"శివా" ఆర్తిగా చేతులు పట్టుకుంది అలివేలు. "మీరిలా ఆలోచిస్తే సుకృతి తట్టుకోలేదు."
"నేనెవర్ని?" ఓ ప్రశ్న మిస్సైల్లా అతడి పెదవులనుంచి దూసుకొచ్చింది. "నేనేం ఆలోచిస్తే మాత్రం సుకృతికి ఏమిటని.....తన జీవితం తన యిష్టం."
"అదికాదు శివగారూ....ఈ సినీ మాయా ప్రపంచంలో తను ఎలా బ్రతికినాగాని నాకు తెలిసీ సుకృతి కొత్త కోణంలో చూస్తున్నదీ, చూడాలనుకుంటున్నదీ మిమ్మల్నే" నచ్చచెప్పబోయింది.
"కానీ....." అర్దోక్తిగా అన్నాడు. "ఆ టాపిక్ వదిలేద్దాం అలివేలు గారూ..... చాలా స్వల్ప పరిచయం నాది. సుకృతిని శాసించటానికి నాకు అధికారమేముందని? కానీ ఒక్క విషయం.....పతనం అన్నది మానసికమా లేక శారీరకమా అన్న మీమాంస అటుంచితే పతనాన్ని జీవితంగా మార్చుకుని అందులో సుఖంగా బ్రతుకుతున్నట్టు తనను తాను మభ్యపెట్టుకోవద్దని మీ మాటగా చెప్పండి."
"అదికాదు శివా.....అసలు సుకృతి పతనం కావటానికి కారణం రాజ్యంగారి పరిస్థితి.
"క్షమించండి ప్రపంచంలో యిలాంటి సమస్యలున్నది కేవలం సుకృతికి మాత్రమే కాదు....అందరూ సమస్యల పరిష్కారానికి సుకృతి ఎంచుకున్న మార్గాల్లోనే ప్రయాణం చేయడంలేదు. తను వెంటనే పతనం కాకపోతే రాజ్యంగారి ట్రీట్ మెంట్ కి డబ్బు దొరికేది కాదని మీరంటే నా జవాబు ఒక్కటే..... ఓ చావులాంటి జీవితం కోసం మరో జీవితాన్ని చంపుకోవడం జీవచ్చవంలా బ్రతకడం మరీ దారుణం."
శిలలా నిలబడిపోయింది అలివేలు.
శివ వ్యక్తిత్వం ఏదయినా కాని యిప్పుడు సుకృతిని పూర్తిగా అపార్ధం చేసుకున్న స్థితిలో నిలబడి మాట్లాడుతున్నాడు.
నిన్నగాక మొన్నటిదాకా సుకృతి, శివల విషయంలో అలివేలుకే మన్న ఓ ఆలోచన వుంటే అది కాస్తా చెదిరిపోయిన క్షణమది.
"ఈ సినిమాలో సుకృతి వుంటుందా?" అనుమానాన్ని నివృత్తి చేసుకుంటున్నత్తుగా అడిగింది అలివేలు.
"ఎందుకలా అనుకుంటున్నారు?"
చెప్పటానికి సంశయించలేదు అలివేలు "సుకృతి మీ దృష్టిలో దిగజారిన ఆడపిల్ల కాబట్టి."
నిర్వేదంగా నవ్వాడు. "మీరలా డౌటు పడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే నేరస్తులు ప్రయాణం చేసే రైలు బోగీలో అందరితోబాటు నేనూ ప్రయాణం చేయక తప్పదనేటంతదాకా రాజీపడటం నాకు అలవాటు కాబట్టి."
అలివేలు మనసు చివుక్కుమంది. శివ దృష్టిలో సుకృతి యింత దిగజారిపోయిందేం?
"ఎంత కాదనుకున్నా సుకృతి చాలా శ్రమపడి నాకీ అవకాశం యిచ్చింది అలివేలుగారూ కాబట్టి యీ సినిమాలో సుకృతి వుంటుంది. నేనూ వుంటాను. కాకపోతే ముందనుకున్న సబ్జెక్టు వుండదు."
"అదేం?"
"ఇప్పుడు నేను ప్లాన్ చేయాలనుకుంటున్నది మరో సబ్జెక్టు కాబట్టి."
"అంటే?"
"సినిమా రంగంలో పతనం కాకుండా పైకెదిగిన ఓ ఆడపిల్ల జీవితం ఎలా వుండాలీ అన్నది నా సినిమా యితివృత్తం కాబోతూంది అలివేలు గారూ.....అందులో ముఖ్యపాత్ర సుకృతిది అవుతుంది. నేనూ, పావని మిగతా పాత్రలమవుతాం" ఆ తర్వాత శెట్టిని ఒప్పించడం కష్టం కాలేదు శివకి.
ఎంతో ఎదిగి చివరికి ఆర్ధికంగా, నైతికంగా పతనమైన ప్రముఖనటి రాజ్యం కథ సినిమాలాగా తీస్తానన్నాడు. ఆ మరుసటి రోజునుంచే కదా చర్చలకి మరో రచయితతో కూర్చున్నాడు.
తను రాసేవాడే....
కానీ సినిమా రంగం కాలుష్యం గురించి తెలిసిన మరో అనుభవజ్ఞులైన రచయిత అవసరమనిపించింది.
అందుకే ప్రముఖ సినీరచయిత అప్పారావుతో కథా చర్చలు ప్ర్రారంభించాడు వెంటనే.
* * * *
"తప్పకుండా ఓ మహత్తరమైన కథ వ్రాస్తాను" హామీ యిచ్చాడు. నలభయ్యేళ్ళ ప్రముఖ సినీ రచయిత అప్పారావు శివని చూస్తూ "అంతేకాదు ప్రేక్షకులు యీలలు, చప్పట్లతో అదిరిపడే ట్రెండ్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాసి నువ్వు వందరోజుల షీల్డు అందుకునేట్టు చేస్తాను.
అప్పారావు కోసం ఓ స్టార్ హోటల్ రూం బుక్ చేసిన శివ యిప్పటికి రెండు గంటలుగా అప్పారావు స్వాత్కర్షతో వూపిరి అందక గిలగిల్లాడిపోతున్నాడు.
"అంతెందుకు ఈ రోజు ప్రముఖులైన చాలామంది డైరెక్టర్లు తొలి చిత్రానికి నాచేత కథలు వ్రాయించుకున్నవాళ్ళే.....నేను వ్రాసిన ప్రతి చిత్రమూ కనకవర్షం కురిపించింది. ఇప్పుడు నీ పిక్చరూ ఎక్కడికి వెళ్ళిపోతుంది?"
