Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 48

 

    "అబ్బా....అయితే ఏంటి?"


    "ఏం లేదు. ఆ గొట్టంగన్నాయ్ గాడిని చేసుకుంటే ఎలా వుంటుందంటావ్?"


    "వాడి ఖర్మ" అన్నాడు కసిగా శ్రీచంద్ర.


    "వదినా....వదినా గురూ కూడా ఒప్పుకున్నాడు. చేసుకో వదినా. ఓ పనైపోతుంది. నాకో జీన్స్ పోట్టిలాగు కుట్టించాలి మరి పెళ్ళికి" బుంగమూతి పెట్టి అన్నాడు సత్తిపండు.


    ఫట్ మని నెత్తిమీద కొట్టింది సమీర.


    "వదినా! ఎవరో దొంగదెబ్బతీసారు" అన్నాడు సత్తిపండు.


    "చంపేస్తా. నా చందూ ఉండగానే అడ్డమైన గొట్టంగాళ్ళను పెళ్ళి చేసుకోమ్మని సలహా ఇస్తావా?" అంది కోపంగా సమీర.


    "మరెంటోదినా! ప్లేటు గ్లాసు ఫిరాయించేసేవ్" అన్నాడు సత్తిపండు.


    శ్రీచంద్ర మాత్రం వీళ్ళ మాటలను వినే మూడ్ లో లేడు.


    "వెళ్తాను. సమ్మీ కాస్త పనుంది" అంటూ లేచాడు.


    "సరే.....నేనూ వెళ్తాను. రేపు తలతిక్కల సమయం అనే కొత్త ప్రోగ్రాం షూటింగ్ కూడా వుంది" అంటూ తనూ లేచింది సమీర, ఇంటికి వెళ్ళడానికి సిద్దమవుతూ.


    "అదేం టైటిల్ అలా ఉంది?" అన్నాడు శ్రీచంద్ర.


    "వెరైటి ప్రోగ్రాంలే. బాగుంటుంది. వీలయితే రేపు ఉదయంరా, సారధిలో ఫస్ట్ ప్లోర్ లో సెట్ వేసారు" చెప్పింది సమీర.


    "ఇలాంటి పిచ్చి ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ ఎందుకు చేస్తావో నాకర్ధం కాదు" ఒళ్ళు మండి అన్నాడు శ్రీచంద్ర.


    "నేను చేసేది పిచ్చి ప్రోగ్రామ్సా. నువ్వే పిచ్చి అయినా పెళ్ళయ్యాక ఎలాగూ పెత్తనం చెలయిస్తావ్ కనీసం ఇప్పుడైనా నాకు స్వేచ్చనివ్వు."


    "అక్కడికి నేనేదో కట్టి పడేస్తున్నట్లు....."


    "ఓకె....ఓకె....గుడ్ నైట్. రేపురా వీలయితే" చెప్పేసి సమీర వెళ్ళిపోయింది.


    
                                                                  * * *


    "నారదా! మొదటి ప్రయత్నమే విఫలమైనది. ఆ బుద్దిలేని వైద్యుడు మన యత్నమును భగ్నము చేసినాడు" అన్నాడు యమధర్మరాజు నారదుడితో.


    "తమరి బుర్రలో ఆలోచనలకూ కొదవా. మరో ప్రయత్నం చేయుడు" అన్నాడు నారదుడు.


    "ఆలోచించుచుంటిని. చక్కని పధకం" అంటూ నారదుడి చెవిలో ఏదో చెప్పాడు.


    "బహు చక్కని ఆలోచన సుమీ" అన్నాడు నారదుడు.


    యమధర్మరాజు చేయి మీసం పైకి వెళ్లింది దర్పంగా......

 

                                                                   * * *

 

తన గదిలో పడుకుని సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు శ్రీచంద్ర.


    సరిగ్గా అప్పుడే తలుపులు తెరచుకున్నాయి.


    యమధర్మారాజు తలుపుతోసి లోపలకి అడుగుపెట్టాడు.


    అతనిప్పుడు గరుడాచలం రూపంలో ఉన్నాడు. లోపలికి అడుగుపెట్టగానే మంచమ్మీద పడుకున్న శ్రీచంద్ర కళ్ళు తెరచి ఎన్నడూ రాని తండ్రి తన గదిలోకి రావడం చూసి లేచి కూర్చున్నాడు.


    సీరియస్ గా కొడుకు వైపు చూసి హు....ఏముంది రోడ్డు మీద బలాదూర్ గా తిరగడం, ఎక్కడే గడ్డి దొరికితే ఆ గడ్డి తినడం, ఇంటికొచ్చి పడుకోవడం.....ఇంతకన్నా ఏ నుయ్యో గొయ్యో చూసుకోవచ్చుకదా" ఈసడింపుగా అన్నాడు గరుడాచలం వేషంలో వున్న యమధర్మారాజు.


    కోపంగా , పౌరషంగా చూసాడు శ్రీచంద్ర.


    "ఆ చూపులకు మాత్రం తక్కువేం లేదు. అయినా....చీ...చీ....మనిషి జన్మ ఎత్తాక కొద్దిపాటి సిగ్గూ, శరము ఉండాలి. నీతోటి వారిని చూసయినా నేర్చుకో. ఏ ఉద్యోగం లేకుండా వున్నది నువ్వొక్కడివే. నాకెంత నామర్దా ."


    "అయినా నీకు అన్నమెలా సహిస్తుంది. నిద్రెలా పడుతుంది? అసలు నీకెలా బ్రతకాలనిపిస్తోంది. చీ....చీ....వెధవ జన్మ. ఇంకా ఎన్నాళ్ళిలా నిన్ను పోషించాలిరా" అంటూ మొహమ్మీద ఉమ్మేసినంత పన్జేసాడు.


    "అయిందా?" అడిగాడు తాపీగా శ్రీచంద్ర.


    ఉలికిపాటుతో చూసాడు గరుడాచలం వేషంలో ఉన్న యమధర్మారాజు.


    "సిగ్గులేకుండా అయిందా అని అడుగుతున్నావా? అసలు నీ స్థానంలో నేనుంటే ఈ పాటికి ఈ గదిలోనే ఉరేసుకుని చచ్చేవాడిని" అన్నాడు ఆవేశం పట్టలేక గరుడాచలం.


    "అంటే నీ ఉద్దేశం ఏంటి? నేనిప్పుడు సీలింగ్ ప్యాన్ కు ఉరేసుకుని చచ్చిపోవడమా?" అడిగాడు శ్రీచంద్ర.


    "నా జన్మకు అంత అదృష్టం కూడానా? నిన్ను చచ్చేవరకు పోషించాలని నా తల రాత. ఏం చేస్తాం."


    "బాగా ఆలోచించుకో. నేను చస్తే నీకు తల కొరివి కూడా పెట్టేవాడు ఉండడు" అన్నాడు బెదిరిస్తున్నట్లుగా శ్రీచంద్ర.


    "నీలాంటి అణా కానీ వెధవ వుండేకన్నా ఉరేసుకుని చావడమే బెటర్. చావు......పౌరషం వుంటే" ఇప్పుడే చావరా!" అక్కసుగా అన్నాడు గరుడాచలం.


    "నీలాంటి వాడి కొడుగ్గా బతకడంకన్నా చావడమే బెటర్. థాంక్స్ ఫర్ ది సజెషన్" అన్నాడు ఉక్రోషంగా.


    అసలే ఉదయం జరిగిన సంఘటనతో డిప్రెషన్ లో వున్నాడు. దానికి తోడు తండ్రి మాటలు.


    "చావరా......నిజంగా నీకంత పౌరషం వుంటే చావు. ఒక్కసారి ఏడ్చి వూరుకుంటాను. నాకసలు కొడుకే పుట్టలేదనుకుంటాను." అన్నాడు గరుడాచలం.


    "అలాగా.....థాంక్స్. మీరిక దయచేస్తే నేను ఉరేసుకునే ప్రోగ్రామ్ పెట్టుకుంటాను. ఆ దరిద్రపు తాడేక్కడుందో" అంటూ తాడు కోసం వెదకసాగాడు.


    యమధర్మరాజు కళ్ళు మూసుకుని తెరిచాడు.


    ఓ మూల తాడు ప్రత్యక్షమయింది.


    "అదిగో.....తాడు....తాడు....అని వెతుకుతున్నావుగా! ఇక చావు! తొందరపెట్టసాగాడు యమధర్మరాజు.


    "ఈతాడు ఇక్కడికేలా వచ్చిందబ్బా" ఆశ్చర్యంగా అడిగాడు అనుమానంగా తండ్రి వైపు చూసి.....


    యమధర్మరాజు ఉలిక్కిపడి--


    "నాకు తొందరెందుకు? నీలాంటి అప్రయోజకుడైన కొడుకు ఎప్పుడూ చస్తాడా అని చూస్తున్నా. నువ్వు ఛస్తే నాకన్నా సంతోషపడేవాడుండడు" అన్నాడు.


    "నువ్వు కోరుకున్నట్టు చచ్చి చస్తాన్లె. నేరాలు చేసే హంతకుడికి కూడా ఉరి తిసేముందు ఆఖరి కోరిక ఏమిటని అడుగుతాడు తలారి. నువ్వు వాడికంటే తిసిపోయావా?" ఉక్రోషంగా చూస్తూ అన్నాడు శ్రీచంద్ర.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS