"పిల్చారట?" అంటూ జానకి ఎదురుగా కుర్చీలో కూర్చుంది.
"ఎంత పొగరు ?కనీసం కూర్చోమనేదాకయినా నిల్చోవద్దూ- ఆఫీసరు ముందు న్యాయంగా ఆఫీసరు కూర్చోమన్నా కూర్చోవటానికి సందేహించాలి" పైకి అనలేక మనస్సులోనే అనుకుంది మిసెస్ కైలాసం.
"ఎందుకండీ పిల్చారట?" మళ్ళీ అడిగింది జానకి, ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుని.
"రమణి ఆర్డర్స్ కాన్సిల్ అయ్యాయి" ప్రశ్నార్ధకంగా చూస్తూ అంది మిసెస్ కైలాసం.
"విన్నాను ఇప్పుడే" ముభావంగా అంది జానకి.
"మంత్రిగారు రమణి అంటే అంత శ్రద్ధ తీసుకోవటానికి కారణం ఏమిటంటావు?" కొంచెం ముందుకు వంగి కుతూహలంగా ప్రశ్నించింది మిసెస్ కైలాసం.
జానక్కి నవ్వు వచ్చింది. మిసెస్ కైలాసం మాటల్లోని అంతరార్ధం తెలుసుకొన్న జానక్కి అసహ్యం వేసింది. మొరటుగా జవాబు చెప్పాలనిపించింది. 'నాకు తెలియదు' అని మాత్రమే అనగలిగింది.
జానకి జవాబుకు మిసెస్ కైలాసం అరికాలి మంట నెత్తి కెక్కింది.
"ఇలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. పెద్ద ఆఫీసర్లు ఇచ్చిన అర్దర్సును ఒబే చెయ్యాలి గాని ఇలా ఎవరేవర్నో పట్టుకొని కాన్సిల్ చేయించుకోవటం మోస్టు ఇండిసిప్లిన్. ఇదే తెల్లవాళ్ళ రాజ్యంలో అయితేనా?"
"ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. పెళ్ళి కావాల్సిన పిల్ల అంత దూరం ఎలా వెళుతుంది" సౌమ్యంగానే అంది జానకి.
"గవర్నమెంటు సర్వీసు అంటే ఏమిటనుకున్నావ్?" రెట్టించింది మిసెస్ కైలాసం.
"క్షమించండి ! మరి పోయిన సంవత్సరం మీకు ట్రాన్స్ ఫర్ వస్తే ప్రభుత్వాన్నీ, భగవంతున్నీ దుమ్మెత్తి పోశారుగా. ముఖ్యమంత్రి గారి దగ్గర భోరు భోరున ఏడ్చి ఆర్డర్స్ కాన్సిల్ చేయించుకున్నారుగా?" అంది జానకి.
మిసెస్ కైలాసం ముఖం మాడిపోయింది. కుర్చీలో కర్రలా బిగుసుకుని నిటారుగా కూర్చుంది.
"బలేదానివే! నేనూ రమణీ ఒకటేనా ఏమిటి ?" ఎలాగో గొంతు పెగల్చుకొని అంది మిసెస్ కైలాసం.
జానకి లేచి చెప్పకుండానే బయటకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళి పోతున్న జానకిని చూసి "అసలు నిన్ను పిలవడం నా బుద్ది తక్కువేలే" అనుకుంది పళ్ళు పటపట కోరకబోయి పెదవి కొరుక్కుంది.
అసలే అష్టకష్టాలు అనుభవిస్తున్న మిసెస్ కైలసానికి ఓ శుభముహూర్తాన పిడుగులాంటి వార్త నెత్తిన పడింది. ప్రస్తుతం వున్న అఫీసరమ్మగారి స్థానంలో ఓ మగ ఆఫీసరు వస్తున్నాడని తెలిసింది. ఆ వార్త విన్న మిసెస్ కైలాసం ఆఫీసులో, ఇంట్లో , చివరకు ఊళ్ళో కూడా కాలు కాలిన పిల్లిలా తిరిగింది.
మగ ఆఫీసరే! ఇంకేమయినా ఉందా? లోలోపల గుండెలు బాదుకుంది. ఆడపిల్లలు బతకతానికే? అసలే ఆ జానక్కి పట్టపగ్గా లుండవు. రెండు రోజుల్లో ఆ మగ ఆఫీసర్ని వల్లో వేసుకోదే! ఇంకేమైనా వుందా? ఇక తనను లెక్క చేసేవాళ్ళు ఆ ఆఫీసులో వుంటారా? మిసెస్ కైలాసం తనకు వున్న పలికిబడినంతా ఉపయోగించి ఆ మగ ఆఫీసరు రాకుండా చెయ్యటానికి ప్రయత్నించింది.
కాని ఒక దుర్ముహుర్తాన ఆ మగ ఆఫీసరు వచ్చి కూర్చున్నాడు.
ఆఫీసులో పడగవిప్పిన పాములా తిరిగే మిసెస్ కైలాసం ఆఫీసరు గదిలోకి అడుగు పెడుతూనే చెప్పు కింద తేలులా ఇట్టే మారిపోగలదు - కాబట్టి మిసెస్ కైలాసం వెంటనే మారిపోయింది. వెన్న కంటే మృదువూ, చక్కెర కంటే తియ్యని నవ్వును ముఖం మీద పులుము కొని ఆఫీసరు గదిలో కాలు పెట్టింది.
అలా వచ్చిన ఆమెను ఆఫీసరు ప్రశ్నార్ధకంగా చూశాడు. తన పరిచయం ఇచ్చుకుంది. వెంటనే అయన మర్యాద ఉట్టిపడే స్వరంలో ఆమెను కూర్చోమన్నాడు.
"ఫర్వాలేదు. మంచివాడులాగే వున్నాడు. ఎంత మర్యాద! కాని వయస్సులో మరీ చిన్నవాడిలా వున్నాడు. ఆడపిల్లల వల్లో పడకుండా చూడాలి" అనుకొంది మిసెస్ కైలాసం.
"చెప్పండి , ఆఫీసు ఎలా వుంది ?" ఏదో అడగాలి కాబట్టి అడిగాడు ఆఫీసరు.
ఆలోచిస్తున్న మిసెస్ కైలాసం ఉలిక్కిపడింది. తననే ఆ ప్రశ్న వేసింది? తననే! ఇంకెవరూ ఆ గదిలో లేనిదే ? ఎంతమంచి వాడు? తనకెంత గౌరవాన్ని ఇస్తున్నాడు? ఆఫీసు ఎలా ఉందని తననే ప్రశ్నిస్తున్నాడు ? చాలా తెలివైన కుర్రాడు ! అనుకుంది మిసెస్ కైలాసం.
ఆ ప్రశ్నకోసమే ఎదురు చూస్తున్నట్లు గబగబా ఆ ఆఫీసులో వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళో చెప్పేసి గాలి పీల్చుకుంది. ఆఫీసరు ఆశ్చర్యంగా ఆమె మాటలు వింటూ గంభీరంగా చూస్తున్నాడు.
"ఆ జానకి అనే ఆవిడకు అంత గర్వమా అండీ?" అడిగాడు ఆఫీసరు.
"చిన్నగా అడుగుతారేం. మీరు ఆమె గర్వాన్ని అణచాలి. ఆఫీసర్లను ఎలా గౌరవించాలో నేర్పించాలి." అంది.
"నా దగ్గిర అలాంటివి సాగవు లెండి ?" అన్నాడు ఏదో ఆలోచిస్తూ.
"సర్! ఒక మనవి. నేనూ రోజూ నాలుగున్నరకే వెళ్ళిపోతాను. ఇంతకుముందు వున్నా అఫీసరమ్మ గారు నాకు పర్మిషన్ ఇచ్చారు. ఉదయం కూడా ఒక గంట ఆలస్యంగానే వస్తాను." అంది మిసెస్ కైలాసం తలవొంచుకొని ముసి ముసిగా నవ్వుతూ.
ఆఫీసరు ఆమెనూ, ఆమె సిగ్గునూ కళ్ళు పెద్దవి చేసుకొని చూశాడు. అతని మౌనాన్ని అంగీకారంగా తీసుకుంది.
"సర్! ఆ జానకి గవర్నమెంటుకు నాతొ సమానం అయిన ఉద్యోగం కావాలని అప్లికేషన్ కూడా పెట్టుకుంది. ఎంత ధైర్యమో ఆలోచించండి." అంది మిసెస్ కైలాసం.
ఆఫీసరు అర్ధం కానట్టు చూశాడు మిసెస్ కైలాసం ముఖంలోకి. పెద్ద ఉద్యోగం కావాలని కోరటం నేరం అని ఇంతకూ ముందేప్పుడూ ఆతని బుర్రలోకి రాలేదు.
"వెళ్ళొస్తానండీ!" అంది.
"అలాగే వెళ్లిరండి ." అన్నాడు ఆఫీసరు ఆమెను అదోలా చూస్తూ.
"ఆఫీసరు మంచివాడే కాని మగవాళ్ళు చెడగొట్టకుండా ఉండాలిగా!" అనుకుంటూ బయటకు వచ్చింది మిసెస్ కైలాసం.
