అసహనంగా చూశాడు శివ, అసలు సంగతి వదిలేసి ఈ బాదుడు ఏమిటో అర్ధంకాక ఏదో అనబోతుండగా అర్ధం చేసుకున్న రాఘవ "ఒక్క నిజం సర్" అన్నాడు అప్పారావుని చూస్తూ.
"మేం అలా ఓ అయిదు నిమిషాలు బయటికి వెళ్ళొస్తాం"
"మంచిది. ఈలోగా నేను పాయింటుని మధిస్తుంటాను. వెళ్ళిరండి" అన్నాడు అప్పారావు బయటికి వెళుతున్న శివా, రాఘవల్ని చూస్తూ.
గది దాటి పది అడుగులు వచ్చాడో లేదో యిక నిభాయించుకోలేనట్టు అరిచాడు శివ. "మీ అందరి చచ్చు సలహా మీద అప్పారావుని రచయితగా పెట్టుకున్నందుకు ఇప్పుడు రిపెంట్ అవుతున్నాను."
"ఆ మాట డైరెక్టుగా అతని ముందే అనేట్టున్నావని నిన్నిలా లాక్కొచ్చాను" నచ్చచెబుతున్నట్టుగా అన్నాడు రాఘవ.
"కథ చర్చించక ఆయనేమిటి......"
"తప్పదు శివా......అప్పారావు చాలా పేరున్న సినిమా రచయిత".
"అంటే అతడి సోదిని భరిస్తూ కూర్చోవాలా?"
"అదికాదు శివా.....అప్పారావుతో నీకు పరిచయం అట్టే లేక అలా మాట్లాడుతున్నావు కాని అతనెంత బిజీ రైటరో నీకు తెలుసుగా."
"బుల్ షీట్....నాకు ఆన్ బేరబుల్ గా వుంది"
విసుగ్గా కణతలు నొక్కుకున్నాడు. "ఉదయం ఎనిమిది గంటలకి హోటలుకి వస్తాననిచేప్పి రూం బుక్ చేయమని పదకొండు గంటల కొచ్చాడు. వచ్చిన దగ్గర్నుంచి తన గొప్పతనం గురించి బాజా వాయిస్తూ రెండు ఐస్ క్రీంలు తిన్నాడు. ఆనక సరిపడా భోంచేసి మళ్ళీ తనెన్ని సూపర్ హిట్సు రాసిందీ లెక్క చెబుతూ రెండు బిరియానీ పేకెట్సు పార్శిల్ చేయించి యింటికి పంపించాడు. ఏమిటిదంతా?"
"ఇండస్ట్రీ" టక్కున జవాబు చెప్పాడు రాఘవ. "అవును శివా! ఇది సినిమా యిండస్ట్రీ. ఇక్కడ గుర్తించేది సక్సెస్ ని. నీ మేధస్సుని కాదు. అందుకే అపాయింట్ మెంటిచ్చిన టైంకి గంటల ఆలస్యంగా వచ్చినా భరించాలి. విషయం వదిలి మరోదాని గురించి వూదరగొడుతున్నా తట్టుకోవాలి. నిజానికి అతను రాసింది వంద సినిమాలయితే అందులో ఇరవై దాకా సూపర్ ప్లాపులే. అయినా వాళ్ళు ప్లాపుల సంగతి మాట్లాడరు. ఖర్మ కాలి సక్సెస్ అయిన సినిమాలు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందీ చెబుతారు. ఒక వేళ ప్లాపు సినిమా సంగతి మనం కదిపితే ఆ కథని సరిగ్గా హేండిల్ చేయలేక దర్శకుడి నాశనం చేసాడని డైరెక్టర్లని తిడుతుంటారు. ఎందుకంటే సక్సెస్ ని సొంతం చేసుకోవడం యీ సినిమా రంగంలో అందరూ చేసే పనే కాబట్టి."
ఫెయిల్యూర్ ని బాస్టర్ద్ చైల్డ్ గా తిరస్కరించి, సక్సెస్ ని దొరికిన అనాథబిడ్డగా అందరూ అక్కున చేర్చుకునే మనస్తత్వం గల సినిమారంగం గురించి నచ్చచెబుతుంటే రాఘవకేసి కొన్ని క్షణాలపాటు యిబ్బందిగా చూస్తూ నిలబడిపోయాడు శివ.
"ఎందుకో నేను రాయించాలనుకున్న కథకి అప్పారావు కరెక్టు రచయిత కాదేమో అనిపిస్తుంది."
"కాస్త ఓపికపట్టు శివా.....నా మాట విను. నువ్వు కొత్తగా డైరెక్టరువవుతున్నావు కాబట్టి నీకు కొందరు సీనియర్ టెక్నీషియన్స్ అవసరం."
రాఘవ స్టేట్ మెంట్ తప్పుకాదు. ఈ సినిమా రంగంలో సినిమా లని కొని విడుదల చేసే 'బయ్యర్స్' ముందు హీరో ఎవరో చూస్తారు. తర్వాత డైరెక్టరు, ఆనక తక్కిన నటులు, టెక్నీషియన్స్ ని చూసి సినిమా లను కొనడానికి ఉత్సాహం చూపుతారు. అది ఆనవాయితీ. అలా అంతా తరచి చూశాక కొనబడ్డ సినిమాలు అన్నీ హిట్సు అవుతాయని కాదు.
"వెళదామా?" సాలోచనగా అన్నాడు శివ.
అప్పటికి అరగంటయ్యింది గది నుంచి బయటికొచ్చి.
ఈపాటికి అప్పారావు కొద్దో గొప్పో కథ ఆలోచించి వుంటాడేమో అని శివ పొరపాటు పడివుంటే అది అతని తప్పుకాదు. సినీ రంగపు కాలుష్యం అంటని వ్యక్తి కావడంతో ప్రతి నిమిషాన్నీ ఉత్పాదకంగా మార్చుకునే తపన గలవాడు కావడంతో అలా నిజాయితీగా ఆలోచించాడు.
గదిలోకి వస్తూనే షాక్ తిన్నట్టు నిలబడిపోయాడు శివ.
గురకపెట్టి నిద్రపోతున్నాడు అప్పారావు. రోజుల తరబడి తిండిలేనట్లు సుష్టిగా భోంచేసి, వారాల తరబడి నిద్రకి నీడ దొరకనట్టు ఏ.సి. రూంలో ఆదమరచి నిద్రపోతున్నాడు.
నిద్ర లేపుదామనుకుంటూ శివ ముందుకు కదలబోయేంతలో వారించాడు రాఘవ. "నీకిది కొత్తగాని మాకివన్నీ మామూలేరా. ఓ ప్రొడ్యూసర్ అకౌంట్ లో రూం బుక్ చేయించడం, అక్కడ గదిలో విశ్రమిస్తూ మరో ప్రొడ్యూసర్ కథ గురించి ఆలోచించడం, అలా ఆలోచిస్తూ నిద్రపోవడం కొత్త కాదు."
"ఇక్కడ అలవాట్ల గురించి నేను మాట్లాడ్డం లేదు రాఘవా, అని నాకు అనవసరం కూడా కానీ నాకంటూ కొన్ని పద్దతులు కావాలి."
