"ఏం పరవాలేదు . నాకు నీ ఆరోగ్యం ముఖ్యం."
"నా బాధ అది కాదు."
"చెప్పు."
"ఈరోజు నన్ను ఓడించినా మీరు గెలవలేకపోయారుగా."
ఏ విషయంలోనో అతడికి అర్ధమైంది.
"అంటే ఛాన్స్ వెస్టయిపోయింది."
"అదేమిటి?" పక్కకు ఒత్తిగిలి అడిగాడు.
"అదంతే. ఏ రోజు పోటీ ఆ రోజుదే.....సో....మరి మూడు రోజుల పాటు మీరూ, నేనూ విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ తర్వాత మన పోటీ."
ఇక్కడ ఆమె చెప్పిన జవాబుతో అతడిలో ఏ ప్రశ్న ఉదయించిందో కిన్నేరకు తెలీదు.
తను మాట్లాడుతున్నది భర్త స్థానంలో ఉన్న అందమైన, తెలివైన అబ్బాయినే అనుకుంది తప్ప, రాఘవకున్న లౌక్యాన్ని ఆమె సరిగా అంచనా వేయలేకపోయింది.
కిన్నెర ప్రస్తుత స్థితేమిటో తెలుసుకోవాలని ఆ మరుసటి రోజే పధకం వేశాడు రాఘవ.
* * * *
ఉదయం ఎనిమిది గంటలకే తయారయిన రాఘవ లోగిలిలో ఉత్సాహంగా అటూ యిటూ తిరుగుతున్న కిన్నేరను ఏకాగ్రతగా చూస్తూ నిలబడిపోయాడు చాలా సేపటిదాకా
"అప్పుడే ఆఫీస్ కు బయలుదేరుతున్నావట్రా?" అడిగింది మాణిక్యమ్మ యింకా టిఫిన్ చేయని రాఘవను చూస్తూ.
"కిన్నెరతో పాటు అనకాపల్లి గుడికి వెళదామనుకుంటున్నాను బామ్మా!"
"ఏది నూకాలమ్మ గుడికే? నీ కింత భక్తెప్పుడు పుట్టుకొచ్చిందిరా?" అంది బుగ్గలు నొక్కుకుంటూ.
కిన్నెర సమీపంలో లేకపోవడం చూసి అన్నాడు -- "అది సరేలేవే! కిన్నెరతో కలిసి వేల్లోచ్చా అని....."
"ఎందుకెళ్ళకూడదు?" అడిగింది నివ్వెరపోతూ.
"అదేనే....."ఎలా చెప్పాలో అర్ధం కాలేదు రాఘవకు. "కిన్నెర మూడు రోజుల పాటు....."
"నీ మొహం! అలాంటిదేం లేదు" రాఘవ ఏ అనుమానంతో ఇలా అడిగాడో అర్ధమైనట్టు చెప్పింది. "మాములు కడుపు నొప్పిలే......భేషుగ్గా వెళ్ళొచ్చు."
రాఘవ మోహంలో రంగులు మారిపోయాయి.
నిశ్చేష్టుడిలా చూస్తుండగానే వచ్చింది కిన్నెర.
"ఏమిటి అప్పుడే హడావుడి పడుతున్నారు? ఆఫీసు కింకా టైం కాలేదుగా?"
"గుడి కోసారి వేల్లోద్దాం కిన్నెరా! బయలుదేరు."
ఉన్నట్టుండి రాఘవకు ఇలాంటి ఆసక్తి పుట్టుకురావడం ఆమెకు అబ్బుర మనిపించడంతో వెంటనే బయలుదేరింది.
పదిహేను నిమిషాల కారు ప్రయాణంలో కిన్నెర మాట్లాడుతుంటే నిశ్శబ్దంగా వింటున్నాడు తప్ప, ఏమి మాట్లాడలేదు.
గుడికి చేరుతుండగా అంది "ఏమిటి.....మౌనవ్రతమా?"
అతడి మనసులో ఏ ఆలోచనల వెల్లువ అతన్ని దారుణంగా కలవరపరుస్తున్నది ఆమె వూహించలేకపోయింది.
మనసారా నవ్వడం తనకు మాత్రమే చేతనైనట్టు రాఘవ గుడిలో అర్చన పూర్తి చేసి బయటికి వచ్చాడు నిర్లిప్తంగా.
డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న ఆమెతో అన్నాడు -- "నన్ను బ్యాంకు దగ్గర దింపేయ్."
"బ్రేక్ ఫాస్ట్ కాలేదుగా?"
"ఫర్వాలేదు బయట తింటాను."
"అది కదండి! ఇంకా టైముందిగా?"
"నీ ఉద్దేశ్యం ఏమిటి కిన్నెరా.....? అంతా నువ్వు చెప్పినట్టే జరిగి తీరాలా?" కటువుగా అనేసి ఆమె పక్కన కూర్చున్నాడు. "పోనీయ్ '
"ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి."
"నన్ను విసిగించకు."
ఏమందియనకు?? ఉదయం బాగానే ఉన్నాడుగా, ఇంతలోనే ఇలా మారిపోయాడెం?
"నే నేమైనా తప్పుగా ప్రవర్తించానా?" కారు నడుపుతూ అడిగింది.
జవాబు చెప్పటం రాఘవ కిష్టం లేదు.
అసలు ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుంది అతడికి తోచడంలేదు.
తనతో మూడు రోజులు దూరం తప్పదంది. బామ్మతో అలాంటిదేమి లేదని చెప్పింది. ఆ విషయం యిందాకే బామ్మ మాటల్ని బట్టి అర్ధమయిపోయింది.
"ప్లీజ్!" బ్యాంకు దగ్గరికి వచ్చాక అభ్యర్ధనలా అంది మరోసారి "ఇంటికి వెళదాం రండి."
నిర్లిప్తంగా నవ్వేశాడు. మాములుగా అయితే ఘాటుగా జవాబు చెప్పేవాడే కాని, పెళ్ళయి ఎంత కాలమైందని? అ'చూడు కిన్నెరా! నీలా బంగారు చెంచాలతో గోరుముద్దలు తింటూ పెరిగిన వాడిని కాదు. ఒక్క రోజు బయట టిఫిన్ చేస్తే నా ఆరోగ్యం చెడిపోదు."
