"ఇక నిన్ను చూడకుండా ఒక్క క్షణం వుండలేను. మన పెళ్ళి ఝామ్ ఝామ్ మని తొందర్లో జరిగిపోవాలి. మా నాన్నని మేనేజ్ చేసే పూచీ నీదే. ఆయనంత మూర్ఖుడు ప్రపంచంలో వుండడు. పంచాంగం ఆయన ఆరో ప్రాణం. రాహుకాలం, యమగండం చూడందే ఇంట్లోంచి కాలు కూడా బయటపెట్టడు. జాతకాలూ, జ్యోతిష్యం, వాస్తూ, సాంప్రదాయాలు - ఇలా అన్నిటినీ అతిగా నమ్ముతాడు.
కాబట్టి మనం ప్రేమించుకున్నాం. పెళ్లి చేయండంటే అందరి నాన్నల్లాగా సుతరామూ అంగీకరించడు. కాబట్టి మనిద్దరి జాతకాలూ బ్రహ్మాండంగా వున్నాయనీ, మనిద్దరికీ పెళ్లి చేస్తే సీతారాముల్లా వుంటామని మన ఊరి అవధాని చెప్పేటట్లు అరేంజ్ చెయ్. మనిద్దరం ప్రేమించుకుంటున్నామని బయటపడేలోగా యిది జరిగి పెళ్ళి అయిపోవాలి. శుభస్య శీఘ్రం" అని ఊపిరి వదలకుండా ఏకబిగిన చెప్పింది.
ఆమె చెప్పినట్లే వేయి రూపాయిలతో అవధానితో పని కానించేశాడు. పెళ్ళయి పోయింది. కాని చిక్కంతా ఫాస్ట్ నైట్ దగ్గరే వచ్చింది. ముహూర్తం రోజున అలా అయిపోవడంతో నెల రోజులు వాయిదా పడింది.
సత్యనారాయణరావుకి మొత్తం నలుగురు ఆడపిల్లలు మగపిల్లలు లేరు. సుజన చిన్నపిల్ల మిగిలిన ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళ వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు.
శోభనం ఇలా వాయిదా పడటంతో సుజన అక్కయ్యలు ముగ్గురూ ఊర్లకు బయల్దేరితే సత్యనారాయణరావు వాళ్ళను ఆపేశాడు.
"శోభనం ముచ్చట జరక్కుండా మీరు వెళ్ళడానికి లేదు. పిల్లలకు చదువుపోతుందంటే అల్లుళ్ళతో పిల్లల్ని పంపేయండి. రాక రాక వచ్చారు. ఆ ముచ్చటా తీరాక నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని దిగబెడతాను.
చిన్నల్లుడు ఒక్కడే. ఆ ఇంట్లో ఆడపిల్లలెవరూ లేరు. ఉన్నదంతా తల్లీ కొడుకే. అందువల్ల ఈ శోభనం గొడవంతా ఆడవాళ్ళ ముచ్చట గనుక మీరు కాలు కదపడానికి లేదు" అని ముగ్గురు కూతుళ్ళనూ బయల్దేరనివ్వలేదు. అల్లుళ్ళు పిల్లలని తీసుకుని ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.
సుజన, వంశీల వివాహం అయ్యాక ఇంత ప్రహసనం గడిచిందన్న మాట.
"వంశీ... వంశీ" తల్లి మళ్ళీ పిలవడంతో బద్దకాన్నంతా ఒంటి నుంచి విదుల్చుకొని తన రూమ్ తలుపు తెరిచాడు.
"నీకేదో ఉత్తరం వచ్చినట్లుందిరా" అని ఆమె ఓ పోస్టల్ ఎన్ లప్ అందించింది.
ఉత్తరాన్ని అటూ ఇటూ తిప్పుతూ తిరిగి తన గదిలోకి వచ్చి మంచం మీద ఏటవాలుగా పడుకుని ఉత్తరాన్ని చించాడు. అక్షరాలను గుర్తుపట్టాడు. సుజన రాసింది. ఆ వీధిలోంచి ఈ వీధిలోకి ఉత్తరమా అని ఆశ్చర్యపోతూ చదవడం ప్రారంభించాడు.
"వంశీ!
మన శోభనాన్ని వచ్చే నెల రెండో తేదీ నిర్ణయించారు. ఇది తెలిసిన వెంటనే మా అక్కయ్యలు ముగ్గురూ నన్ను ఆట పట్టించడం ప్రారంభించారు. తమ మరిది సరసుడైతే ఫస్ట్ నైట్ కోసం అంతకాలం ఆగలేడనీ, ఒట్టి దద్దమ్మ అయితేనే ముహూర్తం వచ్చేవరకు ఎదురు చూస్తాడనీ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఈ సమయంలో నాకూ, వాళ్ళకీ మధ్య మాటా మాటా పెరిగింది.
మా వంశీ ఎంత గొప్ప ప్రేమికుడో, అంత సరసుడని నేనన్నాను. అయితే నాన్న పెట్టించిన ముహూర్తంలోపే మీరు ఫస్ట్ నైట్ జరుపుకోండని అన్నారు. తాము నాన్న పక్షమే గనుక మనిద్దరం కలుసుకోవడానికి కూడా వీలు కల్పించరట. పైపెచ్చు మనం కలుసుకోకుండా వాళ్ళు అడ్డుకుంటారట. ఇలాంటి స్థితిలో మనం వల్ల కళ్ళు గప్పి శోభనం జరుపుకోవాలన్నది పందెం. ఈ పందెంలో వాళ్ళు నెగ్గితే ఒక కోరిక కోరతారు. దాన్ని మనం తీర్చాలి. మనం విజయం సాధిస్తే మనం అడిగింది వాళ్ళివ్వాలి.
ఇలా మా మధ్య కుదిరిన ఛాలెంజ్ ని నువ్వూ ఒప్పుకుంటావన్న భరోసాతో సరేనన్నాను. శాస్త్రాలూ, పద్ధతులూ అంటూ మా నాన్న మనం కలుసుకోవడానికి గానీ, మాట్లాడుకోవడానికి గానీ అనుమతించరు. ఆయన ఇలాంటి వాటిని ఎంతగా పట్టించుకుంటారో నీకూ తెలుసు.
అందువల్ల ఆయన్నీ, పందెం వేసిన మా ముగ్గురు అక్కయ్యలనూ బోల్తా కొట్టించి మనం ఫస్ట్ నైట్ జరుపుకోవాలి. దీనికి గడువు వచ్చేనెల రెండు. కాబట్టి నువ్వే ఏదో మతలబుచేసి మనం కలుసుకునే ఏర్పాట్లు చేయాలి. ఇదంతా నీతో చెప్పే వీలులేక ఈ వీధిలో వున్న నేను ఆ వీధిలో వుండే నీకు ఇలా పోస్టల్ ద్వారా రాయబారం పంపుతున్నాను. అంటే నేనే స్థితిలో వున్నానో ఊహించు.
ఈ ఛాలెంజ్ గురించి ఆలోచిస్తుంటే రాత్రి నా ఎం.ఫిల్. రీసెర్చీకి ఓ బ్రహ్మాండమైన టాపిక్ తట్టింది. అదేమిటంటే 'ఫస్ట్ నైట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్' అన్నది. స్త్రీ తన జీవితంలో మొదటిసారి ఒక మగాడి ఉద్రేకాల్నీ, ఉద్వేగాల్నీ చూసేది శోభనం రోజే. అమ్మాయిలకు ఓ కొత్త జీవితానికి స్టార్టింగ్ పాయింట్ శోభనమే. భర్త అయినవాడు ఎలాంటి వాడో తెలుసుకునేందుకు కర్టెన్ రైజర్ లాంటిది ఫస్ట్ నైట్.
తను పుట్టిన ఊరు, కన్నతల్లి దండ్రులూ, స్నేహితులూ - వీరందర్నీ వదిలి కొత్త వ్యక్తితో, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మహా ప్రస్థానం మొదలయ్యేది ఆ రాత్రి నుంచే. తన జీవితం ముందు ముందు ఎలా గడుస్తుందో తెలిపే లిట్మస్ టెస్ట్ శోభనం.
మొదటి రాత్రి అంటే కేవలం సెక్సే కాదు కదా. దానికీ ముందూ వెనకా చాలా వుంటాయి. అదిగో వాటిని రికార్డ్ చేస్తాను. ఆర్ధిక పరిస్థితులూ, నైతిక విలువలూ, మెంటల్ ఇంబాలన్స్ లూ, రకరకాల కాంప్లెక్సులూ - ఇవన్నీ మొదటిరాత్రి ఎలా ప్రతిఫలిస్తాయో, జీవితంలో అవి కల్పించే ప్రభావం ఎలా వుంటుందో విశ్లేషిస్తాను.
రేపటినుంచే నా థీసిస్ కి శ్రీకారం చుడతాను. నేను చిన్నప్పట్నుంచీ మద్రాసులో వుండడం వల్ల మన ఊరి అమ్మాయిల గురించి ఏమీ తెలియదు. ఈ మధ్యే వాళ్ళతో పరిచయాలు ప్రారంభమయ్యాయి. వీళ్ళనందర్నీ ఫస్ట్ నైట్ మీద ఇంటర్వ్యూ చేస్తాను. వాళ్ళ శోభనం రోజున ఏం జరిగిందో తెలుసుకుంటాను.
ఎలా వుంది నా రీసెర్చ్ ఐడియా? పాశ్చాత్య దేశాల్లోనే స్త్రీలు ఇలాంటి వాటికి జవాబులు చెబుతారని, మనదేశంలో చెప్పరని అంటూంటారు. కనీ ఇది అబద్దం ఇలా అనుకుంటూ మనమేదో మనకు లేని గొప్పతనాన్ని ఆపాదించుకుంటూ వుంటాం. లేదూ మన స్త్రీలను ఆ కామెంట్లతో చిన్నబుచ్చుతుంటాం. కానీ ఒక్క విషయం వంశీ! బెడ్ రూమ్ ఎక్కడైనా ఒకటే అమెరికాలో అయినా, ఇండియాలోనైనా మనిషి స్వభావం ఒక్కటే అందుకే మన స్త్రీలూ తమ ఫస్ట్ నైట్ ల గురించి చెబుతారని అనుకుంటున్నాను.
ఇక ఏమిటి విశేషాలు?
మా సిస్టర్స్ తో నేనువేసిన పందెంలో మనం నెగ్గాలి. ముహూర్తాని కంటే ముందుగానే ఎవరికీ తెలియకుండా మన శోభనం ఝామ్ ఝామ్ అని జరిగిపోవాలి. భారం అంతా నీదే. విష్ యూ బెస్టాఫ్ లక్ -
యువర్స్ - సుజన"
