Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 48


    ఆ తరువాత కామినీ కూడా పొరపాటుకి నాలుక కొరుక్కోక తప్పలేదు.
    అనుకోకుండా ఇరురువు పొరపాటున బయటపడి పోయారు. పూర్తిగా కాకపోయినా ఆ తరువాత కొన్ని విషయాలు మాట్లాడుకోక తప్పలేదు.
    "నీకీ విషయం ఎవరు చెప్పారు? కిరణ్ చెప్పాడా! రావుగారు చెప్పారా! చెబితే ఏమని చెప్పారు? ఏమని అడిగారు?" అని కామినీ అడుగుతూంటే, జవాబుగా.
    "నామీద నమ్మకం లేకనేగా నాదగ్గర నువ్వు ఈ రహస్యం దాచింది. హత్యా రహస్యం గురించి ఆ మాత్రం నేను తెలుసుకో లేననుకున్నవా! రావుగారు చెప్పారో, కిరణ్ చెప్పాడో, మరెవరో చెప్పారో, వల్లకాట్లో రామనాధం చెప్పాడో. ఎవరో ఒకరు చెప్పారు. నాకు తెలిసింది. ఇది లక్షలతో కూడిన  వ్యవహారం." అన్నాడు దామోదరం.
    ఇద్దరూ డైరెక్టుగా మాట్లాడుకోక పోవటముతో పైగా కొన్ని కల్పితాలు చేర్చడంతో అసలు విషయం బైటికి రాకపోగా అనుమానాలు ఎక్కువయ్యాయి వారిమధ్య.
    శాలిని హత్య, కత్తిపోట్లు, ఫోటోలు అలా పొడి పొడిగా దామోదరం అంటూంటే లేని ఫోటోలు, రక్తము చిందకుండా జరిగిన అనిత హత్య గుర్తుకు వచ్చాయి కామినీకి. చాటుగా చాలా పెద్ద గొడవే జరుగుతున్నది అనుకుంది కామిని.
    అరగంట తరువాత డైరెక్టుగా రంగంలోకి దిగారు.
    "మనిద్దరి మధ్యా రహస్యాలు ఉండకూడదంటే, ఆ ఫోటోలు, క్యాసెట్లు నాకివ్వు." అన్నాడు దామోదరం.
    "ఫోటోలు లేవు, క్యాసెట్లు లేవు, నా కల్పన అది" అంది కామిని.
    కామినీకి తనకి ఇవ్వటం ఇష్టంలేక అలా అబద్దము ఆడుతున్నది అని గ్రహించాడు దామోదరం.
    "నీ మామ మొత్తం ఆస్తి కలిసి 50 లక్షలు వుంటుందేమో. ఇంకా ఎక్కువ ఉండచ్చునేమో నాకు తెలియదు. ఆ లక్షలేకాక ఇంకా లక్షలు కావాలంటే మనం సంపాయించవచ్చు, ఫోటోలు, క్యాసెట్లు బయటపెట్టు" కామినీకి అంతా అర్ధమైపోయింది.
    "ఇంట్లో వాళ్ళుకాక మరో క్రొత్త మనిషి ఈ విషయంలొ తల దూర్చాడు" అని మాత్రం గ్రహించింది కామిని.
    వాళ్ళ వాదన ఎంతకీ తెగలేదు. నిజం చెప్పుకోలేదు. ఒక నిర్ణయానికి రాలేదు.
    "బాబాయ్! ఆశతో చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు. ఏదన్నా జరగరానిది జరిగితే నీతోపాటు నేను కూడా ఇరుక్కోవలసి వస్తుంది. మనం ఒకరిని ఒకరు నమ్ముకోక మన గొయ్యి మనమే తీసుకుంటున్నాం. కాస్త ఆలోచించు. ఇవాళ రేపు గడువిస్తున్నాను. బాగా ఆలోచించి ఏ విషయమూ నాతో చెప్పు. నేను మాత్రం నీతో నిజమే చెప్పాను. నేను మా యింట్లో వాళ్ళుకాక, పరాయి మనిషి వచ్చి నిన్ను కలుసుకుంటే మాత్రం మనం మృత్యువుకి మూడు అంగుళాల దగ్గరలో ఉన్నట్టు" అని చెప్పి కామినీ బయటకు వచ్చేసింది.
    "ఇదొహ బెదిరింపు" అనుకున్నాడు దామోదరం. అంతేకాక ఈ విషయాలన్నీ పాండేకు వెళ్ళి చెప్పాడు కూడా మరొకసారి నీ ప్రయత్నం నువ్వు చేయి గట్టిగా అన్నాడు పాండే.
    విచిత్రంగా ఆ రాత్రికే క్యాసెట్, ఫోటోలు తన యింట్లోనే దొరికాయి దామోదరానికి. శాలినీని కిరణ్ కత్తితో పొడుస్తూన్న ఫోటోలు. చాలా చక్కగా ఫోటోల్లో పడ్డాడు కిరణ్. మొత్తం ఆరు ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలను చూడంగానే దిక్కుమాలిన ఐడియా ఒకటి దామోదరానికి వచ్చింది. "రెండు ఫోటోలు రావుగారికి అమ్మి మిగతా ఫోటోలన్నీ పాండేకి యిస్తే ఎలా ఉంటుంది? ఎడా పెడా డబ్బు వస్తుంది కదా!"
    ఆ విషయం గురించి ప్లాన్ వేసుకుంటూ కూర్చున్నాడు దామోదరం.
    
                                  29
    
    దామోదరం రావుగారికి ఫోన్ చేశాడు.
    "ఫోటోలు దొరికాయి కాని క్యాసెట్ దొరకలేదు. ఫోటోలు అయినా రెండే దొరికాయి. కామినీ చాలా తెలివిగలది. బహుశా మిగతా ఫోటోలు మరో చోట, నెగిటివ్ లు వేరొకచోట, క్యాసెట్ ఇంకొకచోట దాచి ఉంటుంది. రేపు, ఎల్లుండిలో వాటిని సంపాదిస్తాను. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు ఇస్తాను. తీసుకోండి. మీరు వచ్చేటపుడు పాతికవేలు తీసుకురండి ఎడ్రస్ చెబుతున్నాను వివరంగా నోట్ చేసుకోండి. మీరు పాతిక వేలతో ఒంటరిగా రండి" అంటూ దామోదరం ఆ యింటి అడ్రస్ యిచ్చాడు.
    "ఫోటోలో మా కిరణ్ బాగా గుర్తుపట్టేటట్టు ఉన్నాడా! ఏదీ కాస్త వర్ణించు!" అన్నాడు రావుగారు.
    దామోదరం వర్ణించి చెప్పాడు.
    "అర గంటలో అక్కడ వుంటాను పాతిక వేలతో సహా" అన్నాడు రావుగారు తరువాత ఫోన్ పెట్టేశాడు.
    ఆ సమయంలొ కిరణ్ ఆయన ప్రక్కనే వున్నాడు.
    "కిరణ్! నువ్వు ఎప్పుడూ ఎవరినీ కత్తితో పొడిచి చంపలేదు కదూ!" అన్నాడు.
    "లేదు డాడీ! అనితను తప్ప నేను ఎవరినీ కూడా చంపలేదు!"
    "కిరణ్! దామోదరం మన్ని మోసంచేస్తున్నాడు. నువ్వు శాలినీ అనే అమ్మాయిని కత్తితో పొడిచి చంపుతుండగా తీసిన ఫోటోలు రెండు దొరికాయట. పాతికవేలు తెమ్మని, ఆ ఫోటోలు ఇస్తానని ఇప్పుడే చెప్పాడు. వాడి అంతేదో నేనే తేల్చుకోదలచుకున్నాను. పాతికవేలు తీసుకుని రివాల్వర్ తీసుకుని నేను వెళుతున్నాను. ఇది నేను ఒక్కడినే ఎదుర్కుంటాను. నేవెళ్ళిన అరగంటకి నీవు బయలు దేరి అక్కడికిరా! మనిద్దరం కలిసి వాడి అంతుచూద్దాం. ఒకవేళ నేను ప్రమాదంలో పడితే నన్ను రక్షించటానికి నిన్ను రమ్మంటున్నాను. నువ్వు వచ్చేటప్పుడు మినీ రివాల్వర్ తీసుకునిరా! అటువాడిని ఆ తరువాత ఇక్కడి ఈ కామినీ పిశాచాన్ని చంపిపారేశానంటే కధే వుండదు." అని మరికొన్ని జాగ్రత్తలు చెప్పి రావుగారు బయలుదేరి వెళ్ళిపోయారు.
    రావుగారు వెళ్ళిన అరగంటకి కిరణ్ బయలుదేరివెళ్ళాడు.
    కామిని ఇంట్లోలేదని గట్టిగా తెలియడంవల్ల ఫోన్ వచ్చిన కంగారులో రావుగారు కిరణ్ మాట్లాడుతూవుండగా కామినీ రావడం, పొంచి వినడం జరిగింది. ఆ సమయంలో కామినీవారి ఎదుట పడదలచుకోలేదు. ఆవేశంలొ హతమార్చినా హతమార్చవచ్చు అని. అప్పటికి కామిని ప్రక్కకు తప్పుకొని, కిరణ్ బయలుదేరినపుడు, అతనికి తెలియకుండా బయలుదేరింది అతనివెంట.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS