"ఏ వరమయినా అడిగిందాకా యివ్వరు."
"మీ మగవాళ్ళ మనసు నవనీతం కాబోలు"
"అవును. త్వరగా కరిగిపోతాం వేడి తగలగానే."
"కరిగిపోయాకనే వెన్నకు రూపం మారుతుంది."
"మగవాళ్ళమీద నమ్మకం పెంచుకో," అన్నాడు గోపాలకృష్ణ రంగారావు ఆ మాటకు మల్లమ్మదేవి యిచ్చే సమాధానం యేమికో వినదలుచుకోలేదు. వినలేదు. చెప్పనివ్వలేదు.
కోడికూత విన్పించింది. మల్లమ్మదేవి మంచం దిగి వచ్చి తలుపు పట్టుకుని నిలబడింది. మరికొద్ది క్షణాలకే తలుపు అవతల శబ్దం అయింది. తలుపులు తెరుచుకున్నాయి యెదురుగా కమలక్క.
కమలక్క ఆమెను తీసుకువెళ్ళింది. యీసారి వెళ్ళటం విడిది చేసిన గదికి కాదు. గోపాలకృష్ణ రంగారావువారి అంతఃపురంలోకి.
అక్క వస్తుందని యెంతోసేపు యెదురుచూచింది జగ్గమాంబ తెల్లవారిన తరువాత. బారెడు ప్రొద్దెక్కినా ఆమె జాడలేదు. తల్లి అదేమీ పట్టనట్లు ప్రయాణానికి సిద్దం అవుతోంది.
"అమ్మా! అక్క యిక్కడికి రాదా?" అని అమాయకంగా అడిగింది జగ్గమాంబ.
"పిచ్చితల్లీ, ఆమె యిప్పుడు నీ అక్క కాదు- బొబ్బిలి మహారాణి. ఆమెను చూడాలంటే నీకయినా, నాకయినా రంగారావుగారి అనుమతి కావాలి యిది రాచమర్యాద" అని వివరించి చెప్పింది తల్లి.
12
జగ్గమాంబ బిక్కు బిక్కుమంటూ తల్లి వెంట తిరుగుతోంది ఆమెకు లోకమంతా శూన్యమే అయినట్లుగా వుంది. యెన్నటికీ తీరని వెలితిగా వుంది. తన శరీరంలోని ఒక భాగాన్ని యెవరో త్రెంచుకుపోయినట్లుగా వుంది కాలు కాలిన పిల్లిలా అటూ యిటూ తిరిగింది. యీ అయిదురోజులనించి ప్రొద్దస్తమానూ తాము విడిది చేసిన యింటికి పదే పదే వచ్చాక కమలక్క యివ్వాళ నల్లపూస అయిపోయింది.
రేపు తనకికూడా పెళ్ళి అయిపోతే యింతే జరుగుతుంది కాబోలు. తనుకూడా ఒక యిల్లాలయిపోయి అంతఃపురంలోకి వెళ్ళిపోతే అమ్మను చూడాలన్నాకూడా ముందుగా అనుమతులు వుండాలి కాబోలు యేమిటో మతిలేని అనుమతులు యీ రాణీతనమూ రాచరికమూ తల్లీబిడ్డల మధ్య, అక్కా, చెల్లెళ్ళ మధ్యకూడా అడ్డు నిలుస్తుంది కాబోలు.
చిన్నకూతురు మనోవేదనను అర్ధం చేసుకున్నాడు రామరాయుడు.
"అమ్మా, మరి కాస్సేపటికి మనం ప్రయాణం కావాలి. అటూ యిటూ వెళ్ళిపోకు. ప్రయాణం ఆలస్యం అయిపోతుంది" అని హెచ్చరించాడు.
తిరుగు ప్రయాణానికి సమయం దగ్గర పడుతున్నకొద్దీ జగ్గమాంబ మనసులో గుబులు మరింత పెరుగుతోంది.
అమ్మకూ, నాన్నకూ కన్పించకుండా కోట ప్రహారీ దగ్గరకు వచ్చింది. వెంగళరాయుడు గుర్రాలశాల దగ్గర తానుండి స్వయంగా గుర్రాలకు మాలీను చేయిస్తున్నాడు. వున్న గుర్రాల సంఖ్య స్వల్పమే అయినా అన్నీ మేలుజాతివి.
"చిన్నిబావా యిక్కడున్నావా?" అంటూ పలకరించింది జగ్గమాంబ.
"అవును యేం?"
"నీకోసమే వెతుకుతున్నాను."
"ఎందుకో-?"
"ఎందుకేమిటి మేం యీరోజే వెళ్ళిపోతున్నాం తెలుసా?"
"ఆఁ తెలుసు."
"నీకెలా తెలుసు?"
"ఇప్పుడు నువ్వు చెప్పావుగా!"
"ఇంకా చెప్పాల్సిన సంగతులు చాల వున్నాయి. నాతో వస్తావా?"
"ఎక్కడికి?"
"బొబ్బిలి వూరంతా నాకు చూపించవూ?"
"రా గుర్రంమీద పోదాం" అంటూ బయల్దేరాడు వెంగళరాయుడు. చెరొక గుర్రంమీద యెక్కి వూరంతా చూచేందుకు బయల్దేరారు.
బొబ్బిలి జనాభా అయిదువేలు వెయ్యిదాకా యిళ్ళుంటాయి. బ్రాహ్మణవీధిలో వంద యిళ్ళుంటాయి వాళ్ళ వృత్తి వ్యవసాయం కొద్ది కుటుంబాలు మాత్రమే బ్రాహ్మణుల కులవృత్తిమీద ఆధారపడి బ్రతుకుతారు. వెలమవీధిలో వ్యవసాయదారులు, సైనికులూ వుంటున్నారు. వైశ్యులవీధిలో అన్ని వృత్తులవాళ్ళూ వున్నారు. వ్యాపారులు, వ్యవసాయ దారులు, సైనికులు, మిగిలిన వర్ణాలవాళ్ళకి ఇళ్ళు వేరు వేరుగా వున్నాయి, యెవరి పనులు వాళ్ళు నిశ్చింతగా చేసుకునేందుకు వీలయిన పద్దతిలో. వైశ్యులవీధిలో ఆ గళ్ళున్నాయి వివిధ రకాల కొలతల్లోనూ, వివిధ రకాల ఆకృతుల్లోనూ తయారుచేసిన కత్తులూ, యీటెలూ, డాళ్ళూ, కవచాలూ, శిరస్త్రాణాలు అమ్మే అంగళ్ళున్నాయి. తేనె, యిప్పపువ్వూ యిప్పసారా అమ్మే అంగళ్ళున్నాయి.
కొన్నిచోట్ల అడవిలోంచి పట్టితెచ్చిన రక రకాల పక్షులూ, చిన్ని చిన్ని జంతువులూ అమ్ముతున్నారు. మరొకచోట వేటకు పనికి వచ్చే వలలూ, పుచ్చులూలాంటివి అమ్ముతున్నారు. రవసెల్లాలు అమ్మే దుకాణాలున్నాయి. గుర్రాలు అమ్మే శాలలున్నాయి.
ఆ వీధిలోని వైశ్యులంతా శ్రమజీవులు విదేశవ్యాపారం చెయ్యగలిగినవాళ్ళు బొబ్బిలిలో యెవరూలేరు. బడీరులమీద గుజరాత్, రాజస్థాన్ లతో వ్యాపారం చేసేవాళ్ళు. వంగ, బీహారాలమీదుగా హిమాలయాల వరకూ వెళ్ళి రాగలిగినంత పెద్ద వ్యాపారులుకూడా యెవరూ లేరు.
ఆ అంగళ్ళ మధ్యనించీ రంగారావు సోదరుడూ, జగ్గమాంబా వెళ్తూవుంటే కొందరు వంగి నమస్కారం చేస్తూ తమ వినయవిధేయతల్ని ప్రకటిస్తున్నారు. పెద్దవాళ్ళు యెదురు అయినప్పుడు వెంగళరాయుడు గుర్రంమీదినించి దిగి తన గౌరవభావాన్ని తెలుపుతున్నాడు.
ఆ వీధిలో అందరూ యెవరి పనుల్లో వాళ్ళున్నారు. ఆయుధాలమ్మే వాళ్ళు ఆయుధాలకు మెరుగులు పెట్టుకుంటున్నారు. గుర్రాలు అమ్మేకాలంవాళ్ళు వాటి ఆలనా పాలనా చూచుకుంటున్నారు చిన్ని చిన్ని జంతువులు అమ్మేవాళ్ళు వాటికి మేతా, నీరు అందిస్తూ ఆటలు నేర్చుకుంటున్నారు. రససెల్లాలు అమ్మేవాళ్ళు ఆడవాళ్ళచేత అల్లకల పనులు చేయిస్తున్నారు.
