Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 4


    అదే సమయానికి గది తలుపులు తెరుచుకుని పాప తల్లి లోపల్నుంచి వచ్చింది. ఎదురుగా పాప కనిపించకపోయే సరికి తల అటూ ఇటూ త్రిప్పే సరికి అంతదూరంలో జరగబోయేది క్షణంలో గ్రహించి కెవ్వుమని అరిచి ముందుకు పరిగెత్తింది.
    పాప ఆమెకు అందే వ్యవధిలేదు. కాని అప్పుడు సునంద ర్యాంప్ మీద నుంచి పైకి నడచి వస్తోంది. మొదట మెట్లెక్కి వద్దామనుకున్నదల్లా ర్యాంప్ నుంచి దానిమీద నుంచి నడుద్దామని సరదాపడింది.
    మలుపు తిరిగి పైకి రావటానికి యింకో అయిదారు గజాల దూరం వుండగా పాప అంచుకువచ్చి క్రిందకి జారిపోబోతూ వుండటం చూసింది.
    "అరె!" అనుకుంటూ మెరుపులా పైకి పరిగెత్తి సరిగ్గా పాప క్రిందకు దొర్లిపోయే ముందు రెండుచేతులూ చాచి అందుకో గల్గింది.
    మరు క్షణంలో పాప ఆమె భుజాల మీద వుంది.
    సునంద పాపను ఎత్తుకుని పైకివచ్చేసరికి ఆస్త్రీ వగరుస్తూ దగ్గరకు వచ్చేసింది.
    "మీరేనా ఈ పాప తల్లి?" అనడిగింది సునంద.
    ఆమె నోటమాటలేనట్లు తల ఊపింది.
    "ఇలాగేనా పిల్లల్ని చూసుకోవడం?" అంటూ సునంద ఆమెకు పాపను అందించింది.
    ఒక క్షణం తర్వాత ఆ స్త్రీకి నోటివెంట మాటలు పెగిలాయి. "ఏదో పొరపాటున పిల్లను వొదిలేశాననుకోండి. కాని ఈ మనిషి అలా బొమ్మలా నిలబడి చూస్తూ వుండకపోతే కాస్త పట్టుకోకూడదూ! అసలితను మనిషేనా?"
    అప్పుడు చూసింది సునంద అటుకేసి మహేష్! చిత్తరువులా నిలబడివున్నాడు. కెవ్వున అరవబోయి తమాయించుకుంది.
    "మనిషయి వుండడు. రాక్షసుడయి వుండాలి. లేకపోతే..." ఆ స్త్రీ ఆవేశంగా అంటోంది.
    "ఆగండి. అతని మంచితనం మీకు తెలీదు. ఏం జరిగిందో అర్ధం కావటంలేదు" అంటూ అతని దగ్గరకెళ్ళి భుజంమీద చెయ్యివేసి కుదుపుతూ "మహేష్! మహేష్" అని పిలిచింది.
    అదే సమయానికి ప్రత్యూష ఓ గదిలోంచి బయటకువచ్చి జరిగేదంతా చూసింది. వెంటనే పరిస్థితి ఆమెకు అర్ధమైంది. డాక్టర్ భార్గవ చెప్పిన యిన్ స్ట్రక్షన్స్ మనసులో మెదిలాయి. మెరుపులా మహేష్ వుంటోన్న గదిలోకి పరిగెత్తి చకచక నియోస్టిగ్ మిన్ టూ మిల్లీగ్రామ్స్ సిరంజిలోకి లోడ్ చేసి మహేష్ దగ్గరకు పరిగెత్తింది.
    "ప్లీజ్? అతన్నేమీ అనకండి. ఎటాక్ లో వున్నాడు" అంటూ గబగబ ఇంజక్షన్ చేసేసింది.
    సునంద గుండె వడివడిగా కొట్టుకుంటోంది. "సిస్టర్! అతనికి...." అంది వొణికే కంఠంతో.
    "మైస్థీనియాగ్రేవిస్."
    మైస్థీనియాగ్రేవిస్! మైస్థీనియాగ్రేవిస్" సిస్టర్ మాటలు సునంద చెవుల్లో మార్మోగుతున్నాయి.
    
                                  2
    
    డాక్టర్ భార్గవ మహేష్ ని బెడ్ మీద పడుకోబెట్టి ఎగ్జామిన్ చేస్తున్నాడు. అతని ప్రక్కనే ప్రత్యూష నిలబడి వుంది. సునంద కిటికీ దగ్గర నిలబడి ఉత్కంఠతో చూస్తోంది.
    "ఆర్ యు ఆల్ రైట్?" అనడిగాడు భార్గవ.
    "బై ఆల్ మీన్స్" అన్నాడు మహేష్ చిరునవ్వుతో."
    "ఫైసోస్టిగీమిస్ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వేసుకోవడం లేదా?"
    "వేసుకుంటున్నాను."
    భార్గవ ఏమీ మాట్లాడకుండా అలోచిస్తోన్నట్లు వుండిపోయాడు.
    "డాక్టర్! ఇన్ వెస్టిగేషన్స్ అన్నీ పూర్తయి రిపోర్ట్స్ వచ్చాయికదా" అన్నాడు మహేష్.
    "వచ్చాయి కానీ మీరు కూడా డాక్టరే. వాటివల్ల ఏమీ తేలదని మీకు తెలుసు."
    
                           *    *    *
    
    సునంద డాక్టర్ భార్గవను అతని కన్ సల్టింగ్ రూమ్ లో కలుసుకుంది.
    "నేను మహేష్ స్నేహితురాల్ని, మీతో ఐదు నిముషాలు మాట్లాడవచ్చా?" అని అడిగింది.
    "తప్పకుండా" అని ఆమెను ఎదురుగావున్న కుర్చీలో కూచోమన్నట్లు సౌంజ్ఞ చేశాడు.
    "మహేష్ బాధపడుతున్న డిసీజ్..."
    "చాలా అబ్జర్ వేషన్స్ తర్వాత మైస్థీనియాగ్రేవిస్ అన్న డయాగ్నోసిస్ కి వచ్చాం!"
    సునంద ఆయన్నేదో అడగబోయి, ఆయనింకా ఏదో చెప్పబోతూ వుండటంతో ఆ ప్రయత్నం విరమించుకుంది.
    "డాక్టర్ మహేష్ తనంతట తానే మొదట యీ లక్షణాలు గమనించాడు. ఓ రోజు ఉదయం షేవ్ చేసుకుంటూ వుండగా, తన మొహంలోని ఎక్స్ ప్రెషన్ లో మార్పు వచ్చినట్లుగా గ్రహించాడు. మొదట ఏమోఅనుకున్నాడు. తర్వాత రోజుకి ఒకటి రెండుసార్లు మొహంలోని కండరాలు పేరలైజ్ అవుతున్నట్లు తెలుసుకున్నాడు. అన్నం తింటూన్నప్పుడు వున్నట్లుండి దవడ కండరాలు పనిచెయ్యకుండా నిలిచిపోవటం, కనురెప్పలు తెరవటానికీ, ముయ్యటానికీ వేల్లేని స్థితిలో ఆగిపోవటం.... గమ్మత్తేమిటంటే మైస్థీనియాగ్రేవిస్ లొ కంట్లోని ప్యూపిల్స్ మాత్రం పనిచేస్తూ వుంటాయి.....క్రమంగా యీ డిసీజ్ యితర స్కెలిటర్ మసిల్స్ కు వ్యాపిస్తుంది. ఉన్నట్లుండి కాళ్ళూ చేతులూ కదలటంమానేసి పేషంట్ నిస్సహాయస్థితిలోకి వెళ్ళిపోతాడు. అలా ఎటాక్ వచ్చినప్పుడు కొంతసేపటికి తనంతట తాను రికవర్ కావచ్చు. లేకపోతే యిందాక జరిగినట్లు ట్రీట్ మెంట్ అవసరం కావచ్చు."
    సునంద ఒకటిరెండు క్షణాలు మౌనంగా కూర్చుంది. చిన్న ప్రకంపన ఆమె శరీరమంతా వ్యాపిస్తోంది.
    "అతనికి యిది రావటానికి కారణం?" తేరుకున్నాక నెమ్మదిగా అడిగింది.
    "అతనికేకాదు, ఎవరికైనాసరే మైస్థీనియాగ్రేవిస్ ఎందుకొస్తుందో యిటియాలజీ తెలీదు. అది అభేద్యంగానే వుండిపోయింది. కొందరు దురదృష్టవంతులకి అది వస్తుందంతే."
    "పోనీ ట్రీట్ మెంట్ వాడుతూవుంటే కొంతకాలానికి తగ్గిపోతుందా?" చివరి ఆశగా గొంతు  స్వాధీనంలోకి తెచ్చుకుని అడిగింది.
    "చాలా కష్టం. నూటికి ఒకటి రెండు కేసుల్లో శరీరం తానంతట అదే మామూలుస్థితికి రావచ్చు. మిగతా కేసులన్నిట్లో జీవితాంతం ట్రీజ్ మెంటు వాడుతూ వుండాల్సిందే. కాని.....కొండకు దారంపెట్టి లాగినట్లు ఒక్క అవకాశం లేకపోలేదు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS