Previous Page Next Page 
నీరజ పేజి 4

                    


    నీలకాంత్ వెళ్ళిపోగానే నీరజ ఆర్తిగా ప్రభు రెండుచేతులూ పట్టుకుంది...
    "ప్రభూ! నామాట విను! నీలకాంత్ తో స్నేహం మానెయ్యి..."
    ప్రభు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. నీలకాంత్ చేసింది తప్పు కావచ్చును - కాని, తన తప్పు తనే ఒప్పుకుని పశ్చాత్తాపపడ్డాక కూడా క్షమించకపోవటం సమంజసమేనా?
    ప్రభు, నీలకాంత్ చిన్నప్పటినుండీ స్నేహితులు కాకపోయినా ఒకరికొకరు తెలుసు... నీలకాంత్ తండ్రి బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి... అంత పలుకుబడి సంపాదించిపెట్టిన డబ్బు కూడా ఉంది. సినిమాలకూ, షికార్లకూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టే నీలకాంత్ ను స్నేహితులంతా ఒక నాయకుడి లాగా చూసేవారు. ప్రభు ఒక్కడే నీలకాంత్ డబ్బుకు లొంగేవాడు కాదు. నీలకాంత్ ఎప్పుడూ స్టూడెంట్ లీడర్ గా ఉండేవాడు-ఏదో ఒక ఇదంగా అల్లర్లు రెచ్చగొట్టడం ... ఆ అల్లరిలో తను నాయకుడుగా ఉండటం అతనికి బాగా ఇష్టం ... డిగ్రీ తీసుకున్నాక ప్రభు ఒక ఫరమ్ లో ఎకౌంటెంట్ గా చేరాడు. నీలకాంత్ మాత్రం స్టూడెంట్ లీడర్ కావాలని .... స్టూడెంట్ గానే ఉండాలని మరొక సబ్జెక్ట్ తో మళ్ళా యమ్.ఏ.లో చేరాడు.
    ఒక రోజు తన ఫ్రెండ్స్ అందరికీ ఒక హోటల్ లో పార్టీ ఇస్తున్నాడు నీలకాంత్....నీరజతో కలిసి హోటల్ కి వచ్చిన ప్రభును చూసాడు. వాళ్ళిద్దరూ ఫేమిలీరూంలో కూచోగానే "హలో ప్రభూ?" అంటూ తను లోపలకు వెళ్ళాడు. నీలకాంత్ ను చూడగానే నీరజ ముఖం జేవురించింది.
    నీలకాంత్ నీరజను చూస్తూ దీనంగా "నన్ను క్షమించండి! ఆ రోజు తొందరపడ్డాను. అప్పటినుంచి ఇప్పటివరకూ మీకు క్షమార్పణ చెప్పుకోవాలని చూస్తూనే ఉన్నాను" అన్నాడు.
    ప్రభు ఆశ్చర్యంగా "మీ కిద్దరికీ పరిచయం ఉందా?" అన్నాడు.
    నీలకాంత్ అంతకంటే ఆశ్చర్యంగా "ఈవిడ నీ కేమీ చెప్పలేదా?" అన్నాడు.
    "లేదు."
    "అబ్బా ! ఎంత విశాలహృదయం! మీ ఇద్దరిముందు నేనే క్షుద్రుడిగా ఫీలవుతున్నాను, ప్రభూ! నా తప్పు నేనే నీ ముందు ఒప్పుకుంటాను. నువ్వు ఏ శిక్ష విధించినా సరే, అసహ్యించుకున్నా సరే. నీకు తెలుసుగా! నేను అప్పుడప్పుడు తాగుతాను, కొన్నిసార్లు కొంచెం ఎక్కువగా కూడా తాగుతాను. ఆరోజు ఎక్కువ గానే తాగాను. మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు....శీతాకోక చిలుకలను ఇంటికి రప్పించుకోవటం నాకు అలవాటే. ఆ రోజూ అలాంటి చిలుక కోసమే ఎదురుచూస్తున్నాను -నీరజ నా గదిలోకి వచ్చింది - నా కోసమే వచ్చిందనుకున్నాను చెయ్యిపట్టుకుని దగ్గిరకు తీసుకోబోయాను - చెళ్ళు చెళ్ళున నా రెండు చెంపలూ వాయించింది. నా మైకం దిగిపోయింది. నీరజణు క్షమార్పణ కోరుకోవాలనుకున్నాను. కానీ అప్పటికే ఆవిడ వెళ్ళిపోయింది... ప్రభూ! నన్ను క్షమించు. నేను చేసింది తప్పు లేదనను. కానీ, పొరపాటున జరిగింది..."
    ప్రభు చేతులు పట్టుకున్నాడు. నీలకాంత్ కళ్ళలో నీళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
    ప్రభు వెంటనే ఏమీ అనలేకపోయాడు. నీరజవంక చూసాడు. నీరజ పెదవులు బిగించుకుని కూచుంది...
    "దట్సాల్ రైట్! జరిగింది మరిచిపో!" అన్నాడు, ఆ సందర్భంలో అంతకంటే ఏమనాలో అర్ధంకాక...
    "థేంక్యూ!" అని ప్రభుచేతిని సంతోషంగా ఊగించి నీరజవైపు తిరిగిమర్యాదగా తలవంచి తన స్నేహితుల మధ్యకు వెళ్ళిపోయాడు నీలకాంత్.
    నీలకాంత్ వెళ్ళిపోగానే ప్రభు నీరజతో "అతను చెప్పింది నిజమేనా? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా?" అన్నాడు.
    "అవును, వెళ్ళాను?"
    "దేనికి?"
    "ఉద్యోగం కోసం. ప్రసాదరావుగారికి చాలా పలుకుబడి ఉందనీ...ఆయనను కలుసుకుని మాట్లాడితే నాకు ఉద్యోగం తేలిగ్గా దొరుకుతుందనీ చెప్పారు. నేను ప్రసాదరావు గారింటికి వెళ్ళాను. భయపడలేదు. భయపడవలసిన అవసరం ఉంటుందని నాకు తెలియదు. నాకు నౌకరు కనిపించాడు "ప్రసాదరావు గారు ఉన్నారా?" అని అడిగాను. "పైన ఉన్నారు, వెళ్ళండి" అన్నాడు. తీరా అక్కడ ఈ నీలకాంత్..."
    ఆగిపోయింది నీరజ...నీలకాంత్ పేరు ఉచ్చరిస్తున్నప్పుడు నీరజ మనసులో మంట అంతా కళ్ళలో కనిపించింది. ప్రభు ఓదార్పుగా నీరజచేతిమీద తడ్తూ "సరేలే! మరిచిపో!" అన్నాడు.
    "ఛీ! దుర్మార్గుడు!" అక్కసుగా అంది నీరజ. పకపక నవ్వాడు ప్రభు.
    ఆ తర్వాత నీలకాంత్ ప్రభును వదిలిపెట్టలేదు.
    "ప్రభూ! అందహ్రూ నా డబ్బుకోసం నాచుట్టూ కాకుల్లా చేరేవారే! నాకు నిజమైన స్నేహితులు లేరు. నీ స్నేహం వదులుకోలేను..." అన్నాడు.
    "అదేమిటి నీలకాంత్! ఎవరైనా నీ స్నేహం దొరకటం అదృష్టం అనుకుంటారు."
    "అవును నువ్వొక్కడీవే అలా అనుకోవు. స్నేహాన్ని స్వార్ధానికి మార్చుకునే కపటం నీకు లేదుగనుక. అందుకే నీ స్నేహం దొరకటం నా అదృష్టమని అనుకుంటున్నాను..."
    ప్రభు తానై నీలకాంత్ స్నేహాన్ని కోరలేదు కానీ కోరివస్తోన్న నీలకాంత్ ను పొమ్మనలేకపోయేవాడు. నీలకాంత్ రానురాను ప్రభుఇంట్లో కూడా సన్నిహితుడైపోయాడు. లక్ష్మీదేవికీ యశోధరకూ కూడా నీలకాంత్ అంటే ఇష్టమే. యశోధరా నీలకాంత్ ను కూడా "అన్నయ్యా!" అనే పిలుస్తుంది. నీలకామ్త్ కూడా యశోధరను సొంత చెల్లెలులాగే చూసేవాడు. యశోధరకు పెళ్ళి సంబంధాలు నీలకాంత్ చూసేవాడు. ఒక డాక్టర్ తో సంబంధం నిశ్చయించింది కూడా నీలకాంతే! నీరజ వచ్చినప్పుడు మాత్రం నీలకాంత్ చాలా సంకోచపడేవాడు. సాధారణంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ప్రభు తనే బలవంతపెట్టి నీలకాంత్ ను కూర్చోబెట్టేవాడు... నీరజకు మాత్రం నీలకాంత్ ను చూసినప్పుడల్లా తేళ్ళూ జెర్రులూ పాకుతున్నట్టే ఉండేది.
    "ఆ నీలకాంత్ తో స్నేహం మానెయ్యి ప్రభూ!" అనేది.
    "ఏం? మళ్ళా ఏమైనా అసభ్యంగా ప్రవర్తించాడా?"
    "లేదు...కానీ..."
    "నీరజా! ఆనాటి సంగతి మరిచిపో! పొరపాటు అనటానికి ఆధారముందిగా! మనుష్యులను అసహ్యించుకో కూడదు!"
    ఇంకేమీ మాట్లాడలేకపోయేది నీరజ.
    నీరజను గూండాలు ఎత్తుకుపోయారని విన్నప్పుడు ప్రభు పిచ్చివాడై పోయాడు. నీలకాంత్, ప్రభు కూడా ఉండి ధైర్యం చెప్పాడు. నీరజ తిరిగి వచ్చిందన్న వార్తను ప్రభు ఆఫీసుకే వెళ్ళి చెప్పాడు. అలాంటి నీలకాంత్ ను నీరజ నిష్కారణంగా అనుమానించటం ప్రభుకు నచ్చలేదు.
    "ఆనాటి పొరపాటేనా? మళ్ళీ నిన్ను అవమానించాడా?" అన్నాడు.
    నీరజ సమాధానం చెప్పలేకపోయింది. తన ముఖం అతనికి కనిపించకుండా తల మరింత క్రిందకు దించుకుంది.
    
                                           *    *    *
    

    జగమంతా చైతన్యంతో ఉన్నప్పుడు మాటుమణిగిఉండి, సూర్యుడు మాటు మణిగి లోకమంతా నిశ్శబ్దంలోకి జారుకున్నప్పుడు సందడించేవి రెండే రెండు రంగాలు- ఒకటి వ్యభిచారగృహాలు-రెండు దొంగల గుంపులు.
    రాజేశ్వరి ఆధ్వర్యాన ఆ వ్యభిచార గృహం చాలా సందడిగా ఉంది. కొందరు గుంపులుగాచేరి పాటలు పాడుకుంటున్నారు. మరికొందరు ఇంకా చిన్న వాళ్ళు డాన్స్ నేర్చుకొంటున్నారు. మూసుకున్న తలుపులవెనుకనుంచి కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. తమ సరసుడు బానబొజ్జవాడయినా, చిడుమువంటివాడయినా, మొరటువాడయినా, అర్భకుడయినా, వాళ్ళుమాత్రం అలా నవ్వుతూనే వున్నారు, నవ్వదానికే పుట్టినట్లు...కన్నీరు కార్చే అధికారం శాశ్వతంగా పోగొట్టుకున్నట్లు తన పక్కనే పడుకున్న వాడి జుట్టులోకి వేళ్ళుపోనిచ్చి ఆప్యాయంగా నిమురుతూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది సుశీల......
    "ఏమిటి?" అన్నాడు బాలూ...
    "ఏంలేదు. నేను చెప్పినా మీరు నమ్మరు."
    బాలూ నవ్వాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS