దగ్గర దగ్గర అయిదున్నర గంటలకి భార్యాభర్తలిద్దరూ కొత్త కార్లో వచ్చారు. "కొత్త యింటికి వెళదామంటే ఇక్కడికొచ్చారేమిటండీ" అని ఆవిడ అడిగారు.
"ఉండు చెప్తాను" అని, వారు నా దగ్గరకొచ్చి, "సరోజా! వచ్చి కారుచూడు" అన్నారు. ఎమ్.ఎస్.ఎక్స్ 138, స్టాండర్డ్ కార్, లైట్ క్రీం కలర్ - ముచ్చటగా వుంది.
కారు చూసిన తర్వాత నేను పెద్ద ట్రేలో పూజసామాన్లు, స్వీటు పట్టుకొని కారు దగ్గరికొచ్చి ఆవిడ్ని చూసి నమస్కారం చేశాను.
ఆవిడ ఆయనని చూసి, "పూజలన్నీ కపాలీ కోవెలలో చేద్దాం. ఇక్కడేం వద్దు. రండి వెళదాం" అన్నారు.
"కోవెలకైతే నువ్వెళ్ళి అవన్నీ పూర్తిచేసుకొని రా, నేను రాను" - అన్నారాయన. వెంటనే డ్రైవర్ సుబ్బారావు, "అమ్మగారూ! కారు రాగానే మొట్టమొదటి సారిగా సరోజమ్మగారు పసుపూ, కుంకుమా, పూలు తెచ్చారు. వద్దనకండి. అపశకునం" - అన్నాడు.
నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మీ చేత్తో పూలమాట వేసి కొబ్బరికాయ కొట్టి హారతివ్వండి" అన్నాను.
"మా యింటికి వెళ్ళి కారుకి పూజ చేసుకుంటాను" - అన్నారావిడ.
అందరూ నన్నే చూస్తున్నారు. లోలోపల బాధపడుతున్నా పైకేమీ తెలీనివ్వకుండా వూరుకున్నాను.
"నువ్వు కొబ్బరికాయ కొట్టేయి సరోజా!" అన్నారాయన.
ఆయన మంచి మనసుకి మనస్సులోనే జోహారులర్పించాను.
"లేదండీ! ఆవిడ పెద్దావిడ ఆవిడ పూజ చెయ్యడం న్యాయం" అన్నాను.
వెళ్ళి ఆవిడతో చెప్పారాయన.
"అసలు ఇక్కడికి తీసుకొస్తానంటే నేను కారెక్కేదాన్నే కాను" అన్నారావిడ.
ఆయన ఆవిడతో ఏమీ మాట్లాడలేదు.
కూల్ గా - "సుబ్బారావ్! డ్రయివ్ చెయ్యాల్సిన వాడివి నువ్వు ఈ కొబ్బరికాయ నువ్వే కొట్టు" అన్నారు.
పూజంతా అయిపోయింది. అందరికీ స్వీట్స్ పంచాను.
"రా సరోజా! కారు ఎక్కు" అన్నారు శ్రీశ్రీగారు.
"నేను దిగిపోతాను..." అన్నారావిడ.
* * *
పూజించే వాళ్ళు పిరికివాళ్ళు
"అదేమిటండీ? శుభమా అని కారు కొనుక్కుని మీరు దిగిపోవడం ఎందుకు? నాకీ రోజు ఇంట్లో చాలా పని వుంది. ఇక్కడికి దగ్గరే మా ఇల్లు. నేను వెళ్ళిపోతానులెండి. మీరు వెళ్ళండ"న్నాను.
నన్ను కార్లో దింపెయ్యమని కంపెనీవాళ్ళతో చెప్పి శ్రీశ్రీగారు భార్యతో సహా తన కారులో వెళ్ళిపోయారు.
నేనూ అమ్మా కారులో ఇంటికి వెళ్ళిపోయాం.
మా అమ్మ ప్ర్రారంభించింది...."మనమేమయినా ఆవిడ్ని కొట్టామా, తిట్టామా? ఎందుకలా మనల్ని చూసి మండిపడుతుందో అర్ధంకాలే"దని అంది.
"ఏముందిలే అమ్మా! నావల్ల శ్రీశ్రీగారికి అదృష్టం పట్టిందని నలుగురూ అనుకుంటున్న మాటలు ఆవిడకి కష్టంగా వున్నాయి. ఇదంతా తన కూతురి అదృష్టం అంటుందావిడ"
వెంటనే మా అమ్మ, "నేనూ, ఆవిడా ఎన్ని అన్నా, చూసేవాళ్ళకి తెలియదటే? పాపం శ్రీశ్రీగార్ని చూస్తే జాలేస్తోంది సరోజా!" అంది.
"సరేలే అమ్మా! వదిలేద్దూ రోజూ కంపెనీలకి వెళ్ళి బోరుకొడుతోంది. పిల్లల్ని తీసుకొని అలా బీచ్ కి వెళ్ళి వద్దాం పద" అన్నాను.
పిల్లలంతా ఎగిరి గంతేశారు. అప్పుడు మా పెద్దన్నయ్య పెద్ద కొడుకు విజయ్ కూడా మా దగ్గరేవుండి చదువుకొనేవాడు. అందహ్రూ రడీ అయ్యారు నాన్నగారితో చెప్పి బయలుదేరదామనుకొనేసరికి శ్రీశ్రీగారు వచ్చారు.
నాకు ఆశ్చర్యంతోపాటు వారిమీద ఎక్కడలేని అభిమానం పుట్టుకొచ్చింది.
"ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. రండి కారులో వెళదాం" అన్నారు.
"మీరోచ్చారుగా మేం వెళ్ళం" అన్నాను.
పిల్లలంతా గోలపెట్టేశారు. రేపు తీసుకువెళతానన్నాను.
"అది కాదు సరోజా! ఈ రోజు మంచిరోజన్నావుగా! ఓసారి నువ్వు కూడా కారు ఎక్కావనుకో బాగుంటుందన్నారు".
"అబ్బో! మీక్కూడా సెంటిమెంట్స్ మీద నమ్మకం వుందన్నమాట".
"సెంటిమెంటూ కాదు, పాడూ కాదు మేం అందరం కారెక్కాం. నువ్వొక్కర్తివే బాకీ" అన్నారు.
"వద్దులెండి. ఎందుకు లేనిపోని గొడవలు? మీ రెక్కారుగా అదే చాలు" అన్నాను.
"గొడవలు ఏమిటి సరోజా! ఈ రోజు కాకున్నా 'రేపయినా నువ్వు కారు ఎక్కకుండా అవుతుందా? కంపెనీ వాళ్ళని నీ కోసమే వేరే కారు పంపమంటే బాగుంటుందా? మన కారులో వాళ్ళు పెట్రోలు పోస్తారు. ఇది నా కారు. నా పేరు మీద కొన్నాను వస్తావా, రావా?" అన్నారు.
అందర్నీ ఇంట్లోనే ఉండమని, అమ్మని మాత్రం తీసుకువెళ్ళాను.
"ఎక్కడికి వెళదాం?" అని అడిగారు.
"కపాలీశ్వరూడి కోవెలకి వెళదాం" అన్నాను.
ఆ మాటకి వారికెంత వొళ్ళుమండిందో చెప్పలేను.
"ఈ కపాలీలు, గిపాలీలు నాకిష్టంలేదు. మీ గుళ్ళూ గోపురాల పూజలు నేను లేనప్పుడు చేసుకోండి. నువ్వు కూడా పూజల పురుగువే అన్నమాట" అన్నారు.
"తప్పండీ అలా అనకూడదండీ" అన్నాను.
"ఇంకెలా అనాలి? పూజలూ పునస్కారాలు, పాతచింతకాయ పద్దతులూ, సాంప్రదాయాలు, ఇష్టాయిష్టాలు - వీటి గురించి మాట్లాడి తెలుసుకోవడం దాకా మనం రాలేదు కదూ! చెప్తున్నా విను.
నేను పరమ నాస్తికుడ్ని నాకీ దేవుళ్ళమీద, దెయ్యాలమీద నమ్మకంలేదు. నీకుంటే చెప్పు" అన్నారు.
"నాకున్నదల్లా దేవుడి మీద నమ్మకం ఒక్కటే" నండి.
"అంటే.....నాకు జస్ట్ ఆపోజిట్ అన్నమాట" అంటూ నా ముఖంవైపు చూశారు.
"మీ మాటల్ని బట్టి అలాగే అనిపిస్తోంది. ఈ విషయంలో మన ఇద్దరం ఈస్ట్ అండ్ వెస్ట్ అన్నమాటే" అన్నాను.
"చూడు సరోజా!...." అని ఏదో అనబోయారు.
నేను వెంటనే....."దయచేసి కోవెలకి తీసుకువెళ్ళండి. మీరు దిగొద్దు. నేను మాత్రం దిగుతా గుడిలోకి వెళ్ళను. మీకూ, కారుకి దిష్టితీస్తాను" అన్నాను.
"ఏమిటి సరోజా! నువ్వూ నీ చాదస్తమూను దేవుడ్ని పూజించే వాళ్ళంతా ఉత్తపిరికిపందలు. వాళ్ళ కాళ్ళమీద నిలబడే ధైర్యం వాళ్ళకి లేదన్న మాట" అంటూ నా మనస్సు నొప్పించడం ఇష్టం లేక, డ్రైవర్ తో కోవెలకి పోనీయమని చెప్పారు.
దేవుడంటే వారికి ఇష్టం లేదన్న సంగతి ఖచ్చితంగా నేను ఆరోజే తెలుసుకున్నాను.
ఆలస్యం చెయ్యకుండా వెంటనే కొబ్బరికాయ కొట్టేసి, గోపురం చూసి బయలుదేరి పోయాను. నేను దిగి మళ్ళీ కారు ఎక్కేలోపల రెండు సిగరెట్లు ఊదేశారు.
"నాతో వున్నప్పుడు ఇలాంటి పనులు చెయ్యకు ముందీ దైవ భక్తిని నిర్మూలిస్తేకానీ మన దేశంలో ఉన్న దరిద్రం పోదు. దేశం బాగుపడదు" అంటూ దారి పొడుగునా చివాట్లు పెడుతూనే ఇంటి దగ్గర దింపేసి, "ఉదయం సిద్దంగా వుండమ"ని చెప్పి వెళ్ళిపోయారు.
మర్నాటినుండి ఆ కారులోనే వెళ్ళడం మొదలైంది. తర్వాత మామూలయి పోయింది.
శ్రీశ్రీగారింటి 'గృహప్రవేశంముహూర్తం' దగ్గరపడింది.
"గృహప్రవేశం ఏర్పాట్లన్నీ నువ్వు కూడా నడుం కట్టుకొని చూడాల"ని చెప్పారు.
ఇంకా ఆవిడ పాత ఇంట్లోనే వుండడం వల్ల అయిదారుగురు ఆర్టిస్టుల సాయంతో పనివాళ్ళని పెట్టి నా సరదా కొద్దీ పెద్ద పందిరి వేయించాను.
సన్నాయి మేళం, బెంచీలు, కుర్చీలు, వంట వాళ్ళూ.....అన్ని చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశాం.
ఆవిడ వచ్చేసరికి నేను తప్పుకునేదాన్ని.
దగ్గర దగ్గర మూడువందల మందిని భోజనాలకి పిలిచాం. ఫీల్డులో వున్న ఆర్టిస్టులు, డైరెక్టర్లూ, ప్రొఫెసర్లూ చాలామందిని ఆహ్వానించాం. ఎక్కువ హడావుడి చెయ్యడం, డబ్బు తగలెయ్యడం, గృహప్రవేశం, పూజలు - ఇవేవీ శ్రీశ్రీగారికి అసలు ఇష్టంలేదు.
"డబ్బు తగలేస్తున్నావ"ని నశిగేవారు. పూజలూ పునస్కారాలు ఆవిడ నెత్తిమీద వేసుకోవడం వల్ల నేను బ్రతికిపోయాను.
1957వ సంవత్సరం మార్చి నెలలో శ్రీశ్రీగారింటి గృహప్రవేశం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ నేనే స్వాగతం పలికి కూర్చోపెట్టాను.
శ్రీశ్రీగారికి ఇష్టం లేకున్నా - ఉదయం ఏడుగంటలకి ప్రారంభమయిన ఫంక్షన్ రాత్రి తొమ్మిది గంటలవరకూ చాలా గ్రాండ్ గా జరిగింది.
