"టైం లేదు సర్కిల్ గారింట్లో డిన్నర్ కు వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యం అయింది. మొహం అన్నా చూపించకపోతే బాగుండదు. మీ ఆయన పాపం, వెయిట్ చేస్తున్నాడు. నేను వస్తా వరూ!" అన్నాడు రామనాథబాబు.
కారు సాగి వెళ్ళిపోయింది. పనిపిల్ల కుర్రాడ్ని వరూధినికి అందించింది. తాళం తీసే ప్రయత్నంలో పడింది.
"ఎంతసేపయిందీ వచ్చీ?" వరూధిని వెంకటపతికేసి అప్పుడే చూసినట్లుగా చూసి అడిగింది.
వెంకటపతి మాట్లాడలేదు. బియ్యం మూట, మూతి దగ్గిర పట్టుకొని బరబరా ఇంట్లోకి లాక్కొచ్చి వేశాడు. పనిపిల్ల ఉగ్గం తపేళా పట్టుకొని లోపలికి వెళ్ళింది.
"ఏమన్నాడు ముసలాయన?" కొడుకుని వెంకటపతికి అందిస్తూ అడిగింది వరూధిని.
వెంకటపతి మాట్లాడలేదు. నిద్రపోతున్న కొడుకు జుట్టు నిమురుతూ గదిలో అటూ ఇటూ తిరిగాడు. కుర్రవాడికి పక్కవేసి, ఫాన్ పెట్టి, వెంకటపతి చేతుల్లోనుంచి కొడుకుని అందుకొని పడుకోబెట్టింది.
చీరమార్చుకొని హాల్లో కూర్చొన్న వెంకటపతి దగ్గిరకొచ్చి "ఏం మునిగిపోయింది? ఇంత పొద్దుపోయి రాకపోతేనేం? తెల్లారి రాకపోయారా?" అన్నది.
అప్పటికే వెంకటపతి అలాంటి మాటలకు అలవాటు పడ్డాడు. నోరెత్తకుండా కూర్చున్నాడు.
"ఒసే! కమలా! ముందయ్యగారికి వడ్డించవే!" అని కేకవేసింది.
పనిపిల్ల వచ్చింది. "ఇప్పుడే బియ్యం కడిగి పెట్టానమ్మా!" అన్నది.
పనిపిల్ల వంట కాగానే ఇద్దరకూ వడ్డించింది.
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వెంకటపతి భోంచేస్తున్నాడు. వరూధిని ఎదురుగా కూర్చొని పెరుగువడ్డిస్తూ మళ్ళీ రెట్టించి అడిగింది:
"ఇంతకీ మామయ్య ఏమన్నారూ?"
"ఛస్తే పొలం అమ్మడానికి ఒప్పుకోనన్నాడు."
"ఛస్తే పీడ విరగడయిపోతుంది. మనమే అమ్ముకోవచ్చు!" గరిటె పెరుగు గిన్నెలో ఎత్తి పడేస్తూ అంది వరూధిని.
వెంకటపతి నోట్లో వున్న ముద్దను గుటుక్కున మింగేశాడు.
"చాతకానివాడివి ముందే చెప్పకపోయావా?" రుసరుసలాడుతూ అన్నది వరూధిని.
"ఇప్పుడేమయిపోయింది? ఇవ్వాళ కాకపోతే రేపు ఒప్పుకుంటాల్లే!" అన్నాడు వెంకటపతి పెళ్ళాంకోపం తగ్గించే ప్రయత్నంలో.
"బిల్డింగ్ శాంక్షన్ కూడా వచ్చింది. ఈ నెల్లోనే రామనాథబాబుగారు మొదలు పెట్టాలంటున్నారు స్థలం నా పేరుమీదే వుంది. లేకపోతే మరొకళ్ళని భాగం కలుపుకుంటాం అంటున్నారు" అంటూ తినేతినే పళ్ళెంలో నీళ్ళుపోసి చివాల్న లేచింది వరూధిని.
అన్నం తింటున్న భర్తను కవ్వించింది వరూధిని.
"సినిమాహాలు ప్లాన్లన్నీ తయారయినై. మనవల్లనే ఆరునెల్లుగా ఆలస్యం అయింది. ఈపాటికి హాలుకూడా పూర్తయేది. రామనాథబాబు మంచివారు కాబట్టి సరిపోయింది. మనమీద వున్న అభిమానంతో ఇంతవరకూ ఆగారు."
"అగకపోతే ఆయన్నే కట్టుకోమను! మనకు సినిమాహాలూ వద్దు పాడూ వద్దు." అన్నాడు వెంకటపతి పెళ్ళాంవైపు చూడకుండానే.
వరూధినికి వళ్ళు మండిపోయింది.
"ఆ ఏడుపు ముందే ఏడిస్తే పోయేదిగా?"
ముద్ద నోట్లో పెట్టుకోబోతూ వెంకటపతి తలెత్తి పెళ్ళాం ముఖంలోకి చూశాడు. భర్తముఖం చూసిన వరూధినికి నిజంగానే భయం వేసింది. కాని, తను తగ్గిపోతే తన ప్రయత్నమంతా వ్యర్ధం అయిపోతుందని భావించింది.
"మీ ఆస్తిని మీరు అమ్ముకొనే హక్కులేదా? ముసలాడు చెబితే నెత్తిన గుడ్డేసుకొని వచ్చిందిగాక ఎందుకలా చూస్తారు?"
"ఇక్కడ ఇల్లూవద్దు, సినిమాహాలూ వద్దు! ఇక్కడ బస్తీకాపురం వెలగబెట్టింది చాలు. ఇక మన ఊరికి వెళ్తేనే మంచిది." వెంకటపతి చాలా లోతుగా ఆలోచించి అన్నమాటలేనని అర్ధం చేసుకొని వరూధిని గాబరాపడింది.
"నేనెక్కడకూ రాను. కావాలంటే మీరు వెళ్ళి మీ అయ్యదగ్గిర వుండండి. నా బిడ్డను పెట్టుకొని నేనిక్కడే వుంటాను."
"ఆహా! అంతవరకూ తెగించావన్నమాట?"
"తండ్రి ముందు పిల్లీ! పెళ్ళాం ముందు పులీ! బాగానే వుంది సంబడం!" మూతి తిప్పుకొంది వరూధిని.
"ఊరికే వాగావంటే....?"
"ఏం చేస్తావేంటి?"
ముందున్న గ్లాసును ఎత్తి పెళ్ళాం మీద విసిరాడు వెంకటపతి. వరూధిని తలమీదుగా వెళ్ళి గోడకు తగిలి కిందపడింది. వరూధిని దెబ్బతిన్న ఆడపులిలా లేచింది. తనముందున్న ఎంగిలి పళ్ళెం ఎత్తి వెంకటపతి ముఖంమీద కొట్టాలనిపించింది. ధైర్యం చాలక అతను తింటున్న పళ్ళెం మీదకు విసిరింది. వెంకటపతి రౌద్రంగా లేచాడు. వరూధిని జుట్టు పట్టుకొని వంగదీశాడు.
కొడుకు ఏడుపు వినిపించింది. కంచాల మోతకు పసివాడు నిద్ర లేచాడు. గుక్కపెట్టి ఏడవసాగాడు. వరూధిని పడక గదిలోకి వెళ్ళి తలుపులు ధడేల్ను వేసింది.
వెంకటపతి తెల్లవారి నిద్రలేచి వరూధిని ఇంకా గదిలోనే వుందనే ఉద్దేశ్యంతో, అటుకేసయినా చూడకుండా వరండాలో కూర్చున్నాడు. అప్పుడే రిక్షా దిగి లోపలకు వస్తున్న వరూథిన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
ఇది ఎక్కడ్నుంచి వస్తున్నది? అసలెప్పుడు వెళ్ళింది? తను నిద్రలేచే సరికి ఇంట్లో లేదన్నమాట?
వరూధిని కళ్ళు తేలవేస్తూ, కాళ్ళు భారంగా ఈడుస్తూ, వచ్చి మండిగం దాటబోతూ, తూలి దర్వాజా పట్టుకొంది. వెంకటపతి బుర్రలో కందిరీగలు తిరిగినట్టయి చూశాడు.
"నువ్వు మనిషివా? పశువ్వా?"
"ఏదయినా తేడా ఏముందన్నట్టుంది వెంకటపతి చూపు.
"రాత్రిపోతే ఈపాటికి శవదహనంకూడా జరుగుతూ వుండేది."
"ఏమయిందీ?" వెంకటపతి వానపాములా అయిపోతూ అడిగాడు.
"ఇంకా అడుగుతున్నారా? గుండెల్లో నొప్పి వచ్చింది. గిలగిల్లాడిపోయాను. మనిషి చచ్చినా బతికినా మీకు పట్టదు." వరూధిని హీనస్వరంతో అన్నది.
మెల్లగా దర్వాజా పట్టుకొని జారి గడపల్లో కూలబడింది. వెంకటపతి గాబరా పడ్డాడు.
"ఎట్టా వుందిప్పుడు?" అన్నాడు లేచి భార్య దగ్గరకొచ్చి.
వరూధిని కళ్ళు మూతలుపడిపోతున్నాయి. వెంకటపతికి ఏమీ తోచక వరూథిన్ని పట్టుకొని లేవదీయబోయాడు. ఆగమని సౌంజ్ఞ చేసింది వరూధిని. రెండు నిముషాలయాక తెప్పరిల్లి భర్త కళ్ళలోకి చూసింది. నీరసంగా పెదవులు కదిలాయి.
"డాక్టరమ్మను తీసుకురానా?" అన్నాడు వెంకటపతి.
"అక్కన్నుంచే వస్తున్నాను. హార్టుస్పెషలిస్ట్ భుజంగరావుగారికి చూపించమన్నది. ఫోటో తీయాలంట."
"ఏంటీ? గుండెజబ్బని చెప్పిందా?" వెంకటపతి బెంబేలుపడిపోయాడు.
"నా బిడ్డ అదృష్టం! అసలు రాత్రే పోవాల్సింది."
"ఛ! అయ్యేం మాటలు? ఊరుకో!" వెంకటపతి గొంతు పూడిపోయింది. రాత్రి తన తొందరపాటువల్లే వరూధిని ఇలా అయిపోయింది. ఇంకా నయం! ఆ కోపంలో దాన్ని వంగదీసి బాదలేదు. అలా జరిగుంటే తన చేతుల్లోనే పోయేది.
వెంకటపతి భార్యను లేవదీసి మెల్లగా మంచం దగ్గరకు తీసుకెళ్ళిపడుకోబెట్టాడు. కొడుకు నెత్తుకొని గుండెలకు హత్తుకుని కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడు.
"ఛ! అదేమిటండీ? ఇప్పుడు నాకేమయిందని అలా అయిపోతారూ? ఏదీ, బాబును ఒక్కసారి ఇవ్వండి!" అన్నది వరూధిని భర్తకు ధైర్యం చెబుతూ.
సాయంకాలం రామనాథబాబు వచ్చాడు. భుజాలమీద కొడుకుని ఆడిస్తోన్న వెంకటపతిని చూసి "ఏదీ, ఎక్కడా?" అని అడిగాడు.
'వంట్లో బాగాలేదు. రాత్రి గుండెల్లో నొప్పి వచ్చింది. పెద్ద డాక్టరుగారికి చూపించమన్నది డాక్టరమ్మ. ఆ పెద్దడాక్టరుగారి దగ్గరకు వెళ్ళామంటే కదలటం లేదు. రేపు వెళ్ళొచ్చులే అంటుంది." అంటూ చెప్పుకుపోతున్నాడు వెంకటపతి.
రామనాథబాబు కంగారుపడిపోయాడు. "నువ్వు మనిషివేనా? అసలు మగాడివేనా?" అని అనలేదుకాని అన్నట్టే చూశాడు రామనాథబాబు వెంకటపతి వైపు.

