28
నా హృదయానికి, నా మనస్సుకు, నా బుద్దికి వనితాలోకం తప్ప ఇంకొకటి దృశ్యం కావటమేలేదు. ఆడవాళ్ళ ద్వారా భగవంతుని పైనా, ప్రపంచంపైనా కసి తీర్చుకోవాలి. ఆస్తిపోయినవాడికి లోకంలో ధనమంతా వాడి ఆస్తే. అలాగే భార్య పోయిన నాకీ స్త్రీ దాహం విపరీతం అయింది. దాహం తీర్చుకోలేని వ్యాధి పీడితునిలా ఆ వనితా జలధివెంట తిరగడమే కాని, అందులో మునగలేదు.
శుఠను కాలేని శుద్ధ హీనాత్ముణ్ని. నన్నీ నారీలోకమంతా హేళన చేస్తోందని భావించాను. వాళ్ళను హేళన చేశాను. మా ప్రయాణాల్లో వాళ్ళు వింటూండగా మా సుబ్బులుతో ఆడవాళ్ళను ఎత్తిపొడవడం, వాళ్ళను శంకించడం, దుర్భాషలాడడం సాగించాను. కొందరు మగవాళ్ళు ఆ మాటలను వింటూ నన్ను ఎత్తిపొడిచారు, కొట్టవచ్చారు. ఒకసారి రైలు కుడా ఆపుచేసేటంతవరకు వచ్చింది.
అప్పుడే ఒక మహిళారత్నం నా వైపు తిరిగి, పూర్వీభాషలో ''ఓ అబ్బాయీ! ఇందాకటినుండీ నీ పేలుడంతా వింటున్నాను. నీ మొగం చుస్తే జబ్బుతో ఉన్న మనుష్యునిలా కనబడుతున్నావు. మీబోటి తుచ్ఛులు మా స్త్రీలను చేసే అవమానం మితిమీరిపోతూ ఉంది. నీకు కనబడేది స్త్రీల దేహమా, వాళ్ళ అందమా? వాళ్ళ తెలివి అంతా వాళ్ళ అందమైన అంగాలలో ఉందా? వాళ్ళు భోగవస్తువులా? వాళ్ళు పురుష వాంఛలు తీర్చడానికి పుట్టారా? నీ తప్పుల హిందీ ప్రలాపాలు వింటూంటే నువ్వు మదరాసి వాడిలా కనబడుతున్నావు. మదరాసీ మగవాళ్ళు మా ఉత్తరాది మగవాళ్ళకన్న పెద్దమనుష్యు లనుకున్నాను. ఛీ! ఛీ! ఏమి బ్రతుకయ్యా నీది!
'' రా, నీకు ఆడవాళ్ళు పశువులో, దద్దమ్మలో, శక్తి రూపిణులో చూపుతా, మా లక్నో స్త్రీ మండలి అఖేడాకు. నీలో ఇంతైనా మానవత్వం ఉంటే ఈలాంటి నీచ ప్రలాపాలు కట్టిపెట్టి నోరు సర్వకాలం మూసుకుని ఉండే ప్రయత్నం చేయి. లేదంటావా, నేనే నాలుగు లెంపకాయలు తగిల్చి నీ జబ్బు కుదురుస్తాను'' అంటూ ఆమె నా వైపు క్రోధారుణ నయనాలతో చూచింది.
మా వాడు ఆమెకు నమస్కారంచేసి, ''అమ్మా! మావాడు చాలా జబ్బులో ఉన్నాడు. రెండుసార్లు చచ్చి బ్రతికాడు. అతని మనస్సు సరీగా లేదు''అన్నాడు.
'' ఒరే సుబ్బులూ నీ కెందుకురా నా గొడవ? ''అన్నాను. ఇంతలో లేచాడో గాహర్వాల్ రాజపుత్రుడు.'' ఇస్ లుచ్చేకి బాత్ సున్కర్,మేరా బదన్ జల్ రహా హై.(ఈ తుచ్ఛుని మాటలు వింటోంటే నా వళ్ళు మండిపోతుంది)'' అంటూ నాదగ్గరకు వచ్చాడు. నేనూ లేచాను.
నా పూర్వబలం పూర్తిగా పోలేదు. ఇద్దరం ఇంకో నిమిషంలో ఎంత కొట్టుకొందుమో, మా సుబ్బులూ, నన్ను చివాట్లు పెట్టిన ఆ లక్నో వీరనారీ లేచి మా ఇద్దరి మధ్య అడ్డం వచ్చారు. వాళ్ళిద్దరూ ఆ రాజపుత్రునికి సర్ది చెప్పారు.
మా అమ్మ లేచి ఆ రాజపుత్రునికి నమస్కారం చేస్తూ కళ్ళనీళ్ళు కారిపోతూ ఉండగా తెలుగులో '' అయ్యా, వాడు నాకు ఏకపుత్రుడు. రెండు సార్లు చచ్చి బ్రతికాడు. మనస్సు సరిగాలేదు. రక్షించు నాయనా! వాడి మీద దేబ్బపడితే చచ్చిపోతాడు. వాడు చస్తే నా ప్రాణం వెంటనే పోతుంది'' అంటూ గజగజ వణికిపోయింది.
ఆ రాజపుత్రుడు నెమ్మదించి'' ఫరవానై మాయీ!'' అని కూర్చున్నాడు. నేనూ కూర్చున్నాను. రైలు హరిద్వారం వచ్చింది. హరిద్వారం గంగానదికి కుడివైపున ఉంది. హిమవత్పర్వతాల వెలువడి గంగానది ఆర్యావర్త సమపథాలలో ఇక్కడనే ప్రవేశిస్తుంది. స్టేషనులో దిగాము. ఓ గంగాపుత్రుడు మమ్మల్ని సత్రంలోకి తీసుకుపోయాడు. వెంటనే గంగకు పోయి హరికాచరణ్ ఘట్టంలో స్నానం చేశాము. నేను స్నానం చేయడం పుణ్యంకోసం కాదు. అది హరిచరణ ఘట్టమైనా ఒకటే అసురచరణ ఘట్టమైనా ఒకటే. స్నానంచేసే ఆడవాళ్ళూ, వేసవికాలంలో స్నానవాంఛా తప్ప మరేమీలేదు. మా అమ్మగారూ, సుబ్బులు అతిభక్తితో స్నానంచేసి అయిదారు రూపాయలు ఖర్చు చేశారు. వాళ్ళు దగ్గిరనే ఉన్న గంగాద్వార మందిరంలోకి వెళ్ళారు. నేను బజారు చూసుకుంటూ సత్రంలోకి వచ్చి కూర్చున్నాను.
ఇక్కడ హరిద్వారంలో రకరకాల సుందరాంగులు నా కంట పడ్డారు. ప్రపంచం స్త్రీ సౌందర్యంతో నిండినట్లే నాకు కనిపించింది. రైలులో ఆ లక్నో వనిత అన్న మాటలు నా మనసు కలత పెట్టుతున్నవి. నాకు ఆ రాజపుత్రునిమీదా ఆ లక్నో స్త్రీమీద పట్టరాని కోపం లోపల కతకుత లాడుతున్నది. మేము ఉన్న గదిముందు వరండాలో బోనులోని జంతువులా తిరుగుతున్నాను.
నాకు లోకంమీద కసి తీరలేదు. దైవం మీద కసి తీరలేదు. ఏమి చెయ్యను? దేవుడి గుళ్ళల్లో దొంగతనాలు చెయ్యనా? రాత్రిళ్ళు దేవుళ్ళ విగ్రహాలను ముక్కలు చేయనా? హరిచరణమట! హరిణనేత్ర చరణం కాదూ? స్నాన ఘట్టంలో రాతిమీద ఓ చచ్చు అడుగు చెక్కి, అది హరిచరణం అనేవాడు ఒక శుంఠ. అది చెక్కించినవాడు మరో శుంఠ. అది నమ్మి పూజించినవాడు అంతకంటె శుంఠ. ఈ శుంఠలందరు దేశాన్ని దద్దమ్మ, చచ్చమ్మ, కుంకమ్మ దేశాన్ని చేసి పాడుచేసి పారేశారు.
29
హరిద్వారం వచ్చిన మర్నాడు తెల్లవారగట్ల తిన్నగా స్నాన ఘట్టానికి పోయాను. ఏమిటా హరిచరణం? దానికి నా చరణప్రహరణం ఇస్తే ఏమవుతుంది? స్నానఘట్టానికి వెళ్ళడంతోటే అక్కడ అప్పుడే స్నానం చేస్తూన్న సాధువు లెవ్వరూ చూడకుండా, ఇతర దొంగభక్తు లెవ్వరూ కనుగొనకుండా హరిచరణాన్ని నాలుగు తన్నులు తన్నాను. ఏమి చేయగలిగిందా చరణం? విష్ణుచక్రం రాలేదే? గరుత్మంతుడు తన్నుకుపోలేదే? పాంచజన్య శంఖారావాలు భూనభోంతరాళాలు వ్రక్కలు చెయ్యలేదే? లోకం తలక్రిందులు కాలేదు, సముద్రాలు పొంగిరాలేదు. మిన్ను విరుచుకు పడలేదు. నక్షత్రాలు డుల్లలేదు. హ్హా! హ్హా! హ్హా! ఓయివెఱ్ఱి విష్నుపదమా! నన్నేం చేస్తావు. నువ్వు నువ్వా దద్దమ్మ పంగనామాల వాళ్ళను ఏడిపిస్తావు? నన్నేం చేయగలవు? నాకు నువ్వంటే భయమా?
