Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 48


    "కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు వాడితో ఏమిటేనీకూ?" అన్న ఈ తండ్రేనా "చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోందయ్యా! నీ ఋణం తీర్చుకోలేను" అని అన్నది?
    
    ఆమెకి చాలా ఆశ్చర్యంగానూ, అపనమ్మకంగానూ అన్పించసాగింది. ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రపంచంమీదా. ఈ సమస్త మానవ సంబంధాల మీద నమ్మకం పోయినట్లుగా అన్పించింది. అరణ్య న్యాయమే నయమేమో! పశుపక్ష్యాదులన్నీ తమ ఇష్టానుసారం సంచరిస్తూ హాయిగా వుంటాయి. ఈ బంధాలూ, బంధనాలూ, ఆంక్షలూ, హక్కులూ ఏమీ వుండవు. తమ జీవితధ్యేయం తిండి సంపాదించుకోవడం, తినడమే కాబట్టి ఆ పనిలో దీక్షగా శ్రమిస్తూ, ఎటువంటి 'హిపోక్రసీ' లూ లేకుండా కలిసి సంచరిస్తూ, కోపమొస్తే పోట్లాడుకుంటూ మనశ్శాంతిగా వుంటాయి.
    
    అంతలోనే ఆమె ఉలిక్కిపడింది. ఛీ ఛీ ఏమిటిది? తన సిద్దాంతాలూ, నమ్మకాలూ, ఆశయాలూ అన్నీ పేకమేడల్లా కూల్చేసుకుని, ఇలా పశువుల్లా బ్రతుకు గడపడం మేలనే ఆలోచన చేస్తోందేమిటి? తనలో ఈ విధమైన మార్పుకి కారణం, తనచుట్టూ వున్న మనుషులా? లేక మారిపోయిన విలువలకు మన నమ్మకాలా? జ్ఞానం ఎక్కువవుతున్న కొద్దీ ఆందోళన ఎక్కువవుతుంది. అపజయాలు వెల్లడిచేసే వాస్తవాల్ని ఆమె తట్టుకోలేకపోతోంది.
    
                                                                * * *
    
    సంధ్యాకాంత పెట్టిన ముద్దుకి, మార్తాండుడు సిగ్గుతో ఎర్రటికొండల మధ్యకి జారిపోతున్నాడు.
    
    నిర్దయ మబ్బు సైనికుల చేతిలో బంధించబడి బయటికి రాలేకా, అటు వుండలేకా ఉక్కిరిబిక్కిరవుతున్నాడు శశాంకుడు.
    
    చేతిలో వున్నా మల్లెమొగ్గలని చూస్తుంటే పుష్పవిలాపం గుర్తుకొచ్చింది ధృతికి. సూదులతో గుచ్చలేక, కంఠాలకి ఉరిముడులు వెయ్యలేకా అలాగే నేలమీద పేర్చసాగింది.
    
    ఆమె ప్రమేయం లేకుండానే అవి 'నవీన్' అనే అక్షరాల ఆకృతి దాల్చాయి. నవీన్ ని కలిసి నాలుగు రోజులయింది. ఆ రోజు గాయపడి వెళ్ళిన తర్వాత అతని సంగతులేమీ తెలియలేదు.
    
    ఇంతలో పెద్దగా వీచిన గాలివల్ల మొగ్గలన్నీ చెల్లాచెదురైపోయాయి.
    
    "అయ్యయ్యో!" అప్రయత్నంగా వాటికోసం ముందుకు వంగింది. మొగ్గలమీద కర్కశంగా పడిన బూటు కాలిని చూసి బాధగా తెలెత్తి చూసింది.
    
    ప్రేమ్ కనిపించాడు.
    
    "అమ్మ నీతో మాట్లాడాలిట" చెప్పాడు. అతను చాలా గంభీరంగా వున్నాడు. పార్టీలో ఆ సంఘటన జరిగాక అతను యిదే ఆమెని పలకరించడం.
    
    ఆమెకి "రాను" అనాలని ఎంతగానో అనిపించింది కానీ అంతలోనే అలా అంటే పిరికితనమనుకుంటారన్న ఊహ వచ్చి "ఊ" అంది.
    
    అతను వెనుతిరిగి వెళ్ళిపోయాడు.
    
    ధృతి వెళ్ళేసరికి గాయత్రీదేవితో బాటు ధర్మానందరావుగారు కూడా హాల్లో కూర్చుని కనిపించారు.
    
    "కమాన్, కూర్చో!" అన్నారాయన.
    
    ధృతి వినయంగా నమస్కరించింది.
    
    గాయత్రీదేవి ఓసారి ఆపాదమస్తకం అదోలా చూసి, చేతిలోని మేగజైన్ లో తల దూర్చేసింది.
    
    ఆ చూపుల వాడిని ధృతి అర్ధం చేసుకుంది. "ఎందుకిలా ప్రతివాళ్ళూ తననో అపరాధిని చూసినట్లు చూస్తున్నారు? నేను చేసిన తప్పేమిటీ?" అనడిగేయాలనిపించింది.
    
    "రేపు ఆఫీసుకి శలవు పెట్టు. ప్రేమ్ వాళ్ళమ్మగారు మీ ఇంటికి వస్తారట" అన్నారాయన.
    
    "ఎందుకూ?" అని అడగాలని నోటి చివరదాకా వచ్చినా, సంస్కారం ఆ ప్రశ్నని అక్కడే ఆపేసింది.
    
    "పదిగంటలకి బయల్దేరదాం" చెప్పింది తలెత్తకుండానే గాయత్రీదేవి.
    
    ధృతి ఆయనకేసి తీవ్రంగా చూసింది. అటు ఆవిడకీ, ఇటు తనకీ కూడా ఈ విషయంలో అంతగా ఉత్సాహంలేదు. బహుశా ఇదంతా ఈయన నడిపిస్తున్న నాటకంలా వుంది అనుకుంది.
    
    ఆయన చిన్నగా నవ్వుతూ "మొన్న పార్టీలో మీ నాన్నగారు నన్ను కూడా మీ ఇంటికి ఆహ్వానించారు. కానీ అవసరమైన పనులున్నాయి, మరోసారి వస్తాను" అన్నారు.
    
    ఆమె మౌనంగా తలవూపి, అక్కడినుండి వేగంగా బయటపడడానికి ప్రయత్నిస్తూ "వస్తానండీ" అంటూ వెనక్కి తిఇర్గి గబగబా అడుగులు వేస్తూ బయటికి వచ్చేసింది.
    
                                                                     * * *
    
    గాయత్రీదేవి తమ ఇంటికి రావడంలో ఏదో కృత్రిమత్వం దాగున్నట్లూ, అది పరమ అసహజంగానూ అనిపించసాగింది ధృతికి.
    
    సుభద్రా, సీతారామయ్యా ఆవిడని చూడగానే కంగారుపడిపోయారు. ఆ తరువాత సాక్షాత్తు లక్ష్మీదేవే స్వయంగా తమ ఇంటికి నడిచి వచ్చినట్లు పొంగిపోయారు. క్రిందా మీదాపడి మర్యాదలు చేశారు.
    
    ఆవిడ అన్నీ సహజంగా స్వీకరిస్తూ, భక్తుల సేవలు అందుకుంటున్న అమ్మవారిలా కనిపించింది. మధ్య మధ్యలో వారి స్థితిగతులనీ, అవతారాలనీ పరికిస్తున్నట్లు సాలోచనగా చూస్తోంది.
    
    ధృతి వరండాలోకి వచ్చి, అక్కడ చదువుకుంటున్న తమ్ముడిని "నవీన్ ఏమైనా కనిపిస్తున్నాడా? ఆఫీసులో కూడా కనిపించడంలేదు" అంది.
    
    రవి తలెత్తి ఆశ్చర్యంగా చూస్తూ "నీకు తెలీదా? ఆంటీకి చాలా సీరియస్ గా వుంది. హాస్పిటల్లో పెట్టారు. నవీన్ నాకు నిన్న కనిపించి చెప్పాడు" అన్నాడు.
    
    "ఏ హాస్పిటల్లో?" ఆతృతగా అడిగింది ఆమె.
    
    రవి చెపుతుండగానే "నే వెళతాను, ఇంట్లోవాళ్ళు అడిగితే చెప్పు" అంటూ చెప్పులేసుకుని పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది.
    
                                                                 * * *

    నవీన్ ని చూస్తూనే ఆమె అతనిపై విరుచుకుని పడిపోయింది. "అసలు నేను ఒకదాన్ని వున్నాననే విషయం నీకు గుర్తుందా? నేను నిన్ను ఆప్తుడిగా తలచి ప్రతిదానికీ నీ దగ్గరకు పరుగెత్తుకు వస్తాను. నీకు మాత్రం ఎప్పటికీ పరాయిగానే కన్పిస్తాను..." అంటూ ఆవేశంగా ఇంకా ఏదో అనబోయి, అతని ముఖాన్ని చూసి ఆగిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS