Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 48

    అతడు శిలువలాగే నిల్చున్నా-అరమోడ్పులయిన అతని కళ్ళలోంచి కారిన ఓ నీటి బొట్టు ఆమె పాపిట మధ్య పడి తళుక్కుమంది.

    "అదికాదండి! మీరు నాకు చెప్పకుండా-నలిగిపోయే ణా హృదయంలో ఆనందాన్ని పేర్చి, మీ గొంతులో గరళాన్ని నింపుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు?

    నా కడుపు పేగుల్లో కదలికలు లేకపోతేనేం? ఆ ప్రేగులు ప్రేతాత్మల నిశీధి స్మశానమై జీవితాంతం స్తబ్ధుగా వుండిపోతేనేం-? ఈ జన్మకు మీ గుండెను పంచుకున్నాను చాలు.....మరో జన్మంటూ వుంటే మీ పేగు పంచుకునే పాపనయి పుడతాను.

    మీ నిర్ణయాన్ని ఎలా హర్షించను? ఈ లోకపు సాంప్రదాయం మనసై నిప్పుల వర్షం కురిపిస్తుందయ్యా.... నిశీధిలో నిశ్శబ్దంగా బరితెగించే సంబంధాలు. ఎన్నో బయటపడకుండా కడుపుల్ని కత్తెర్లకు బలిచేస్తే గుర్తించని సంస్కృతి....కలయిక లేకుండానే పెరుగుతున్న కడుపును చూసి.....కళ్ళచూపులతో, నోటి మాటలతోనే మనల్ని శిలువేస్తుందని ఎలా చెప్పను? మీ నెత్తుటి చమురుతో చేసిన ఈ ప్రమిదలోని ప్రమోదానికి ఆ గదిలోనే సమాధి కడుతుందీ సంస్కృతి అనెలా బోధించను? వల్లి వేసి వెలివేయాలనే చాదస్తపు లోకం....మీ నిర్ణయాన్ని క్రుళ్ళిపోయిన కళ్ళతోనే హర్షించి గులాబీలతో కప్పినా ముళ్ళతోనే పొడుస్తుందని నిన్నెలా నమ్మించను.....? నా కడుపు రాళ్ళు నింపుకున్న గొడ్రాలన్న లోకం పొత్తిళ్ళలో ముత్యాన్ని మెరిపించాలనే మీ నిర్ణయంతో ఈ లోకాన్ని హతమార్చినా.....ప్రేతాత్మలై వచ్చి పీక్కుతినే ప్రమాదముందని ఇంకెలా చెప్పను....??

    ఆమె చెప్పటం లేదు.

    ఆమె గండి పడిన గుండెనుండి బారులు తీర్చిన రక్తపు టేరుల్లో మాటలు సుళ్ళు తిరిగి అడుగంటిపోతున్నాయి. సింధూరపు ధారులన్నీ మందార వర్ణాల్ని మరిచి.....రంగు మార్చి కవిత్వమై కడలి తరగలా కదిలి వచ్చి కన్నీరుగా మిగిల్చి అతడి ప్యాంటుని తడుపుతున్నాయి.

    గాద్గదంగా గుండెలు వెక్కిళ్ళతో ఎగిసిపడుతుంటే__

    అతడి చెయ్యి భారంగా ఆమె తల మీద పడింది.

    భీభత్సమై పేలిపోతున్న శత శతఘ్నుల మధ్యనించి పారిపోయి వచ్చిన క్షతగాత్ర సైనికుడి మీద భయంతో పెట్టిన ఆదిలక్ష్మి శతగోపపు ఆప్యాయతలా....

    క్షణాలు శిధిల శకలాల్లా దొర్లిపోయాయి కొద్దిసేపు వాళ్ళ గుండె లోతుల్లోంచి...కాలపు లోయల్లోకి.

    ఆమె వెక్కిళ్ళమధ్య చెప్పింది-

    అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చిన నేను మీ మాటల్ని విన్నాను. మీ నిర్ణయంతో ఏకీభవించనని నన్నెందుకు మభ్యపెట్టాలని ప్రయత్నించారూ" శరత్ ఏమీ మాట్లాడలేదు.

    "శారీరకంగా ఏ పాపాల్ని తాకని నేను మానసికంగా దాన్ని ఎలా మోస్తాననుకున్నారూ?"

    ఒక నిమిషం అరవై క్షణాల్ని ఆర్తిగా భుజించి కాలచక్రంలో పడినలిగిపోయి గతంలా ఆవిరైపోయింది.

    "మీ సైన్సు...పెంచుకునే పాపానిస్తుందేమోగాని, పంచుకునే మాతృత్వాన్ని ఇవ్వలేదుగదా..." ఆమె వెక్కిపడుతూనే చెపుతోంది. ఆ ప్రయత్నానికి గొంతు కండరాలు తిరగబడుతున్నాయి.

    ఇంకా ఆమేదో చెప్పాలని ప్రయత్నిస్తుంటే__

    "అయాం వెరీ సారీ సుగా__నీ మనసు కష్టపెట్టటం నా అభిమతం కాదు" అతడామె చేతుల్ని మెల్లగా విడిపించుకు లేపి వేగంగా కదిలిపోయాడు యుద్దానికి సన్నద్ధమైపోయిన సిపాయిలా.

    అలాంటి సమయంలోనే ఒళ్ళో పెట్టుకొని లాలించే అతడు హఠాత్తుగా వెళ్ళిపోతుండేసరికి నిర్వేదం నిండిన చూపుల్తో నిశ్చేష్టతగా నిల్చుండి చూస్తుండిపోయింది.

    భూమి రెండుగా చీలి విఘాతం ఏర్పడ్డట్టుగా.

    మెదడు నరాలు తెగిపోయి కపాలం కదిలిపోతున్నంత బాధ....ఆమె నిగ్రహించుకోడానికి ప్రయత్నించింది ఆ ప్రయత్నం వమ్ము అవుతుంటే నెత్తుటి నాళాలు చిట్లి కళ్ళలో రక్తం కారుతున్నంత బాధగా, వేదనగా చూసింది కిటికీలోంచి.

    పోర్టికో దగ్గర్లో ఆగిన కారు ఓసారి రివర్సుగా వచ్చి గురిపెట్టిన శరాఘాతంలా దూసుకుపోయింది. బయటికి క్షణాల్లో....ఆ వేగం ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది.

    ఆమె చూస్తూనే వుండిపోయింది నైరాశ్యంగా.

    "ఏంటమ్మగోరు? అయ్యగారు అంత ఇస్పీడుగా పోతుండరు గంతటి కోపం నేనెప్పుడూ సుళ్ళేదు కళ్ళు సింతనిప్పుల్లా మండుతున్నయ్. రాయన్న ఎర్రగులాబీ కోసి తెచ్చినా ముట్టకుండా ఎల్లిపోయిండు. ఏమైందమ్మగోరు నాకు సెప్పరా?"

    వెనగ్గా వచ్చి అంది పనిమనిషి రంగి.

    సుగాత్రి కళ్ళు తుడుచుకుని "ఏమీలేదే! నువ్వెళ్ళి పని చూస్కో నన్ను కాసేపు ఒంటరిగానే వుండనియ్యి వెళ్ళిపోవే" అంది.

    "నాకు తెల్సమ్మగోరూ మీ తపనంతా పోరగాళ్ళ కోసమేనని....కన్నాల్లేమో కన్నందుకు ఏడుత్తన్నారు. కనలేనోల్లేమో కలవరిత్తండ్రు. ఆ దేవుడే అంతటోడమ్మా...ఆడించి నవ్వటం ఆడి పని. అయినా కొడుకును కనేంతదాకనే పేమలూ, భమలూను. ఒడ్డాలనాడు బిడ్డలేగాని....గడ్డాలొచ్చినంక కొరివి పెట్టడానిక్కూడా అయ్యల దగ్గర లంచాలు తీసుకునే కొడుకులు పుడ్తండ్రు. ఆళ్ళ సదువులే అట్ల తయారు చేత్తన్నయ్. అయిదోది సదువంగ 'అయ్యా' అంటాడు. ఏడోది సదువంగ 'బాపూ' అంటాడు. పదోది పట్టంగానే 'నాన్నా' అంటడు. కాలేజీలో పోయి రాంగానే 'డాడీ' అంటాడు పెండ్లాం రాంగానే ఆస్థి పంచివ్వురా 'గాడ్దీ' అంటడు...ఈ కాలంల గట్లాంటి కొడుకులు. ఆళ్ళు పుడితేనేం? పుట్టకుంటేనేం? పోరగాళ్ళు పుట్టి సంబరమేముందమ్మగోరు?"

    ఇంకా పెళ్ళికాని రంగి పేరంటంలా మాట్లాడేసరికి సుగాత్రి నవ్వు తెచ్చిపెట్టుకొని నవ్వింది.

    "కళ్ళుబ్బినయ్ అమ్మగారు....కడుక్కోండి కాఫీ తెచ్చిత్తా" అని వెళ్ళింది రంగి.

    సుగాత్రికి శరత్ కోపంగా ఎటువెళ్ళాడోనని భయపడింది క్షణం పాటు. అతన్నిబాధ పెట్టుకున్నందుకే అలా వెళ్ళిపోయాడా? ఎటు వెళ్తారు? చీకటి పడగానే ఆయనే తిరిగొస్తారు అనుకొని భయంభయంగా ఆలోచిస్తూ కూచుంది సుగాత్రి.

   
                         **    **    **    **
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS