Previous Page Next Page 
విశిష్ట పేజి 47

    ఒకడు దొంగతనం చేశాడన్నా, ఖూనీ చేశాడన్నా, అత్యాచారానికి పాల్పడ్డాడన్నా దాని వెనుకున్న కారణాలు సానుభూతితో చూడాలి! ఇప్పుడంతా సర్దుకోవాలంటే ఆమె మా ఇంటి కోడలు కావడం ఒక్కటే దారి అనిపించింది.

    అందుకే నాకు నేనుగా వెళ్ళి పెళ్ళి ప్రపోజల్ చేశాను. ఆమె అర్ధంచేసుకొని అంగీకరించింది. ఈ వివాహం ఆమె తండ్రికి యిష్టంలేదు. అందుకే వాళ్ళెవరూ పెళ్ళికి రాలేదు. ఎవరు కాదన్నా చేసుకునే అమ్మాయి యిష్టపడింది కదా అది చాలనుకున్నాను."

    "మీరు రాజకీయ నాయకులు కదా! ఈ వివాహం జరపడంలో పెద్ద రాజకీయమే వుందని మేం అనుకుంటున్నాం. ఆమెను మీ కోడల్ని చేసుకుంటే మీ కొడుకును కేసులనుండి తప్పించవచ్చని మీ ఆలోచన....... అవునా?"

    "కేసులనుండి నా కొడుకును తప్పించాలంటే ఆమెను కోడల్ని చేసుకోవాల్సిన అవసలం ఏం లేదు. హోం మినిస్టర్ గా రిజైన్ చేసినంత మాత్రాన నా పని అయిపోయిందని అనుకోవద్దు. ఈ మినిస్ట్రీ కి రిజైన్ చేస్తే మరో మినిస్ట్రీ నాకోసం రెడీగా వుంటుంది. అందులో నో డౌట్! నాకున్న పలుకుబడితో నా కొడుక్కి ఉరిశిక్షపడినా తప్పించగల పవరు నాకుంది"

    "అంత పవరున్న మీరు విశిష్టగారిని బెదిరించి ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పించారు?"

    "చెప్పమ్మా! నిన్ను నేను బెదిరించానా?"

    "లేదు -నన్ను ఆయన బెదిరించలేదు."

    "బెదిరించకపోతే మీరీ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నారు? ఇంతకు ముందు మీ నాన్నగారిని కలిసి ఇంటర్వ్యూ చేసివచ్చాం. ఆయన చాలా సంగతులు చెప్పారు"

    "ఏం చెప్పారు?"

    "ఈ పెళ్ళికి మీరు ఒప్పుకోకపోతే మీ కుటుంబాన్ని ఆయన సర్వనాశనం చేస్తానని బెదిరించారని, అందుకే మీరీ పెళ్ళికి ఒప్పుకున్నారనీ......"

    "అదేం లేదు. నేను ఇష్టపూర్తిగానే ఒప్పుకున్నాను ఈ పెళ్ళికి. ఇందులో ఎవరి బలవంతమూ లేదు బెదిరింపులూ లేవు." "మీ నాన్నగారు అబద్ధం చెప్పరంటావా?"

    "ఆయనకీ పెళ్ళి యిష్టంలేదు. అందుకని ఏదో చెప్పాలని చెప్పారేమో!"

    "పృధ్వీగారూ! ఈ పెళ్ళి మీరు ఇష్టంతో చేసుకున్నారా ? ఏదో కేసులనుండి బయటపడొచ్చునన్న స్వార్ధంతో చేసుకున్నారా?"

    "ఇందాక ఈ ప్రశ్నకు మా నాన్నగారు జవాబు చెప్పారుకదా? మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నారు?" పృధ్వీ అసహనంగా అన్నాడు.

    "మీ జవాబు కూడా వినాలని."

    "మా నాన్నగారు చెప్పిందే నా జవాబు

    "మొత్తానికి రాజకీయనాయకుడి కొడుకు అనిపించుకున్నారు. మీరు ఆచు తూచి మాట్లాడడం చూస్తుంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందేమో అనిపిస్తోంది."

    "మీ పత్రికలవాళ్ళకి అలవాటేకదా ఏదేదో ఊహించడం, అవన్నీ పత్రికలకు ఎక్కించడం! ఏమిటో మీ పత్రికలవాళ్ళు మా రాజకీయనాయకులపట్ల శకుని సారధ్యం వహిస్తున్నారేమో అనిపిస్తుంది. అనని మాటలు అన్నట్టుగా రాస్తారు. అన్న మాటలు వక్రీకరిస్తారు!" అన్నాడు మాదవరావు.

    "మా పత్రికలమీద అనవసరంగా అపవాదు వేయకండి సార్! మీ రాజకీయనాయకులకు మా పత్రికలు సోపానాలవంటివి! మంచికైనా చెడ్డకైనా మీ గురించి పబ్లిసిటీ ఇచ్చేవే పత్రికలుకదా? ప్రతిపక్షాలమీద బురద చల్లాలన్నా, మీరు చేసే సేవలు ప్రజలకు తెలియాలన్నా పత్రికలే ఆయుధాలు కదా?" సీరియస్ గా అన్నాడొక విలేఖరి.

    "అవునబ్బా! ఆ మాట కాదన్నదెవరు? మేం లేకపోతే మీ పత్రికలు నడుస్తాయిగాని మీ పత్రికలు లేకపోతే మాకు నడవదు.

    మాకూ ప్రజలకూ మీ పత్రికలు వారధిలాంటివి! పత్రికల మీద ఆ గౌరవం నాకెప్పుడూ వుంటుంది. భయం కూడా ఉందండోయ్! మీ కలాలు పదునెక్కి ఎప్పుడేం రాసి మమ్మల్ని తికమక పెడతారోనని."

    "మీరు ఇక్కడోమాట, అక్కడోమాట అని మమ్మల్ని తికమక పెట్టకుంటే చాలు సార్"

    నవ్వులు!

                                           *    *    *

    అది శోభనపు గది అలంకరించి వున్నా వాతావరణం యుద్దభూమిలా వుంది.

    వెలిగించిన అగరొత్తులు సువాసనలు వెదజల్లుతూ కాలిపోతున్నాయి.

    ఏపిల్ పండును అందుకుని చాకుతో కోస్తున్నాడు పృధ్వీ.

    అతడికి కొంచెం దూరంలో నిలబడింది విశిష్ట.

    "ఇప్పుడు చెప్పు -నన్ను పెళ్ళి చేసుకోవడంలో నీ ప్లాన్ ఏమిటో?" అడిగాడు ఉన్న ఒక కన్నుతో ఆమెను గుర్రుగా చూస్తూ.

    నల్ల కళ్ళజోడు తీసేస్తే ముఖాన్ని చూడడం బహుకష్టం. ఒక విధమైన జలదరింపుతో కళ్ళు ప్రక్కకు తిప్పుకుంది విశిష్ట.

    "పెళ్ళి ప్రపోజల్ తెచ్చింది నీ బాబు! నేను కాదు! మా ఇంటికి వచ్చి నిన్ను పెళ్ళి చేసుకోకపోతే మా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించాడు.

    నా ఒక్కదానికోసం మా కుటుంబాన్ని బలిపెట్టడం ఇష్టంలేక నా జీవితం ఏమైనా కానీ అన్న ఇదితో ఈ పెళ్ళికి అంగీకరించాను. ఆటలో పావులు కదుపుతున్నది మీరు! నేను పావుని మాత్రమే పావుకి ప్లాన్ వుండదు"

    "బెదిరింపులకు భయపడే మనిషివి కావని నాకు తెలుసు. నీ మనసులో ఏదో దురుద్దేశ్యం పెట్టుకునే ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టావు. చెప్పు! ఈసారి ఏమిటి నీ ప్లాన్? ఇదివరకు వచ్చి కురూపిని చేసిపోయావు. ఇప్పుడు ఏకంగా హత్య చేయాలనా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS