యివేసింది సుశీల. తనంత తానుగా ఎవరినైనా ఆపేక్షతో స్పృశించటం, చాలా రోజుల తరవాత అదే మొదటిసారి సుశీలకు.
    మూడు గంటలకు ఎవరో లేపినట్లు లేచి కూచున్నాడు బాలూ.
    సుశీల నవ్వి "న్నెఉ మిమ్మల్ని లేపకూడదని అనుకున్నాను..." అంది.
    "నువ్వు నిద్రపోలేదా?"
    బాలూ జాలిగా చూశాడు.
    "పాపం! మమ్మల్ని ఆనందపెట్టడానికి ఎంత త్యాగం చేస్తున్నారు మీరు!"
    నిర్ఘాంతపోయింది సుశీల.
    తమ వృత్తిని గురించి ఇంతవరకూ ఎందరెందరో ఎన్నెన్ని రకాల మాటలో అన్నారు. కొందరు సమాజానికి చీడపురుగులని అన్నారు. మరికొందరు జలగలని అన్నారు. కొందరు ఉదారులు సానుభూతి చూపి, జాలిపడ్డారు. కాని 'త్యాగం' అనే మాట మాత్రం ఇంతవరకూ ఎవ్వరూ వాడలేదు.
    "ఏమన్నారు? మళ్ళీ అనండి!" అంది.
    "ఏమో! మరచిపోయాను!" నవ్వి వెళ్ళడానికి లేచాడు బాలూ.
     సుశీల మంచంమీదనుంచి లేచి బాలూ రెండు చేతులూ పట్టుకుని కళ్ళకద్దుకుంది.
    బాలూ తన చేతులకయిన తడిని చూసుకున్నాడు. సుశీల చెమ్మగిల్లిన కళ్ళను చూశాడు. తలవంచుకుని వెళ్ళిపోయాడు.
    అప్పటినుండే సుశీల మనసు బాలూ రాకకోసం ఆరాటంతో ఎదురుచూడసాగింది. అతడు వెళ్ళిపోతుంటే 'అప్పుడేనా?' అనిపించేది. అయినా నోరు విప్పి ఏమీ మాట్లాడేదిగాదు. తనలాటి వ్యక్తి నోట ప్రేమ సంభాషణలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో ఊహించలేని వ్యక్తికాదు సుశీల. అంతేకాదు, వెనకటిలా కృత్రిమపు అల్లరి మాటలు కూడా మాట్లాడలేకపోతోంది.
    "నీ పేరేమిటి?" అన్నాడు ఒకనాడు బాలూ.
    "మాకు ఒక పేరని ఏముంది? ఇక్కడికి వచ్చే మీరంతా మీ వివరాలు చెప్పరు-మా వివరాలు అక్కర్లేదు. ఎవరికీ కావలసిన పేరుతో వాళ్ళు పిలుచుకుంటారు. రాణీ అనో జానీ అనో...మీరే చెప్పండి. నాకు ఏపేరు పెడతారో..."
    "నాకు మూడ్ వచ్చినప్పుడు పెడతాను. ఇప్పుడు కాదు?"
    రానురాను సుశీల మనసు మరీ బాలూతో నిండిపోసాగింది. అతడు తన దగ్గర ఉండే కొద్దిపాటి సమయంలో అతనికి తన దగ్గర ఉన్నదంతా...ఇంకా...ఇంకా ఎలా అర్పించుకోగలవా అని ఆరాటపడేది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS