"ఇంటిలోని పోరు ఇంతింత కాదయా - అని వేమనగారే రాశారు. నిజమేకాని. ఈ చిన్న విషయాలకి మనస్సు పాడుచేసుకుంటే ఎలాగండీ!" అని నేననగానే "అబ్బో! వేమన పద్యాలు కూడా చదివావేమిటి".
"భలేవారే! మరీ అంత చచ్చుకింద లెక్కకట్టేశారేమిటండీ. రెండో క్లాసు, మూడో క్లాసులవాళ్ళు కూడా చదువుతారు. దానికేంగానీ చూడండి. ఇక ముందు నీ యింటికి రాను. నాకు మరీ సంతోషం. నాలుగురోజులు వల్లించి తర్వాత ఆవిడే ఊరుకుంటారు. ఈ విషయాన్ని పెద్దగా ఆలోచించి బాధపడకండి. మీ యింట్లో వ్యవహారం బాగా ముదిరిందనుకోండి. నాతో చెప్పండి. నేను పని మానేస్తాను. ఇప్పుడు ఫరవాలేదు. మీ చేతిలో నాలుగయిదు పిక్చర్లున్నాయి" అన్నాను.
"నోరుముయ్యి సరోజా? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా పనిమానేద్దామా అని కాచుక్కూర్చున్నట్లున్నావు. ఏం నా దగ్గర పని నీకెంత కష్టంగా ఉందా? ఉంటే ముఖాముఖి చెప్పేయి. దానికి ఈ కుంటిసాకులెందుకు? ఇంకొకరిమీద నిందెందుకు?" అన్నారు.
"అది కాదండీ"
"ఏదికాదు సరోజా! ఎంతమంది కోసం అలా త్యాగం చేస్తూ వుంటావు?".
"ఇందులో త్యాగం ఏముందండీ? నావల్ల మీ కుటుంబంలో కలతలు లేకుండా వుండాలంటున్నాను"
"నీవల్లకాకుంటే ఇంకొకరివల్ల వచ్చేవి ఎలాగయినా వస్తాయి. వాటికి కారణాలు అక్కర్లేదు. వీడు పిచ్చివెధవ - వీడికేమీ తెలీదనుకుంటున్నావు. కానీ పొరపాటు, నాకన్నీ తెలుసు.
నా దగ్గరికి పనికి రావడానికి ముందు నీకెదురైన ప్రశ్నలు, నా గురించి అందరూ నీకు చెప్పిన మాటలు, చివరికి నా విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం, చేసిన సవాల్ - అన్నీ తెలుసు. మీ అన్నయ్య చలపతిరావుగారే స్వయంగా చెప్పారు. అందుచేత మనం ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోదాం"అన్నారు.
"అయితే పాట రాద్దామా?".
"ఈ పూటొద్దు సరోజా! మధ్యాహ్నం రాద్దాం. ఇప్పుడు పాట రాసే మూడ్ లో లేను" అన్నారు.
"మరి రాగానే పాటరాద్దామని అడిగారుగా".
"అడిగాను కానీ రాయనిచ్చావా? మాటల్లో దించావు. నీ మాటలతో నా మనస్సు కాస్త కుదుటపడింది. ఏవయినా విషయాలు చెప్పు" అన్నారు.
"ఏవున్నాయండీ".
"పోనీ మాట్లాడు".
"ఏమ్మాట్లాడనండీ. నేను మాట్లాడడానికి ఈ డబ్బింగ్ విషయాలు తప్పితే మరేమీ లేవు" అన్నాను.
"అన్నట్టు చూశావా మరచిపోయాను. మా ఆవిడ గృహప్రవేశానికి ముహూర్తాలు చూస్తోంది" అన్నారు.
"ఇల్లు ఎన్నాళ్ళలో పూర్తవుతుందని" అడిగాను.
"మరో నెల్లాళ్ళలో అయిపోవచ్చు".
"చాలా మంచి మాట చెప్పారు" అన్నాను.
"ఈరోజు శర్వాణీ పిక్చర్స్ కి వెళ్ళాలి. అక్కడ పాట రాయాలి. నువ్వూ వస్తావా?"
"స్ట్రయిట్ ప్క్చార్ పాటకి నేనెందుకండీ" అన్నాను.
"ఫరవాలేదు రా" అన్నారు.
మధ్యాహ్నం ఆ కంపెనీకి వెళ్ళాం. ఆ పక్కవీధిలోనే శ్రీశ్రీగారు ఇల్లుకడుతున్నారు. సాయంకాలం అయిదు గంటలప్పుడు వారి యింటికి వెళ్ళాం. ఆవిడ పక్కనున్న కొట్టుకి వెళ్లారట.
ఇల్లంతా అయిపోయింది. వంటిల్లు అనుకున్నట్లుగా ప్లాన్ కుదరక లోపల పని అలాగే ఆగిపోయింది. మేస్త్రిని పిలిచి, "చూడవయ్యా! అది ఇలా కట్టు. ఇక్కడ ఇది వుండాలి" అని వంటిల్లు ప్లాన్ చెప్పాను.
"చాలా బాగుందండి అమ్మాయిగారూ!" - అన్నాడు.
"నేను చెప్పానని మీ అమ్మగారితో చెప్పకయ్యా నాయనా" - అని చెప్పేసి శ్రీశ్రీగారితో పాటు శర్వాణీకి బయలుదేరాను.
మేము వెళుతూ వుండగా దారిలో ఎదురుపడ్డారావిడ. నన్ను చురచుర చూశారు.
నేను దగ్గరగా వెళ్ళి "నమస్కారమండీ బాగున్నారా?" అని అడిగాను.
"ఎక్కడికి వెళ్ళివస్తున్నార"ని అడిగారావిడ.
"మీ ఇల్లు చూడడానికండీ" అన్నాను.
"మీ అమ్మగార్ని వెంటేసుకొని రావడం మానేశావేమిటని" అడిగారు.
"ఆవిడ మీకంట పడకపోవడం మా దురదృష్టం. అటువంటి పొరపాట్లు ఎప్పుడూ చెయ్యనండీ" - అన్నాను.
చిన్న చిన్న విషయాలకీ మనుష్యుల్లో అంత పెద్ద మార్పులా అని ఆశ్చర్యపోయాను.
భార్యాభర్తలిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు.
"అయితే రారన్నమాట" అని ఆవిడంటున్నారు.
"కంపెనీకి వెళ్ళివస్తానన్నానుగా" అంటూ మాతో వచ్చేశారు శ్రీశ్రీగారు. నేనేమీ అడగలేదు.
అలా దినం విడిచి దినం, కడుతున్న యింటికి వెళ్ళి చూసేవాళ్ళం. ఒకరోజు ఆవిడ శ్రీశ్రీగారితో "ఈవిడ్ని కూడా ఎందుకిక్కడికి తీసుకురావడం? మీరూ మీరూ బయట ఎలాగయినా పోండి. మీ ఇద్దరూ కలసి నా గుమ్మంలోకి మాత్రం వస్తే నేనొప్పుకోన"ని అనడం విన్నాను.
నిజమే! ఆవిడ్ని ఎందుకు బాధపెట్టాలి? అందువల్ల మనకొచ్చే లాభం ఏమిటి? అనుకుంటూ వారితో చెప్పకుండా ఆఫీసుకి వచ్చేశాను. పదినిముషాల తర్వాత వారు కూడా వచ్చేశారు.
"నాతో చెప్పకుండా ఎందుకొచ్చేశావు?".
"భలేవారే! మండుతున్న అగ్నిలో ఇంకా ఆజ్యం పోయమంటారా?".
"అంటే దాని మాటలు విన్నావన్న మాట".
"అబ్బ! ఆ సంగతి మరచిపోండి" అన్నాను.
"ఆవిడ మాటలు నీకు కష్టం అనిపించలేదూ?".
"కష్టం ఏముందండీ. ఆ స్థితిలో ఎవరున్నా అలాగే మాట్లాడ్తారు ఆ మాత్రం అర్ధం చేసుకుంటే ప్రాబ్లమ్స్ వుండవు" - అన్నాను.
చాలా దీక్షగా ఆలోచిస్తూ వుండిపోయారు.
* * *
మర్నాడు ఆఫీసులో కూర్చొని, "ఈరోజు కారు వస్తోంది సరోజా!" అన్నారు.
"అరె నాకు చెప్పనేలేదే" అన్నాను.
ఏమ్మాట్లాడలేదాయన.
"కొత్త కారేనా?" అనడిగాను.
"అదేమిటలా అడుగుతున్నావు?"
"సడన్ గా చెప్పారు కదా! సెకండ్ హేండేమో అనుకున్నాను"
"కాదు. నెల్లాళ్ళకిందటే స్టేండర్డ్ కంపెనీ (మౌంట్ రోడ్డు)లో బుక్ చేశాను".
"కంగ్రాట్యులేషన్స్! చాలా మంచి కబురు చెప్పారు. నాకు చాలా సంతోషంగా వుంది" -అని అన్నానే కానీ, 'దాని ఖరీదెంత, నాకీ మాట ముందుగానే ఎందుకుచెప్పలేదు' అన్న విషయాలేవీ అడగలేదు. నాకు అవసరమని నా ఉద్దేశం. శ్రీశ్రీగారు ఇక మీద స్వంతకారులో వస్తారన్న సంతోషం ఒక్కటే చాలు - అనుకున్నాను.
"ఏమిటాలోచిస్తున్నావు" అనడిగారు.
"అంటే - మధ్యాహ్నం కంపెనీలో పనిలేదన్న మాట".
"అవును ఇద్దరం కలసి వెళ్ళి కారు తీసుకొద్దాం" అన్నారు.
"ఏం మీ ఆవిడ రారా?".
"కారు కోసం కంపెనీ చుట్టూ వారం రోజులై కాళ్ళు అరిగేలా తిరుగుతోంది. అది అక్కడే వుంటుంది. ఇక్కడ్నుండి మనిద్దరం వెళదాం" అన్నారు.
"చూడండి. శుభమా అంటూ కారు వస్తూంది. నన్ను తీసుకువెళ్ళి ఆవిడ మనసు బాధపెట్టకండి, ఇటువంటి మర్యాదలకోసం నేను ఎదురుచూడలేదు, చూడకూడదు" కూడా.
"అయితే మధ్యాహ్నం ఇక్కడికే ఇద్దరం వచ్చేద్దాం. ఇక్కడినుండే నేను అయిదు గంటలకి వెళ్ళి కారు తీసుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాను" అన్నారు.
"అలాగే"
* * *
మూడు గంటలకే ఆఫీసులో కూర్చున్నాం. ఆయన దృష్టంతా కారు మీదే వుందని గ్రహించను. అప్పుడే శర్వాణీవాళ్ళు 'అక్కచెల్లెళ్ళు' చిత్రం తీస్తున్నారు. ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదనుకుంటా.
కంపెనీవాళ్ళు కారు ఇచ్చారు. శ్రీశ్రీగారు నన్ను అక్కడే వుండమని చెప్పి కంపెనీ డ్రైవర్ సుబ్బారావుని తీసుకువెళ్ళారు. వారు వెళ్ళగానే ఆఫీసుబాయ్ ని పిలిచి పెద్ద పూలమాల, రెండు కొబ్బరికాయలు, ఊదొత్తులు, కర్పూరం, ఒక కిలో స్వీట్లు తెమ్మని నూరు రూపాయలిచ్చి పంపాను. వాడు సైకిల్ మీద వెళ్ళి త్వరగా వచ్చేశాడు. అన్నీ సిద్దంగా వుంచాను.
