"ఆ కాలంలో అందరు ఆడవాళ్ళు నన్ను ఎంత గౌరవించారు." అంటూ అందుకొన్నాడు పోకిరి ముసలి ముండాకొడుకు. "ఇక్కడికి వచ్చే ఆడవాళ్ళు అందరు నా తొడమీద కూర్చొని గంటలకొలదీ కాలము గడిపివేస్తూ ఉండేవారు" అని చెప్పి అతడేదో మరివొక తన యౌవన దిగ్విజయగాధ మొదలుపెట్టగా కిర్రని చప్పుడుతో చెప్పడాని కిబ్బంది కలిగింది.
"కావాలి కక్కగట్టుకి" అని శంకరం మనస్సులో అనుకొన్నాడు.
"అబ్బా! ఈ కీళ్ళ నొప్పులు ఎక్కువైపోతున్నాయి. చూడు శంకరం! ముసలి వాన్నయిపోతున్నాను. ఆ కాలపు శక్తులు అంతరించిపోయాయి. వెనుకటికి నా వీపు బాధ పెట్టిందనుకున్నావు. మళ్ళీ ఎంతో మరమ్మత్తువలనగాని లేకుంటే లోకాన్ని చూచేవాడినా?" అని వృద్ధుడు సర్దుకుంటూ అన్నాడు.
"అబ్బా! చాలా బాధపడి వుంటారు!" అని శంకరం మూలిగాడు.
"దానికేం శంకరం! నువ్వీ యింటిదాన్ని నీ యింటిదాన్ని చేసుకోవాలని అభిలాష నాకు!"
"నేనా అండి?"
"నువ్వే! అలా చూస్తావెందుకు? నువ్వే చేసుకోవాలి! నీ మీద ఇష్టం నాకు"
శంకరం ఒకరకమైన ఏడుపు మొఖంతో "ఆవిడ ఒప్పుకోదండి!" అని పలికినాడు-అంతట కిటికీనుండి చూచినదంతా జ్ఞాపకము వచ్చి అప్రయత్నముగ అతడొక నిట్టూర్పు విడిచినాడు.
వృద్దుడు దృఢంగా "ఏమిటీ ఒప్పుకోదూ అది? ఒప్పుకోకపోవడమే అది?" అన్నాడు.
"ఔనండి! ఒప్పుకొనకపోవడమే నండి! ఈ వ్యవహారం యింకొకడి చేతులో వుందండి. వాడి మొగం మండ ఎంత అందవికారపు మనిషనుకొన్నారు-"అన్నాడు శంకరం.
"శంకరం! అది వాణ్ణి పెళ్ళి చేసుకోదు."
"చేసుకుంటుందండి! మీరుగాని నాలాగే కిటికీలోంచి చూస్తే మీకు నమ్మకము కలుగునండి."
"హాష్" నే నెరుగుదునోయ్ ఆ సంగతి నాకు తెలుసునోయ్."
శంకరానికి ఈమారు పూర్తిగా కోపం వచ్చింది-రాదూమరి. చెప్పండి! ముసలి వెధవాయెను' వాడికిదంతా ఎందుకు? రామా కృష్ణా అని పడివుండక! అయినా శంకరం ఏమీ చెయ్యిచేసుకోలేదు. మనస్సంతా చాలా కలతపడిపోయింది.
'ఎందుకు శంకరం, నాకంతా తెలుసును-నువ్వేకాదు. చాలామంది యిటువంటి అమాయికపు సరదాలు పడుతూ ఉండేవాళ్ళు- నా జీవితంలో ఇట్టివి లెక్కలేనన్ని చూశాను కాని లాభంలేదు-శంకరం! లాభంలేదు."
"మీకు చాలా అనుభవం ఉండాలండి! చాలా అనుభవంతో పలుకుతున్న మాటలివి!"
"అలాగే! అలాగే!" అని చాలా బిక్కుగా కన్ను గీటుతూ వృద్దుడన్నాడు తర్వాత ఒక విచారపు నిట్టూర్పుతో శంకరం! శంకరం! మా కుటుంబం అంతటికీ నేనే మిగిలాను అన్నాడు.
"చాలా పెద్ద కుటుంబం కాబోలునండి?"
"ఔను చిన్నలూ, పెద్దలూ కలిపి పన్నెండుగురూ! గట్టి ప్రక్కలతో దృఢమైన చేతులతో చూడ సుందరంగా వుండేవారు. ఈ కాలపు చచ్చురకం అనుకున్నా వేమిటిరా?
"అయితే వాళ్ళందరూ ఏమయారండి?"
"పోయారోయ్ శంకరం పోయారు! మేము చాలా బాధపడుతూ ఉండేవాళ్ళము సుమా! అసలు వాళ్ళందరూ నాలాగు సత్వం కలిగినవాళ్ళు కారు మరి. అందుచేత కీళ్ళ నొప్పులు భరించలేకపోయారు. కర్రల కొట్లూ పంట యిల్లులాంటి వైద్యశాలలో పడిపోయారోయ్ శంకరం! అందులో కొందరికి దహనసంస్కారమే అయిపోయింది." అంటూ ముసలివాడు మిక్కిలి విచారంతో అన్నాడు.
"అబ్బా! చాలా విచారమేస్తున్నది!" అంటూ శంకరం మూలిగినాడు. ముంచుకొని వస్తున్న విచారాన్ని అరికట్టుతూ కొంతవరకు నిశ్శబ్దంగా ఊరుకొండి, పిమ్మట ముసలివాడు "పోనీగాని శంకరం! క్రియముక్క తేలకుండా వుంది చూశావూ! ఇప్పుడు యజమాన్ని పెళ్ళాడదలచుకొన్న మనిషి ఉన్నాడే దరిద్రుడు. కేవలం మోసగాడు సుమీ! ఈ అమాయకురాలిని పెళ్ళాడి యీ యిల్లు స్వాధీనం చేసుకొని మమ్మల్ని బానిసలుగా అమ్మివేయటమే వాని ఉద్దేశం! వానికి డబ్బుమీదనేగాని ఈవిడ మీద ప్రేమ లేదు." అన్నాడు.
"ఔను! కాని!...."
"క్షు....అడ్డుగా రాకు శంకరం నువ్వంటే చెప్పానుకాను, నీ మీద నాకు వేరు అభిప్రాయం-నువ్వే ఈవిడను పెళ్ళాడినట్లయితే ఈ యింటిని చచ్చినంత వరకు వదలిపెట్టవు నాలుగు గోడల మధ్యా చాలినంత తిండికి వుంటే అదే చాలు నీకు - నువ్వెంతో యోగ్యుడివి-"
"నామీద మీకిటువంటి అభిప్రాయం వున్నందుకు చాలా కృతజ్ఞున్ని."
"అందుచేత శంకరం! నువ్వే ఈమె వరుడివి. వాడు కాడు!"
"అయితే.....యిది పొసగడ మేలాగండి!...." అని ఆత్రుతతో అడిగాడు శంకరం.
"నేను చేస్తాను కదూ, వెళ్ళి వాడి జేబులు పరీక్షించు ఒక్క ఉత్తరం కానవస్తుంది. వింటున్నావా? ఒక ఉత్తరం! వాడి భార్య దగ్గర్నుండి తిరిగిరమ్మని వేడుకొంటూ-దరిద్రుడు ఆరుగురు పిల్లలున్నారు సుమీ వీడికి - అందరూ చిన్న పిల్లలు -వాళ్ళని వదలి చూశావా ద్రోహి."
ఈ మాటలతో ముసలివాడు ముగించాడు. అంతటితో అతని రూపురేఖలు అస్పష్టమై పోతున్నాయి. శంకరం కళ్ళకు ఏవో తెరలు క్రమ్ముకొన్నాయి. ముసలివాడు క్రమంగా కుర్చీలోకి ఒరిగిపోతున్నట్లు కుర్చీలో కలసిపోతున్నట్లూ కనబడ్డాడు. వెనుక దిండ్లు కుర్చీ వీపుగా అయిపోయినవి. కాళ్ళకట్లు కుర్చీ కాళ్ళగుడ్డలుగా మారిపోయినవి. అచ్చట కాంతి కూడా మసకలైపోయింది. శంకరం కళ్ళు మూసుకొని యధాప్రకారంగా ముసుగుతన్ని నిద్రలో మునిగిపోయినాడు.
ఆ విధంగా నిద్రపోయిన శంకరం సూర్యోదయానికి కొంచం ముందుగా మేలుకొన్నాడు. పరుపుమీదే మఠం వేసుకొని కూర్చొండి. గడచిన రాత్రి అంశాలు జ్ఞాపకం తెచ్చుకో మొదలుపెట్టాడు. ఒక్కమారుగా జరిగినదంతా జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతడు కుర్చీవేపు చూశాడు. వింతగానే యిపుడూ వుంది. వేదాంతి లక్షణాలే యిపుడూ వున్నవి. కాని అదే నిన్నటి ముసలివాడనటం అతి మిక్కిలి తెలివితో కూడిన పని అయినా శంకరం అనుమానం పోక 'తాతయ్యా' ఎలా ఉన్నారేమిటి? అని పలకరించాడు. జవాబులేదు. రాత్రి బాగా నిద్రపట్టిందా! ఉహు! మారు లేదు. 'పోనీ వాడి బట్టలు ఏ పెట్టెలో ఉన్నాయో అదేనా చెప్పుదా!' దీనికి జవాబులేదు.
"కాని వాడి పెట్టె అదే అయుంటుంది. దొంగ తాళంతో తియ్యలేకపోతానా!" అన్న ధీమాతో శంకరం బయలుదేరి పెట్టె చూశాడు-తాళం తీశాడు-జేబులు పరీక్షించాడు-ఉత్తరం! ఇకనేం! ఇక రాజ్యం ఏలగల మనోధైర్యం తోచింది శంకరానికి-మరెందుకు ఆలస్యం-వెంటనే మొగం కడుక్కుని బయలుదేరాడు. కధ నడిపించడానికి నడుం కట్టేడు.
తిన్నగా మెట్లు దిగి యిల్లు పరిశీలిస్తూ 'ఇదంతా మనదే కాబోతున్నది' అని లెక్కించుకుంటూ క్రిందికి వచ్చి దాసీని "అమ్మగా రున్నారా!" అని అడిగినాడు. లోపల మాట్లాడుతున్నారని జవాబు వచ్చింది. వాడితోనే కాబోలు.....అనుకోని శంకరం "కొంచెం మాట్లాడవలసిన పనుంది అని చెప్తావా?" అన్నాడు.
"కొంతసేపటికి శంకరానికి లోపలికి వెళ్ళటానికి వీలు కలిగింది. ఇప్పుడక్కడ ఆమె ఒక్కర్తే ఉన్నది శంకరం రాగానే ఆమె "దయచెయ్యండి అంతా సదుపాయంగా ఉంది కదా? మరేమీ ఇబ్బంది లేదనుకొంటాను." అని మొదలుపెట్టింది.
శంకరం పరవశుడైపోయినాడు. ఓహో! ఈవిడ నిజంగా కష్టసుఖాలూ తెలిసినది కాదని ఎవరనగలరు? ఇంతలాగు చూచుకోవడం ఎవరికీ సాధ్యమవుతుంది? అని అతడు తలపోసుకొని వ్యవహారం పరిష్కరించుకొనే తలంపుతో 'నాకేమీ యిబ్బంది లేదు-కాని ఒక ముఖ్య విషయము మాట్లాడ దలచుకొన్నాను. మీకు వినాలని ఉన్నపుడే చెప్తాను' అన్నాడు.
"అక్కరలేదు. ఇప్పుడే చెప్పవచ్చును."
"అయితే యిప్పుడు మీరు మాట్లాడుతున్న ఆయనను గురించే నేను చెప్పబోయేది.'
"అలాగా! ఆయన్ని మీరెరుగుదురేమిటి!' అని ఆమె ఎర్రబడ్డ చెక్కిలితో అడిగింది.
"లేదు కాని! వారి పేరేమిటండి" అని శంకరం కొంచెం చిక్కుగానే అడిగినాడు.
"రామస్వామిగారు" అని వెంటనే అన్నదామె.
"చాలా పొడుగైన మనిషి!" అన్నాడు శంకరం.
"చాలా మంచివారండి."
"మంచో చెడ్డో తెలియదు. కాని ఒక్క నిమిషం వినండి. కొంతసేపు సావకాశంగా కూర్చొంటేనే గాని వీలుపడదు."
"వితంతువు కొంచం ఆశ్చర్యపడ్డది. మొత్తానికి ఇద్దరూ సావకాశంగా కూర్చొన్నారు. అప్పుడు మరి ఎలా జరిగిందో ఎరుగను గాని-నాకే అన్నమాట యేమిటి. మా తాత గూడా శంకరం సహా ఎలా జరిగిందో తనకి తెలియదని చెప్పాడని నాతో చెప్పినాడు. అయితే ఎలా జరిగితేనేమి శంకరం అరచేయి ఆవిడ అరచేతిమీద పడి మాట్లాడుతున్నంత సేపూ అలాగే వుండిపోయిందట.
