బట్టతల పేరే రాఘవరావని ధన్వి కి తెలిసిపోయింది.
"హెల్త్ మినిస్టరుగారి బామ్మర్ది....అయన తలచుకుంటే నిన్ను వెంటనే బయటికి గెంటేయగలరు......"
ఇక ఉపేక్షించలేదు ధన్వి. "ఫెంటాస్టిక్ సర్....నన్ను ఇంటర్వ్యూ చేయటానికి యిక్కడ కూర్చున్న మేధావులు నన్ను దుయ్యబట్టి మీమీ అవసరాలకి, తగ్గట్టు రాఘవరావు అనే ఓ ముఖ్యుడికి కాకా పట్టటానికి ఈ ఇంటర్వ్యూను ఈ సందర్భంగా తీసుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను."
అరవలేదు, అవేశపడలేదు.....
కానీ అందర్నీ దిగ్బ్రాంతిలోకి నెట్టాడు ధన్వి.
"ఇక్కడ రాఘవరావుగార్ని ముఖ్యుడు అని తప్ప ప్రముఖుడని నేనెందుకు ఎడ్రసు చెయ్యలేదు అంటే ప్రాముఖ్యత నేది మేధస్సుని బట్టి నిర్ణయించాలి కాబట్టి. అతడు మేధావి కాదా అని మిరడగొచ్చు. సర్విస్ కమిషన్ బోర్డులో వుండేది మేధావులే అని మీరు నన్ను దబాయించొచ్చు. కాదనను....మీలో చాలామంది పోస్టుగ్రాడ్యుయేట్స్ అయివుంటారు.....ఆ డిగ్రీ సంపాదించింది కొనడం ద్వారానా లేక ఏ స్టేట్ లోనో డొనేషన్ కట్టి చదవడం ద్వారానా అని కూడా నేను ప్రశ్నించదలచుకోలేదు.....అసలు ఆ డిగ్రీ స్థాయి ఐక్యూ మీకుందా అని నేను నిలదీయడంలేదు. ఈ దేశంలో ప్రభుత్వాలు, రాజకీయ నాయకులూ వాళ్ళ అవసరాలకి తగ్గట్టు రాయించుకున్న రాజ్యాంగం నిజంగా న్యాయంగానే నడిస్తే మీలాంటి కుహానా మేధావులు బంధుప్రీతి మూలంగానో, ఆశ్రిత పక్షపాతంతోనో తప్ప సత్తాతో ఆ స్థానాల్లో కూర్చోగలిగేవారా అని సింపుల్ గా అడుగుతున్నాను.....నాకు తెలుసు నాది అరణ్యరోదనని...కాని అడుగుతాను, ఈ దేశంలో స్వేచ్చగా మాట్లాడే హక్కు ఒక్కటే నాకు రాజ్యాంగం యిచ్చింది కాబట్టి."
"ఏమిటి రేచ్చిపోతున్నావ్?" రాఘవరావు రోషంగా పైకి లేవబోతుంటే డాక్టర్ శరత్ చంద్ర వారించాడు "ప్లీజ్!"
హటాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
"మిస్టర్ ధన్వి....." ప్రశాంతంగా చూశాడు డాక్టర్ శరత్ చంద్ర.
"మీరు మీ తెలివి తేటల్తో మా అందర్నీ ఆకట్టుకున్నాడు. కానీ అవసరానికి మించి ఎమోషన్ ప్రదర్శించి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటున్నారు, ఇలా అయితే....."
"నాకు జాబెలా వస్తుంది?" అర్దోక్తిగా పూర్తిచేశాడు ధన్వి.
"రాదు సర్....ఇప్పటిదాకా జరిగిన రాద్దాంతం ఒక్కటే కాదు తొంబై శాతం ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగే పోస్టులు అప్పుడే అమ్ముడుపోయాయి కాబట్టి."
డాక్టర్ శరత్ చంద్ర మొహం వివర్ణమైపోయింది.
అది కాదు ఇంటర్వ్యూ బోర్డులో వున్న ప్రతి సభ్యుడూ తొట్రు పడ్డాడు. అది ధన్వి చెప్పింది నిజమైనందుకో లేక మిగతా సభ్యుల మొహాల్లోని భావాలు నిజమని నమ్మించాయో తెలీదు. డాక్టర్ శరత్ చంద్ర ఇంటర్వ్యూలోని అతిముఖ్యమైన ఘట్టంలోకి అడుగుపెట్టాడు.
"నేని ఇంటర్వ్యూ బోర్డుకి చైర్మెన్ని మిస్టర్ ధన్వి!" శరత్ చంద్ర సూటిగా అడిగాడు. "ఇప్పటికే పోస్టులు అమ్ముడుపోయాయని ఏ బేసిస్ మీద అనగలుగుతున్నారు?" మనుషుల్లో మంచిని మాత్రమే చూడగలిగే మేధావి వర్గానికి చెందిన మీలాంటి గొప్ప వ్యక్తులు చూడాల్సిన చీకటి కోణాలు చాలా వున్నాయి సర్......" ధన్వి ఉద్విగ్నంగా కాదు చాలా ప్రశాంతంగా చెప్పాడు.
"నన్ను నిరూపించమంటున్నారు.....తప్పకుండా ఆ పని చేసేవాడ్ని. ఎప్పుడు! కాలుష్యం అన్నది ఒకేచోట పేరుకుని వున్నప్పుడు.....కానీ ప్రతి మూల ప్రతి అంగుళంలోకి అవినీతి చొచ్చుకుపోయింది సర్.....ఇంటర్మీడియట్ 'ఎమ్ సెట్' ప్రశ్న పత్రాల లికేజి మొదలుకుని యింజనిరింగ్ డిగ్రీలు అమ్ముకునేదాకా ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం.....మీకు తెలీదు నేను 'రిటన్ ఏగ్జామ్' లో పాస్ కావటానికి ఓ బోర్డు మెంబరు మేనల్లుడు లక్ష అడిగాడు."
"ఇచ్చారా"
"లేదు"
"అయినా మంచి మార్కులు స్కోర్ చేశారుగా!"
"కాబట్టి మీ డిపార్టుమెంట్ లో అంతా నీతివంతంగా సాగిపోయిందని మీరు అనొచ్చు. లేదు సర్! నేను కష్టపడి రాశాను కాబట్టి స్కోర్ చేశాను. కానీ డబ్బు ఖర్చు చేసి నాలాగా కొందరి స్కోర్ చేశారు.....దీనిలో సర్విస్ కమిషన్ దిగుస్థాయి గుమస్తా మొదలుకుని పై స్థాయి దాకా అంతా భాగస్వాములే....ఇప్పుడు చెప్పండి.....మీ ఒక్కరూ యిన్ని విభాగాల్ని అందులోని మనుషుల్ని ఎలా అదుపు చేయగలరు?"
"నీకు ఉద్యోగం వస్తుందనే అనుకుంటున్నావా?"
రాఘవరావు రెట్టించాడు చికాగ్గా.
"వస్తుంది మిస్టర్ రాఘవరావ్......"ధన్వి బావరహితంగా అన్నాడు. "ఏ రోజైతే కనీస విద్యార్హత వున్న ఓటర్లు మాత్రమే ఈ దేశంలో నాయకుల్ని ఎన్నుకునే అవకాశం వస్తుందో.....మాతృభాషని సైతం స్వచ్చంగా మాట్లాడలేని వ్యక్తులు చట్ట సభల్లో ప్రజా ప్రతినిధులుగా అడుగు పెట్టడం అసంభవమని ఏరోజు రాజ్యాంగం నిర్ణయిస్తుందో......దేశంలోని అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు న్యాయముర్తులకి శాసనాలను రచించి ఆచరించే ' ఐఏఎస్' 'ఐపిఎస్' అదికారులకి వున్న వయోపరిమితి రాజకీయ నాయకులకేందుకు అవసరం లేదని ప్రజలు తిరగబడి ఏరోజు అడుగుతారో ......ఓ మాములు రాష్ట్ర ప్రభుత్వపు క్లర్కు ఉద్యోగానికి పోలిస్ ఎంక్వయిరీ అవసరమయినప్పుడు లక్షల మందిని పాలించే నేతలు హంతకులైనా ఫర్వాలేదన్న నియమాన్ని మేధావులు ఎప్పుడయితే ప్రశ్నిస్తారో అదిగో అప్పుడు నేను సగర్వంగా ఉద్యోగంలో అడుగుపెదతాను....."
ధన్వి ఇక అక్కడ కూర్చోలేదు....ఫలితం తెలిసినట్టు లేచి వెళ్ళిపోయాడు.
చైతన్యాన్ని నిలువునా పాతేయాలనుకున్న కొందరు అవినీతిపరులైన వ్యక్తుల మీద అసహ్యంతో.....సత్యానికి శిరోముండనం చేసి గుబురు చీకటి మృగ నేత్రాలతో అసత్యాన్ని అంతటా పరచాలనుకున్న కొందరు బోర్డు మెంబర్లపై అసహ్యంతో సంకెళ్ళని చేదించుకుని వెళ్ళిపోయాడు......
