Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 48


    "ఒకవేళ ఈ మ్యూజిక్ అక్కర్లేదనుకుంటే?"
    "ఏముంది సింపుల్. ఇవన్నీ పనిచేసేందుకి ఓ మెయిన్ వుంటుంది. దాన్ని ఆఫ్ చేస్తే సరి!"
    "నువ్వెక్కడ పడుకుంటావ్?"
    తెల్లబోయాడు ఆ ప్రశ్నకి.
    "నాకు కొద్దిగా నిద్ర వస్తున్నట్టుగా వుంది. నేను ఓ గంటో గంటన్నరో పడుకుంటాను!"
    "నేను సోఫాలో పడుకుంటాను!"
    "దట్సాల్ రైట్!" అని అటు తిరిగింది. రవి సోఫాలో కూర్చున్నాడు. అతనికామె ప్రశ్న ఎలాగో వుంది.
    "రవీ!"
    "ఊఁ"
    "నేను చెప్పేది బాగా విను. నన్ను అర్థం చేసుకో. మన పెళ్ళి హఠాత్తుగా జరిగిపోయింది. అమ్మమ్మ ఆజ్ఞ. ఆఖరి కోరిక అది. అందుకే నేను తలొంచాను. అలా అని నాకిష్టం లేందే చేయి కలిపాననుకుని అపార్థం చేసుకోవద్దు. నాకు యిష్టమూ లేదు. అయిష్టతా లేదు. ఏ భావం నేను నీపై ఏర్పరుచుకోలేదు.
    మన పెళ్ళికి యింకా వ్యవధి వస్తుందని అనుకున్నాను. కానీ మోహన్ చేసిన కుటిల ప్రయత్నంతో అది త్వరపెట్టినట్టయింది. కనీసం ఓ ఏడాది పాటయినా మనం కలసిమెలసి తిరిగి వుంటే నా మనస్సు నీపై లగ్నం చేసుకునేదాన్ని. కానీ దానికి అవకాశం రాలేదు.
    ఇప్పుడు-ఇప్పుడు-యాంత్రికంగా పెళ్ళి చేసుకున్నట్టుగా, నీతో మాటాడుతున్నట్టుగా నేను నిన్ను పంచుకోలేను.
    లెట్ మి లవ్ యు. దెన్ లెట్ మి షేర్ యు__"
    బహుశా సూటిగా ముఖంలోకి చూస్తూ చెప్పలేకపోయిందేమో అటు తిరిగి చెప్పింది. అయితే ఆ కంఠం మాత్రం నిశ్చలంగా వుంది. తడబాటు లేదు. గాబరా లేదు. బాగా ఆలోచించుకుని, నిశ్చలమైన మనస్సుతో చెప్పినట్టుగా వుంది.
    "ఇది నీకు బాధగా వుండొచ్చు. కానీ ఏం చేయాలి?  
    నేనో పిచ్చిదాన్ని అనుకో. బలవంతంగా నన్ను నీకిచ్చి చేశారనుకో. నువ్వు నా పిచ్చి నయమయ్యేదాకా వేచి వుండవూ. లేకపోతే తెలిసీ తెలియని ఆ మనస్సు సరిలేని బొమ్మతో కాపురం చేస్తావా?
    "ఉహూఁ నిన్నీ నాలుగు నెలలూ పరీక్షించాక అంతటి మూర్ఖపు పనిచేస్తాననుకోను. అవునా? మనం ఫ్రెండ్స్ లాగా వుందాం. ఫ్రెండ్స్ లాగా కలసి తిరుగుదాం. తర్వాత-తర్వాత-నా మనస్సు..."
    ఆమె పూర్తిచేయలేక పోయింది.


                                   37


    మద్రాసులో దాదాపు పదిహేను రోజులు గడిపారు. అక్కడ చూడదగ్గ ప్రదేశాలు చూశారు. అన్నిరోజులున్నా తొలిరోజు ఏ మర్యాద జరిపాడో ఆఖరి క్షణం వరకూ అలాగే వుంచాడు నాయుడు. అక్కడి నుంచి బెంగుళూరుకి బయలుదేరుతామంటే కారిచ్చి పంపాడు. అక్కడ ఓ కన్నడ ప్రొడ్యూసర్ కి రింగ్ చేసి ఓ గెస్ట్ హౌస్ లో దిగే ఏర్పాటు చేశాడు. అక్కడున్నన్ని రోజులూ ఆ ప్రొడ్యూసర్ వీళ్ళకి గైడ్ లాగా పనిచేశాడు. ఆ ప్రొడ్యూసర్ నాయుడుగారి పిక్చర్స్ ని కన్నడంలో డబ్ చేస్తూ వుంటాడు.
    సౌత్ ఇండియా అంతా పూర్తిగా తీరిగ్గా చూసాక త్రివేండ్రం నుంచి ఫ్లయిట్ లో బయలుదేరి వచ్చారు హైద్రాబాద్ కి.
    రాగానే ఇద్దరూ కలసి ఓ ఉత్తరం రాశారు ఆయనకి. ఆఖరికి అది ఓ కృతజ్ఞతా పత్రమో, సన్మాన పత్రమో అనేట్టుగా తయారైంది. ఒక్కోసారి యధార్థం చెప్పినా అది అతిశయంగానే కనిపిస్తుంది మరి.
    ఇన్ని రోజులు వాళ్ళు ఏకాంతంలో గడిపినా ఒకే బెడ్ మీద పడుకున్నా ఇద్దరు అత్యంత ఆత్మీయులైన స్నేహితులుగానో, స్నేహితురాళ్ళగానో గడిపారు.
    స్పటికం కంటే దర్పణం కంటే స్వచ్చమైంది రవి మనస్సు.
    ఓ రోజు ఊటీలో వుండగా నిద్ర మత్తులో డబుల్ కాట్ లో తనని ఆనుకుని పడుకున్న రవి మంచం వైపు దొర్లి అతనిపై చేయి వేసింది స్వప్న. తేలు కుట్టినట్టుగా, ముట్టరానిది ముట్టినట్టుగా మేలుకొన్నాడు రవి.
    మృదువుగా తామరతుండుని తొలగించినంత సుకుమారంగా ఆ చేతిని తొలగించాడు. ఇక ఆ రాత్రంతా నిదరేపోలేదు అతను.
    కానయితే స్వప్న మాత్రం హాయిగా నిదురపోయింది. అసలామెకు తను అతనిపై చేయి వేసినట్టుగా కానీ, అతను మేల్కొని తొలగించినట్టుగా గానీ గుర్తేలేదు.
    ఎక్కడో అతని అంతరాంతరాల్లో ఆమె మేలుకుని తనని పరీక్షించేందుకు అలా ప్రవర్తించిందేమోననే ఊహ మెదిలింది. కానీ అటు తర్వాత ఎక్కడా ఎన్నడూ ఆమె ప్రవర్తనలో ఆ ఛాయ కనిపించక పోవటంతో అతని అనుమానం మనస్సులోనే సమాధి అయిపోయింది.
    దాదాపు రెండు నెలలు తిరిగివచ్చేసరికి తిరిగి అంతా కొత్తగా అనిపించింది.
    ఇన్నిరోజులూ విశ్వేశ్వరంగారు ప్రతిరోజూ ఆ ఇంటి విషయాలు చూస్తూనే వున్నారు. ఇంటిలో కానీ, ఇంటికి సంబంధించి కానీ ఏ మార్పూ లేదు. అయితే ఒక్కటి మాత్రం తెలిసింది.
    అది మోహన్ కి జైలుశిక్ష విధించడం,అతను తప్పించుకోవటమూ. అతనిప్పుడు పరారీలో వున్నాడు.
    ఎక్కడున్నాడో ఎలా వున్నాడో యెవరికీ తెలియదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS