Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 48

   

     'సీతమ్మా - వస్తానని రాసిందిలే' రాజారావు కళ్ళకి చేయి అడ్డుపెట్టుకుని వెలుతురుపడకుండా, గేటు వైపు చూస్తున్నాడు.
   
    'శారదమ్మ గారండీ' -
   
    'శారదా - అమ్మా, నువ్వా' రాజారావు గొంతునిండా ఆనందంనిండింది.
   
    'నేనే నాన్నగారూ నువ్వు ఇక్కడ నుంచిలే వెంకడిని లేపి, తనుకూచుని కాళ్ళకి నూనిరాసి రుద్దటం మొదలుపెట్టింది.
   
    'నీకెందుకు తల్లీ - చాలు' రాజారావుతోబాటు శారద లోపల కెళ్ళింది.
   
    'నేను రాసిన ఉత్తరాలు అందాయా. అవునుకానీ ఈ ముసలినాన్నపైన ఇంత దయకలిగిందేం తల్లీ' అన్నాడు నవ్వుతూ.
   
    'నీళ్ళు కిందనుంచి పైకి కూడా వస్తాయని'
   
    "నీళ్ళు కిందనుంచిపైకి అవునండీ పైపు గొట్టాలతో వస్తాయిగా" వెంకడు కల్పించుకుని అన్నాడు.
   
    "ఆ నీళ్ళుకాదులే - నాన్నగారూ, అమ్మ ఎప్పుడూ అంటుండేది - నీళ్ళుపై నుంచి కిందకి వస్తాయని, కింది నుంచి పైకి రావని అంటే తల్లి తండ్రులప్రేమ పిల్లల పైనేకాని, పిల్లల ప్రేమ తల్లితండ్రులపైకి రాదని - కదండీ నాన్నగారూ -
   
    'ఆ - ఆ- రాజారావు అన్నాడు కానీ, శారద ఎందుకొచ్చిందో అర్ధంకాలేదు.
   
    'అమ్మా - నా ఫ్లాటుకొన్నావా' ఎంతో ఆశగా అన్నాడు.
   
    'కొంటాను నాన్నగారూ - హైదరాబాదులో కాకుంటే బొంబాయిలో కొంటాను'
   
    'అంటే'
   
    'అదే - నేను బొంబాయి వెళ్ళాలను కుంటున్నా. నేనెక్కడుంటే మీరూ అక్కడే వుందురు గానీ. 'శారద చూస్తోంది తండ్రి ముఖంలో మార్పులు 'చాల్లే - నీకు చేతకాక పోతే నాడబ్బు నీ ముఖానపడేయ్ - నేనే ఏదో చేసుకుంటాను. ఈ పాత ఇల్లు అమ్మేసి 'ఇక్కడే కాస్త బాగున్నది కొనుక్కుంటాను - నేను ఎక్కడికీ రాను - నాతో ఎవరూ వుండద్దు - ఈ వెంకడిని పెట్టుకు కాలంగడుపుతా. బొంబాయా - హమ్మో! చచ్చినా రాను' రాజారావు కోపం ఆగటం లేదు.
   
    'నాన్నగారూ నేను ఎక్కడికెడతానో, ఎక్కడఉంటానో ఇంకోరెండు మూడు రోజుల్లో తేలిపోతుంది - అప్పుడాలోచిద్దాంలెండి" - శారద వంటింట్లో కెళ్ళింది. ఇంట్లో ఆడదిక్కులేకపోతే ఇల్లెలావుంటుందో తెలిసింది శారదకి ఆ ఇల్లు చూస్తుంటే రాజమ్మ పిన్ని వున్నపుడు అంతా ఆమె బాధ్యతగా చూసుకొనేది. ఎవరోస్తారు, ఎవరుంటారు ఇక్కడ?
   
    పంతులుగారి అమ్మాయి ఈ ఊళ్ళోవుంటుంది. పొద్దున్న ఎనిమిది గంటలకొచ్చీ, సాయంత్రం ఆరుగంటలకొచ్చీ అన్నం వండి, నాన్నగారికి పెట్టి వెళ్ళిపోతుంది తక్కిన పని వెంకడు చేస్తాడు - ఎన్ని రోజులు గడుస్తుంది ఇలాగ - ఆరుగురు పిల్లల తండ్రి రాజారావు గతియిదైతే, ఒకళ్ళు, ఇద్దరు పిల్లలున్నవాళ్ళ గతి ఇంకేమిటోమరి - అందుకేగదా మన సంస్కృతికి భిన్నమైనా ఊరు ఊరునా వెలుస్తున్నాయి. వృద్దాశ్రమాలు, వృద్దాశ్రమాలు - ఒకప్పుడు వృద్దులు ఇంట్లోవుంటేనే ఎంతో గౌరవంగా భావించేవారు, మాముత్తాతగారు, మా తాతగారు అని ఎంతో ఆనందంగా చెప్పుకొనేవారు, ఇంట్లో వృద్దులు ఛాదస్తంగా వున్నా అనారోగ్యంగా వున్న ఆ ఇంట్లో అందరూ ప్రేమగా ఆప్యాయంగా చూసే వారు. కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మునిమనుమలతో ఆ ఇళ్ళు ఎంతో నిండుగా కలకలలాడుతోవుండేవి. వృద్దులని, చిన్న పిల్లలని ఒకేలా చూడాలనే భావం వుండేది. ఇంట్లో పెద్ద వాళ్ళు వృద్దుల్ని ప్రేమగా గౌరవంగా చూస్తే ఇంట్లో వున్న చిన్న వాళ్ళు కూడా అలాగే చూసేవారు. తాతయ్యలు నాయనమ్మలు, అమ్మమ్మలు మునిమనుమలతో కబుర్లు చెప్తూ, ఆనందంగా వృద్దాప్యాన్ని గడిపేవారు. కాలం ఎంత చిత్రంగా మారిపోయిందో - ఏ ఇంట్లోనూ పెద్దవాళ్ళు వుండద్దనే భావమే - పెద్దవాళ్ళు బోర్, పెద్దవాళ్ళు చెప్పేమాటలు చెత్త, పెద్ద వాళ్ళు లేకపోతే ఇల్లు నీట్ గా వుంటుంది, పెద్దవాళ్ళు అన్నిటికీ అడ్డుపడుతూ వుంటారు. ఇదే భావం స్థిరపడిపోయి పెద్దాళ్ళని ఎలా వదిలించుకోవాలనే దానికి మార్గమే ఈ వృద్దాశ్రమం అందరూ వుండి ఎవరూ లేనివారిలా, ఒకరు పెట్టే తిండిపై ఆధారపడుతూ పడివుండాలా ఏ వారానికీ, నెలకో వచ్చి చూసే పిల్లలకోసం ప్రాణాలు పెట్టుకు ఎదురుచూస్తూ వుండాలా ! రాజారావు చేతిలో పెద్ద ఉత్తరం కదులుతోంది. పేజీల పేజీలు  - రాజారావు అదే ఉత్తరం నిన్నటి నుంచీ చదువుతున్నాడు. మళ్ళీ మళ్ళీ చదువుతున్నాడు. వృద్దాశ్రమం - ఆయన మనసులో అదేకదులుతోంది.
   
    'అమ్మ - నేను వృద్దాశ్రమంలో చేరాలనుకుంటున్నా' రాజారావు చేతికర్ర తీసుకుని నెమ్మదిగా దొడ్లో అటూ ఇటూ తిరుగుతూ అన్నాడు.
   
    'ఏమిటి నాన్నగారూ. వృద్దాశ్రమం'
   
    'అవును - అదే - ఆ ఉత్తరం చదువు' - పెద్ద ఉత్తరం శారదవైపు విసిరాడు. మామిడి చెట్టుకింద అరుగుమీద కూచుంది శారద. - అంత పెద్ద ఉత్తరం ఓపిగ్గా చిన్న అన్నయ్య రాశాడంటే అందులో ఏదో విశేషముండి వుంటుంది - శారద ఉత్తరం చదవటం మొదలుపెట్టింది. ఆ ఉత్తరం చదువుతున్న కొద్దీ ఆవేశం పెరిగిపోతోంది. గబగబ చదివింది పెద్దన్నయ్య కూతురు పెళ్ళికుదిరింది. ఆ పెళ్ళి చేసి పిల్లని అత్తవారింటికి పంపేసి, అన్నయ్య కుటుంబం అమెరికా వెళ్ళిపోతారట అన్నయ్యకి రెండేళ్ళు వెళ్ళేందుకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తోందిట ఇక, పెద్దక్కయ్య, సీతమ్మ వాళ్ళ కుటుంబాల బాధ్యతలతోవున్నారు తండ్రిని తీసికెళ్ళి వాళ్ళదగ్గర పెట్టుకోలేరట - తను, ప్రమోషనొచ్చి మద్రాసు వెడుతున్నాడు.....కాకపోయినా తన పిల్లలు ఇద్దరు చదువులకి వచ్చారు. ఇందులో దాచేదేముందీ, తన భార్యకి నాన్నగారిని ఇంట్లో పెట్టుకుచూట్టం ఇష్టంలేదట - ముసలాళ్ళని ఆవిడ భరించలేదట. ఇంకా శారద - అది గాలిపటం - దానిని నమ్మిమనమేమీ చేయలేము. ఎప్పుడెక్కడుంటుందో తెలియదు -విడాకులయ్యాయి - ఎవణ్ణి పెళ్ళాడుతుందో తెలియదు - పెళ్ళిపెటాకులు లేకుండా అలానే వుండి పోతుందేమో - ఏదయినా అది మీ బాధ్యత ఏమీ వహించలేదు - కనక, ఇక మిగిలింది ఒక్కటే - వృద్దాశ్రమం - నెలకి ఎనిమిది వందలు కట్టాలి - పదివేలు డిపాజిట్ కట్టాలి - మన ఊరికి దగ్గర్లోనే వుంది. పదిహేను నిముషాలలో బస్సులో రావచ్చు - అక్కడ చాలా మంది ఉన్నారు. మీవయసువాళ్ళు, మీ కన్నా చిన్నవాళ్ళు - మీరు హాయిగా అక్కడ వుండండి. మీకు డబ్బులు మేమెవరమూ ఖర్చు పెట్టక్కర్లేదు మీకేవున్నాయి - ఇంత నిర్మొహమాటంగా రాస్తున్నందుకు ఏమీ అనుకోకండి పరిసస్థితులు అర్ధంచేసుకోండి - వృద్దులు ఎవరికీ బరువుకాకుండా ఇది బాగానే వుంది - పూర్వపుకుటుంబం పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు - ఇలాగే మొత్తం సాగింది ఉత్తరం !!
   
    "అబ్బాయి ఆ ఉత్తరంలో ఒక్క విషయం రాయలేదు శారదా. ఈ వృద్దులు అక్కడే మరణిస్తారు కనక వాళ్ళకి కర్మకాండ చేయటానికి కొడుకులు వస్తారా, రారా, - అసలు కర్మకాండ చేయాలా వద్దా - వాళ్ళే ఈడ్చిపారేస్తారా" - రాజారావు కర్ర ఊతతో వేగంగా అటు ఇటు తిరుగుతున్నాడు.
   
    "ఊరుకోండి నాన్నగారూ. అన్నయ్య అభిప్రాయమిది - మీ అభిప్రాయమేమిటో మీరు రాయండి" - ఉత్తరం మదిచింది శారద. 'నాన్నగారూ నా దగ్గరుండండి - వృద్దాశ్రమం దేనికీ అనదే తను - అలా అనడానికి బొంబాయివెళ్ళాక, - శారద ఇలా అనుకుంటుంటే, రాజారావు మరోలా అనుకున్నాడు "చిన్నాడి మీద నాకు కోపం ఎందుకూ దీనిమీద కోపం ఎందుకు రావద్దూ - నాన్నగారూ - నాతో తీసికెళ్ళిపోతా - రెడీకండీ అనదేం మరి" -


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS