Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 4

 

    విదీశీ యువతిలా అలంకరించుకుని వున్న భారత మహిళ బ్యూటీ పార్లర్ లోకి అడుగుపెట్టింది.
    "నా హెయిర్ కు బ్రౌన్ టచప్ చేయాలి."
    వచ్చీ రావడంతోనే అన్నదామె.
    బ్యూటీషియన్ కు తల తిరిగినంత పనయింది.
    ఇంతకు ముందు భారత మహిళలాకనిపించాలని ఒక విదేశీ వనిత తన హెయిర్ ను బ్లాక్ చేసుకోవడమే ఒక విశేషం అయితే, సాక్షాత్తు హైందవ స్త్రీ తను వున్నదానికి బిన్నంగా ఒరిజినల్ హెయిర్ ను బ్రౌన్ చేయమనడం విశేషం కాక మరేమిటి అనుకుంటూ , తనకు తన వ్యాపారం ముఖ్యం కాబట్టి ఆమె హెయిర్ కు బ్రౌన్ ఫినిష్ ఇవ్వడంలో మునిగిపోయింది.
    "మిస్.....ఇఫ్ యూ డోంట్ మైండ్.....మే ఐనో యువర్ స్వీట్ నేమ్"
    "వైనాట్......రీటా ఐయాం మిస్ రీటా"
    'ఓ వెరి సింపుల్ ..........బ్యూటీపుల్ నేమ్"
    ఆమె తన సంతోషాన్ని వెలిబుచ్చుతూ.
    ఆమె బిల్ పేచేసి రిస్టువాచి కేసి చూసుకుని హడావుడిగా టాక్సీని పిలిచి ఎక్కింది.
    బొంబాయి వి,టి. లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ బయలు దేరటానికి సిద్దంగా వుంది.


                                                 *    *    *    *

    విజయవాడ గవర్నరు పేటలో అత్యంత అధునాతనంగా నిర్మించిన భవంతి వద్ద......రోడ్డుకు ప్రక్కగా......
    వరుసగా లెక్కలేనన్ని కార్లు పార్కు చేసి వున్నాయి.....
    సిటీ యాంటీ గుండా స్క్వాడ్ ఇన్ స్పెక్టర్ వినయకుమార్ వాటిని చూస్తూనే నొసలు ముడివేస్తూ జీప్ ను ఆపాడు.
    ట్రాఫిక్ కానిస్టేబుల్ హడావుడిగా వచ్చి సెల్యూట్ చేశాడు.
    "ఆ ఏమిటిది.....ఇన్ని వెహికిల్స్ ఆగి వున్నాఏంటి 'నో పార్కింగ్ ప్లేస్ అని తెలియదా?"
    "అదా సార్.....అది"
    నీళ్ళు నములుతున్నాడే కానీ స్పష్టంగా సమాధానం చెప్పలేక పోతున్నాడతను.
    "ఇక్కడ వుండి నువ్వు చేసే డ్యూటీ ఏమిటి?' గద్దించాడు ఇన్స్ పెక్టర్.
    "అది కాదు సర్! విష్ణుగారి దర్శనానికి వచ్చిన వాళ్ళను ఏమీ అనకూడదు. ఎక్కడ పార్కు చేసినా అభ్యంతరం పెట్టకూడదు. లేదంటే ఆయనకు కోపం తెప్పించిన వాళ్ళం అవుతాం సార్."
    "ఏమిటి నువ్వు చెప్పేది.'
    ఇన్స్ పెక్టరులో చిరాకు .
    "మీరు ఈ సిటికి కొత్తగా వచ్చారు . అందుకే మీకు విష్ణుగారి గురించి తెలియదు. సాక్షాత్తు మంత్రులే అయన దర్శనానికి వస్తారు సార్" ఆ కానిస్టేబుల్ భక్తితో చెప్పాడు.
    "ఓహో! అంత పలుకుబడి వున్నా వ్యక్తా! మంత్రులను కూడా తన దగ్గరకు రప్పించుకుంటాడు అంటున్నావు. అయన ఏమయినా కోటీశ్వరుడా?" ఇన్స్ పెక్టర్ వినయ కుమార్ విసుగ్గా అడిగాడు.
    'అయన దైవాంశ సంభూతుడు సార్, పిలిస్తే పరమేశ్వరుడు పలుకుతాడట. అయన దర్శనం కోసం పోలీస్ అధికారులు , రాజకీయ నాయకులు కూడా గంటల తరబడి ఎదురుచూస్తుంటారు సార్" అర్ధానిమీలిత నేత్రాలతో చెప్పాడు కానిస్టేబుల్.
    "ఓహో - మునీశ్వరుడన్న మాట' హేళన ధ్వనించింది ఇన్స్ పెక్టర్ కంఠంలో.
    "కాదు సార్"
    'అయితే బాబా లేదా సాధువు అయివుంటాడు.'
    "పొరబడుతున్నారు సర్.....అయన వయస్సు ఎంత అనుకుంటున్నారు."
    ఇన్స్ పెక్టర్ ప్రశ్నార్ధకంగా చూశాడు.
    అతని ముఖంలో అశ్చర్యం.
    "అవును సార్ ముప్పయి ఏళ్ళు వున్న నవయువకుడు. యోగసాధన చేసి, చిన్న వయసులోనే జ్ఞాననిష్ఠతో దైవసాక్షాత్కారం పొందిన అమోఘదైవ శక్తి సంపన్నుడు.'
    "నువ్వు చెప్పేది విచిత్రంగా వుందే.....ముని కాదంటావు, బాబా , స్వామీజీ కాదు గొప్ప యోగి అంటావు. ముప్పయి ఏళ్ళు వున్న యువకుడు దైవాంశ సంభుతూడెంటి ఎలా నమ్మాలి?"
    "నిజం సర్! మీకీ కాదు అయన గురించి తెలియనప్పుడు , వినేవాళ్ళకు ఎవరికయినా అలానే అనిపిస్తుంది. కానీ అది నమ్మలేని నిజం సార్! ఒక్కసారి మీరూ చూశారంటే అయన శక్తి ఎలాంటిదో మీకు కూడా తెలుస్తుంది. అయన దర్శనార్ధమై వచ్చినవాళ్ళు వాహనాలను ఎక్కడయినా పార్క్ చేసుకోవచ్చు. ఎవరూ అభ్యంతరం పెట్టరు. విష్ణు పేరు వినపడితే చాలు ప్రభుత్వాధికారులు సయితం పైళ్ళు మూసేసి లేచి నిలిచి నమస్కారం పెట్టుకున్న తరువాతే వాళ్ళ పని మొదలు పెడతారు సార్.'
    తన్మయత్వంతో తనను తాను మరచిపోతూ చెప్పుకుపోతున్నాడు కానిస్టేబుల్.
    "ఓహో! అయితే ఆయనను ఒకసారి చూడాల్సిందే. అతని నిజస్వరూపం ఏమిటో తేల్చవలసిందే" ఇన్ స్పెక్టర్ వినయకుమార్ వ్యంగ్యంగా అన్నాడు.
    ఆ కానిస్టేబుల్ కు ఇన్ స్పెక్టర్ మాటలోని భావం అర్ధం కాలేదు .
    అతనొక అమాయక భక్త శిఖామణి.
    'అవును సర్! కొత్తగా డ్యూటీలో చేరారు ఇప్పుడు సివిల్ డ్రెస్ లోనే వున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. మీకు జయం కలుగుతుంది" అతని మాటలలో వినమ్రత......విశ్వాసం ....భక్తీ భావన .....స్పురిస్తున్నాయి.
    జీప్ ను అక్కడే పార్కు చేసి ముందుకు నడిచాడు వినయ కుమార్.
    ఇప్పడు అతనిలో ఉత్సుకత ఉరకలు వేస్తున్నది.
    పండుగలకు, ఉత్సవాలకు గుడిబయట క్యూ కట్టినట్టు జనం నిలుచుని వున్నారు.
    వాళ్ళ ముందు ఏదయినా ఆశ్రమం లాంటిది వుందేమోనని వినయ కుమార్ పరీక్షగా చూశాడు. ఏమీ కనిపించలేదు, కనీసం చిన్న గుడి కూడా లేదు.
    అపర స్వాములవారు వుండేది ఎక్కడో అతనికి అర్ధం కాలేదు.
    ఆ క్యూని అనుసరించి ముందుకు నడిచాడు.
    అధునాతనంగా వున్న భవంతిలోకి వెళ్ళింది క్యూ.
    విష్ణు వుండేది పర్ణశాలలో కాదని ఖరీదయిన ఆ భవంతిలోనేనని ఇన్ స్పెక్టర్ వినయకుమార్ కు అప్పుడు అర్ధం అయింది.
    అది చాలా అధునాతనమయిన భవనం...ఇంద్రభవనం!
    వరుసలో నిలిచి వున్న ఒక పెద్దాయన ముందు నిలిచి అతనిని పలకరించాడు.
    "ఏం పని మీద దర్శనం చేసుకుంటున్నారు?"
    "నా కూతురుకి త్వరగా పెళ్ళి కావాలని."
    "విష్ణు గారు దీవిస్తే పెళ్ళి జరిగిపోతుందా?"
    అతని మాటలు విన్న చుట్టుపక్కల వాళ్ళు కోపంతో అతనిని తినేసేట్టు చూశారు.
    "తప్పు బాబూ కలియుగ పురుషుడ్ని అలా కించపరచకూడదు చెంపలు వేసుకోనాయనా.....అపరాధం పోతుంది." ఒక వయసుమళ్ళినామె హితభోద చేసింది.
    "ఇలా మొక్కుకుని అయన ఆశీర్వాదం తీసుకుని అలా యింటికి వెళ్ళేసరికి అమ్మాయికి పెళ్ళి కళ వచ్చేస్తుంది. అంత గొప్ప మహిమాన్వితుడు అయన. ఇంకొకరు చెప్పారు.
    "ఆయనను వేడుకుంటే ఉద్యోగాలు కూడా వస్తాయా?"
    "అవును......తప్పకుండా వస్తాయి"
    'అయితే ఇంటర్యులకు వెళ్ళడం, కష్టపడి ఫస్ట్ రాంక్ లు తెచ్చుకోవడం ఎందుకు? ఆయనగారి ఆశీర్వాదం తీసుకుంటే చాలుగా......" అన్నాడు ఇన్ స్పెక్టర్ కొంచెం విసుగ్గా.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS