ప్రారంభం
ఒక అందమైన అమ్మాయి (ముక్కు ఎలిజబెత్ టేలర్ లా, కళ్ళు మార్లిన్ మన్రోలా వున్నది.) దోసిలితో పూలు గాలిలోకి ఎగరేసింది. వచ్చిమీద పడబోయేటంతలో అన్నీ కలిసి ఒక చిన్న ఆకారంగా రూపుదిద్దుకున్నాయి.
మరో అప్సరస తీగ సుతారంగా మీటింది. పూలు చెదిరిపోయి ఆ శబ్దానికి అనుగుణమైన అక్షరాలుగా తయారయ్యాయి.
సన్నటి నడుము వున్న అమ్మాయి అందంగా ఒళ్ళు విరుచుకున్న భంగిమలో నోటేషన్ ప్రారంభం అయ్యింది.
ఒక కంజాతదళాక్షి సొగసు కన్నుల్లో ఒక హోల్ నోట్ పక్కన హాఫ్ నోట్.
మధ్యలో గీత- కొనదేలిన ముక్కులా వుంది. మీట యొక్క ధ్వనిని కొంచెంసేపు పెంచటానికి కుడివైపు పెట్టిన చుక్క బ్యూటీస్పాట్ లా వుంది. ఒక హంసగమన నడుస్తూ వుంటే ఆ పాదాల ముద్రలు అందంగా పడినట్టూ టైమ్ సిగ్నేచర్ల గీతల మీద బీమింగ్ ఏర్పడింది.
మొత్తం మీద అన్నీ కలిపితే ఒక ఇరవైమంది కోరస్ లా పాడుకుంటూ "ఆ...య్ లా...వ్ యూ..." అన్న ట్యూన్ నోటేషన్ కళ్ళముందు కదలాడింది.
ఒకటే పిచ్ లో కొద్దిగా స్వరం పెంచి సెమీటోన్ ఉపయోగించటంవల్ల కలిగే "ఆక్సిడెంటల్" మృదుమధురంగా వుంది. ఈ అప్సరసల వెనకాల మ్యూజిక్ వాయిస్తున్న వాడెవడో బాలూ అంత గొప్పవాడై వుంటాడు.
అంతలో చిన్న ఏక్సిడెంట్ జరిగింది. ఒక అప్సరసకి కోపం వచ్చి రెండు చూపుడు వేళ్ళనీ డబుల్ షార్ప్ ఆకారంలో బాలూవైపు సూచించింది. దానివల్ల పాట స్వరం హెచ్చింది గానీ బాలూని మాత్రం అక్కడ నుండి తోసేశారు. ఆకాశం మీద నుంచి భూమ్మీదకి వచ్చిపడ్డాడు. డొక్కల్లో ఏదో గుచ్చుకుంది. అయినా ఇంకా ఆ నోటేషన్ మత్తు వదల్లేదు. మళ్ళీ ఆకాశంలోకి ఎగరడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ డొక్కల్లో ఏదో వచ్చి గుచ్చుకుంది. ఈసారి మత్తు కొద్దిగా విడివడి మాటిమాటికీ వచ్చి గుచ్చుకుంటున్నది- ఆకాశంవైపు ఎగరటంవల్ల కాదనీ, ఆ గుచ్చుకునేది పక్క స్టూడెంటు మోచెయ్యి అనీ, వాడు బాలూని నిద్రలేపటానికి ప్రయత్నం చేస్తున్నాడనీ అర్ధం అయ్యింది. చప్పున కళ్ళు విప్పాడు. తాను ఎకనామిక్స్ క్లాస్ లో వున్నానని అర్ధమయింది.
"మిస్టర్ బాలూ? మార్షల్స్ మార్జినల్ యుటిలిటీ థియరీ ఏమిటి?"
చాలాసేపటినుండీ ఆయన పిలుస్తున్నాడని ఆ కంఠంలో కనబడిన కోపమే చెపుతోంది. పూర్తిగా మెలకువలోకి అతడు రావటానికి శతవిధాలా ప్రయత్నిస్తుండగా ప్రక్కనే కూర్చున్న సుబ్బారావు ఏదో సమాధానం అందివ్వటానికి ప్రయత్నించాడు. అతడు గొణిగిన దాంట్లో సగం వినపడింది.
బి.ఏ. ఫైనల్ ఇయర్ చదువుతున్న వాడిని మిగతాది ఆ మాత్రం నేను పూర్తిచెయ్యలేనా! అనుకుంటూ గొంతు సవరించుకుని ధీమాగా చెప్పాడు. "ఒక అరటిపండు తిన్నాక రెండో అరటి పండు తింటే రెండో అరటిపండుకన్నా మొదటి అరటిపండు బావుంటుంది...." (ఇక్కడి వరకే సుబ్బారావు చెప్పింది విన్నాడు.)
"కరెక్ట్" అన్నాడు లెక్చరరు.
హుషారొచ్చింది. తర్వాత, స్వంత సైన్సు పరిజ్ఞానం ఉపయోగించదలుచుకున్నాడు... "రెండో అరటిపండు బాగా లేకపోవటానికి కారణం బాక్టీరియాగానీ, వైరస్ గానీ అయిండవచ్చు."
క్లాసు గొల్లుమంది. ఈసారి సుబ్బారావు చెయ్యి వచ్చి అతని మోకాలిని కొట్టింది. ఆర్ట్ లో సైన్సు కలపటం తప్పని తెలిసింది. లాజిక్ ని ఆశ్రయించాడు....."ఒక అరటిపండు కన్నా ఇంకొక అరటిపండు రుచిగా వుండకపోవటానికి రెండూ రెండు వేరు వేరు గెలలకి సంబంధించిన పళ్ళై వుండవచ్చు. లేదా మనస్తత్వ శాస్త్రాన్ని తీసుకుంటే మొదటి పండు తింటున్నప్పుడు నాలికకు వుండే ఏంక్జయిటీ రియాక్షన్, ఫోజిక్ అబ్సెషన్, కంపల్సివ్ రియాక్షన్స్ రెండో అరటిపండు తింటున్నప్పుడు వుండకపోవచ్చు."
"మిస్టర్ బాలూ! ఇది సైకాలజీ క్లాసు కాదు."
"పోనీ ఫిలాసఫీ తీసుకుంటే మొదటి పండు తినగానే వేదాంత భావం అలవడవచ్చు."
మళ్ళీ క్లాసు గొల్లుమంది.
"మిస్టర్! ఇది ఎకనమిక్స్ క్లాస్."
"అయితే సరే!" నమ్రతగా అన్నాడు- "మొదటి పండు తొక్క తీస్తున్న సమయంలో రెండో దాని ధర పెరిగి వుండొచ్చు."
ఆయన మొహం జేవురించింది. "క్లాస్ అయ్యాక వచ్చి నన్ను కలువ్" అన్నాడు కోపంగా.
* * *
"జాబ్" బాలు ఆరోప్రాణం. చేతిలో గిటార్ వుంటే ఇంకేం అక్కరలేదు. చిన్నప్పుడే తండ్రి దీనిపట్ల అభిరుచి కలిగించాడు. అతడు ఓ పెద్ద హోటల్లో డ్రమ్మర్ గా వుండేవాడు. ఒకరాత్రి ఇద్దరు బాగా తాగి గొడవచేస్తూ వుంటే మధ్యలో సర్దుబాటు చెయ్యడానికే వెళ్ళాడు. ఇద్దరూ కలసి అతణ్ణి పొడిచేశారు. బాలు అమ్మ కూడా ఎక్కువకాలం బ్రతకలేదు. కొడుకుని చదివించాలన్న ఆశయంతో తన లేబర్ ని పెట్టుబడిగా మార్చడానికి ప్రయత్నం చేసింది. కానీ మార్షల్ థియరీ ఎల్లప్పుడూ ఒకేలా వర్తించదు. ఆమె లేబర్ ధర పడిపోయింది. ఆ దిగులుతోనే ఆమె కూడా పోయింది. ఆశయం పూర్తిచేయడం, కంకణం కట్టుకోవడం లాంటి పెద్ద పెద్ద పదాలేవీ ఉపయోగించలేదు గానీ ఇంతవరకూ వచ్చిన చదువును ఆపుచేయటం బాలూకి ఇష్టం లేకపోయింది. ఎంతో కష్టపడి ఇక్కడివరకూ చదివించింది అమ్మ అతను ఇంకొంచెం కష్టం పడదామనుకున్నాడు.
అప్పుడు సాయపడింది తండ్రి నేర్పిన గిటార్.
"ఏదో మామూలుగా వాయిద్దాం, నలుగురి మెప్పూ పొందుదాం" అని అతనెప్పుడూ అనుకోలేదు. మ్యూజిక్ కన్నా దాని వెనక వుండే శాస్త్రం అతన్నెక్కువ ఆకర్షించసాగింది.
బ్లూస్టార్ హోటల్లో రాత్రి పదకొండున్నరా, పన్నెండు వరకూ పనిచేసేవాడు. వాళ్ళిచ్చే జీతం తిండికి, కాలేజీకి బొటాబొటిగా సరిపోయేది. కానీ వచ్చిన చిక్కల్లా... చదువుకన్నా ఈ సాయంత్రం పూట ఉద్యోగమే ఎక్కువ ఆకర్షణీయంగా వుండేది అతడికి.
బ్లూస్టార్ హోటల్ ప్రొప్రయిటర్ చాలా పిసినారి. బీరు బాటిల్స్ లోంచి మేలురకం బీరు తీసేసి చౌకబారుది కలిపేవాడు. అలాగే రోస్ట్ చికెన్ అని చెప్పి రోస్ట్ ఈగిల్ ఇచ్చేవాడు. పనివాళ్ళు అందరూ చూసీ చూడనట్టు ఊరుకొనేవాళ్ళు ఇరవై ముఫ్ఫై రూపాయలిచ్చి హోటల్లో గ్రద్దల్నీ, పందుల్నీ నాజూగ్గా ఫోర్కుతో తినే వాళ్ళని చూస్తుంటే నవ్వొచ్చేది. వాళ్ళకి మనిషి మాంసం పెట్టినా అభ్యంతరం లేదుగానీ పనివాళ్ళ రక్తమాంసాలు కూడా చౌకగా కొనేయాలనుకోవడం బాధగా వుండేది. కానీ ఆ పరిస్థితుల్లో ఆ ఉద్యోగం తప్ప ఇంకో గతిలేదు బాలూకి.
సరిగ్గా ఈ సమయంలో వెస్టెండ్ హోటల్నుంచి అతడికి పిలుపొచ్చింది.
నగరంలో కెల్లా అత్యంత అధునాతనమైన హోటల్.... వెస్టెండ్ వాళ్ళిచ్చే జీతం మిగతా వాళ్ళకన్నా దాదాపు రెట్టింపు వుంటుంది. ఇవన్నీ కాదు ముఖ్యం. ఆ హోటల్లో గిటారిస్ట్ అంటే ఆ ఖ్యాతే వేరు. కానీ అక్కడ పని దొరకటం అంత సులభమైన విషయం ఏమీకాదు. ఎంతోమంది ఉన్న ఆ ఒక్క పోస్టుకోసం ప్రయత్నిస్తున్నారని బాలూకి తెలుసు.
ఆరోజు సాయంత్రం ఇంటర్వ్యూకు వెళ్ళాడు. ఇంటర్వ్యూ అంటే పెద్ద పెద్ద ప్రశ్నలూ, సమాధానాలేమీ లేవు. "ఇంతకు ముందు ఎక్కడ పనిచేశావు? ఎంత జీతం ఇచ్చేవారు?" అడిగారంతే. వెస్టెండ్ హోటల్ మేనేజర్ కి యాభై అయిదేళ్ళు వుంటాయి. బలంగా, లావుగా వున్నాడు. ఒక చూపులో ఎదుటి వాళ్ళ సామర్ధ్యాన్ని అంచనా వేసేట్టు చురుగ్గా వున్నాయి కళ్ళు. అతడికెందుకో బాలు నచ్చలేదన్నట్టు అతడి చూపు చెపుతోంది. బహుశా బాలు మరీ కుర్రవాడిలా కనబడి వుంటాడు.
"కాలేజీలో చదివేవాడివి సాయంత్రం ఇక్కడ పనెలా చేస్తావ్? రెండు పడవల్లో రెండు కాళ్ళవ్వవా?" అని అడిగాడు ఇంగ్లీషులో.
"నేనింతకాలం ఇలాగే చేస్తూ వచ్చాను సర్" అన్నాడు బాలు నమ్రతగా.
అతడు సంతృప్తి చెందినట్టు కనబడలేదు. "సరే అలా కూర్చో మా బేండ్ చీఫ్ వస్తాడు. అతడితో కనుక్కుని చెప్తాను" అన్నాడు. అతడి మాటల్లో బాలుని పన్లోకి తీసుకోవటం ఇష్టంలేదన్నది స్పష్టమైంది.
దాదాపు ఒక అరగంట కూర్చున్నాడు. చీకటి పడింది. ఆరు, ఆరున్నర, ఏడు అయింది. మొత్తం బెండ్ గ్రూప్ లో ఎవరూ రాలేదు. పాత బస్తీలో గొడవల మూలాన కర్ఫ్యూ విధించారని తెలిసింది. మరో అరగంటలో నగరమంతా కర్ఫ్యూ విధించబడింది.
ఇలాటిది చాలా అరుదైన సంఘటన. రోడ్లన్నీ నిర్మానుష్యంగా వుంటాయి. కానీ హోటల్స్, ముఖ్యంగా ఇలాంటి స్టార్ హోటల్స్ లోపల విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. గదుల్లో దిగిన వారందరూ ఇక బయటికి వెళ్ళడానికి వీల్లేక రెస్టారెంట్ కే ఆ సాయంత్రం గడపటం కోసం వస్తారు. బాలు కూర్చున్న చోటు నుండి అద్దాల అవతల కిక్కిరిసిన రెస్టారెంటు నుంచి జనం గోల తెలుస్తూనే వుంది. మేనేజరు కంగారుగా అటూ ఇటూ తిరగటం కూడా కనిపిస్తోంది.
మరికొంచెంసేపు గడిచాక రిసెప్షను దగ్గిరగా వెళ్ళి బేండ్ చీఫ్ గురించి అడిగాడు.
"వాళ్ళింకేం వస్తారు? పాత బస్తీ నుంచి రావాలి. ఈ రోజు రానట్టే" అంది రిసెప్షనిస్టు.
బాలుకేం చెయ్యాలో తోచలేదు. మేనేజరు హడావిడిగా తిరుగుతున్నాడు. అందరి గొంతుల్నీ కవర్ చేసే మ్యూజిక్ లేకపోవడంతో ఏదో వెలితిగా కనబడుతోంది. అప్పుడే ఒక కస్టమర్ అడుగుతున్నాడు కూడా.
చిటపటలాడుతున్న మేనేజర్ దగ్గరికి భయపడుతూనే వెళ్ళి "సార్" అన్నాడు. ఏం కావాలన్నట్లు విసుగ్గా చూశాడు మేనేజరు.
"మీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు బేండ్ నేను ఎంగేజ్ చేస్తాను!"
అతడి కళ్ళల్లో విస్మయం కనబడింది. "నువ్వా?" అన్నాడు ఆశ్చర్యంగా. తలూపాడు.
అతడు ఓ క్షణం మాట్లాడలేదు. తరువాత తల అడ్డంగా వూపుతూ "నో నువ్వొక్కడివే ఎలా చేస్తావు?" అన్నాడు.
"కొంచెంసేపు చేస్తాను. బాగోలేకపోతే మానేస్తాను" అన్నాడు.
అతడు ఏమనుకున్నాడో ఏమో తలవూపి "సరే" అన్నాడు.
అదృష్టవశాత్తూ అవి అక్కడే వున్నాయి.
బాలు సింధసైజర్ స్టేజిమీద అమర్చడానికి వెళుతూ వుంటే అప్పటికే బాగా తాగివున్న ఒక కస్టమర్ చప్పట్లు కొట్టసాగాడు. సన్నగా గుండెదడ మొదలయింది. ఇంతకుముందు అతనెక్కడా వాయించలేదని కాదు. కాని చవకబారు బ్లూస్టార్ హోటల్లో వాయించటం వేరు, వెస్టెండ్ హోటల్ బేండ్ వేరు. గిటారు తీగలు సరిచేస్తూ వుంటే చేతులు కంపించసాగాయి. ఆంప్లిఫైర్ కొన్ని రెట్ల ధ్వనితో ఆ విశాలమైన హాలులో ప్రతిధ్వనించింది. ఆ అకస్మాత్తు ధ్వనికి మాట్లాడుతున్న వాళ్ళంతా ఒక్కసారిగా సంభాషణ ఆపుచెయ్యటంతో హాలంతా నిశ్శబ్దం అలుముకుంది. అందరి తలలు స్టేజీవైపు తిరిగాయి. అంతలో స్టేజీమీదపడే వెలుగుని హెచ్చిస్తూ మిగతాచోట్ల లైట్లని తగ్గించారెవరో.
బాలు దృష్టిలో మ్యూజిక్ ఒక హాబీయేగానీ, ఒక తిండిపెట్టే విద్యగానీ కాదు. అతని తండ్రితోపాటే అయిదారేళ్ళ వయసులో ఇది ప్రారంభించాడు. జపనీస్ "పాటెల్", గ్రీకు "నామోస్", భారతదేశపు "రాగం", అరేబియన్ "మఖ్ఖమ్" అన్నిటి గురించి కాస్తో కూస్తో తెలుసుకున్నాడు. ముందు చెప్పినట్లు మ్యూజిక్ కన్నా దాని వెనుకవున్నా శాస్త్రం అతన్నెక్కువ ఆకర్షించింది. కానీ శాస్త్ర పరిజ్ఞానం వేరు, పదిమంది మెప్పు పొందటం వేరు. అత్యంత అధునాతనమైన ఈ పరికరాలతో జనాన్ని మెప్పించగలనా? అన్న భయం అతనిలో మొదలయింది.
అతనింకా ప్రారంభించకపోవటంతో మేనేజర్ ఉరిమి చూశాడు- జనం కూడా చిన్న శబ్దంచేసి వూరుకున్న అతనివైపు విచిత్రంగా చూశారు. బాలు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. సింధసైజర్ మీద వేళ్ళు ఎలా కదులుతున్నాయో అతనికే తెలీదు. ముందు చిన్న ఆలాపనతో ప్రారంభించాడు.
అలా అయిదు నిమిషాలు వాయించాడు. చివరి చరణం పూర్తయింది.
అకస్మాత్తుగా చెవులు బ్రద్దలయ్యే చప్పట్లు మేనేజరు కళ్ళల్లో ఇప్పుడు కోపమూ, విసుగూ లేవు. ఆ స్థానానే అంతులేని ఆశ్చర్యం చోటుచేసుకుని వుంది. మైక్ పుచ్చుకున్నాడు బాలు.
"ఫ్రండ్స్! ఇప్పుడు మీకు ఒక ట్యూన్ వినిపిస్తాను. దీన్ని "ఇస్తాదార్" అంటారు. ఆఫ్రికన్ అడవుల్లో నరమాంస భక్షకులు జాతర్లలో ఉపయోగించే ట్యూన్ ఇది."
ప్రేక్షకుల్లో ఆశ్చర్యం చోటు చేసుకుంది.
అంతే మరి! ఆఫ్రికన్ అడవుల్లో నరమాంస భక్షకులు- మనిషిని చంపి తినేటప్పుడు వాయించే వాయిద్యాల్ని- ఇక్కడ ఎయిర్ కండిషన్డ్ బార్లో- ఈ నాగరికులు వినగలుగుతున్నారంటే అంతకన్నా థ్రిల్ ఏముంటుంది?
బాలువేళ్ళు డ్రమ్స్ మీద నాట్యం చేయటం మొదలుపెట్టాయి.
గ్లాసులో వున్నది సిప్ చేయటం కూడా మర్చిపోయి కళ్ళప్పగించి చూడసాగారు కస్టమర్లు. ఆ గది గోడలు కూడా కంపించసాగాయి. అతడు వాయించటం పూర్తవగానే శ్రోతలు "వన్స్ మోర్" అని అరిచారు.
మరొకసారి ఆ నరమాంస భక్షకులు వాయించేది, ఈ భక్షకులు వింటూ వుండగా వాయించి..... తరువాత వరుసగా "ముక్తాసారి", "తక్సీన్" ట్యూన్ లు అందించాడు.
దాదాపు పదిన్నర అవుతూండగా ప్రోగ్రాం ముగిసింది.
మేనేజర్ అతడి దగ్గరికి వచ్చి అభినందిస్తున్నట్టూ "యింతసేపు ఒక్కడివే అందర్నీ ఆకట్టుకోగలిగావంటే చాలా గొప్ప విషయం" అన్నాడు.
ఆ అభినందనలకన్నా తన ఉద్యోగం ముఖ్యం. ఆ విషయమే బాలు అడిగాడు.
"ఎప్పటినుండి రాగలవు? రేపటినుండి రాగలవా?"
"ఓ!" అన్నాడు.
"జీతం పదిహేను వందలు".
ప.... ది.... హే...ను....వం...ద...లు.
సన్నగా రాబోయిన విజిల్ ని అతికష్టంమీద ఆపుకున్నాడు.
అప్పాయింట్ మెంట్ కాగితం అందిస్తూ "ఆ డ్రమ్స్, మ్యూజిక్ చాలా భయంకరంగా వున్నాయి. ఆ ఆఫ్రికన్ లు తింటూ వాయిస్తారా? మనిషిని కాలుస్తూ వాయిస్తారా?" అని అడిగాడు కుతూహలంగా.
బాలు నవ్వాడు. "మన రాగానికి 'ఆలాపన' ఎలాగో ఆఫ్రికన్స్ కి 'ఇస్తాబార్', ఈజిప్టు వాళ్ళకి 'తక్సీన్' అలాగా. పోతే 'నరమాంస భక్షకు' లనేదే శ్రోతలకి కాస్త థ్రిల్ కలిగించటం కోసం నేను కల్పించిన మసాలా. మీరు కూరల్లో వేసేది నేను మైకు దగ్గర వేశానంతే" అన్నాడు.
మేనేజర్ మొహం వాడిపోయినా వెంటనే తేరుకుని బిగ్గరగా నవ్వేస్తూ "గుడ్... గుడ్" అన్నాడు.
ఇక ఆ రాత్రికి ఇంటికి వెళ్ళడానికి లేదు. బాలు వర్కర్స్ రూంలో పడుకోవడానికి వెళుతుంటే కారిడార్ లో "హలో" అని వినబడింది. మసకచీకట్లో మనిషిని గుర్తుపట్టలేక "ఎవరూ" అని అడిగాడు.
"ప్రొద్దున్న క్లాసయ్యాక నా రూంకి రమ్మంటే రాలేదేం?" అని అడిగాడు. తల తిప్పి చూస్తే ఎకనమిక్స్ లెక్చరర్.
ఆయన కూడా పూర్తి మందులో ఉన్నాడు.
2
మరుసటిరోజు లెక్చరర్స్ రూమ్ లో చేతులు కట్టుకొని నమ్రతగా "సారీ సర్!" అన్నాడు.
