పద్దెనిమిదేళ్ళ పరువంలో వున్న వర్షకి స్త్రీ పురుష సంబంధాలనుగురించి అవగాహన లేకపోవడం ఏమీలేదు. కానీ అమ్మ యశ్వంత్ సూచనకి అంగీకరిస్తుందా? అంగీకరిస్తే.....తను ఏమౌతుంది? ఆ కొత్త సంబంధం మోజులో తనని అలక్ష్యం చేస్తేనో!
అమ్మో.....ప్రొద్దుట లేచినప్పటినుండీ, రాత్రిదాకా తను అమ్మతోడు లేకుండా వుండలేదు. అమ్మ కూడా అంతే! మరో ఈ కొత్త స్నేహితుడు జ్ఞాపకం చేస్తున్న పాత పరిచయాల మైకంలో పడిపోదుకదా.....అని ఆలోచిస్తూ వుండిపోయింది.
జ్ఞాపకం ఒకటి మెల్లగా వచ్చిమనసు వీణపై మధురోహలస్వరాలని రవళించినట్లు విద్య యశ్వంత్ సాహచర్యాన్ని ఆనందించింది. అతని చేతులు ఆమెచుట్టూ బిగిశాయి.
"యశ్వంత్.....విడు.....దూరంగా వెళ్ళు...."ఆమె స్వరంలో ప్రతిఘటన లేకపోవడం ఆమె గమనించింది. పోకచెట్టులానున్నగా వున్న ఆమె ఎదమీద అతను ముఖం ఆన్చాడు.
"నానిశ్చయం నేనింకా చెప్పకముందే నువ్వు తొందరపడ్తున్నావు" ముఖాన్ని అతని ముఖంనుండి తప్పించడానికి ప్రయత్నిస్తూ అంది.
"మానీ.....నీ శరీరం నీ నిశ్చయాన్ని తెలియబరుస్తోంది విద్యా.....ప్లీజ్......ఎంజాయ్ ఇట్!" అతని పెదవులు తహతహలాడ్తూ ఆమె పెదవులకై వెదికాయి. అతని చేతి వేళ్ళు ఆమె శరీరాన్ని తమకంగా తడుముతూ తనకేసి అదుముకున్నాయి.
విద్య అతని చేతిలో అటూ ఇటూ తిరుగుతూ కొద్దిసేపు తన అస్థిత్వాన్ని మరిచిపోయింది. శరీరం ఏదో కావాలని మారం చేస్తోంది. అతని శరీరం ఆమెని ఆత్రంగా తనలో ఇముడ్చుకోజూస్తూ నిద్రపోతున్న ఆమె కోరికల్ని రెచ్చగొడ్తోంది. పొంకం తగ్గని ఆమె శరీర అవయవాలు, బింకాన్ని తగ్గించుకొని అతని చేతిలో సరిగమలు పలుకుతున్నాయి.
ఆమెని అతను నెమ్మదిగా అతని గదిలోకి తీసుకువెళ్ళాడు వర్ష గది గుమ్మానికున్న పరదాలు గాలికి ఊగుతూమువ్వల శబ్దం చేస్తున్నాయి. అద్దెకి తెచ్చుకున్ననిశ్శబ్ద క్షణాలని అనుభవిస్తున్నట్లుగా ఆమె అచేతనమై కూర్చుని వుంది.
ఎంతో స్పష్టంగా తల్లి అతనితోబాటు ఆ గదిలోకి వెళ్ళడం ఆమె చూసింది. జాజిరెమ్మసన్నగా కదిలి ఆమెని స్వాంతనపరచజూసింది. కిటికీలోనుండి పడే జాబిలి కిరణం ఆమెని జాలిగా తాకింది.
యశ్వంత్ తనని ఆక్రమించుకోబోతుండగా, విద్యకి చెర్నాకోలతో ఛెళ్ళునకొట్టినట్లయింది. అదాటుగా అతన్ని దూరంగా తోసి లేచి కూర్చుంది.
"విద్యా....." అతను ఏదో చెప్పబోయాడు.
"యష్....గెట్ లాస్ట్! విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్....." ఆమె కళ్ళు ఎర్రబారికలువల్లా వున్నాయి.
ఊపిరి ఉగ్గబట్టి వింటున్న వర్ష చెవులకి ఈ మాటలు వినపడి ఊపిరి అందినట్లయింది.
విద్య గబగబా లేచి ఇవతలకి వస్తూ "వెళ్ళి పో యశ్వంత్.....తెల్లవారేదాకా కూడా వుండద్దు. ఒక్క రోజులోనే నేను ఇంత బలహీనమైపోయేటట్లు చేశావు. ఇంకొక్క ఘడియకూడా వుండద్దు! నాప్రపంచంలో నేనూ.....నా చిన్నారి వర్షా....అంతే! అన్యులకి ప్రవేశంలేదు. దయచేసి వెళ్ళిపో.." అని పరిగెత్తుకొచ్చేసింది.
గదిలోకి రాగానే మంచం మీద దిగులుగా కూర్చున్నవర్షని చూసింది. అప్పుడు కన్నీరు మున్నీరౌతూ "తల్లీ...... నా వర్షా...." అని చేతులు జాపింది.
ఆక్షణం వర్షకి సమస్తం తనపాదాక్రాంతం అయినట్లుతోచి తల్లిని ఆత్రంగా చుట్టుకుపోయింది.
వర్ష ఏమీ అడగలేదు! విద్య ఏమీచెప్పలేదు. ఇద్దరూ మౌనంగా ఒకరి సాన్నిధ్యంలో ఒకరు సేదదీరారు.
కాసేపట్లోనే డోర్ బెల్ రింగ్ అయింది. విద్యా, వర్షా గది ఇవతలకివచ్చి చూశారు. యశ్వంత్ సామాన్లు రెండు చేతుల్లోపట్టుకుని గడప దాటుతూ "విద్యా...బై!" అన్నాడు.
విద్య బదులుగా తలవూపికూతుర్ని దగ్గరికి తీసుకుంది.
"వర్షా బై" చెప్పాడు.
"బై!" అని గుండెనిండుగా ఊపిరి పీల్చుకుంది వర్ష. అతను చీకట్లో కలిసిపోయాడు.
"తలుపు వేసి రా వర్షా..... గడియా గట్టిగా పడిందో లేదో చూడు!" అంది విద్య.
ఆ తలుపులు ఆ విధంగా గడియగట్టిగా పడిందో లేదో చూడు!" అంది విద్య.
ఆ తలుపులు ఆ విధంగా గడియపడ్డాయి! ఆ రోజునుండీ విద్య ఇంట్లో పార్టీలు ఎరేంజ్ చేయడం కూడా మానేసింది.
కొత్తవాళ్ళతో ముఖ్యంగా పురుషులతో తల్లి మాట్లాడవలసివచ్చినపుడు తప్పనిసరిగా తనని తోడుగా తీసుకెళ్ళడం వర్ష గమనించింది. తన పరీక్షలన్నీ అమ్మే వ్రాసినట్లుగా, అమ్మ విజయాలన్నీ తనే సాధించినట్లుగా వర్ష భావించేది.
ప్రపంచంలో కెల్లా అత్యద్భుతమైనది.....అమ్మ కళ్ళల్లోని తడిదీవెన.....అతి సుందరమైనది...... అమ్మ పెదవి అంచున మెరిసే చిరునవ్వుని అని ఆమె నమ్మకం. ఒకరోజు వర్ష కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొంది. ముసలి అవ్వ వేషం. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆమె వేషంలోనే పట్టుకుని గాల్లో తేలిపోతున్నట్లుగా తల్లి దగ్గరకొచ్చి ఆమెని గాఢంగా కౌగలించుకుంది. వెన్నెల బొమ్మలా ఉన్న విద్య కూతురిబుగ్గలను ముద్దాడింది.
"వర్షా.......మీ సిస్టరా?" అడిగింది వర్ష లెక్చెరర్ ఒకావిడ.
"కాదు మా అమ్మ!" గర్వంగా చెప్పింది.
"మైగాడ్! నీ కన్నా మీ మదర్ చాలా స్మార్ట్ గా వున్నారు. ఈ వేషంలో అయితే అచ్చునువ్వు ఆవిడకి అమ్మలావున్నావు" ఆవిడ మనసులో దాచుకోలేక అనేసింది.
విద్య వెంటనే "మీరు సరిగ్గానే ఊహించారు మేడం. వర్ష నాకు అమ్మే! అంతకన్నా ఎక్కువేమో కూడా...." అంది.
వర్షకి తెలుసు విద్యది అసమాన సౌందర్యం అని! అటువంటి అందగత్తె....మంచి వయసులో వుండికూడా తనని వరించి వెంటపడేమగవాళ్ళని తృణప్రాయంగా త్యజించి, జీవితాన్ని తన చుట్టూ నిర్మించుకోవడం ఆమెకి గొప్ప సంతృప్తినీ నిశ్చింతనీ ఇస్తుంది.
ఇంటికి వచ్చేటప్పుడు కార్లో తల్లితో అంది "నువ్వు చాలా అందంగా వుంటావమ్మా నాకోసం చాలా త్యాగాలు చేశావు కూడా....నేను చాలా అదృష్టవంతురాల్ని!"
"చాలా..... ఇంకా వుందా?" విద్య నవ్వింది" యూ ఆర్ మై లైఫ్ నువ్వు లేకపోతే అసలు నేను ఈరోజు వుండేదాన్ని కాదు."
* * *
వర్షకి ఆనందంతో, కృతజ్ఞతతో కళ్ళనిండా నీళ్ళువచ్చాయి. కళ్ళకి దారి కనపడక వైపర్స్ ఆన్ చేసింది. ఆ తర్వాత అవి అద్దం మీద కాదు తన కళ్ళనుండి జాలువార్తున్న కన్నీరని తెలిసి కొనగోటితో తుడుచుకొంది.
పేవ్ మెంట్లమీద పసిపిల్లలు తల్లి డొక్కలో దూరి ఆదమరచినిదురపోతున్నారు. చలీ..... ఎండా...వానా వారిసహచరులు. బహుశా బాధించవేమో! ఆకాశం నుండి తెల్లని మబ్బుతునకలా ఏ శాంతా క్లాజో జారిపడి ఈ పసిపిల్లలకి ఉన్నిరగ్గులు కప్పితే ఎంతబావుండ్నూ.... ఎవరుపెట్టారీ నగరపు పేవ్ మెంట్లమీద ఈ ఒత్తులు వెలిగించని ప్రమిదలు! నిరంతరం ధూళిలో కడిగిపొగతో ధూపదీపాలు వెలిగించుకునే చిల్లరదేవుళ్ళు! తన ఆలోచనలకి తనే నవ్వుకుంది వర్ష.
వర్షకారు ఎయిర్ పోర్ట్ చేరుకుంది.
