Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 50


    "కాస్త ఓపిక పట్టరా బాబూ!"
    "అదికాదు రాఘవా! సాధ్యమైనంత త్వరగా మొదలు కావాల్సిన సినిమా నాది. ఇలా అయితే కథెప్పుడు పూర్తయ్యేది?"
    "తప్పకుండా అవుతుంది శివా కథకి సంబంధించి సినిమారంగంలో రెండు రకాల అలవాట్లున్నాయి. హీరోగారిచ్చిన డేట్సు దగ్గర పడేదాకా అద్భుతమైన కథా చర్చలు జరుగుతున్నత్గ్టు పోజు పెట్టి హోటలు బిల్సు పెంచేసుకుని రోజులో ఓ గంటపాటు కథ మీద గావుకేకలు పెట్టి చివరికో చచ్చు కథలో కాంప్రమైజ్ కావడం ఒక పద్దతి అయితే ముందే 'కథ ఇలా వుండాలి' అని క్లుప్తంగా ఓ పాయింట్ అనుకుని ఆనక దాన్ని సినిమా విడివికి తగ్గట్టుగా రాసే పద్దతి మరొకటి. నిజానికి మంచి పద్దతి రెండోదే. కారణం మనకంటూ రాజ్యంగారి కథనే పాయింటుంది కాబట్టి దాన్ని సులభంగా డెవలప్ చేయొచ్చుగా అందుకని నువ్వేం కంగారుపడకు."
    గభాలున లేచాడు అప్పారావు ఎవరో చాచి తన్నినట్టుగా.
    ఉలికిపడి చూశారు శివా, రాఘవలిద్దరూ.
    ఎదురుగా నిలబడ్డ యిద్దరు యువతుల్ని చూసి కొంత, తను ఎంతసేపు నిద్రపోయాడో అర్ధంకాని గిల్టీనెస్ తో మరికొంత అప్పారావుని అణువంత కంగారులోకి నెట్టడంతో "అద్భుతమైన ఫ్లేష్ మెదిలిందీ" అన్నాడు అర్జెంటుగా కథకి ఉపక్రమిస్తున్నట్టుగా.
    "అవును శివా.....గొప్ప ఫ్లాష్ లాంటి ట్రాక్ వచ్చేసింది" రెట్టించాడు అప్పారావు.
    "నిద్రలోనే?" రాఘవ నిశ్చేష్టతగా అడిగాడు.
    "ఛ ఛ నేను నిద్రపోయానా?.....ఆలోచిస్తున్నాను"
    అప్పారావు సమర్ధింపుతో ఎంత ఒళ్ళు మండిపోయిందీ అంటే శివ యిక నిగ్రహించుకోలేకపోయాడు. "ఇంత కాలానికి ఓ కొత్త విషయం బోధపడింది."
    "ఏమిటి?" అప్పారావు అడిగాడు.
    "ఆలోచనల్లో సైతం మనిషి గురకపెడతాడని."
    "కరెక్ట్..... నిజమే" తను చెప్పిందే వేదమన్న ఆలోచనల్ని ధృవ పరుస్తూ అన్నాడు అప్పారావు. ఉద్రేకపూరితమైన కథ ఆలోచించేటప్పుడు నాకు ముందు గురకలా వస్తుంది."
    "ఎదుటి మనిషికి అది గాలి పీల్చే విండ్ పైప్ బ్లాకవడంతో గురక పెడుతున్నాడేమో అనిపిస్తుంది. దానితో బహుశా నిద్రపోతున్నారని పొరపాటు పడుతూంటారు" శివ చాలా సిన్సియర్ గా ఈ మాట అనడంతో అందులో శ్లేష అర్ధంకాని అప్పారావు అభినందనగా శివాని పేట్ చేశాడు.
    "నీకు మంచి భవిష్యత్తుంది. ఇది నిజం.....ఇలా మోడరన్ గా ఆలోచించే కుర్రాళ్ళని చూస్తే నాకు మంచి వూపు వస్తుంది. ఒకసారి యిలాగే ఓ పెద్ద డైరెక్టరు కథ రాయమంటూ నా వెనుక ఆరునెలలపాటు తిరిగాడు. అప్పటికీ నా అరవయ్యేడో చిత్రం 'ఆదెమ్మ అప్పడాల కర్ర' వంద రోజులు పూర్తిచేసుకుని సిల్వర్ జూబ్లీవైపు దూసుకుపోతూంది. నాకు ఓ మంచి కథ రాసిపెట్టండి అని నా పాదాల దగ్గర కూర్చుని కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు."
    శివ మొహంలో రంగులు మారటాన్ని గమనించిన రాఘవ అదే విషయం అప్పారావు ఆరుసార్లు చెప్పాడన్న విషయం గుర్తుచేస్తూ "పొద్దుట చెప్పారిదంతా" అన్నాడు కోపాన్ని అదిమి పెట్టుకుంటూ.
    "కానీ మీకు పూర్తిగా చెప్పలేదు. "ఇలాంటి గొప్ప పాయింటు మిస్సయితే యువదర్శకులకి భవితవ్యం వుండదన్నంత ధీమాతో చెప్పుకు పోయాడు అప్పారావు. "కాళ్ళెందుకు పట్టుకుంటావు కథ రాస్తానుగా అంటే నేను పట్టుకున్నది మీ కాళ్ళు కాదండీ..... సరస్వతిదేవి పాదాల్నే అన్నాడు. నాకు చాలా ముచ్చటేసింది."
    "వెంటనే ఆరుకోట్లు బిజినెస్ చేసిన గొప్ప కథ రాసిచ్చారు" రాఘవ పొద్దుట అప్పారావు చెప్పిన దానికి రెండు కోట్లు పెంచి చెప్పాడు.
    "అవును..... ఆ సినిమాతో ఆ దర్శకుడు జతహకం మారిపోయింది. ఇప్పుడా డైరెక్టరు ఎవరో నేను మీకు చెప్పనవసరం లేదనుకుంటాను."
    రాఘవ అవునూ అనబోయేంతలో అప్పారావు మళ్ళీ అందుకున్నాడు. "అయితే ఆ సినిమా వందరోజుల ఫంక్షనులో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.....అది...."
    "సర్!" శివ సీరియస్ గా అన్నాడు. "మనం మన కథ గురించి మాట్లాడుకుందాం."
    "తప్పకుండా" దృఢంగా అన్నాడు అప్పారావు.
    "మనం వచ్చింది మన కథ గురించి కాబట్టి మతులుపోయే గొప్ప కథని మనం తయారుచేద్దాం.... ఆ విషయం నాకు వదిలెయ్."
    తన సోది తప్ప ఎదుటి మనిషి మూడ్ గురించి ఆలోచించే స్థితిలో లేడు అప్పారావు....ఈ మాత్రం పరిశీలన లేని వ్యక్తి యింత పాపులర్ రైటర్ ఎలా అయ్యాడా అని శివ తల పట్టుకుని ఆలోచిస్తుంటే ఇందాకటి ఊపులోనే అప్పారావు చెప్పుకుపోయాడు. "ఆ వందరోజుల ఫంక్షన్ లో డైరెక్టరు నన్ను స్టేజ్ మీదికి పిలుస్తూ 'అన్నయ్య వేదిక నలంకరించాలి' అన్నాడు. ముందు నాకు అర్ధం కాలేదు. మిమ్మల్నే అన్నయ్యగారూ అంటూ యీసారి తను స్వయంగా క్రిందకివచ్చి నా చేతులు పట్టుకున్నాడు. ఆ క్షణంలో అప్పుడప్పుడు ఆ డైరెక్టరు నా పాదాలు పట్టుకున్న సీను గుర్తుకొచ్చింది. పరవశంగా కావలించుకున్నాడు. వేదికపైకి నేను వెళ్తూంటే ఒకటే చప్పట్లు. అక్కడ ప్రతివాళ్ళూ నన్ను ఉద్దేశించి ఏం మాట్లాడినాగాని సదరు డైరెక్టరు అన్న మాటలు యిప్పటికీ మరిచిపోలేనివి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS