Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 48

 

    "ఇప్పుడు నేనే మన్నానని?"


    "నీకేం తక్కువని? అనాలి అనుకుంటే ఏమైనా అనగలవు.......చేయాలి అనుకుంటే ఏమైనా చేయగలవు. శ్రీ శ్రీ శ్రీ రావుబహుద్దూర్ రామమోహనరావు గారి మునిమనవరాలివి, చాలా ప్రముఖులైన శ్రీ వీర్రాజు గారి ముద్దుల కూతురివి.'


    "ఆగండి!" కారు దిగబోతున్న రాఘవ చేయి పట్టుకుంది. " ఎందుకిలా మాట్లాడుతున్నారు?"


    "నేను అంటున్నది నిజమేగా?"


    "కావచ్చు. కానీ మీ గొంతులో వ్యంగ్యం దేనికి?"


    "చేయి విదిలించుకున్నాడు. "దేనికో అర్ధం చేసుకో కిన్నెరా......! నానుంచే నిజాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించకు."


    ఆమెకు కళ్ళనిళ్ళ పర్యంతమౌతుంది. "మర్యాదగా జవాబు చెప్పండి."


    "చెప్పకపోతే?"


    ఆమె దగ్గర జవాబు లేదు.


    "చూడు మిసెస్ కిన్నెరా! నేనో మధ్య తరగతి మాములు మనిషిని. అయినా అణువంత స్వాభిమానం వున్నవాడిని. నువ్వు ప్రపంచంలో దేన్నయినా కొనగలిగే శక్తి గలదానివి కావచ్చు......అంతమాత్రం చేత అందరూ నీకు ఎల్లకాలము దాసోహం అవుతారని పొరపాటు పడకు" ఉద్విగ్నంగా బ్యాంక్ లోకి నడిచాడు.


    స్థాణువై పోయిందామె. కళ్ళలో పేరుకుంటున్న నీటి పొరల్లో అంతా మసకగా కనిపిస్తుంటే , దుఃఖాన్ని దిగమింగుకుంటూ యింటికి వచ్చింది.


    "అల్లుడుగారేరమ్మా?" అన్నాడు వీర్రాజు.


    తల పక్కకు తిప్పుకుంది కిన్నెర. "బ్యాంకుకు వెళ్ళిపోయారు నాన్నా!"


    మంగ విభ్రమంగా కిన్నేరను అనుసరించింది. కిన్నెర నడకను బట్టి కూడా ఆమె మనసు గ్రహించగలదు మంగ.


    "ఏమందమ్మా?"


    "ఏం కాలేదు."


    "మంగ మరేదో అనబోయింది."


    "ముందు బయటికి నడు."


    "మీరు బ్రేక్ ఫాస్ట్....."


    "నీ తల పగల కొడతా! పో బయటికి" అరిచింది రోషంగా.


    మంగ వెళ్ళిపోయింది.


    కిన్నెర కంత కోపమెందుకో మొదట అర్ధం కాకపోయినా మనవడు తిరిగి రాకపోగానే కొంత బోధపడిన మాణిక్యమ్మ కిన్నెర గొంతు స్థాయిని బట్టి పూర్తిగా తెలుసుకోగలిగింది.


    "ఎమైందమ్మా!" లాలనగా ఆమె తల నిమురుతూ అడిగింది మాణిక్యమ్మ.


    కళ్ళు తుడుచుకుంది కిన్నెర. "ఏం కాలేదు."


    "పిచ్చి పిల్ల! నీకన్నా రెండు తరాల ముందు పుట్టినదాన్ని, చెప్పు వాడెక్కడ? అలిగి అలాగే వెళ్ళిపోయాడా? "అయినా పెళ్ళయిన వారానికే ఈ గిల్లికజ్జా లేమిటమ్మా? ,మొదటి ఆరు నెలలు కొత్త జంట ఎలా ఉండాలని! ఛఛ! నువ్వలా కంటతడి పెట్టుకోకు. అయినా నిన్నేడిపించటానికి వాడికేం పోయేకాలం వచ్చింది? పొద్దుటే కిన్నెరతో గుడికేళతాను బామ్మా తీసుకెళ్ళచ్చా అని వాడు అడగ్గానే ఎంత సంబరపడిపోయాను! పైగా వెర్రి వెంగళయీ 'ఇప్పుడు తీసుకెళ్ళచ్చా?" అని పిచ్చి ప్రశ్న వేస్తె భేషుగ్గా తీసుకువెళ్ళవచ్చునని మరి చెప్పాను."


    అర్ధమైపోయింది కిన్నేరకు. రాత్రి తను చెప్పింది నిజమో, కాదో తెలుసుకోవటానికి అయన ఇలా బామ్మని వుపయోగించుకున్నాడు.


    తను గుడికి వెళ్ళే పరిస్థితో, కాదో తెలుసుకుని తన మేధస్సు నిరూపించుకునే ప్రయత్నం చేశారు.


    ఒక్కరోజు అబద్దంలో మూడు రోజులు దాటేయాలని ప్రయత్నిస్తే ఇదేమిటి తనిలా దొరికిపోయింది! ఇప్పుడెలా?


    "అమ్మా కిన్నెరా! నీలాంటి అందమైన ఆడపిల్ల మొగుడిని కొంగున కట్టేయటం ఎంత సేపని! ఇంత చదువుకుని, ఇలాంటి వయసుండి మొగుడిని ఓ ఆటాడించాలి గాని, యిలా కంటతడి పెట్టుకుంటారా?"


    నిజమే, కిన్నెర అందానికి , ఆమె తెలివికి రాఘవ లాంటి సంస్కారం గల వ్యక్తిని కొంగున కట్టుకోవటం చాలా చిన్న పని!


    కాని, తను పందేనికి ఆ వయసునే అడ్డం పెట్టిందిగా!


    ఎలా! ఇప్పుడు ఏ జవాబు చెబితే అయన క్షమిస్తారు?


    క్షమించే స్థాయి దాటిపోయినంత మొండిగా మాట్లాడిన రాఘవనేలా తను ఇక నమ్మించేది?


    సరిగ్గా అదే సమయంలో......


    బయటి నుంచి వీర్రాజు కేకలు వినిపించాయి.


    "చెప్పు రాయుడు! నా మాటగా భోజరాజుకు చెప్పు. ఎంత రక్తపాతం జరిగినా, ఆఖరికి నా ఆస్తి, ప్రాణాలు మొత్తం నాశనమైనా పోటికి దిగుతాను. ఈ సారి ఎన్నికలతో తాడో పేడో తేల్చుకు తిర్తాను!"


    ద్వారం బయటికి చూసింది.


    ఏదో నచ్చచెప్పబోతున్న రాయుడి మీద ఆవేశంగా అరుస్తున్నాడు ఆమె తండ్రి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS