Previous Page Next Page 
విశిష్ట పేజి 48

    "రామరామ!"

    రిజిస్ట్రారు ఆఫీసు నుండి వచ్చాక అత్తగారు కొడుకుచేత కట్టించిన మాంగల్యాలను పమిట చాటునుండి తీసి కళ్ళ కద్దుకుంటూ నాటకీయంగా అంది -

    "నేను భారతస్త్రీనండీ! పతియే ప్రత్యక్ష దైవంగా భావించే సంస్కారం నా రక్తంలో జీర్ణించి వుంది. నా అయిదోతనాన్ని నేనే చెరుపుకునే దుర్మార్గురాలిని కాదు."

    "చాలించు నాటకం! నువ్వు ఎంత అమాయకంగా కనిపించినా నువ్వు నమ్మతగ్గ మనిషివి కావని నాకు తెలుసు. చాలా అమాయకంగా కనిపించే నీలో చాలా డేంజర్ ఆలోచనలే పాముపిల్లల్లా కదులుతుంటాయి. చెప్పు! ఏమాలోచిస్తున్నావు? ఏం చేద్దామని ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు?"

    "నన్ను ఏం చేద్దామని పెళ్లి చేసుకున్నావు నువ్వు?"

    "నల్లిని నలిపినట్టు నలిపిపారేద్దామని" అతడిలోని కసి అంతా ఆ మాటలో ప్రతిధ్వనించింది.

    అతడి మాటకు ఖంగు తినలేదు విశిష్ట. అది ఊహించిన జవాబే అన్నట్టుగా మామూలుగానే అంది.  "నల్లిని నలిపినట్టు నలపడానికి నన్ను పెళ్ళి చేసుకోవాలా? ఆ పని పెళ్ళి చేసుకోకపోయినా చేయొచ్చుకదా?"

    "నిన్ను ఏం చేసినా అడిగే హక్కు ఎవరికీ లేకుండా చేద్దామని! నీ మీద అన్ని హక్కులూ నావిగా చేసుకోవడానికి నీ మెడలో ఈ తాడు బిగించాను. నీ దృష్టిలో ఇది పసుపు తాడేమోగాని, నిజానికి ఇది నీ మెడలో ఉరిత్రాడు. ఏ క్షణాన్నైనా ఇది బిగుసుకుంటుంది. ఈ క్షణం నుండి నువ్వు నా చేతిలో నరకం అనుభవిస్తావు."

    "దేనికింత పగ నా మీద?"

    "ఏసిడ్ పోసి అందమైన నా ముఖాన్ని అందవికారంగా మార్చావు. నా పరువు తీశావు. నా ఉద్యోగం పోగొట్టావు. నామీద పోలీసు కేసు పెట్టావు. దీనికి ప్రతిఫలంగా ఇంతకు ఇంత అనుభవించొద్దా నువ్వు?"

    "ఏం చేస్తారు నన్ను?"

    "పూటకు నాలుగుసార్లయినా తంతాను. రోజుకొకసారైనా వాతలు పెడతాను. ఇంటి చాకిరి అంతా నీచేత చేయిస్తాను.... కళ్ళురిమి ఏమిటలా చూస్తున్నావు నా ముఖంలోకి. ఆ కళ్ళు పీకేస్తాను."

 

       "చూడడానికే భయానకంగా, అందవికారంగా మారిన, ఈ ముఖం వెనుక మనసు ఎంత ఛండాలంగా, పరమ దరిద్రంగా వుందా అని చూస్తున్నాను.అంచనాలమించి దిగజారిపోయావు."

    "నన్ను అంచనావేసే పని మానేసి నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావో చూసుకో."

     "ఏ విషమ పరిస్థితి ఎదురైనా నన్ను నేను కాపాడుకోగలనన్న ధైర్యం నాకుంది."

    "ఏమిటా ధైర్యం?"

    "నా ఆత్మవిశ్వాసమే నా ధైర్యం."

    "ఇప్పుడు చెప్పవే నీ ప్లానేమిటో?"

    "నీ ప్రవర్తన సవ్యమైనదైతే నాదీ సవ్యమే! అందరాడపిల్లల్లా నా వైవాహిక జీవితాన్ని ఆనందమయంగా మలుచుకోడానికి ప్రయత్నిస్తాను. నన్ను హింసించడమే నీ ఆశయమైతే సాధ్యమైనంతవరకు ప్రతిఘటిస్తాను. రివెంజ్ తీసుకుంటాను."

    "ఏం ప్రతిఘటిస్తావు? నీ కాళ్లకీ చేతులకీ పెళ్ళి అనే సంకెళ్లు వేశాను కదా?"

    "ప్రతి యువతికీ, ప్రతి యువకుడికీ పెళ్లి అన్నది ఒక అందమైన అనుభవం! జీవితంలో అందమైన అనుభూతిని మిగిల్చే సంఘటన. జీవితాన్ని అందమైన మలుపు తిప్పే సంఘటన.

     అలాంటి పెళ్లిని ఒక ఆడపిల్లను హింసించి పగ తీర్చుకోడానికి చేసుకున్నావంటే ఆ అపురూపమైన ఆ అనుభూతిని ఎంత అవివేకంగా నాశనం చేసుకున్నావా అనిపిస్తోంది. నిన్ను చూస్తుంటే చాలా జాలిగా వుంది పృద్వీ."

     "జాలిపడే స్థితిలో నిన్నుంచుకుని నన్ను చూసి జాలిపడతానంటా వేమిటి? నాకేమైంది?  మహరాజాలా వున్నాను" ఛాతీ విరిచి మరీ చెప్పాడు. బిచ్చగాడుగా మారిపోవచ్చు బిచ్చగాడు మహారాజు కావచ్చు. కాని ఒక్కటి చెప్పదలచుకున్నాను.

     వింటే మనిద్దరికీ మంచిది గతం గతః మనిద్దరిమధ్య వున్న వైరాన్ని నేను మరిచిపోదలచుకున్నాను. పెళ్లి మన రెండు జీవితాలను ముడివేసింది. ఈ క్షణం నుండి మనం కొత్త జీవితం ఆరంభిస్తే బాగుంటుంది.
 
     నువ్వు నా మెడలో మాంగల్యం కట్టిన క్షణం నుండే నీమీద వున్న ద్వేషాన్నీ, అసహ్యాన్నీ మనసు మూలల్లోంచి దూరం చేసుకున్నాను. దాని స్థానంలోకి ప్రేమను, అభిమానాన్నీ ఆహ్వానించాను. నువ్వూ జరిగిందంతా మరిచిపో! ప్రేమతో మనం ఒకటి అవుదాం."

    "నువ్వు జరిగింది మరిచిపోయినా నేను మరిచిపోలేను. అద్దంలో నా ముఖం చూసినప్పుడల్లా నువ్వు చేసిన దుర్మార్గం గుర్తు వస్తుంది. పగతో రగిలిపోతుంది నా మనసు.

     "భార్యను హింసించి ఆనందించే మగవాడు మగవాడే కాదు నా దృష్టిలో. అసలు మనిషఇ అన్నపదానికే తగడు దయచేసి గతాన్ని విస్మరించండి.మన రెండు జీవితాలు ఆనందమయం చేసుకుందాం."

     "నువ్వు భార్యవు! మనకు జరిగింది ఒకపెళ్లి! అహఁ అహఁ అహఁ అహఁ" పృద్వీ వికటంగా నవ్వాడు.
 
     "అది నా దృష్టిలో  పెళ్ళే కాదు. నిన్ను నా చేతిలో కీలుబొమ్మనవు చేసుకోవడం కోసం ఆడిన డ్రామా అని మరోసారి చెబుతున్నాను"

    "నేను మాత్రం మన వైవాహిక బంధాన్ని మనస్పూర్తిగా అంగీకరిస్తున్నాను.

     "నీ అనుకోవడాలకీ కనుక్కోవడాలకీ వీలులేదు. ఇక్కడ. ఇది నా సామ్రాజ్యం!ఇక్కడంతా నా ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది. నువ్వు నేను కూర్చోమంటే కూర్చోవాలి. లెమ్మంటే లేవాలి"

     "మంచిది ఆ విధంగా నయినా నేను పతివ్రతను అవుతాను కదా?"

    "పతివ్రతవు కాదు. కీలుబొమ్మవౌతావు."

    "సరే! భగవంతుడా నా ముఖం మీద ఏం వ్రాస్తే అది అవుతుంది ఏం చేస్తాను" వైరాగ్యంగా అంది విశిష్ట.

    "నాకు నిద్రవస్తోంది. పడుకొంటాను. తలగడ బెడ్ షీట్ ఇవ్వండి. క్రింద వేసుకొంటాను."

    "ఉహుఁ నువ్వు ఇక్కడే పడుకోవాలి. నా చేతుల్లో నలిపి నలిపి వేస్తాను. చిదిమి వేస్తాను. అప్పుడన్నా నా కసి కొంతలో కొంత తీరుతుందేమో!"

    "మనం అన్యోన్యంగా జీవించలేమని తేలినప్పుడు మనమధ్య ఆ బంధం ఏర్పడడం నాకిష్టంలేదు..." నిష్కర్షగా చెప్పింది.

     "నీ ఇష్టం ఎవడిక్కావాలి...? నిన్ను అనుభవించి తీరుతానని ఛాలెంజ్ చేశాను. ఆ రోజు తప్పించుకొన్నా ఈ రోజు తప్పించుకోలేవు కదా?"

    "నేనిష్టపడందే మీరేమీ చెయ్యలేరు."

    "నేను మగవాణ్ని కాదనుకున్నావా? నిన్ను లొంగదీసుకునే బలంనాకు లేదనుకున్నావా?"

    పులి లేడిపిల్ల మీదికి దూకినట్టుగా మంచం మీది నుండి దూకి ఆమెను పట్టుకొని మంచం మీదికి తోశాడు.

    "మనం కొత్త దంపతులం. ఇది మన మొదటి రాత్రి. మన అనుభూతుల్నీ, ఇష్టాల్నీ ఒకరికొకరం పంచుకోవాల్సిన తరుణంలో బలవంతంగా నన్ను అనుభవిస్తానంటే నువ్వేం మగాడివి? అసలు నా దృష్టిలో  నువ్వు మనిషివే కాదు."

    "బెడ్ మీద  మగవాడు మృగమైతే ఆడది ఎక్కువగా ఆనందిస్తుంది. ఇది నీకు కొత్తేమోగాని నాకు నీలాంటి వాళ్లు చాలా మంది తెలుసు. మీ ఆడవాళ్లు ఎలాంటి మగవాడిని ఇష్టపడతారో కూడా తెలుసు."

    "నేను మాత్రం మృగాలను ఇష్టపడను?

    "నీ ఇష్టా ఇష్టాలు ఎవరికి కావాలే....?నువ్వు నా నుండి ఎలా తప్పించుకుంటావు....? రేపు వుదయం వరకు ఈ తలుపులు తెరుచుకోవు! ఈ గదిలో నిన్ను కాపాడే దిక్కెవరు........? నువ్వు అరిచినా తలుపు తీయరు."

    "ఎవరూ అక్కరలేదు. నన్ను నేను రక్షించుకుంటాను."

    "మళ్ళీ చాకులూ కత్తులూ తెచ్చావా? అమ్మ నిన్ను అంతా సోదాచేసే పంపించి వుండాలే!"

    "నా దగ్గర మారణాయుధాలు ఏమీలేవు. నన్ను రక్షించుకోడానికి వాటి అవసరమూనాకు లేదు."

    "ఛాలెంజ్! నిన్ను నేను అనుభవించి తీరుతాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS