ఉత్తరం అంతా చదువుకున్నాక 'ఈ పందానికి నేను ఓకే' అని గట్టిగానే తనకు తానే చెప్పుకున్నాడు వంశీ.
* * * * *
సాయంకాలమైంది. సంధ్య కాంతి సూర్యకిరణాల బ్రష్షులతో లోకానికి ఎరుపురంగు పూస్తోంది. సూర్యుడు వెళుతున్న రధచక్రాలకు కుంకుమధూళి పైకెగసినట్టు పడమటి కొండలు ప్రకాశిస్తున్నాయి. పచ్చటి పైర్ల మీద గాలి షికారు కొడుతోంది.
అలాంటి సమయంలో సత్యనారాయణరావుగారి ఇల్లు కాలం గోడకు తగిలించిన పురాతన తైలవర్ణ చిత్రపటంలా వుంటుంది.
అది పాత బిల్డింగ్ ఆయన తండ్రి కట్టించింది. ఇటీవల మరమ్మత్తులు చేయించారు.
ముందు విశాలంగా లాన్ వుంటుంది. ఆ తరువాత పెంకులతో వేసిన వరండా, వెరైటీ కోసం ఎర్రటి ఆకులతో వేసిన పందిరిలా కనిపిస్తుంది. లోన హాలుతో కలిపి అయిదు గదులుంటాయి. చివరన చాలాభాగం ఖాళీగా వుంది. ఆ తరువాత ప్రహరీగోడ వుంటుంది. ఖాళీ' భాగంలో సిమెంటు గచ్చు వుండడంతో స్త్రీలు సాయంకాలాలు అక్కడ కూర్చుని బాతాఖానీ వేస్తుంటారు. డాబాకు లోపలినుంచే మెట్లున్నాయి. డాబా మీద రెండు గదులున్నాయి. ఒకదాన్ని సుజన వాడుకుంటూ వుంది. రెండో దానిలో సత్యనారాయణగారి అమ్మ పరంజ్యోతి వుంటుంది. అక్కడే బాత్రూమ్ వగైరా వుండడంతో ఆ ముసలామె ఎప్పుడో తప్ప కిందకు దిగదు.
ఆ సాయంకాలం ఎదురింటి నిరుపమను ఇంటికి రమ్మని కబురంపిన విషయం గుర్తుకొచ్చి సుజన తన గదినుంచి దొడ్లోకి వచ్చింది. పనిమనిషి సుబ్బులుతో చెప్పి ప్రహరీగోడ దగ్గర రెండు ఫేము కుర్చీలు వేయించింది.
మరీ గట్టిగా మాట్లాడితే తప్ప వెనుకనున్న వరండాల్లో కూర్చున్న వారికి విన్పించదు. తనూ, నిరుపమ హాయిగా మాట్లాడుకోవచ్చని సంతృప్తి చెందింది. ఒక కుర్చీలో కూర్చుని ఆ వారం వీక్లీని తిరగేయసాగింది.
వరండాలో ఆమె అక్కయ్యలు ముగ్గురూ సన్నజాజుల దండలు కడుతున్నారు. సుజన అంత దూరంలో ఒంటరిగా కూర్చోవడంతో పెద్దక్కయ్య ఉమ పిలిచింది.
"ఏమిటే అంత ఏకాంతంగా కూర్చున్నావ్? ఆడవాళ్ళ గాలి సోకకూడదనా ఏమిటి? శోభనం కోసం ఆరాటపడిపోకు. మరిదిగారు జడుసుకోగలరు. ఇటొచ్చి కూర్చో"
"ఇంతకీ మన పందానికి మీ శ్రీవారు ఒప్పుకున్నారా? లేక తనవల్ల కాదని చేతులెత్తేశారా?" రెండో అక్క రమాదేవి అడిగింది.
"ఒప్పుకున్నట్లే, ఈ ఛాలెంజ్ లో మేము నెగ్గడం ఖాయం ముహూర్తానికి ముందే మిమ్మల్నందరినీ బురిడీ కొట్టించి ఫస్ట్ నైట్ జరిపేసుకుంటాం."
"అంటే మీ ఆయన ఏ క్షణంలోనైనా మాయారూపంలో వచ్చి నిన్ను వాటేసుకుంటాడంటావ్" చిన్నక్క హేమ అంది.
"మరిదిగార్ని చూస్తే అలా అనిపించడం లేదు. శ్రీరామచంద్రుడి చిన్న తమ్ముడిలా వున్నాడు. అతని కాండక్ట్ సర్టిఫికేట్ లో కూడా 'గుడ్' అనే వుంది" ఉమా ఉడికించడానికి అలా అంది.
"అవసరమైతే ఆ శ్రీరాముడే శ్రీకృష్ణుడిలా అవతరించలేదూ అలాగే మా వంశీ కూడా మీరలా చూస్తూ వుండండి - గడువు లోపల ఆయన రాజకుమారుడిలా దర్జాగా ముందు ద్వారం గుండా వచ్చి వెనక దారిగుండా నన్ను ఎగరేసుకుపోతాడు"
"వెయిట్ అండ్ సీ - ఎవరు గెలుస్తారో? మమ్మల్ని బోల్తా కొట్టించినా నాన్నను ఎవరూ మోసం చేయలేరు. శాస్త్రాల్ని ఔపోసన పట్టిన ఆయన దగ్గర మీ వంశీ ఆటలు సాగవు. మేమూ వేయికళ్ళతో కాపలాకాస్తాం" రమ ఛాలెంజింగ్ గా అంది.
"ఇలా రావే. సన్నజాజుల దండ కట్టాం. నువ్వూ పెట్టుకో శోభనం కాని కొత్త పెళ్ళి కూతురివి కదా. వీటి వాసనా ఆ వీధిలోకి పాకితేనయినా మీవైర్కి ఇన్స్ పిరేషన్ వస్తుందేమో" హేమ పిలిచింది.
"అలాంటి అవసరం లేదులే. నా చిటికెనవేలు చూసే మా వంశీ శృంగారంలో శివాలెత్తిపోగలడు" నాటో సుజన అక్కడికి వచ్చి సన్నజాజుల దండలో కొంత భాగాన్ని తుంచి తలలో పెట్టుకుంది. తిరిగి వచ్చి తన కుర్చీలో కూర్చుంటూ వుండగా నిరుపమ వచ్చింది.
ఆమెకి పాతికేళ్ళుంటాయి.
నంది తిమ్మన ఆమె ముక్కునీ, ధూర్జటి ఆమె పెదవుల్ని, అల్లసాని పెద్దన ఆమె కళ్ళనీ, శ్రీనాథుడు ఆమె వక్షస్థలాన్ని, చేమకూర వేంకటకవి ఆమె నడుమునీ, ముద్దుపళని ఆమె జఘనాన్ని తయారుచేసినట్టు అద్భుతంగా వుంటుంది.
"రా నిరుపమా! నీకోసమే చూస్తున్నాను" సుజన ఆప్యాయంగా పిలిచి కుర్చీలో కూర్చోబెట్టింది.
"తీరిగ్గా రమ్మని కబురు పెట్టావ్! ఏమిటి విశేషాలు?"
"బోర్ కొడుతోంది సరదాగా నీతో కాలక్షేపం చేద్దామని"
"కొత్త పెళ్ళికూతురికి బోర్ కొట్టడమేమిటి? ఎవరయినా పలకరిస్తే ఊహలు చెదిరిపోయాయని చీవాట్లు పెట్టే స్థితిలో వుండాలి నువ్వు."
"అంత చిన్నపిల్లను కాదనుకుంటా నేను అది సరేగాని ఇంట్లో మీవారు వున్నారా?"
"లేరు టౌన్ కి వెళ్ళారు ఏదో మీటింగ్ వుందని. లాస్ట్ బస్ కి కానీ రారు"
ఆమె భర్త ఆనంద్ ఆ ఊరులో వి.డి.ఓ.గా పనిచేస్తున్నాడు. నెల్లూరికి పక్కనున్న పల్లెటూరు స్వంత ఊరు. ఆరునెలల క్రితం ట్రాన్స్ ఫర్ మీద ఆ ఊరొచ్చాడు.
"అయితే రాత్రి తొమ్మిదింటి వరకు మనం మాట్లాడుకోవచ్చు. అన్నట్టు నువ్వు బాగా డ్రస్ చేసుకుంటావు నిరుపమా! రోజూ చూస్తుంటాను కదా - చక్కగా ముస్తాబై కనిపిస్తావ్. చాలామంది ఆడపిల్లలకు డ్రస్ సెన్స్ వుండదు. మిడ్ సమ్మర్ లో బ్లాక్ శారీ కట్టుకొని మ్యాట్నీకి వెళ్ళే స్త్రీలున్నారు. థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి చెమటతో తడిసి ముద్దయిపోతారు.
మరికొందరయితే తెల్లటి చీర కింద ముదురు రంగు లంగాలు వేసుకుంటారు. దీంతో కింది భాగం ఒక రంగులోనూ, పైభాగం తెల్లగా వుండి చూడడానికి ఆడ్ గా వుంటుంది.
ఇంకొందరయితే ఎర్రటి చీర మీద నల్లటి జాకెట్ వేసుకుని అచ్చు డి.ఎం.కె.జెండా కర్రలా కనిపిస్తారు. తేళ్ళనూ, జెర్రెల్నీ ఒంటికి అతికించుకున్నట్టు కొందరు తెల్లటి జాకెట్ కింద నల్లటి బ్రాలు వేసుకుంటారు."
"నిజమే చాలామంది అమ్మాయిలకు మంచి డ్రస్సులే వుండవు. తలకు రాసుకోడానికి కొబ్బరినూనె లేనివాళ్ళే ఎక్కువ. పల్లెటూరు అమ్మాయిల్లో ఎవరో కొందరికి తప్ప మిగిలిన వాళ్ళకు రెండు మూడు డ్రస్సులకంటే మించి ఉండవు."
"నిజమే కానీ నేను చెప్పింది డ్రస్సులు వుండీ ఎలా డ్రస్ చేసుకోవాలో తెలియనివాళ్ళ గురించి"
