నేను ఆనందం పట్టలేక పోయాను."హర్రే-"
ఇందాక పొరబడినవాళ్ళు మళ్ళీ అన్నం గొంతు పొరల్లో ఇరుక్కుని పొరబడ్డారు. చంచల్రావు ముక్కుమీద అన్నం ముద్ద పెట్టేసుకున్నాడు. ఇందాక ప్లేట్లు క్రింద పడేసిన సర్వరు మళ్ళీ లోపలికి వెళ్ళి భోజనం ప్లేట్లు తెస్తూ మళ్ళీ ఢాం అని పడిపోయాడు.
మర్నాడు ఆఫీసుకు శలవు పడేసి ఫిలిప్స్ కలిసి బేరం పెట్టాను.
"అమ్మాయా? హిహిహి- ఇప్పుడెందుకు? అబ్బే- అమ్మాయే! నేను, అహహ-ఏమిటో-అమ్మాయ్"ఫిలిప్స్ మెలికలు తిరగడం ప్రారంభించాడు.
"ఎందుకంటా రేవిట్సార్? ఈ వయస్సులో కాకపోతే ముద్దూముచ్చటా ముసలి వయసులోనా?...." అన్నాను నేను.... ఓరి ముసలిపీనుగ అమ్మాయిల జోలి నీకెందుకురా అని మనసులో తిట్టుకుంటూ.
"మా ఆవిడ ఊళ్లోనే ఉందే!!...." బట్టతలమీద గోక్కున్నాడు.
"నా గది వాడుకోండి సార్... పని మీద ప్రక్క ఊరికెళ్ళానని చెప్పండి.... రాత్రంతా నా గదిలో ఉండొచ్చు.నేను నా ఫ్రెండు గదిలో ఉండొచ్చు. నేను నా ఫ్రెండు గదిలో పడుకుంటాను.....
***
నా గది తలుపులు మూసుకున్నాయి. నేను చంచల్రావు యింటికి బయలుదేరాను.
వారం గడిచిపోయింది. ఆ రోజే ఆఫీసరు వాళ్ళబ్బాయిని సెయింట్ డన్స్ స్కూలుకి తీసుకెళ్ళేరోజు. ఉదయం ఎనిమిదిన్నరకు స్నానం చేస్తూ "ఈ పాటికి ఆయన స్కూలుకి వాళ్ళబ్బాయిని తీసుకెళ్ళి ఉంటాడు... సీటు వచ్చే ఉంటుంది" అని అనుకున్నాను.
పదిన్నరకు ఆఫీసులో అడుగు పెడుతూనే హడావిడిగా ఆఫీసరు గదిలోనికి అడుగు పెట్టాను.
"ఏమైందిసార్?...." అన్నాను కుతూహలంగా.
ఆఫీసరు మొహం కందగడ్డలా ఉంది.
"నువ్వు చూస్తే సీటు వచ్చేసినట్లే మాట్లాడావు.... కానీ ఆ ఫిలిప్స్ గాడు నన్ను చూస్తూనే మండిపడ్డాడు. ఎవరు చెప్పాడు మీ అబ్బాయికి సీటిస్తానని అని అన్నాడు... నువ్వు ఆ స్కూలు ఆవరణలో కాలుపెడ్తే కాళ్ళు విరగ్గొట్టిస్తానని అన్నాడు...."

నాకు మా ఆఫీసరు ఏమంటున్నాడో అర్థం కాలేదు."అది కాదు సార్... ఆ ఫిలిప్స్...."
"ఏది కాదు... మ
ధ్యలో నన్ను పూల్ ని చేశావు.... సీటిస్తాడో లేదో సరిగ్గా కనుక్కోకుండా నన్ను పంపించావు... సర్లే... నువ్వెళ్ళి నీ పని చూస్కో...." అన్నాడు కోపంతో కందిపోయిన ముఖాన్ని పైళ్ల మధ్య దూర్చేస్తూ.
నాకు అంతా అయోమయం అయిపోయింది. ఫిలిప్స్ గాడు మోసం చేశాడా?
సాయంత్రం చంచల్రావుని కలిసి సంగతంతా చెప్పాను.
"పద అలా హోటలుకు వెళ్ళి కాఫీత్రాగుతూ మాట్లాడదాం...."అన్నాడు.
ఇద్దరం హోటలుకు వెళ్ళాం.
"పోనీ బొంబాయి వెళ్ళి మహబూబ్ పాషాని కలిసి అతనిద్వారా అమితాబ్ బచ్చన్ ని కలిసి... అతనిద్వారా...."
"అబ్బబ్బ... అదంతా అయ్యేపని కాదురా..."విసుక్కున్నాడు చంచల్రావు ఫిలిప్స్ అలా ఎందుకు ప్రవర్తించాడో అర్థంకాక. కాస్సేపు హోటల్లో తలలు బ్రద్దలు కొట్టుకుని బయటపడ్డాం ఇద్దరం.
నాలుగు అడుగులు వేసిన తరువాత "అదిగదిగో.... అటుచూడు...." అంటూ నా వీపుమీద ఒక్క చరుపు చరిచాడు చంచల్రావు. నేను అటూ చూశాను.
డాక్టర్ రావు, సెక్స్ స్పెషలిస్టు క్లినిక్ నుండి పంచెకట్టుతో బయటికి వచ్చిన ఫిలిప్స్ ఒకసారి నన్ను యెర్రగా చూసి వెళ్ళిపోయాడు.
అయితే అది నేను పంపిన ఫామిలీ టైపు అయ్యాయి పనే నన్నమాట.
"పిలిప్స్ యెందుకలా చేశాడో అర్థం అయింది కదా?" అన్నాడు చంచల్రావు.
"మరి కే.జీ. క్లాసు సీటు సంగతి ఏం చేద్దాం?...."
"ఆ సంగతి మర్చిపో...."
బుద్దిగా తల వూపాను నేను. నా ప్రమోషను సంగతి గురించి మీకు విడిగా చెప్పనవసరం లేదుగా....
