"నిజం చెప్పు. గుర్తుతెచ్చుకొ. నేనడిగేది అమ్మాయిల్ని. ఎందరువేసి పోయుంటారు?"
వాడు దీర్ఘంగా ఆలోచించి "నిన్న పొద్దుగాలటప్పా బాబయ్య డబ్బా ఇప్పక ముందా?" అడిగాడు ముష్టివాడు.
అమితేష్ కు ఎంత చూడొద్దనుకున్నా-వాడి పుళ్ళమీద చూపుపడి ఒళ్ళు గగుర్పాటు కల్గుతోంది.
"ఆ....ఆ...అంతకుముందే!"
"ము___గ్గు___రే__ఆడోల్లు ఏసినట్టు యాదికుంది" అన్నాడు వాడు ఎటో చూస్తూ.
"చెప్పు__చెప్పు-ఎలా వుంటారు వాళ్ళు."
వాడు మరో పదినిముషాలు ఆలోచించి, బుర్రచించి చివరికి 'యాదికి రావటం లేదు బాబయ్యా' అన్నాడు.
"పోనీ__ఎటువేపు నుండి వచ్చి_లెటర్స్ వేసి ఎటువేపు పోయారో చెప్పగలవా?" అడిగాడు.
"ఒకమ్మాయి ఇట్నుంచి వచ్చి టప్పాయేసి అటువెళ్ళింది. సదూకుంటున్న అమ్మాయిలా వుంది.
ఇంకోకామే అట్నుంచి వచ్చి వేసి అటేపోయింది. అయితే మూడోగామె నైతే నాకు పైసలేసింది బాబయ్యా. ఎందుకో ఇగ నేను పరీచ్చగా సూళ్ళేదు ఎటు పోయిందో" అన్నాడు వాడు.
"ఎన్ని పైసలేసింది" లేస్తూనే అడిగాడు అమితేష్.
"మాత్మురాలు రూపాయి బిల్లేసింది బాబయ్యా. కొత్తది కదాని దాపెట్టుకున్నాను" ముళ్ళేలోంచి వాడు తీసి చూపించిన బిళ్ళ చూసి వెళ్ళబోయిన వాడల్లా ఆగిపోయాడు.
"ఏదీ?" ఇలా ఇవ్వు" అని తీస్కుని చూసాడు. చాలా క్రొత్తగా వుండది.
ఒకవేపు ఒకటో అంకె-రెండోవేపు ఇందిరా గాంధి బొమ్మ.
అమితేష్ క్షణం పాటు ఆలోచించాడు.
ఇందిరాగాంధి బొమ్మగల రూపాయి బిళ్ళలు రెండ్రోజుల క్రితమే విడుదలయినట్లు పేపర్లో చదివాడు తను. ఇంత తొందరగా ఇవి ఎక్కువగా సర్క్యూట్ కావు. ఏ కొద్ది మంది దగ్గరో వుంటాయి.
దీనితో ప్రయత్నిస్తే!
ఈ బిళ్ళ ఆ అమ్మాయే వేసిందని ఎందుకనుకోవాలి?
అయిన ట్రై చేద్దాం అని-దాన్ని చూపుడు వ్రేలిమీద పెట్టి బొటన వ్రేలితో చిమ్మి గిరవాటేసి గాల్లోనే పట్టుకొని జేబులో వేసుకున్నాడు అమితేష్.
'ఇది వుండనీ' అని వాడికి చెప్పి మళ్ళీ మోటార్ బైక్ మీద బయల్దేరాడు.
* * * * *
ధారపాతమైన ఆమె కళ్ళనీళ్ళు ఫోమ్ బెడ్ ని తడుపుతున్నాయి.
"నా నిర్ణయంలో - నీకే అపచారం కన్పించినా నన్ను క్షమించునుగా....."
ఆమె రివ్వున లేచి వెనక్కీ తిరిగింది. చూపుల్ని అడ్డగిస్తున్న నీటి పొరలమధ్య మసకమసగ్గా కన్పించాడు శరత్ గుమ్మం దగ్గర.
"నిన్ను మనస్తాపానికి గురిచెయ్యొద్దని-నేనెప్పుడూ నీ సంతోషం ఆలోచిస్తాను. చివరికి నీలోని మాతృత్వానికి ప్రాణం పోయ్యడానికి నా గుండెల్లో ఒక రహస్యాన్ని దాచుకొనైనా నీ కళ్ళలో కాంతులు చూడాలని ఎంతో ఆలోచించి- ఏదో ఆశించి ఆ నిర్ణయం తీసుకొన్నాను తప్ప నా ఆలోచనల్లో అంతటి నీచత్వం వుందని నీకనిపిస్తే-నిజంగానే క్షమించు!" అన్నాడు శరత్ గంభీర్యాన్ని ఆపాదించుకున్న మేరు దీరువులాగా నిల్చుండి.
ఆ మాటకు ఆమె గుండెల్లో ఘనీభవించిన విషాదం నరనరాల్లో జరజరా ప్రాకింది మరోసారి. ఒక్క మటున వెళ్ళి అతడి త్యాగానికి పాదాల్ని కన్నీటితో అభిషేకించేదే!
ఏదీ చేయలేని నిస్సహాయస్థితి.
"నా నిర్ణయంలో నువ్వు ఏదో అసంకల్పిత అక్రమ సంబంధాన్ని వూహించుకోవచ్చు. అలా వూహిస్తే అది నీ తప్పుకాదు. అంతరాల్లో పేరుకుపోయిన తరతరాల మన సాంప్రదాయం, పురాణ కథలూ, నీ పూజలూ నిన్ను నిలదీస్తుండొచ్చు. శారీరకంగా కలువకుండానే నీ దేవుళ్ళూ కన్నారు పిల్లల్ని. అది రీజనింగ్ దొరకని కథలు. కాను సుగా.....మనసా, వాచా, కర్మణా నీ మేలు కోరేవాడ్ని."
అతని ఎరుపెక్కిన నేత్రాల్లో - కన్పించే కరుణరసం!
రౌద్రం ఎరుగని ఆర్ద్రత!
అక్కడ వాళ్ళ విషాదం లాగే ఘనీభవించిన నిశ్శబ్దం నీరవ వాతావరణం.
కనుపాపలంచుల్లో అలలై ఎగిసి అలసిపోయి జారుతున్న కన్నీటిలోంచి ఊపిర్లు బిగబట్టి ఆవేదనా భరితంగా చూస్తుందామె. కలవరపాటు లాంటి నిర్ణయాన్ని త్రోసిపుచ్చి కలత పెడుతున్నందుకు క్షమించమనికూడా అడుగలేని నిస్సత్తువతో-
నిరాశ్యం నిండిన నిశ్చలత్వంతో-
"నా తల్లి ఎలా వుంటుందో నేనెరుగను. నిన్ను తల్లిని చేసి ఆ మాతృత్వపు మనుగడల్లో నా తల్లిని చూసుకుందామనే కోరికా కావచ్చు. నీలోని నిష్కల్మషమైన సాత్వికథే నన్ను పురికొల్పి వుండొచ్చు. నాలోని లోపానికి నీపై నిందని తొలగించాలనే ప్రయత్నమూ కావచ్చు. ఆస్థి కోసం కాకపోయినా రేపు మన అస్థికల్ని కాల్చి ఏ కాశీలోనో కలుపడానికి వారసుడుండాలనే వాంఛా కావచ్చు. మొత్తానికి గుండెల్లో ఘనీభవించిన విషాదాన్ని చిరువెలుగుతో కరిగిద్దామనే ప్రయత్నం తప్ప మన మధ్య విషాదాన్ని పెంచాలని కాదు. నా ఆలోచనల్లో పొరపాటంటే ప్రక్కదోవ తొక్కినందుకు మరోసారి క్షమించు."
ఆ ఒక్క 'క్షమించు' మన్న పదమే ఆమె గుండెల్ని మలిపెట్టి త్రిప్పుతోంది.
ఆర్ద్రత నిండిన అతడి మాటలు ఎక్స్ రే కిరణాల్లా గ్రుచ్చి ఆమె శరీరంలోని ఇనుమును కరిగిస్తుంటే-ఊపిరందని ఉద్వేగమేదో రక్తాన్ని పరవళ్ళు తొక్కిస్తుంటే-దూరమైపోతున్న భావనతో ఉండబట్టలేక అతడి కాళ్ళను చుట్టేసింది.
