"నా సిటింగ్ రూమ్ లోకి తీసుకురా" అంటూ అతను సిటింగ్ రూములోకి వెళ్లి కూర్చున్నాడు.
"నమస్కారం . నాపేరు నాగేశ్వరరావు. ఇందాకా మీకు ఫోన్ చేశాను. కానీ మీరు అర్ధంతరంగా....."
"నమస్కారం " అంటూ రాజారావు తీవ్రంగా అతని వంక చూస్తూ తన్ను తాను తమాయించుకుందుకు ప్రయత్నిస్తున్నాడు.
"నాకు కావలసిన వ్యక్తీ మీరవునో కాదో తెలియదు. కానీ ఉదయం ఒక అమ్మాయి ఈ చిరునామా నాకిచ్చింది. డాక్టర్ వై. బ్రహ్మచారి లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ. వాణీ సైన్సు కాలేజీ. ఫోన్ చేస్తే ఉండండి పిలుస్తాను. అన్నారెవరో బహుశా మీరే ననుకుంటాను. ఫోన్ ఎత్తి నేను చెప్పేది వినకుండానే దుర్భాష లాడి ఫోన్ పెట్టేశారు. ఇప్పుడిక్కడికి వస్తే బ్రహ్మచారి అన్నది మీ పేరు గాదనీ, అది మీ నిక్ నేమ్ అనీ, మీ అసలు పేరు రాజారావనీ తెలిసింది."
'అలా అని ఎవరు చెప్పారు?"
"డిపార్ట్ మెంటల్ క్లర్క్!"
'అతగాడికి కూడా నాపేరు బ్రహ్మచారి అని తెలుసునన్న మాట" అస్పష్టంగా గొణుక్కున్నాడు రాజారావు. "ఇంతకీ ఈ ఎడ్రస్ ఇచ్చిన ఆమె ఎవరు?"
"ఆమె పేరు తెలియదు గానీ ఆమె నిజం చెప్పి ఉంటె, మీరామె భర్త !' అన్నాడు నాగేశ్వరరావు.
రాజారావు ఉలిక్కిపడి "నాకో భార్య ఉందా!" అన్నాడు.
"నాకు తెలియదు. కానీ వివాహమై రెండు సంవత్సరాలయిందని కూడా ఆమె చెప్పింది."
రాజారావు ఒక్క క్షణం తీవ్రంగా అలోచించి తన డ్రాయర్ సొరుగు తీసి అందులోంచి ఒక ఫోటో తీసి, నాగేశ్వరరావు ముందుకు విసిరాడు. ఫోటో చూస్తూనే నాగేశ్వరావు ముఖంలో వెలుగు కనిపించింది. 'ఆహా, ఆమె ఈమె" అన్నాడు ఆనందంగా.
"యూ, యూ, రమా" అనుకున్నాడు చిరాగ్గా రాజారావు. "ఇంతకీ నాతొ ఏం పని?"
జరిగినదంతా వివరంగా చెప్పాడు నాగేశ్వరరావు. "నేను మీ భార్యను అనుమానిస్తున్నా ననుకోండి. కానీ జరిగినదిది. పరిస్థితులలా వచ్చాయి. అమెసరైనా చిరునామా ఇచ్చిందా లేదా అని తెలుసుకుందుకు ఇక్కడికి వచ్చాను. మానాన్న గారు చాలాకాలంగా వ్యాపారం చేస్తున్నారు. అయన దగ్గర ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఎవరితో ఎలా వ్యవహరించాలోనాకు బాగా తెలుసును. నాలుగైదు రోజులుఆగి మరీ పోలీసు రిపోర్టు ఇవ్వదల్చుకున్నాను. ఈలోగా వాచీ దొరక్కపోతే సమాజంలో పరువుగా బ్రతుకుతూ పెద్దమనిషిగా చలామణీ అవుతున్న ఆ ఘరానా దొంగను నేను పోలీసులకు అప్పగిస్తాను." అని అక్కణ్ణించి వెళ్ళిపోయాడతను.
నాగేశ్వరరావు మాటల వెనుక ఉన్న అభిప్రాయం చూచాయిగా అర్ధమైంది రాజారావుకి. అతను రమను అనుమానిస్తున్నాడు. నాలుగైదు రోజుల్లో ఆమె తిరిగి వాచీ ఇవ్వకపోతే పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తున్నాడు.
కానీ తనకు తెలిసినంతవరకూ రమ అలాంటిది కాదు. ఆమెతో తనకు రెండు సంవత్సరాలుగా పరిచయముంది. ఆమెను బాగా అర్ధం చేసుకున్నాడు. వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. తన అన్నగారి వివాహం కాగానే - లైన్లు క్లియరవుతుంది. అప్పుడామెను వివాహం చేసుకుంటానని కూడా ఆమెకు చెప్పి ఉన్నాడు.
3
ఆ సాయంత్రం రాజారావు ఎప్పటి లాగానే వెళ్ళి పార్కులో రమను కలుసుకున్నాడు. "రమా! ఈరోజు నీ ప్రవర్తనను నేను క్షమించలేను. నా పేరును బ్రహ్మచారిగా పాపులర్ చేసేస్తున్నావు."
"ఇంకా బ్రహ్మచారివె గదా నువ్వు. ఇంతకీ ఆ వాచీ షాపు ప్రోప్రయిటర్...."
"ఆ వచ్చాడు, రావడమే కాదు, నన్ను బెదిరించి కూడా వెళ్ళాడు."
"బెదిరించడమెందుకు? ఇంత అందమైన అమ్మాయిని బ్రహ్మచారి పెళ్ళి చేసుకున్నందుకా?"
"వేళాకోళనికైనా అంతుండాలి. పదేపదే నన్ను బ్రహ్మచారి అనవద్దు."
రమ అతని వంక జాలిగా చూసింది. "చూడూ రాజా? నా అందాన్ని నువ్వే కాదు, ఇంకా ఎందరో మగవాళ్ళు గుర్తించారు. అందువల్ల నేను అందగత్తె ననే అనుకోవాలి. నాలాంటి అందగత్తె నిన్ను ప్రేమించింది. అదే నీ అందానికో పెద్ద కాంప్లిమెంటు. అటువంటప్పుడు బ్రహ్మచారి అంటే ఎందుకుడుక్కుంటావు? ఎపెరునైనా ధైర్యంగా తీసుకోకపోతేనే ఇబ్బంది గురవుతావు. నువ్వు ఉడుక్కున్న కొద్దీ జనం మరింత ఏడిపిస్తారు."
రాజరావుకీ హితవు నచ్చలేదు. అతను మాట మారుస్తూ "ఆ షాపు ప్రోప్రయిటర్ కి నీమీద అనుమానం కలిగింది" అతని షాపులో 2,700 రూపాయలు ఖరీదైన వాచీ పోయిందిట!" అన్నాడు.
రమ ముఖంలో కొట్టవచ్చినట్లు ఆశ్చర్యం కనబడింది. "నిజం?" అంది.
"ఏమో ఆ నిజానిజాలు నీకూ, అతనికీ తెలియాలి. కానీ అతగాడు నాలుగైదు రోజుల్లో ఆ వాచీ దొరకనట్లయితే పోలీసు రిపోర్టిస్తాడట. సమాజంలో పెద్దమనిషిగా చలామణీ అవుతున్న ఘరానా దొంగను పోలీసులకు పట్టిస్తానన్నాడు. అంత పెద్ద మనిషి ముందు అతగాడలా మాట్లాడ గలిగే డంటే కారణం నువ్వే చెప్పాలి?"
రమ ముఖం బాధగా అయిపొయింది. "మీ మనస్తత్వం నాకు తెలుసు రాజా! అనవసరంగా నా మూలంగా నీవింత మాట పడవలసి వచ్చింది. కానీ పరధ్యానంగా వాచీ బయటకు తీసుకుపోయిననేరానికి నన్ను దొంగను చేసిన నీచుడికి తగిన బుద్ది చెప్పనక్కర్లేదంటావా?" అందామె ఆవేశంగా.
"ఎలా?"
"ఎలాగంటే నేనేం చెప్పను. నువ్వు చాలా తెలివైన వాడివి. ఈకేసు పరిశోధించు. దీని వెనుక ఉన్న రహస్యం బయటకు తీయి. నామీద వచ్చిన అపవాదును తొలగించడమే కాక...."
'అగు! ప్రతి తెలివైనవాడు పోలీసుల్లా పరిశోధనలు చేయడానికి ఇదేమైనా సినిమా అనుకున్నావా, నేనేమైనా హీరో అనుకున్నావా?' అన్నాడు రాజారావు విసుగ్గా.
"నా రాజా ఉన్న ఈ ప్రపంచం సినిమా కాక మరేమవుతుంది. అందులోనూ మామూలు సినిమా కాదు, టెక్నికల్ సినిమా, నా రాజా ఆ సినిమాలో హీరో, నేను హీరోయిన్ " ఒక్క క్షణం ఆగి 'డిటెక్టివ్ బ్రహ్మచారి , అసిస్టెంట్ రమ ఈ కేసును పరిశోధిస్తారు" అందామే.
రాజారావు ఒక్క క్షణం అలోచించి, "అల్ రైట్ ఈ రోజునించి నేను కాలేజీలో డాక్టర్ రాజారావుని! బయట డిటెక్టివ్ బ్రహ్మచారిని" అన్నాడు.
4
"హలో డాక్టర్ రాజారావుగారేనా?"
'ఆహా!"
"నేను నాగేశ్వరరావుని మాట్లాడుతున్నాను. చాలా థాంక్స్ అండీ. ఈరోజే నా వాచీ పార్సెల్ లో అందింది. చాలా భద్రంగా ఏమీ పాడు కాకుండా అందింది. మీకు పోలీసుల భయము లేదు. నాకు శ్రమా తప్పింది" అవతల ఫోన్ క్లిక్ మంది.
రాజారావు తక్షణం లేచాడు. అతను వెంటనే నాగేశ్వరరావు షాపుకు వెళ్ళాడు.
"నమస్కారమండీ . గడువు కాలం పూర్తీ కాకుండానే నా వాచీ అందింది. ఈ కేసులో మీరు అమాయకులని నాకు తెలుసుననుకొండి. కానీ మీకు చెప్పటం నాకు లాభించింది.
"మీ అభిప్రాయం నాకు అర్ధమైంది. కానీ ఒక్క విషయం. ఆ వాచీ మీకెలా అందిందో, ఆ పార్సిల్ ఎక్కణ్ణించి వచ్చిందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను" అన్నాడు రాజారావు సీరియస్ గా.
"తప్పకుండా" అంటూ ఒక చిన్న పాకెట్ చూపించాడు నాగేశ్వరరావు.
రాజారావు దాన్ని పరిశీలించాడు. ఫ్రం ఎడ్రస్ పి. కామరాజు. హౌస్ నంబర్ 63-5-101 , బంగారు వారి వీధి, రాజన్న పేట అని ఉంది. ఆ ఎడ్రస్ సరైనది కాదని ఎవరైనా ఊహించవచ్చు. ఆ పార్సెల్ పక్క ఊరిలోనే బుక్ అయిందని స్టాంపు ని బట్టి తెలుస్తోంది. రాజరావా చిరునామా నోట్ చేసుకొని వెళ్ళిపోయాడు.
వాచీ నిజంగా ఆమె కాజేసిందా? ఏం చేసుకుందామని చేసింది? మళ్ళీ తిరిగి ఎందుకిచ్చేసింది? తన మీద ప్రేమ కొద్దీనా? రాజారావు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
రమను దొంగగా అతనూహించ లేక పోతున్నాడు. రమ కాకుండా మరెవరైనా అయినట్లయితే దొంగతనం చేశాక తిరిగి ఎందుకిచ్చేస్తారు? అసలు రమ అయినా దొంగతనం ఎందుకు చేయాలి? చేసింది చేసినట్లురుకోక తన చిరునామా తెలిసేలా ఎందుకు చేయాలి? ఇప్పుడు నాగేశ్వరరావు దృష్టిలో తను నిజంగా చిన్నవాడై పోయాడు.
ఆ సాయంత్రం అతను రమను కలుసుకుని జరిగిన విషయం చెప్పాడు.
రమకు కలిగిన ఆశ్చర్యమింతా అంతా కాదు. "నిజంగా ఆ వాచీ పార్సిల్ ద్వారా పంపబడిందా? ఇందులో ఏదో రహస్యముంది?' అందామె.
"ఉంది కాని నీ దగ్గర కూడా ఏదో రహస్యముంది" అన్నాడు రాజారావు. "ఎవరో వాచీలు వేదుకుతున్నారని నా అనుమానం. వాళ్ళకు నువ్వు సహాయపడుతూన్నావు. నువ్వూ, ఆ దొంగ కూడా వాచీలను తీసుకుని బయటకు కొంతకాలముంచుకుని వెనక్కు ఇచ్చేశారు."
రమ ఇబ్బందిగా రాజారావు వంక చూసి , "నీలోంచి డిటెక్టివ్ బ్రహ్మచారి బయటకు వస్తున్నాడు కానీ, పెడదారులు తొక్కుతున్నాడు. నేను నిజంగా ఏ పాపం ఎరుగను" అంది.
"దొంగతనం జరిగినంతకాలం బాగానే ఉంది. కానీ వాచీ తిరిగి ఇవ్వబడటం తో నాకు నిజంగానే నీమీద అనుమానంగా ఉంది" అన్నాడు రాజారావు.
"నిజానిజాలు కాలమే నిర్ణయిస్తుంది లే. నువ్వు అనుమానించినంత మాత్రాన నేను దొంగనై పోను" అంది రమ. కానీ ఆమె ముఖం వివర్ణమైంది. తన్ను ప్రేమించిన రాజారావు అంత మాట అంటాడని ఆమె ఊహించలేదు. అయినా పరిస్థితులు కూడా అలా కలిసి వచ్చాయి మరి.
