Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 50

    సరిగ్గా అదే సమయానికి__

    గోడగడియారం చేసిన చప్పుడు విని చేతనావస్థలో పడి లేచింది సుగాత్రి.

    ఏ అలజడీ లేక నిర్మలంగా వుందామె. ఆమె తీసుకున్న నిర్ణయానికి స్వాగత భేరి పలికినట్లు మ్రోగి ఆగిపోయింది. హడావుడిగా లేచి ఫోన్ రిసీవర్ ఎత్తి శరత్ కోసం ముందు ఇండస్ట్రీ నంబర్ కు డయల్ చేసింది. అవతలివైపూ ఎవరూ ఎత్తిన జాడలేదు. నీరసంగా నిల్చున్నప్పటికి.....దృఢపడుతున్న నిర్ణయం ఆనందరేఖల్ని తెచ్చిపెరుతోంది కళ్ళలో.

    శరత్ ఎక్కడున్నాడో... అర్ధంగాక మరో రెండు క్లబ్బులకి డయల్ చేసింది.

    అయినా శరత్ జాడలేదు. ఆమెకు అకస్మాత్తుగా డాక్టర్ లక్ష్మి గుర్తొచ్చింది. డయల్ త్రిప్పి ఉద్వేగంగా నిల్చుంది.

    అయిదు నిమిషాల తర్వాత బరువుగా ఫోనెత్తి నిద్ర మత్తులో చిరాగ్గా.... ఎవరూ అన్న గొంతు అవతల్నించి.

    "డాక్టర్... నేనే.... నేను.... సుగాత్రిని...."

    "ఏమిటమ్మా! అర్దరాత్రి ఫోన్ చేస్తున్నావ్? ఏమైంది?" అంది లక్ష్మి విసుగ్గా. ఆవలిస్తున్న నోటి గాలి చప్పుడు స్పష్టంగా విన్పించింది.

    "డిస్టర్బ్ చేసినందుకు సారీ డాక్టర్. మావారు......మావారొచ్చారా డాక్టర్. ఆపుకోలేని ఉద్విగ్నత.

    "రాలేదమ్మా...ఎందుకు?"

    "ఆయనింత వరకూ రాలేదు. నాకెందుకో బెంగగా వుంది. ఓ గుడ్ న్యూస్ డాక్టర్. నేను....నేనందుకు ఒప్పుకుంటున్నాను. నాకు.....నాకు టెస్ట్ ట్యూబ్ బేబీ కావాలి డాక్టర్" ఎగిసి పడుతున్న గుండెలతో చెప్పి రిప్లయ్ కోసం ఎదురు చూస్తున్న సుగాత్రి నుదుటన స్వేదం పేరుకుంటుంది.

    "రియల్లీ? థాంక్యూ సుగాత్రి. వెరీమెనీ థాంక్స్, బెస్ట్ ఆఫ్ లక్....శరత్ ఎక్కడున్నాడో కనుక్కుని వెంటనే చెప్పేయ్. నాకన్నా ఎక్కువగా శరత్ సంతోషిస్తాడు తెల్సా?"

    "థాంక్యూ డాక్టర్. ఆయనెక్కడున్నా ఈ రాత్రే చెప్తాను. ఆయన నిర్ణయం మా ఇద్దరి సుఖాన్ని కోరుతున్నప్పుడు నేనెందుకు కాదనాలి బాగా ఆలోచించే నేనిది చెప్తున్నాను. నాకేదో భయంగా వుంది.

    "అలాంటి భయాలేం పెట్టుకోకు. నాకు బాంబే వెళ్ళేపని తప్పించారన్న మాట. వెరీగుడ్. అయితే నీకో గిఫ్ట్ ఇవ్వాలి? చెప్పు. నీకు బాబు కావాలా? బేబీయే కావాలా?"

    "అదేంటి డాక్టర్! కోరుకున్నట్టుగా ఎక్కడైనా పుడతారా? జోక్ చెయ్యకండి. నాకు మాత్రం బాబు కావాలనే వుంది" అంది నవ్వేస్తూ. శాంతమైన సంద్రంలో పొంగే చిరుకెరటంలా వుందామె ఇప్పుడు.

    "నువ్వింకా క్రీస్తుపూర్వంలోనే వున్నావ్. పరీక్షనాళికలో పుట్టేపాపలకు అది సాధ్యమే. ఇంతకు ముందు నూం ఆర్లియన్స్ లోని హ్యూమనా హాస్పిటల్ కు చెందిన డాక్టర్లు తొలిసారిగా టెస్ట్ ట్యూబ్ లో బాబుని సృస్టించారు."

    "నిజమా? టెస్ట్ ట్యూబ్ బేబీల్లో అదికూడా సాధ్యమైతే నాకు బాబే కావాలి"

    "నేను చేసే ప్రయోగాల్లో ఇది కూడా సాధించాలన్నదే. ప్రపంచంలో మొదటిసారిగా డాక్టర్ స్టీవెన్ టేలర్ సాధించాడు. ఆంధోని, ఫిల్లిస్ స్పెన్సర్ అనే దంపతులకు ఇద్దరు బిద్దలున్నా కొడుకు కావాలనే సరికి...ఆంధోని- స్పెర్మ్స్ లో పురుషజన్మకు కారణం చేసే వీర్యకణాలనూ ప్రత్యేకపరిచి ఫిల్లిస్ స్పెన్సర్ అండంతో టెస్ట్ ట్యూబ్ లో కలిపారు. 1986 జనవరి ఇరవై అయిదున కోరుకున్న 'నాళికా సుతుడు' పుట్టాడు వాళ్ళకి.

    "బావుంది డాక్టర్. సంతానం పట్ల సైన్స్ ఇంతగా ఎదిగిపోయిందని మాలాంటి మామూలు గృహిణులకు ఇంకా తెలీదు" అంది సుగాత్రి.

    "ఎలా తెలుస్తుంది? వంటింటికే అంకితమయిన ఇడ్లీల రకాల గురించే ఆలోచిస్తుంటే ప్రపంచం పట్ల ఇంగిత జ్ఞానం కూడా లోపిస్తుంది చివరికి. ఈ కాలంలో కనీస సైన్స్ జ్ఞానమైనా మన తెలుగు పడుచులకు లేకుండా పోతుంది. అంతరాల్లో పేరుకున్న ఆడదాని స్థితిపట్ల ఆమె ఆవేదన ధ్వని తరంగాలై తాకుతోంది. వాళ్ళ మాటలు లైన్ కట్టయి....ఓ ఆగంతకుడిచెవిన పడ్తున్నాయని తెలీదు.

    శరత్ కు చెప్పాలన్న ఆతృతతో అదేదీ పట్టించుకోకుండా "థాంక్యూ డాక్టర్. వుంటాను మరి" అంది. గుడ్ నైట్ చెప్పింది డాక్టర్ లక్ష్మి. శరత్ కోసం మరో రెండు చోట్లకు ఫోన్ చేసింది. అయినా దొరక్కపోయే సరికి తీవ్రంగా ఆలోచించింది.

    ఆమెకు అనాలోచితంగా గుర్తొచ్చిన వ్యక్తి....జీనత్ రాయ్.

    ఏమో.... శరత్ అక్కడే వుంది వుంటే??

    ఎందుకో ఆ సమయంలో అతనక్కడ వుండాల్సింది కాదనుకుంది ఆ క్షణాన ఆమె మనసు కీడు శంకించింది. అయినా ప్రయత్నిద్దామని....డయల్ చేయడానికి నంబర్ కోసం ఫోన్ డిక్షనరీనీ వెతికింది.



                           *    *    *    *    *

 
    నెలలో పదిసార్లు ప్రత్యేకంగా ఆఫర్ చేసినా ఒక్కసారి కూడా సరిగారాని...అర్ధాంతరంగా ఆ రాత్రి రావటంతో విస్తుపోయాడు జీనత్ రాయ్ "రండి శరత్ గారూ. తప్పిపోయి వస్తున్నట్టున్నారు. రండి రండి. అని ఆహ్వానించాడు రాయ్. శరత్ విష్ చేయగానే డాబాపైకి తీసుకెళ్ళాడు. డాబా మీద కుర్చీలు, వాటి మధ్య టేబుల్ మీద ఫారిన్ స్కాచ్ లు, రక రకాల పలావ్ లున్నాయి. వెన్నెల సొనలు పడి ఆ బాటిల్సు మెరుస్తున్నాయి చల్లటి గాలి రివ్వున వచ్చి తాకుతోంది.

    రాయ్ రాజకీయాల్లో పలుకుబడిగల వ్యక్తి. పైరవీలు అతని ఆరవప్రాణం. అందుకే డాబా మీద అలాంటి శాశ్వత ఏర్పాట్లుంటాయి. రోజూ ఓ మినిస్టర్ తో కల్సి పార్టీ ఉంటుంది ఆ ఇంట్లో. రాయ్ నల్లగా ఎత్తుగా వుండి, త్రాగిన కళ్ళలో ఎర్రదనానికి 'ఆకలి' తోడై క్రౌర్యంగా కన్పిస్తుంటే బుర్రమీసాల మీద చెయ్యేసి దువ్వుతుంటాడేప్పుడూ.

    రాయ్ కి ఉన్న జీనత్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ రెండింటిలోనూ శరత్ కు ఫిఫ్టీ పర్సంటేజ్ పార్ట్ నర్ షిప్ వుంది. అయినా అతడు వాటి గురించెప్పుడూ పట్టించుకునేవాడు కాదు__ సుగాత్రి ఇండస్ట్రీస్ తోనే పనులుతీరక రాయ్ మీద నమ్మకం కూడా! రాయ్ సారా కాంట్రాక్ట్ లతో పైకొచ్చిన వాడు కాబట్టి రాజకీయ లక్షణాలు వున్నాయి. మొదటి ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ లాస్ లో నడిచి లాకౌట్ ప్రకటించినపుడు....సాటి పారిశ్రామిక వేత్తగా ఆదుకుంది శరతే! దాంతోనే మరింత ఎదిగి రాయ్ కన్నా రెండు ఇండస్ట్రీలకు దోహదపడిన వ్యక్తి శరత్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS