Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 48

   

    "బానే వచ్చాయి బాబూ! రెండు బత్తాలవరకు వచ్చాయి" అన్నాడు సుబ్బయ్య.

    "సరే, నేను వెళ్ళేటప్పుడు బండిలో తీసుకెళతాను గానీ మోటారు వేయి, నీళ్ళు పెడదాం మొక్కలకు" అన్నాడు సురేంద్ర.

    "తమరికెందుకు బాబు శ్ర్హమ? నేను పెడతాగా" అన్నాడు సుబ్బయ్య.

    "శ్రమనుకుంటే ఎలా సుబ్బయ్యా.....శ్రమనుకుంటే ఈ తోట ఇంత ఏపుగా పెరిగేదా....లోగడ ఈ భూమిలో ఎన్ని రాళ్ళుండేవో నీకు తెలియంది కాదు కదా....మరి అలాంటి భూమిలో ఈరోజు బంగారం లాంటి పండ్లు కాస్తున్నాయి అవునా కదా" అన్నాడు నవ్వుతూ.

    "అవుననుకోండి" అన్నాడు సుబ్బయ్య తల గోక్కుంటూ.

                                    *    *    *    *

    "ఏంటిబాబు పండక్కి వస్తానని చెప్పి ఇప్పుడా వచ్చేది?" అంది గోముగా వరాలు.

    "ఏం చెప్పమంటావు వరాలు నా భాధలు....పనివత్తిడి వల్ల కుదరటం లేదు.....ఎప్పటికప్పుడు నీ దగ్గరకు రావాలనే అనుకుంటున్నాను. తీరిక దొరికితే కదా?" అన్నాడు సోమసుందరం.

    "అంతేలెండి.....నామీద మోజు తీరిపోయిందిగా....నన్ను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు. అవసరం తీరిపోయింది. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు." అంది సీరియస్ గా వరాలు.

    "ఛ....అదేంకాదు వరాలు, నీ మీద మోజు ఈ జన్మకు తిరదంటే నమ్ము" అన్నాడు సిగరెట్ తీసి వెలిగించుకుంటూ.

    "అన్ని ఉత్తుత్తి మాటలే.....నా దగ్గరకు వచ్చినప్పుడు యిట్టా మాట్లాడతారు. మళ్ళీ ఇంటికేళీతే నా ధ్యాసే వుండదు. పండగ బహిమతి తెత్తానన్నారు. అది ఇవ్వవలసి వస్తుందని ముఖం చాటేశారు. అంతేగా" అంది గోముగా జారిన పైట సరిచేసుకోకుండానే.

    "అబ్బా, నీకంతా తొందరేనే! అసలు ఏ రోజయినా నీకు బహుమతి తీసుకురాకుండా వచ్చానా? నా జీవితానికి నువ్వే గొప్ప బహుమతి...." వరాలన్నీ తీర్చే నా బంగారు వరాలివి" అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ.

    ఆమె అతని ఒడిలో మెత్తగా ఒదిగింది.

    "ఇకనుంచి సాయంత్రాలు రావటం కుదరదే వరాలు, పొద్దుట పూటే వస్తాను" అన్నాడు సుందరం.

    "ఏం! ఎందుకని? నా దగ్గరకు రాకుండా మిమ్మల్ని ఎవరన్నా చేస్తున్నారా?" అంటూ ఏడుపు నటించింది.

    "అరెరె....ఈమాత్రందానికే ఏడుస్తావెంటే! నీ దగ్గరకు రాకుండా నన్ను ఏ శక్తి ఆపలేదు" అన్నాడు ఆవేశంగా.

    ఆమె మనసులో పొంగిపోయింది. తన అదృష్టానికి. తనకు పరిచయమైన వ్యక్తులందరూ తనని తమ స్వార్ధానికి ఉపయోగించుకున్నారు కానీ అతను తనని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాడు. అనుకుంటూ తెలీకుండానే అతని మీద ప్రేమ పెరిగిపోయింది.
    మెల్లగా ఆమెను వదిలి "వరాలు నీళ్ళు తీసుకునిరా" ప్యాంటు జేబులో నుంచి సీసా తీశాడు. ఆమె ఆనందంగా వెళ్ళి నీళ్ళు గ్లాసుతో తెచ్చి అతని ముందు పెట్టింది.

    సుందరం బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో మందు వొంపి ఆమె నవ్వుతూ కబుర్లు చెపుతూ దానిలో నీళ్ళు కలిపింది. మందు ఒక్క గుక్కలో దానిని తాగేశాడు.

    "వరాలు! ఈరోజు నీచేతి ఆమ్లెట్ తినాలనిపిస్తుందే, చేసిపెట్టవే అన్నాడు సుందరం మత్తుగా.

    "ఓ! అదెంతభాగ్యం" అంటూ లోపలికి వెళ్ళింది.

    సుందరం మరో పెగ్గు పోసుకుని నీళ్ళు కలుపుకుని తాగుతూ కూర్చున్నాడు.

    ఇంతలో తలుపు కొట్టిన చప్పుడయింది. సోమసుందరం వరాలు అని పిలిచాడు. ఆమె కంగారుగా వచ్చింది.

    "ఎవరో తలుపు బాదుతున్నారు చూడు" అన్నాడు అందోళనగా ఎవరై వుంటారు అనుకుంటూ" వెళ్ళి తలుపు తీసింది.

    కరణం!

    "మీరా?!" అంది ఆశ్చర్యంగా.

    'అవును నేనే. ఎందుకు అంతగా ఆశ్చర్యపోతున్నావ్?" అన్నాడు నవ్వుతూ.

    "లోపల అయన ఉన్నారు" అంది వరాలు.

    "తెలిసే వచ్చానే.....నేను వారితో మాట్లాడాలి" అన్నాడు వెకిలిగా నవ్వుతూ.

    "ఏం మాట్లాడతారు? ఇప్పుడోద్దండి, ఇప్పుడే వచ్చారు" అంది బతిమాలుతూ.

    "ఏంటే! నాకే ఎదురు చెపుతున్నావ్....తల ఎగిరిపోద్ది జాగ్రత్త" అన్నాడు.

    "వరాలు....ఎవడేవాడు! ఎంటట?" అన్నాడు సుందరం చిరాగ్గా.

    కరణం గబగబా లోపలికి వచ్చాడు.

    "అయ్యా! నమస్కారం" అన్నాడు వినయంగా నవ్వుతూ.

    "ఓ కరణంగారా? రండి...రండి....మీరూ ఓ గుక్క తీసుకోండి. మొహమాట పడొద్దు.....ఇది మనిల్లె అనుకోండి" అన్నాడు సుందరం.

    "అయ్యో! వద్దండి. తమరు తీసుకోండి" అన్నాడు కరణం వినయంగా

    "ఏంటి కరణం గారూ! మందు దగ్గరా, మగువ దగ్గర మొహమాటం పడకూడదండి" అన్నాడు సుందరం.

    "వద్దన్నా మీరు వినేటట్లు లేరు. ఏదో తమరి తృప్తి కోసం కాస్త పుచ్చుకుంటాను" అన్నాడు.

    "ఆ! వెరిగుడ్. వరాలూ--మరో గ్లాసు పట్రావే కరణంగారికి. పాపం. పాపం ఈ పుణ్యత్ముడే నాకు నిన్ను పరిచయం చేసింది....సొర్గం చూపించాడు....దండాలు క.....రణం గారూ ....షాలా సంతోషం....." అన్నాడు సుందరం.

    "అయ్యో, మీరు నాకు దండాలు పెట్టడమా....ప్రెసిడెంటుగారి ముద్దుల తమ్ముడు మీరు....మీ హోదా ఎక్కడా, నేనెక్కడ?" అన్నాడు నక్క వినయంతో.

    "కరణం .....మా అన్నయ్య పేరు ఎత్తకండి బాగోదు. అన్నయ్య దేవుడు...." అన్నాడు సుందరం.

    "చిత్తం...నిజమే కదండీ" అన్నాడు కరణం.

    "అయన పేరు తల్చుకోవటానికి కూడా నీకు అర్హత లేదు" అన్నాడు సీరియస్ గా.

    "అవునవును, ప్రెసిడెంట్ గారి హోదానే వేరు...." అన్నాడు, గ్లాసులో బ్రాంది రెండు గుక్కలు తాగి కరణం.

    "సెప్పండి కరణంగారూ! ఎందుకొచ్చారు తమరు? నేనిక్కడున్నానని తెలిసే వచ్చారా? లేకపోతే మీరు కూడా ఇక్కడకు వస్తుంటారా?" అన్నాడు సుందరం.

    "అయ్యోయ్యో...ఎంత మాట! తమరితో కాస్త మాట్లాడదామని వచ్చాను. లేకపోతే నాకిక్కడెం పనండీ. తమరికి పరిచయం చేసిన తరువాత నేను కన్నెత్తి చూసే ధైర్యం కూడానా?" అన్నాడు కరణం .

    "శభాష్ కరణం ....అది ....మనిషంటే అలా వుండాలి"

    "చుషావా వరాలు....కరణానికి నేనంటే ఎంత భయం.....భక్తో" అన్నాడు సుందరం. వరాలు కిలకిలా నవ్వింది.

    "అబ్బా! అట్టా నవ్వమాకే వరాలు....నా మతిపోతుంది.....ఆ నవ్వుతోనే నన్ను కట్టిపారేశావు" అన్నాడు సుందరం.

    :బాబూ! సుందరం బాబూ! నీతో ఒక ముఖ్యమయిన విషయం మాట్లాడదామని వచ్చాను. నా మాట కాదనరుగా" అన్నాడు కరణం.

    "చెప్పు కరణం....నాకింత ఉపకారం చేసినవాడికి నేను ఆమాత్రం సాయం చేయకపోతే ఎలా?" అన్నాడు సుందరం.

    "వద్దులే బాబూ! మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికి?" నా వల్ల మీరు ఇబ్బందుల్ని ఎదుర్కోకూడదు" అన్నాడు కరణం.

    "అలాని ఎందుకనుకుంటున్నారు కరణంగారూ....చెప్పండి. మీకేం కావాలో చెప్పండి. మీకోసం ఏం చేయమన్నా చేస్తాను....." అన్నాడు సుందరం.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS