వికటహాసంతో వచ్చి మెట్లమీద కూర్చున్నాను. నా ఎదుట శకుంతల నీళ్ళల్లో స్నానమాడుతున్నట్లు కనిపించింది. ఇదేమిటి! నా శకుంతల ఎక్కడనుంచి వచ్చింది? కళ్ళు నులుముకుని చూచాను. ఆమె అక్కడనే స్నానం చేస్తూంది. లోతు అని భయం లేకుండా నిర్భయంగా స్నానం చేస్తూంది. నేను చూస్తుండగానే తన రవిక విప్పి నీళ్ళల్లో పడవేసింది. అది గంగా ప్రవాహంలో కొట్టుకుపోయి మాయమైపోయింది. శకుంతల కట్టుకున్న చీర, ఆ కొట్టుకుపోయిన రవిక, ఆమె పూజించిన రోజున నేను అర్పించినవే!
ఆమె నిర్భయంగా అంతలోతు నీళ్ళలో ఆ ప్రవాహవేగా వర్తములలో మునుగుచు తన ఘన కచభారాన్ని విప్పి ఆ సౌభాగ్యం గంగానదికే అందం ఇస్తూండగా స్నానం చేస్తూంది. నాకు '' శకుంతలా '' అని పిలవడానికి మాట రాలేదు. కఱ్ఱలా, రాయిలా, మొద్దులా, ఆ మెట్లమీద అలాగే కూర్చుండిపోయాను. ఆమెరెండుమూడు సార్లు వెనక్కు తిరిగి నన్ను చూచి, చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో ఎన్నికోట్ల సౌందర్యాలు నర్తించాయి! ఆ మందహాసంలో ఎన్ని వెన్నెల్లు వికసించాయి! ఆ నవ్వు పెదవుల ప్రక్క సొట్టలలో ఎన్ని పూవులు ప్రోవులై కురిసిపోయాయి. ఆమె నా ఎదుట సిగ్గులేక ఆ నీళ్ళలో భయంలేక చీర విప్పి, చేతుల్తో చుట్టచుట్టి ఆ ప్రవాహానికి అర్పించివేసింది. ఆమె ఆ దెపమెలతో నెమ్మదిగా నా వైపుకు రాసాగింది. ఎందరో స్త్రీలు , పురుషులు ఆ హరిచరణఘట్టం మూగిపోతున్నారు. ఆమె ఘనవక్షోజద్వయ మప్పుడే నీటి బయటకు వచ్చింది.'' అమ్మయ్యో! శకుంతలా! తప్పు తప్పు '' అంటూ ఆ నీళ్ళల్లో ఆమెవైపు ఉరికాను. శకుంతల దీనహస్తాలుపరుస్తూ, వెనక్కుపోవడం ప్రారంభించింది. ఆమె కంఠంవరకు పోయింది. గడ్డం మునిగిపోయింది. పెదవులు మునిగిపోయాయి. నేను రెండు బారలలో అక్కడకుపోయాను.
నా శ........కుం........త....ల మునిగిపోయింది. నే నా ప్రవాహంలో ఆమె దగ్గరకుపోయి, ఆమె మునిగిన చోట మునిగి, పైకితీసి రక్షించుకోవాలనే ఆతురతతో ఒక్క ఉదుటున అక్కడకు పోయి ఉరికాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకేమీ తెలియదు........
'' బాబా! నీ శకుంతల కోసమే అల్లా ప్రాణాలు తీసుకోవడమే? '' అని స్పష్టంగా తెలుగుభాషలో ఓ సన్యాసి నన్ను ప్రశ్నించాడు.
నేను లేచి కూర్చుండి '' నా శకుంతల ఏది? ఆమె మునిగి పోయిందా? అయ్యో! '' అన్నాను.
'' బాబా! ఎందుకట్లా కంగారు పడతావు? నీ శకుంతల లేనేలేదు. నువ్వు భ్రమపడ్డావు. నీటిలో ఉరికావు. నీ చిత్తవృత్తే నన్నిలా చేసింది, నాయనా!''
నేను నా చుట్టూ మూగిన జనాన్ని చూశాను. మా అమ్మ, మా సుబ్రహ్మణ్యం నన్ను పొదివి పట్టుకున్నారు. మా అమ్మ దుఃఖంతో వణికిపోతూ కుంభవృషిలా కంటినీరు కారిపోతూవుండగా నాకేసి దీనదృష్టులు, ఆ తలముసుగు సందులోంచే, పరపుతూ నన్ను కౌగలించుకొని ఉంది.
'' బాబా! చుచావా మీ తల్లిగారి దుఃఖము. మీ బావగారి దుఖమున్నూ? నీకు ప్రపంచం మీదా, భగవంతునిమీదా ఎందుకీ ప్రళయకాలం వంటి కోపం ? నువ్వు భగవంతుణ్ణి అవమానం చేస్తే, ఆ భగవంతునికి కోపం వస్తుందనా నీ ఉద్దేశం! ఓయీ మొరకుమనిషీ! కోపం నిన్నే దహిస్తూన్నది. నీ చదువు నీకు ఊరట కలిగింపలేదు. నీ యాత్రలు నీకు శాంతినివ్వలేదు. నీకు స్త్రీ తుచ్ఛమైన వస్తువు మాత్రం. నీ భార్య గనుక, ఆమెను నువ్వు నీ ప్రేమ పాత్రమైన కుక్క కన్న ఎక్కువగా చూచి అదే ఒక దివ్య ప్రేమ అనుకున్నావు. ఆమె దివ్య లోకాలకుపోతే , నీ వస్తువు. నీ స్వంత ఆస్తి, నువ్వు అత్యంతగా ప్రేమించిన నీ ప్రేమ నిధానంపోయిందని, భగవంతుని మీద మండిపోతున్నావు అంతేనా?
''సద్గురురాయా ఎటువంటి కలగంటినీ
నిర్గుణమందే గుణముల రంగులు
రంగులలోనే గంధము చూస్తిని
సద్గురురాయా ఎటువంటి కలగంటినీ''
అని మా గురువుగారు పాడినట్లు నీ బ్రతుకు ఒక పాడు కల అయింది బాబా!''
సన్యాసి మాటలు వింటూంటే నా కాశ్చర్యము కలిగింది. ఇవన్నీ మా అమ్మ ఆయనకు చెప్పిందనుకున్నాను. అమ్మా, మా సుబ్బులు ఆయన కేసి తెల్లబోయి చూస్తున్నారు. ఉన్నట్టుండి మా అమ్మ ఆయన కాళ్ళమీద పడి '' స్వామీ మా అబ్బాయిని రక్షించండి బాబూ! '' అని వాపోయింది.
30
ఆ స్వామి తనతో మమ్మల్ని తమ ఆశ్రమానికి తీసుకుపోయారు.
ఆ ఆశ్రమంలో అయిదారుగురు స్వాములున్నారు. అందులో ఇద్దరు గోసాయీలు. స్వామి మమ్మల్ని తన నివాస భాగంలోనికి తీసుకుపోయి అక్కడ ఉన్న కృష్నాజినాలమీద మమ్మల్ని కూచోమని, తాను లోనిగదులలోనికి వెళ్ళారు. మేము ముగ్గురము మాటలు లేకుండా ఆ చాపపై కూర్చున్నాము. ఇంతవరకు నా స్థితి ఇలాంటిదని చెప్పలేను.
నేను గతంలో ఉరుకుతూండగా తానూ, మా అమ్మ గంగ వడ్డుకు పరుగెత్తుకు వచ్చామనీ; అలా పరుగెత్తుకు రావడానికి కారణం, నా ప్రక్క మీద నేను లేకపోవడమేననీ: నేను గంగలో ఉరికి ప్రాణం తీసుకుంటాననీ వాళ్లకు భయంవేసే వచ్చారనీ: వాళ్ళు వచ్చీరావడంలో ఈ స్వామి గంగలో నీ వెనకే ఉరికి నన్ను నిమిషంలో ఒడ్డుకుచేర్చడం చుశామనీ; నేను పది నిమిషాలు ఒళ్ళు తెలియక పడి ఉండడంచూచి, మా అమ్మ ఘొల్లున ఏడ్చిందనీ; ఆ స్వామి మా అమ్మతలపై చేయివైచి '' అమ్మా! నీ కుమారునికి ఏమీ భయంలేదు. అతని జీవితం పూర్తిగా మారిపోయి, మళ్ళీ యధాప్రకారమవుతాడు. అతని భవిష్యత్తు భాగుంటుం'దని చిరునవ్వుతో ధైర్యం చెప్పారనీ, ఇంతలో నేను కళ్ళు తెరిచాననీ దారిలో సుబ్బులు నాకు చెప్పాడు.
నా కిదంతా ఆశ్చర్య మనిపించింది. ఎవ్వరీ స్వామి? ఆయన్ని చూచేంతలో నాకూ ఏదో శాంతి కలగడమేమిటి? ఇదంతా నాలో అణిగి ఉన్న నీరసత్వమేనా? నా ఆవేదన ఓ వెఱ్ఱి బోడిగుండుస్వామి అన్న మాటలతో చల్లారిపోవడమా? నా హృదయం అందుకు సంసిద్దపడి ఉంది కాబోలు. ఇన్ని యుగాలనాటినుంచీ ఉన్న ఈ మూర్ఖభావాలు ఒక్కసారిగా పోతాయామరి? కాషాయాంబరాలు ధరించు ఓ మాయకాడు కంటబడగానే, సాష్టాంగ దండ ప్రణామాలు చేయడానికి అందరమూ సిద్దమౌతాము. అలవాటు చేసుకొన్నవాడికి ఎదుటివారి హృదయం నిమిషంలో అవగతం అవుతుంది. ఈ సన్యాసులు ఆ విద్యలో పరమ ప్రవీణులు. ఆ గంగలోపడి నా శకుంతలతో పోనీక ఈతడు నన్ను రక్షించడ మేమిటి?
