బెడ్ రూంలోని టెలిఫోన్ మ్రోగేసరికి దిగ్గున లేచింది సుగాత్రి. వాచీ చూస్కుంది. రాత్రి ఎనిమిది దాటుతోంది. ఆలోచనల్లో పడి పరిసరాల్నే మరిచిపోయింది అప్పటిదాకా ఆరుగంటల వరకు ఇంట్లో వుండే ఆయన ఎనిమిది దాటినా రాలేదంటే ఎక్కణ్ణించో ఆయనే చేసి వుంటారనుకొని వచ్చి రిసీవర్ ఎత్తి హలో అంది.
"హలో సుగాత్రి! శరత్ వున్నాడా? నేను డాక్టర్ లక్ష్మిని"
"ఆయన లేరు డాక్టర్! ఇప్పుడే బయటికి వెళ్ళారు. మీ దగ్గరికిగాని వచ్చారేమోననుకున్నాను. రాలేదా?" ఆదుర్దాగా అడుగుతున్న ఆమె గొంతు వినీవినగానే చెప్పగలరెవరయినా ఏడ్చి ఏడ్చి గొంతు స్థాయి మారి బొంగురుగా మాట్లాడుతుందని.
"సరే అయితే ఫోన్ పెట్టేయ్."
"డాక్టర్......" ఏదో సంశయం.
"చెప్పండి. నాతో ఏం పని?" నిష్టూరంగానే అంది లక్ష్మి.
"డాక్టర్! అప్పుడు కాస్త కఠినంగా చెప్పానేమో. నన్ను క్షమించండి ప్లీజ్" మళ్ళీ ఓసారి ఆమె కన్నీటి గ్రందులు పగిలి కళ్ళు తడి తడికాగా చెప్పింది.
"నో.....నో__నేనేం బాధపడటం లేదు. కానీ మీలాంటి వాళ్ళు చదువుకున్నా ఆ చదువుల్లో అవగాహన లేనందుకే బాధగా వుంది. ఎదుటి వాళ్ళ నిర్ణయాల్ని సరయిన అవగాహన లేకుండా మాట్లాడటం సమంజసం కాదు సుగాత్రి. సో యూ ఆర్ ఆల్ సో సైన్స్ గ్రాడ్యుయేట్. ఐనో. బట్ ఐ డోంట్ లైక్ యువర్ రిపగ్నెంట్ డిసీషన్! చదువుకోని వాళ్ళయితే మూఢంగా కొట్టేసినా నేనంత పట్టించుకోపోయేదాన్ని. శరత్ కూడా ఈ మెథడ్ ద్వారా మీకు లేని లోటును తీర్చాలనుకున్నాడు. ఒక డాక్టర్ గా దానికి నా ప్రోద్బలం కూడా వుంది. కాదనను. నీకీ విషయం ఎలా తెల్సిందో గాని, తెల్సింది కాబట్టి వ్యతిరేకిత్తిస్తున్నావ్. మా ప్లాన్ ప్రకారం జరిగితే గర్భం ధరించినందుకు నువ్వెంత సంతోషించేదానివి. కన్న తర్వాత వాస్తవం తెల్సినా ఆ పాపనేం చెయ్యలేకపోయేదానివి. ఎందుకంటే మాతృప్రేమ అలాంటిది. నువ్వా ప్రేమను పొందటానికే శరత్ అలా చేయాలనుకున్నాడు. వింటున్నావా?"
వింటున్నా అని కూడా అనలేని శిలాప్రతిమలా వింటోంది సుగాత్రి.
"మంచి మనసుతో ఆలోచిస్తే ఏ పాపమూ కనపడదందులో. మనలాగే రక్తమాంసాలతోనే పుడుతుంది."
లక్ష్మి మాటలు రింగులు తిరిగొస్తున్న బాణాలై సుగాత్రి మెదడ్ని సూటిగా గుచ్చుకుంటున్నాయి.
"శరత్ రాగానే చెప్పు. బేబీ కావాలన్న మీ నిర్ణయం మారింది కదా! సైన్ చేసిన అనుమతి పత్రం వాపసు తీసుకోవడానికి రమ్మనమను. నేను కూడా మూడ్రోజుల తర్వాత బాంబే వెళ్ళే ప్రపోజల్స్ వున్నాయి. హిందూజా గది నుండి ఆఫర్స్ వచ్చాయి. ఈసారి ఓ ఫామిలీ కోరుకుంటున్న ఆ బేబీ బాధ్యతను నాపైన పెట్టారామె. అక్కడయినా నా మొదటి ప్రయోగం చేద్దామని....నేనింక వుంటాను. గుడ్ నైట్.
"సర్....డాక్టర్" నిర్లిప్తంగా చెప్పింది సుగాత్రి.
గోడ మీది గడియారం క్షణాల చప్పుడు చేస్తుంది. ఆమెకు తినాలన్పించలేదు. ప్లాస్క్ వంపుకుని కప్పులో పోసి కాఫీ త్రాగింది. ఒంటరితనం భయంకరంగా చుట్టుముడుతోంది.
ఓసారి క్రిందికి దిగి....వరండా దాకా వచ్చి అయిదు నిమిషాలు ఎదురు చూసింది శరత్ కోసం. ముసలాడి దగ్గు నిర్విరామంగా విన్పిస్తోంది ప్రక్క గదిలోంచి. నిరీక్షణ నిష్పలమని గ్రహించి మళ్ళీ పైకెళ్ళి పడుకుంది.
మెదడ్ని ముసలాల్లా పీక్కుతింటున్న ఆలోచనలు.
శరత్ రానందుకు మొదటిసారి భయపడింది సుగాత్రి. భర్త ప్రవర్తనకి కళ్ళు మండుతున్నా ఆలోచిస్తూనే ఉంది.
* * * * *
"ఏయ్... ఏమిటా మొద్దునిద్ర? ఇప్పుడు టైమెంతయిందో తెల్సా?" నిఖిల్ భుజం తడుతూ అడిగింది నిర్లిప్త.
ఏదో ఆలోచిస్తున్న నిఖిల్ ఉలిక్కిపడ్డాడు "పదకొండయింది. నువ్వింకా నిద్రపోలేదా! ఏమిటి" అన్నాడతను.
"అర్దరాత్రి ఆడది పిలిస్తే ఏమిటి అనే మగాన్ని ఏమంటారో తెల్సా?" అంది కొద్దిగా రోషంగానే.
"ఏమంటారు? ఆడది పిల్చినా మగాడు రాలేదంటే....వాళ్ళిద్దరు లక్షణాలు వున్నవాడంటారు" చెప్పాడు జవాబుగా.
"నీ సంగతీ అలాగే వుంది" అంది కవ్విస్తూ.
అంతే! నిఖిల్లోని తాపం తాండవం చేసి నాగుపాములా చుట్టేసాడు.
"ఏయ్.... ఒక్కసారిగా.... ఇదేం పని" అందామె గోముగా. అతనిలోని స్పర్శకు కొత్తలోకాలు చూస్తున్న తన్మయత్వంగా.
"ఈ పనేమంటారో చెప్పుకో! ఈ దేశమాత పేరులోని చివరి రెండక్షరాల పని. నువ్వు దేవుడి నైవేద్యం పెట్టింతర్వాత ఇచ్చేదానిచివరి రెండక్షరాల పనికూడా! దేశభక్తి, దైవభక్తి రెండూ కల్సిన పనే."
"ఇక్కడ కూడా ఆ చిక్కుముడులేనా? ఈ చిక్కుముడులు విప్పాలి గాని" అందామె బరువుగా మూలుగుతూ మరింత కవ్వింపుగా.....
అతడీసారి కొండచిలువగానే మారాడు.
ఆ అర్దరాత్రి వెచ్చటి విరహాలు చల్లగా ఆవిరైపోయే వేళ....
మన్మధుడు బాణాలు సైతం తాళలేక తాపంతో వంగిపోయిన వేళ.....
అంతర్జాతీయ వేదికలపై పోటీపడుతున్న కామక్రీడల గెలుపు ఓటమిల వేళ...
మరో మూడు గంటల తర్వాత రెండు గంటలు కొట్టింది గడియారం ఠంగ్.....ఠంగ్ మని!!
