Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 47


                                    దొంగ
                                                                 వసుంధర

    నాగేశ్వరరావు మనసు ఆమె చుట్టూ ప్రదక్షిణం చేస్తోంది. ఆమె షాపులో ప్రవేశించి పదిహేను నిమిశాలైంది. షాపులో పని కుర్రవాళ్ళు, షాపింగు కి వచ్చిన మగవాళ్ళూ ఎందరో ఉన్నారు. వారు మాములుగా - ఆమె వచ్చినాక కూడా - వారు చేసుకుపోతున్నారు. ఎవరి దృష్టిలో వారున్నారు.
    కానీ షాపు యజమాని నాగేశ్వరరావు మాత్రం ఆమెనే చూస్తున్నాడు.
    పదిహేను నిమిషాల అనంతరం ఆమె ఒక వాచీ తీసింది. అద్దాల తలుపును పక్కకు తొలగించి - ఆ వాచీని సుతారంగా చేతితో తీసింది. నాగేశ్వరరావు ఆమెని గమనిస్తూనే ఉన్నాడు. ఆమె కళ్ళు వెలిగాయి. అప్రయత్నంగానే కాబోలు - ఆమె వాచిని చిన్నగా పెదవులతో స్పృశించింది.  అనంతరం అద్దాల తలుపు మూసింది. వాచీ ఇంకా ఆమె చేతిలోనే ఉంది. నాగేశ్వరరావు ఉత్సాహంగా ఆమెను గమనిస్తున్నాడు. ఆమె దగ్గర డబ్బు తీసుకోరాదని , ఆ వాచీని ఆమెకు బహుమతి గా ఇవ్వాలని అతనికి ఆ క్షణంలో అనిపించింది. ఎంత నచ్చకపోతే ఆమె ఆ వాచీని ముద్దు పెట్టుకుంటుంది ? అంతటి అందగత్తె ను - తనబోటి గాడు ఒక వాచీ బహుకరించి గౌరవించావలసి వున్నదని అతనికి అనిపించింది.
    బహుశా అతని మనసులోని అభిప్రాయం టెలిపతీ ద్వారా తెలుసుకుందో ఏమో - ఆమె నెమ్మదిగా అక్కణ్ణించి బయటకు వచ్చింది. వాచీ ఆమె చేతిలోనే వుంది. కానీ ఆమె కౌంటర్ దగ్గర ఆగలేదు. నెమ్మదిగా కౌంటర్ దాటి షాపులో నుంచి బయటకు వెళ్ళి పోయిందామే. నాగేశ్వరరామెను కళ్ళప్పగించి చూస్తున్నాడు.
    షాపులోని ఒక కుర్రవాడతని దగ్గరకు పరుగెత్తు కుంటూ వచ్చి "సార్! ఆమె ...." అంటూ ఏదో చెప్పబోయాడు.
    "నాకు తెలుసులే , వెళ్ళు" అన్నాడతను.
    కుర్రవాడు ఇంకా సందేహంగా అక్కడే నిలబడిపోయాడు. నాగేశ్వరరావు విసుగ్గా అతని వంక చూసి , "అది నాకు తెలుసులే వెళ్ళు" అన్నాడు. కుర్రాడు వెళ్ళిపోయాడు.
    ఇప్పుడు నాగేశ్వరరావు మెదడు చిరుగ్గా పనిచేస్తోంది. ఎవరామే? అందంగా వుంది. పెద్ద మనిషి తరహాగా , మర్యాదస్తురాలిగా కనబడింది. ముఖం అమాయకంగా వుంది. ఆమె ముఖంలో కనబడ్డ ఈ లక్షణాలకూ - ఆమె ప్రవర్తించిన తీరుకూ ఎక్కడా పోలిక కనబడలేదు.
    అయితే వాచీని తీసుకు వెడుతున్నప్పుడు ఆమె ముఖంలో ఎక్కడ ఆందోళన గానీ, కంగారు గానీ భయం కానీ, కనబడలేదు. చాలా మాములుగా బయటకు వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆమెను ఆపితే -- ఆవమానంతో అమెముఖం మలినం కావచ్చు. అలా జరగడం ఇష్టం లేని నాగేశ్వరరావు ఊరుకున్నాడు.
    ఆమె నిజంగా దొంగే కావచ్చు. కానీ పది మందిలో ఆమెను దొంగగా నిలబెట్టడం అతనికిష్టం లేకపోయింది. ఆ వాచీ ఖరీదు సుమారు రెండు వందల రూపాయలుంటుంది. ఆమాత్రం మొత్తాన్ని అతను వదులుకో గలడు.
    అయితే ఎవరామే? ఎందుకలా ప్రవర్తించింది? అన్నప్రశ్నలకి మాత్రం అతనికి సమాధానం దొరకలేదు. మరో అరగంట వరకూ. మరో అరగంట లో ఆమె అదే షాపుకి వచ్చింది. ఈసారి తిన్నగా కౌంటర్ దగ్గరకేవచ్చింది.
    "క్షమించాలి. కొద్ది సేపటి క్రితం మీ షాపు లోంచి నేను ఒక వాచీ తీసుకున్నాను. డబ్బు ఇవ్వడం మర్చిపోయాను." అందామె. కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టి నాగేశ్వరరావు వంక చూస్తూ. నాగేశ్వరరావు ముఖంలో సంతృప్తి కనబడింది. తన నాకర్శించిన అందం ఒక దొంగది కాదు. పరధ్యానంగా ఆమె తీసుకు పోయిందా వాచీ.
    "ఏం ఫరవాలేదు. మీరా వాచీ తీసుకు వెళ్ళడం నేను చూశాను. కానీ ఆపలేదు. ఎందుకంటె మీరు చాలా మర్యాదస్తులని నాకు అనిపించింది. మిమ్మల్ని ఆపడం అవమానించడమే నని నాకు తోచింది. మీరు డబ్బు ఇవ్వడానికి తిరిగి వస్తారని నాకు తెలుసు" అన్నాడతను నవ్వుతూ.
    "చాలా థాంక్స్ . కానీ ఇలా అందర్నీ నమ్మితే మీ వ్యాపారం."
    'చూశారుగా , మూడు పువ్వులూ, ఆరు కాయలుగా ఉంది. ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూదదో నాకు బాగా తెలుసు. ముఖం చూసి మనుషుల్ని పట్టేయగలను. మీ ముఖంలోని అమాయకత్వం చూస్తూనే మీరు దొంగ కాలేరని అనుకున్నాను."
    "థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ ! అయితే చిన్న సవరణ. నేను డబ్బు ఇవ్వడానికి కాదు తిరిగి వస్తా. వాచీ ఇవ్వడానికి" అందామె.
    "ఏం?" అన్నాడతను.
    "నిజానికి నేను వాచీ కొనడానికి రాలేదు మీ షాపుకి. కేవలం ఎన్నిక చేయడానికి మాత్రం వచ్చాను. ఈ వాచీ నాకు బాగా నచ్చింది. తిరిగి కేసులో పెట్టి పోదామనుకోన్నాను కానీ పొరపాటున కూడా తీసుకొని వెళ్ళిపోయాను."
    "కానీ మీరు నచ్చింది కదా - తీసుకోడానికేం?"
    "తీసుకునే ఉద్దేశం లేకనే - కూడా డబ్బు తీసుకురాలేదు."
    "డబ్బు, దేముంది లెండి. మీకా వాచీని బహుమతిగా ఇచ్చాననుకొని తీసుకొని వెళ్ళండి."
    "నో, నో, నో . ముక్కూ ముఖం ఎదుగని మగవాళ్ళ దగ్గర్నుంచి బహుమతి తీసుకోవడం మా వారి కిష్టముండదు"
    'అరె- మీకు వివాహమైందా?" ఆశ్చర్యంగా అడిగాడతను.
    "ఇప్పుడు కాదు . రెండు సంవత్సరాల క్రితం అందామె.
    "మీరు నాకు నచ్చారు. మిమ్మల్ని వివాహం చేసుకున్న అదృష్ట వంతుడేవరో తెలుసుకోవచ్చా?"
    ఈసారి ఆమె ముఖంలో చిలిపి తనం ఏర్పడింది. "ఆ అయన బ్రహ్మచారి!" అందామె.
    "మీ భర్త బ్రహ్మచారా? మరి వివాహ మైందంటూన్నారు?' అర్ధం కాక అడిగాడతను.
    ఆమె వాచీ అతని - కౌంటర్ ముందు పెట్టి "కావాలంటే ఎడ్రస్ ఇస్తాను రాసుకోండి. డాక్టర్ వై. బ్రహ్మచారి. లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ , వాణి సైన్సు కాలేజీ" అంది. ఆ తరువాత ఆమె వెళ్ళిపోయింది.
    నాగేశ్వరరావు మనసు గజిబిజీగా అయిపొయింది. అప్రయాత్నంగా అతనా వాచీని అందుకుని చూశాడు. ఈసారి అతనిలోని వ్యాపారస్తుడు పైకి వచ్చాడు. తక్షణం మెకానిక్ ని పిలిచి, "ఈ వాచీ సరైన కండిషన్లో ఉందొ లేదో చూడు" అన్నాడు. పదినిముషాల్లో మెకానిక్ తిరిగి వచ్చి . "ఎక్స్ లెంట్ కండిషన్లో ఉంది!" అన్నాడు. అయితే ఆమె ప్రవర్తనలో ఈ పర్యాయం ఏదో అనుమానం తోచింది. నాగేశ్వరరావుకు. ఆమె ఆ వాచీని ఎందుకు తీసింది? దొంగిలించే ఉద్దేశ్యముంటే తిరిగి ఎందు కిచ్చేసింది? ఆమె చెప్పినది నిజం కాదని అతనికి అనిపించింది.
    అయితే మరో అరగంటలో ఒక కుర్రావాడోచ్చి చెప్పిన వార్త అతన్ని కలవరపరిచింది. ఒక వాచీ కనబడటం లేదు. దాని ఖరీదు సుమారు రెండు వేల ఏడువందలు.
    ఎలా మాయమైందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు మాయమైందో ఊహ కందటం లేదు. నాగేశ్వరరావు మాత్రం ఈ దొంగతనానికీ, ఆమెకూ ఎటువంటి సంబంధముండి ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. కానీ అతనామెను సరదాగా వేయి కళ్ళతో గమనిస్తున్నాడు. ఏ సందర్భంలోనూ ఆమెకు ఆ వాచీ వైపు పోవలసిన అవకాశం రాలేదు. కానీ ఒక విధముగా జరిగి ఉండవచ్చు. ఆమెను శ్రద్దగా గమనిస్తున్న సమయంలో ఆమె తాలుకూ మరో మనిషి, ఆ వాచీ తీసి ఉండవచ్చు. అయితే షాపులో తానొక్కడే కాదు. ఎందరో పనివారున్నారు మరి!
    ఈ విషయాన్నంతటితో సరిపెట్టకూడదని అతననుకున్నాడు. ఆమె నిజాయితీ గురించి తెలుసుకోవాలంటే ఆమె ఇచ్చిన ఎడ్రస్ సరైనదవునో కాదో పరిశీలించాలి. ఈ ఉద్దేశ్యంతో అతను వెంటనే వాణీ సైన్సు కాలేజీ , కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ కి ఫోన్ చేశాడు.
    "హలో! బ్రహ్మచారిగారేనా మాట్లాడుతున్నది?" అని అడిగాడు.
    "ఒక్క క్షణం ఆగండి. ఆయన్ను పిలుస్తాను" అన్నారెవరో. ఒక క్షణంలో అవతల నుంచి ఒక గంబీరమైన కంఠం వినిపించింది. "యస్! ఐయాం హియర్!"
    "హలో, బ్రహ్మచారిగారేనా మాట్లాడుతున్నది...." నాగేశ్వరరావింకా ఏదో అనబోయాడు కానీ, "యూ బ్లడీ పూల్!" అన్న తీవ్రనిందా వాక్యాలతో అవతల వైపు ఫోన్ క్లిక్ మంది.

                                      2
    డాక్టర్ రాజారావు కోపంగా సుబ్రహమణ్యం దగ్గరకు వెళ్ళాడు. "వాడు ఫోన్ లో ఏ మని అడిగాడో నిజం చెప్పు!" అన్నాడు తీవ్రంగా.
    "ఇందులో నిజానికేముంది మేష్టారూ! నేను ఒక ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. రింగయితే నాకే ననుకున్నాను. కానీ డాక్టర్ రాజారావు గారు కావాలన్నాడు. వెంటనే వచ్చి మీకు చెప్పాను" అన్నాడు సుబ్రహమణ్యం.
    పైకయితే అతనలా గన్నాడు కానీ లోలోపల ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. అతనికి తెలుసు! బ్రహ్మచారి అంటే రాజారావు ఉడుక్కుంటాడని .
    రాజారావు మనిషి చాలా తెలివైనవాడే కానీ. రూపం అంత అందంగా ఉండదు. ఒక ప్రత్యేకమైన కోణంలోంచి చూస్తె అతను ఇంచుమించు కోతిలా ఉంటాడు. ఆ సందర్భంగా అతనికి బ్రహ్మచారి అని నామకరణం చేయడం జరిగింది. అది ఎవడు, ఎప్పుడు, ఏ ముహూర్తంలో చేశారో తెలియదు కానీ, బ్రహ్మచారీ శతమర్కటః అన్న సామెత ఉండటమనీ మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.
    ఈ కారణం రాజారావుకు తెలిసేలా కూడా చేశాడు . అందుకే బ్రహ్మచారి అంటే అతనికి వీరావేశం కలిగి ఆంజనేయుడిలా చిందులు తోక్కుతాడు.
    సుబ్రహ్మణ్యం చెప్పిన సమాధానం విని గొణుక్కుంటూ రాజారావు మళ్ళీ తన క్లాసు లోకి వెళ్ళాడు. పాఠం చెప్పటంతో క్రమంగా అతని ఆవేశం తగ్గి మళ్ళీ మామూలు మనిషయ్యాడు. అయితే సరిగ్గా క్లాసు ముగిసే సమయానికి ఫ్యూన్ వచ్చి "మీకోసం ఎవరో వచ్చారు సార్" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS