"ఎక్కడికే బయల్దేరావ్ ముసల్దానా?" అంది కామాక్షి కఠినంగా. నోటివెంబడినిప్పులు కక్కుతున్నట్లు వస్తున్నాయి ఆమె మాటలు.
నిజంగానే ఆ సమయంలో ఆ వైర్లలో నుంచి ఛక్ ఛక్ ఛక్ మని ఎలక్ట్రిక్ స్పార్క్ లు వెలువడ్డాయి.
భయకంపితురాలయిపోయింది అహల్య. "నన్ను....నన్ను క్షమించండి!" అంది తడపడుతూ.
"క్షమించడమానిన్నా!" అని మళ్ళీ విరగబడి నవ్వారు సృజనా, కామాక్షీ. నవ్వుతూ తీగెల్లాగా ఊగిపోయారు మళ్ళీ.
కళ్ళు మరింతగా మసకలుకమ్మాయి అహల్యకి. కళ్ళు మరింతగా చిట్లించి చూసింది.
ఇప్పుడు ఆమెకి సృజనా, కామాక్షీ కనబడటంలేదు. కేవలం రెండు ఎలక్ట్రిక్ వైర్లు కనబడ్డాయి. అంతే!
ఏదీ! సృజన ఏదీ! ఇప్పటి దాకా ఇక్కడే కనబడింది కదా! ఇప్పుడు కనబడదేం! తన కళ్ళే తననిమోసం చేస్తున్నాయా?
అప్పుడు మళ్ళీ వినబడింది సీత గొంతు. "ఎక్కండి నాన్నగారూ!" అంటోంది.
ఆగొంతు నిజంగా సీత గొంతేనా?లేకపోతే అదీ తన భ్రమేనా? సీతా వాళ్ళ నాన్న నిజంగా వచ్చారా?
ఆరాటంతో అల్లాడిపోతోంది అహల్య అంతరంగం.
కారు ఇంజన్ స్టార్టు అయిన శబ్దం వినబడింది.
అంటే..సీతవాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళిపోతోందా? ఇంతదూరం వచ్చితనని చూడకుండానే వెళ్ళిపోతోందా? ఇంతకంటే గుండెకోత వేరే ఏదన్నా ఉంటుందా?
మనసు ముక్కలు ముక్కలు చెక్కలైపోతున్నట్లు అనిపించింది అహల్యకి.
"సృజనా!" అని కేకపెట్టింది హృదయవిదారకంగా. సీత తనపిలుపు వినాలి విని తిరిగిరావాలి?
కానీ ఆమె పెట్టిన పెనుకేక ఆమె పెదవులు దాటిబయటకు రానేలేదు. అప్పటికే మాటపడిపోయింది ఆమెకి.
బయటకారు కదిలిన శబ్దం.
తనకు కనబడకుండానే సృజన వెళ్ళిపోతోందేమోననే ఆలోచనే అహల్యకి అంతులేని తెగువనీ, ఎక్కడలేని శక్తినీ ఇచ్చింది. లేచి నిలబడింది తను.
ఎదురుగా వేళ్ళాడుతున్న లైన్ కరెంట్ వైర్స్ ని లెక్కచెయ్యలేదు ఆమె. సృజనని చూడాలి. అదొక్కటే ఆమె మనసులో మెదులుతోంది.
బయటకు అడుగుపెట్టింది అహల్య.
ఆమెకోసమే కాచుకుని ఉన్న కాలసర్పాలలా వెంటనే ఆమె కాళ్ళని చుట్టేసుకున్నాయి కరెంటు తీగెలు. సృజన, కామాక్షి ఆ ఇంట్లోనుంచి బయటకు రానివ్వకుండా తనని పట్టుకున్నట్లు! ఆ షాక్ కి గజగజగజ లాడిపోయింది అహల్య శరీరం. క్షణాల్లో ఆమెకాళ్ళు చచ్చుబడిపోయాయి.
మళ్ళీ భ్రమ. ఆ భ్రమలో ఒక దృశ్యం.
తన పరిస్థితి చూసి విరగబడినవ్వుతోంది కామాక్షి. "నా కాలిబొటన వేళ్ళునరికితే నాకెంత బాధ కలిగి ఉంటుందో నీకిప్పుడు తెలుస్తోందా?" అని అంటోందా కసిగా.
ఇదంతా చూస్తూ కూడా సృజన తన సాయానికి రాకుండా నిర్లిప్తంగా నిలబడి ఉంది.
తనుచేసిన, తను చేయించిన పాపాలజాబితా అంతా ఆ చివరిక్షణాల్లో ఒక్కసారిగా గుర్తువచ్చింది అహల్యకి. తనచేతుల్లో చిక్కిబుగ్గి అయిపోయిన వేవేలకన్నెపిల్లల బతుకులు గుర్తువచ్చాయి. వాళ్ళ ఆర్తనాదాలూ, శాపనార్దాలూ వేవేల ఒల్టుల విద్యుత్ గా మారి తనని భస్మం చేస్తున్నట్లు భావన కలిగింది.
విలవిల్లాడుతూ, దారుణమైన బాధ అనుభవిస్తూ ఆ ఇంట్లోనుంచి బయటకు రాలేక, ఆ గుమ్మంమీదే విరుచుకుపడిపోయింది అహల్య.
క్షణాలలో కమిలిపోయింది ఆమె శరీరం చూస్తూవుండగానే మాడిపోయింది.
చనిపోయే చివరిక్షణం ఆమె మనసులో మెదిలిన చివరి ఆలోచన---
"నిన్ను చూడలేకపోయాను సృజనా!"
వ్వవ్వవ్వ
టాక్సీవెళుతున్నంతసేపూ ఆపకుండా ఏదేదో చెబుతూనే ఉన్నాడు రమణమూర్తి.
ఉన్నట్లుండి డ్రైవర్ తో అన్నాడు ఆయన "ఇక్కడ ఆపు"
టాక్సీ ఆగింది.
"దామ్మా! దా! దిగు" అన్నాడు రమణమూర్తి తను ముందు దిగుతూ.
సంకోచంగా దిగింది సీత.
అమ్మ నీ! సంజయ్ నీ, స్పందననీ చూడబోతోంది తను!"
ఇప్పుడు పద్దెనిమిదేళ్ళ తర్వాత!
ఆమె మనసు ఉద్వేగంతో నిండిపోయింది.
కిందికిదిగగానే గబగబ నాలుగు అడుగులు వేసి, ఒకచోట ఆగాడు రమణమూర్తి తర్వాత ఎలుగెత్తిపిలిచాడు. "జానకీ! ఓ జానీ! చూడు ఎవరొచ్చారో?"
తెల్లబోయితండ్రివైపు చూసింది సీత. ఆయన నిలబడి ఉన్నది తమ ఇంటిముందు కాదు. అది ఒక కిరాణా షాపు. ఒకప్పుడు ఆ స్థలంలోనే తాము అద్దెకి వున్న ఇల్లు ఉండేది.
ఎందికిలా ప్రవర్తిస్తున్నారు ఆయన? జరుగుతున్నదంతా అర్ధమయీకానట్లే ఉంది సీతకి. దిగులుగా అయిపోయింది ఆమె మనసు.
"జానీ! సృజన వచ్చింది! త్వరగా రా! అన్నం ఉడికిందా? తొందరగా పెట్టేయ్ సృజనకి! స్కూలు టైమవుతోంది? నేను స్కూటర్ మీద దిగబెట్టివచ్చెయ్యనా?" అంటున్నాడు రమణమూర్తి.
ఆ కిరాణా షాపులో ఉన్నవాళ్ళందరూ ఆయనవైపు వింతగా చూస్తున్నారు.
వాళ్ళెవ్వరినీ పట్టించుకోలేదు రమణమూర్తి షాపులోపలికి వెళ్ళిపోయి సామానులు అమర్చివున్న షెల్ఫుమీద తలుపుకొడుతున్నట్లు దబదబ బాదాడు.
జానీ! ఒజానీ! సృజన వచ్చిందంటే వినిపించుకోవేం! స్కూలుకి టైమయిపోతోంది! తలుపు తెరు! తొరగా!
ఆయన అలా కొట్టడంలో షెల్పు తాలూకు అద్దాలు పగిలాయి. సామాన్లు కొన్ని ధనధన కిందపడిపోయాయి.
షాపు ఓనరు కోపంగా లేచివచ్చి రమణమూర్తి మెడమీద చెయ్యి వేశాడు. "బయటకు నడవరా పిచ్చి వెధవా! నడవమంటుంటే! ఈ సారి మళ్ళీ వచ్చి గోల చేశావంటే, పీక పిసికేస్తాను! పదపద!" అని అదిలించి బలంగాతోశాడు.
ఆ విసురుకి వెనక్కి వచ్చి సీతకాళ్ళ దగ్గరపడ్డాడు రమణమూర్తి. తర్వాత తల ఎత్తి జాలిగా ఆమె మొహంలోకి చూశాడు.
"చూడమ్మా నీకు స్కూలుకి టైమయిపోతుందనేకదా నా తొందర! మీ అమ్మ ఎంతకీ తలుపు తియ్యకపోతే ఎట్లా? స్నానం చేస్తోందేమో? ఉండు! వెనకవైపు తలుపుతీసి ఉందేమో చూసివస్తాను" అని లేచి అటు వెళ్ళబోయాడు.
సజలనయనాలతో ఆయనను నివారించింది సీత.
"వద్దునాన్నగారూ! రండి వెళ్దాం!"
ఆయన విస్తుబోయి చూశాడు.
