"అప్పుడే వద్దులే... సీటు దొరికాక ఆలోచిద్దాం..." అన్నాడు చంచల్రావు.
ఇద్దరం స్ట్రాంగ్ కాఫీ త్రాగాం.
"పద... ముందు పుల్లారెడ్డి స్వీట్సు షాపుకి వెళ్దాం..."
నాకు చిర్రెత్తుకొచ్చింది.
"మళ్ళీ స్వీట్సా..."
"నిన్నయితే ఒక కిలోనే... ఈవేళ చీఫ్ మినిష్టర్ పి.ఏ. కాబట్టి రెండు కిలోలు!!.." అన్నాడు చంచల్రావు.
నేనిక మాట్లాడలేదు. సీటోస్తే అంతేచాలు.
స్వీట్సు కొనుక్కుని చీఫ్ మినిష్టరు పి.ఏ. అయిన పరంధామ్ ఇంటికి వెళ్ళాం."ఆయన చీఫ్ మినిష్టరుగారితో బాటు కిళ్ళీషాపు ఓపెనింగ్ కెళ్ళారు..." అన్నది పరంధామ్ భార్య..." ఓ రెండు గంటల తరువాత వస్తారు..."
పాపం మన నాయకులకి దేశసేవ చేద్దామని ఉంటుందిగానీ వాటినీ వీటినీ ఓపెనింగ్ చేయడానికే ఎక్కడలేని సమయం చాలదు... వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఓ రెండు గంటలపాటు రోడ్లు కొలిచి పరంధామ్ ఇంటికి వెళ్ళాం.
"అబ్బే... సెయింట్ డన్స్ స్కూలా?.... అక్కడ రికమెండేషన్లేవీ పంజేయవు... గవర్నమెంటు గగ్రాంటులేవీ ఆ స్కూలుకి మేం ఇవ్వడంలేదు కదా. ఆ ప్రిన్స్ పాల్ మహాకర్కోటకుడు... ఎవరిమాట వినడు... ఓ అయిదు వేలు వాడి మొహాన పడేయండి..." అన్నాడు పరంధామ్ నేనిచ్చిన స్వీటు పాకెట్సుని ప్రేమగా నిమురుతూ-
"ఇంక వీడికి స్వీట్సెందుకూ దండగ తీసేస్కుంటాను...." అని చంచల్రావు చెవిలో గొణిగి స్వీటు పాకెట్స్ అందుకోడానికి చేయిచాపాను.
"అబ్బే... మరేంలేదు.... మీతో కరచాలనం చేసి పోదామనీ...." అన్నాడు చంచల్రావు పరంధామ్ తో.
పరంధామ్ నా చెయ్యి పట్టుకుని స్వీట్సు దొరికిన హుషారులో గట్టిగా ఊపేస్తూ షేక్ హాండ్ ఇచ్చాడు.

ఇద్దరం ఇంటి దారి పట్టాం.
"ఈ వేళ ఈ సమస్యకు పరిష్కారం దొరికితేగానీ ఇంటికి వెళ్ళేది లేదు...పద... హోటల్లో భోజనంచేస్తూ మాట్టాడదాం" అంటూ ఎదురుగా కనిపించిన గీమత్ హోటల్లోకి వెళ్ళాం.
ప్లేటు భోజనానికి చెరి నాలుగు రూపాయలు వేసుకుని తినడానికి అన్నంతో బాటు గుర్రానికి పెట్టేగుగ్గిళ్ళు పెట్టాడు.
ఇద్దరం తినడం ప్రారంభించాము.
హఠాత్తుగా నా మెదడులో మెరుపు మెరిసింది... కెవ్వుమని కేకేశాను సంతోషంతో. చంచల్రావు అన్నంముద్ద నోట్లో పెట్టుకోబోయి ముక్కుమీద పెట్టుకున్నాడు... మాతో భోజనం చేస్తున్న వాళ్ళలో ముగ్గురు నలుగురు పొరబడ్డారు.ఎవరికో భోజనం ప్లేటు తీసుకెళ్తున్న సర్వరు ఢామ్మని క్రిందపడి పోయాడు.
"నువ్విలా పదిమందిలో ఎక్సైట్ అవ్వడం మానుకో... ఇంతకీ ఏమిటి సంగతి?...." అన్నాడు రుమాలుతో ముఖం మీద ఎంగిలి తుడుచుకుంటూ చంచల్రావు.
"నీకు బొంబాయిలోని మెహబూబ్ పాషా తెలుసు కదూ?"
"అవును...ఒకప్పుడు మేమిద్దరం కలిసి చదువుకున్నాం."
"అతను ప్రస్తుతం సినిమాల్లో అమితాబ్ బచ్చన్ కి డూప్ గా వేస్తున్నాడు కదూ?"
అయితే?...."
"ఓరి మట్టిబుర్ర.... ఇంకా అర్థం కాలేదా?.... మనం బొంబాయివెళ్ళి మెహబూబ్ పాషా ద్వారా అమితాబ్ బచ్చన్ ని పరిచయం చేసుకుందాం.... అమితాబ్ మన ప్రైం మినిష్టరుగారి కుటుంబానికి ఆప్తుడు కదా... అతని ద్వారా ప్రైమినిష్టర్ తో ఫిలిప్స్ గాడికి ఓ ఫోను కొట్టిస్తే... నా సామిరంగ....."
"హి... హి.... హి...." గుర్రం సకిలింపు.... హోటల్లోకి గుర్రం ఎక్కడనుంచి నచ్చేసిందో అని నేను గాభరాగాచుట్టూ చూశాను.
"హి... హి.... హి....."
శబ్దం నా ప్రక్కనుండే వచ్చింది... చంచల్రావు నవ్వుతున్నాడు, గుర్రంలా సకిలిస్తూ.
వెధవ... గుగ్గిళ్ళు ఎక్కువ తినేశాడు. అదీ సంగతి. గుగ్గిళ్ళు ప్లేటు దూరంగా లాగేసి "ఇహ వీట్ని తినకు..." అని కోప్పడ్డాను.
"హబ్బ.. భలే జోకేశావురా..." అన్నాడు సకిలింపు ఆపి.
"ఏం?.... నా ఐడియా నచ్చలేదా?....."

"అదేం జరిగేపని కాదు గానీ... లాస్ట్ రిసార్టుగా ఒక ప్లాను దాచి ఉంచాను... అది మంచి పని కాదుగానీ ... ఇక తప్పదనిపిస్తుంది...."
"అదేమిటో త్వరగా చెప్పు... చెప్పు చెప్పు-"
"ఫిలిప్స్ గాడి గురించి ఎంక్వైరీ చేశాను. వాడికి ఆడాళ్ళపిచ్చి చాలా ఉంది. ఒక కాల్ గర్ల్ ని బుక్ చేసి వాడి దగ్గరికి పంపుతే చాలు.నీకు కె.జి.క్లాసు సీటు దొరికినట్టే.
