Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 5


    సునందలో మళ్ళీ కొత్త ఆశలు చిగురించినట్లయింది. "ఏమిటది? అనడిగింది ఉత్కంఠతతో.
    "నెక్రీజియన్ లొ ధైమస్ అని గ్లాండ్ వుంటుంది. మన శరీరంలో ఎసి టైల్ కోలిన్ అనే పదార్ధం మాయోన్యూరల్ జంక్షన్స్ దగ్గర ప్రొడ్యూస్ అవుతూ యీ యింపల్సెస్ ను ఫెసిలటేట్ చేస్తూ వుంటుంది. ఇందులో థైమస్ గ్లాండ్ ప్రమేయం వుందని కొందరి నమ్మకం. ఈ థైమస్ గ్లాండ్ ని ఆపరేషన్ చేసి తీసివేస్తే- అంటే థైమెక్టమీచేస్తే కొంత శాతం ఉపయోగం వుండవచ్చు."
    "కొంతశాతం అంటే?"
    "చాలా తక్కువ శాతం. పదిశాతంలోపే."
    సునందని మళ్ళీ నిరాశ ఆవరించింది. కళ్ళముందు పొగమంచు కదుల్తూన్నట్లయింది.
    "ఒకవేళ..... ఒకవేళ..... ఏ విధంగానూ డిసీజ్ క్యూర్ అవదనుకుందాం. జీవితాంతం అలా వుండిపోతుంద? మధ్యలో ఎక్కువగా ఎటాక్స్ వచ్చి సీరియస్ అయే అవకాశముందా?"
    "చెప్పలేం ఎప్పటికైనా రెస్పెరేటరీ పెకాలిసిస్ వచ్చే అవకాశముంది. శ్వాసకోశానికి సంబంధించిన కండరాలు పేరలైజయిపోతే- ఊపిరాడక __ నిమిషాల మీద ప్రాణం పోవచ్చు" అన్నాడు భార్గవ.
    
                            *    *    *
    
    సునంద కారులో ఫ్రంట్ సీట్ లో కూర్చుని వుంది. చంద్రం కారు డ్రైవ్ చేస్తున్నాడు.
    "చంద్రం!" అని పిలిచింది.
    "ఊ?"
    "ఇదంతా యిలా ఎందుకు జరుగుతోంది."
    "ఎలా?"
    "మహేష్ హ్యాపీగా లేకుండా...."
    "సృష్టిలో అడుగడుగునా కల్లోల మనుభవిస్తూ వుండటం బహుశా సహజమనుకుంటాను."
    "ఇప్పుడెలా?"
    "తెలీదు."
    "అసలు అంతగా ప్రేమించుకున్న మహేష్, హరిణీ....."
    "ప్లీజ్! యిప్పుడేం అడక్కండి" అతని గొంతులో గొప్పబాధ ధ్వనిస్తోంది.
    
                              *    *    *
    
    సునందను మహేష్ యింటిదగ్గర దింపి మళ్ళీ రెండుమూడు గంటల్లో వస్తానని చంద్రం వెళ్ళిపోయాడు.
    సునంద తలుపు తీసుకుని లోపల కడుగుపెట్టేసరికి యిల్లంతా బావురు మంటోన్నట్లు తోచింది.
    హాల్లో ఓ ప్రక్క అందమైన టేబిల్ మీద ఎక్వేరియం అమర్చబడి వుంది-రకరకాల చేపలు చలాకీగా అటూ యిటూ కదుల్తున్నాయి. క్రింద చిన్న చిన్న గులకరాళ్ళు మధ్యలో ఓ గవ్వ. ఓ ప్రక్క చిన్నపిల్లాడి బొమ్మ. ఆ బొమ్మకు వైర్ కనెక్ట్ చెయ్యబడి ప్రక్కనున్న స్విచ్ బోర్డుదాకా సాగివుంది. ఆ బొమ్మలోంచి గాలి బుడగలు బుడగలుగా వస్తోంది.
    కదిలేచేపలు ఎంత అందంగా వున్నాయి.
    ఇంటికి వస్తోంటే మహేష్ మరీ మరీ చెప్పాడు. "ఆ చేపలు నా ప్రాణం. వాటిలో ఏ ఒక్కటి చచ్చిపోయినా నేను భరించలేను. చంద్రం వాటికి సరిగా ఫుడ్ వేస్తున్నాడో లేదో అనుమానంగా వుంది" అని ఫిష్ ఫుడ్ ఎక్కడుందో, అది ఎలావెయ్యాలో అన్నీ వివరంగా చెప్పాడు.
    నీటిలోకి ఫిష్ ఫుడ్ చల్లుతూ వాటివంక ఆసక్తిగా చూస్తోంది సునంద.
    క్రిందటిసారి ఇక్కడకు వచ్చినప్పుడు హరిణి కూడా వుంది.
    "హేయ్! చాలా అందంగా వున్నాయి చేపలు. ఎప్పటినుంచీ పెంచుతున్నారు?" అనడిగింది ఉత్సాహంగా తను.
    "అవన్నీ మహేష్ ప్రాపర్టీ. ఆ వివరాలన్నీ అతన్నే అడుగు" అంది నవ్వుతూ హరిణి.
    "వీటి పేర్లన్నీ నీకు తెలుసా?" అనడిగింది మహేష్ ని.
    "కొంతవరకూ."
    "ఏదీ చెప్పు."
    మహేష్ లేచి ఆమె ప్రక్కకు వచ్చి నిల్చున్నాడు.
    "ఇది నువ్వు చాలా తేలిగ్గా కనుక్కోగలవు. మెరిసే బంగారం గోల్డ్ ఫిష్"
    "అన్నిటి కన్నా కొంచెం పెద్దగా ఏకాంతంగా తిరిగే యీ చేప బ్రాస్ గోల్డ్."
    "ఇవి చూశావా? త్రిభుజాకారంలో వున్నాయి. వీటిని ఏంజల్స్ అంటారు.
    "దూకుడుగా ఫైట్ చేస్తున్నట్లు వున్న ఈ చేపలు ఫైటర్స్."
    "ఇవి చూడు. లైట్ పింక్ కలర్ లొ మిలమిల మెరుస్తూ-ఒకదాన్నొకటి కిస్ చేసుకుంటున్నట్లు చేస్తున్నాయే....."
    "కిస్ చేసుకుంటున్నట్లు కాదు, కిస్ చేసుకుంటున్నాయి."
    "కిస్సింగ్ గారమి అంటారు"
    "బ్యూటిఫుల్"
    "___ఈ చిన్న చిన్నగా చకచక కదిలే రెండు రకాలు - టైగర్ పాట్స్, విడోస్."
    "చేపల్లో కూడా విడోస్ వుంటాయా?" అంటూ నవ్వింది సునంద.
    మహేష్ జవాబు చెప్పలేదు. నీటిలో కదిలే చేపల్ని ఆసక్తిగా చూస్తూ మౌనంగా నిలబడ్డాడు.
    "ఈ చేపలు ఎప్పుడూ విశ్రాంతి లేకుండా ఎలా కదుల్తూ వున్నాయో! నిద్రపోతాయా అసలు?"
    "అప్పుడప్పుడూ నిద్రపోతూ వుంటాయి. కదలకుండా అలా వుండిపోతూ."
    "నిరంతరం చలిస్తూ, సంచలిస్తూ వుండే జీవులు హఠాత్తుగా నిశ్చలనంగా వుండిపోతే ఎలా వుంటుందో?"
    "ఎవరికి? వాటికా? చూసే వారికా?"
    "ఇద్దరికీ"
    రెండు మూడు క్షణాలు నిశ్శబ్దం "ఏమో మరి."
    "ఊ?"
    "ఏమో మరి"
    "మళ్ళీ అను"
    "ఏమో మరి. ఈ పదం బావుంది" అంటూ నవ్వింది సునంద.
    "నిరంతరం కదిలే జీవులు నిశ్చలనంగా వుండిపోతే...."
    అని ఆసక్తిగా ఆహారం తింటూంటే చూస్తూ నిలబడ్డ సునంద కనుకొలకుల్లో నీళ్ళు నిలచాయి.
    హాల్లో ఒకప్రక్క రెస్ట్ మీద అమర్చబడి వున్న ఫోన్ మ్రోగింది.
    ఒకవేళ....హరిణేమో. ఒక్కక్షణం తటపటాయించింది. ఫోన్ మ్రోగింది. ఇహ వుండలేక వెళ్ళి రిసీవ్ చేసుకుంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS