Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 49

 

    "కాని భోజరాజు గారూ అంత మొండిగానే ఉన్నారు వీర్రాజుగారూ!"


    "కాబట్టి, నేను వెనకడుగు వేయాలంటావా? వీల్లేదు రాయుడు నేను వాడిలా పాలేరు కొడుకుగా పుట్టి పెరిగినవాడిని కాను, రావుబహుద్దూర్ రామోహనరావుగారి మనవడుని. రాజా ప్రభంజనరావు కొడుకును! మర్యాదగా రూలు ప్రకారం ఈ టర్మ్ నాకే వదిలిపెట్టమను. లేదంటే రక్తపాతానికి సిద్దపడమను" తుది హెచ్చరికగా అన్నాడాయన.


    కిన్నెర చూస్తుంది నిశ్చేష్టంగా. సరిగ్గా అది నివారించాలనే కదూ తనూ భవ్యతో పందెం వేసింది.


    తండ్రి మాటల్లో ఏ మనసు పొరలు కదిలాయో ఇప్పుడు ఆమె కళ్ళ ముందు రాఘవ కాక తాత రావుబహుద్దూర్ రామమోహనరావుగారు మెదిలారు.


    తను పందెం వేసి తప్పు చేయలేదు!


    తన తండ్రిని సగర్వంగా నిలబెట్టటానిగ్గాను రక్తపాతం జరక్కుండా ఆపటానిగ్గాను ఈ మాత్రం త్యాగం తప్పదు!


    అలా అనుకోగానే అందోళన చాలావరకు తగ్గినట్టయింది.


    
                                                               *    *    *    *


    "వస్తానని చెప్పి మోసం చేశారు మీరు......" అంది రమణి రాఘవ కేసి చిరుకోపంగా చూస్తూ.


    భోజన సమయం కావస్తుండటంతో వెరిఫై చేస్తున్న లేడ్జర్ పుస్తకాలను పక్కన పెడుతూ "రండి" అన్నాడు అభిముఖంగా ఉన్న కుర్చీ చూపిస్తూ........"సారీ! ఏదో పనిలో పడి మరిచిపోయాను."


    "అంతేలెండి. కొత్త కాపురమనుకుంటాగా......పాత స్నేహితులు జ్ఞాపకం ఎలా ఉంటారు!" మాములుగా అంది రమణి కుర్చీలో కూర్చుంటు.


    వృద్ద కేషియరు మాధవరావు చాలా ఆసక్తిగా వారి చర్చ వింటున్నట్టు గమనించలేదు రాఘవ.


    "ఏమిటి......ఏదో ఆలోచనల్లోకి జారిపోయారు?" అడిగింది రమణి- "ఈ వేళా కుదరదని చెప్పబోతున్నారా!"


    "అదేం లేదు......ఈవేళ తప్పకుండా వస్తాను."


    "మీ శ్రీమతి అనుమతి తీసుకోవాలా?"


    "అదేం లేదు. "నవ్వేశాడు. "అయినా నాకు పెళ్ళయిన విషయం అప్పుడే మీకు తెలిసిపోయిందన్నమాట!"


    "భలేవారే, చాలా పెద్దింటి అల్లుడైపోయారుగా! మీ మామగారు మీ పెళ్ళి సందర్భంగా దినపత్రికల్లో పెళ్ళికి వచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతూ ఫోటోలు వేయించారుగా అది చూశాను."


    ఇక ఆ విషయం మీద ఎక్కువ ఆసక్తి చూపించనట్టు ప్రసక్తి మార్చాడు. "లెక్చరర్ గా మీ జీవితం ఎలా ఉంది?"


    "ఇంకా నాకూ కొత్తగానే ఉంది. పూర్తిగా అడ్జస్టవ్వాలి అంటే కొంత టైం పడుతుందేమో! అయినా మీ రేమిటి అలా డల్ గా ఉన్నారు! కొత్త పెళ్ళికొడుకంటే ఎలా ఉండాలి? ఇప్పటి కన్నా పూర్వం ప్రేమ కవితలు పంపించేవారే అప్పుడు నయం......"


    పైకి లేచాడు- "రండి .....లంచ్ కు వెళదాం."


    "ఏం.....ఇంటికి వెళ్ళరా?"


    "మీతో కలిసి చేయాలనుంది."


    మాధవరావు ఆశ్చర్యంగా చూస్తుండగానే వెళ్లిపోయారిద్దరూ.


    సరిగ్గా అయిదు నిమిషాలలో కిన్నెర వచ్చింది బ్యాంకుకు. రాఘవ కనిపించలేదు.


    సర్!" మాధవరావును అడిగింది "మావారు....."


    "హోటలుకు వెళ్ళారమ్మా!" మాధవరావు ఉత్సాహంగా చెప్పాడు కిన్నెర అడగలే గాని అవసరానికి మించినంత ఇన్ ఫర్మేషన్ అందించే మూడ్ లో ఉన్నాడాయన.


    "ఎంత సేపైంది?" గొణుగుతున్నట్టుగా అడిగింది.


    "ఇప్పుడే, ఎవరో స్నేహితురాలులా ఉంది. చాలా రోజులకు కలిశారనుకుంటాను చదువుకున్న రోజుల్లోని ఏవేవో గుర్తు చేసుకుంటూ కాసేపు ఇక్కడే గడిపి, ఆ తర్వాత మీ వారే హోటలుకని ఆమెతో పాటు బయలుదేరారు."


    తను వస్తానని తెలిసే ఎలా వెళ్ళారు?


    ఆమె ఇంకా ఆలోచించుకుంటూ నిలబడటం నచ్చలేదు మాధవరావుకు. "పైగా నిన్న ఆవిడ దగ్గరికి సాయంకాలం వస్తానని, ఏదో పని మూలంగా రాలేకపోయానని చాలా సేపు సంజాయిషీ కూడా ఇచ్చారులెండి పాపం అయన మాత్రం ఏం చేస్తారు? మీరు పాతరోజులు మర్చిపోయారు ఏవో ప్రేమ కవితలు గట్రా అంటూ చాలా బాధపడింది. ఇక వెళ్ళక తప్పుతుందా? అయినా ముసలివాడిని, ఇలాంటి విషయాలు నాకెందుకమ్మా ఏదో కూతురు వయసున్న దానివి, పైగా వీర్రాజు గారి అమ్మయివని చెప్పాను గాని, నిజానికి తల దూర్చకూడని గొడవలు" తనకు  సంబంధం లేదంటూనే మొత్తం కక్కేశాడు.


    చాలా చోట్ల ఇలాంటి మాధవరావులు బాధపడటం సహజమే కాని ఈ మాధవరావుకు మరో ఉద్దేశం కూడా వుంది.


    తన కొడుక్కి ప్రస్తుత ఎం.పి. భోజరాజు ద్వారా ఓ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మాధవారావు యిలా చెప్పి భవ్యకు చాలా సహకరించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS