Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 47

 

    ఆజ్యం ముఖం మాడిపోయింది. శీల ముఖంలోకి చూసింది. ఏడవలేక నవ్వుతుంది శీల. జానకి వైపు చూసింది రాజ్యం. జానకి పెదవుల మీద లాస్యం చేస్తున్న చిరునవ్వును చూసి ఆశ్చర్యపోయింది రాజ్యం. జానకి ముఖం మాడ్చుకోకపోవటం మిసెస్ కైలాసానికి కొంత నిరాశనే కలిగించింది.
    జానకి రెండడుగులు ముందుకు వేసింది. "ఏమిటంట?" అన్నట్లు చూసింది మిసెస్ కైలాసం.
    "క్షమించండి! మొన్నటిదాకా మీరు ఎన్.జీ.ఓ ఏ గదా? ఆహా నాకు తెలియక అడుగుతున్నాను. మీరు బస్ స్టాండుల్లో నిల్చొని "టీ" తాగుతూ , వేరుశనగ కాయలు తింటూ నిల్చునేవారా అండీ?" మేమూ ఎప్పుడూ అలా చెయ్యలేదు లెండి. అందుకే తెలియక అడుగుతున్నాను." అంది జానకి వ్యంగ్యంగా.
    మిసెస్ కైలసానికి మాటలే కరువయ్యాయి. అసలే చిన్నదయిన మిసెస్ కైలాసం ముఖం ముడుచుకొని చింతాకంత అయింది. అసలే పొడుగాటి కాళ్లేమో , గబగబా రెండంగల్లో వెళ్ళి రోడ్డు పక్కగా వున్న రిక్షా ఎక్కి కూర్చుంది, బేరం కూడా అడక్కుండా . ఆ తరవాత రిక్షావాడితో పడే పేచీ ఆ పక్కింటివాళ్ళ నడిగితే తెలుస్తుందేమో!
    "మీకు చాలా దైర్యం బాబూ!" అంది రాజ్యం , జానకి ధైర్యాన్ని మెచ్చుకోవటానికి బదులుగా నోచ్చుకుంటున్నట్లు . రాజ్యానికి తనకు లేదనే బాధకంటే ఇతర్లకు వున్నదనే బాధ ఎక్కువ.
    "నిజం మాట్లాడట్టానికి భయం ఎందుకు? మనల్ని ఇంతమందిని అవమానించే అధికారం ఆమెకు ఎవరిచ్చారు?" అంది జానకి.
    అలా అన్నదే కాని జానకి కళ్ళముందు మిసెస్ కైలాసం చింతాకంత ముఖం కనిపించేటప్పటికి జాలి వేసింది. తను అంత మొరటుగా అనాల్సింది కాదేమో!
    జానకి అవకాశం చిక్కినప్పుడల్లా భూమి మీద అనని మిసెస్ కైలాసం కాళ్ళను పట్టుకొని కిందకు లాగి "ఇదీ భూమి . నువ్వు నిల్చోవలసింది ఇక్కడ!" అని చెప్పటానికి ప్రయత్నిస్తూ వుంటుంది. అలా లాగినప్పుడల్లా మిసెస్ కైలాసం కిందకు దిగటమే కాకుండా, అప్పుడప్పుడు బొక్క బోర్లా ముక్కుకు దుమ్మంటేలా పడటం కూడా జరుగుతూ వుంటుంది.
    మిసెస్ కైలాసం ఎంతగా మందను తప్పించుకు తిరగాలనుకుంటున్నా అప్పుడప్పుడు ఆఫీసువాళ్ళకు బస్సు స్తాండులో తటాస్థపడ్తూనే వుంటుంది.
    ఒకరోజు బస్ స్టాండ్ లో శీల చేతిలో వున్న ఓ తెలుగు వార పత్రికను  అందుకుంది. తెరిచి చూస్తూ "నాకు తెలుగు సాహిత్యం" అన్నా, తెలుగు సినిమాలన్నా అసహ్యం. అసలు తెలుగు భాష మాట్లాడమంటేనే చిరాకు. ఇంగ్లీషులో ఎక్స్ ప్రెషన్ "తెలుక్కుఎక్కడుంది?" అంది. అంతలోనే ఆ దృష్టి పత్రికలోని ఒక కధ పేపరు మీద పడింది. మిసెస్ కైలాసం పకపక నవ్వసాగింది. అర్ధం కాక శీలా, రాజ్యం, జానకీ ఆమె ముఖం లోకి చూశారు ఆశ్చర్యంగా.
    "ఈ తెలుగు వాళ్ళకు కధలకు పేర్లు పెట్టటం కూడా రాదు. 'పాకుడు రాళ్ళు' అట. రాళ్ళు ఎక్కడన్నా పాకుతాయా?" అంటూ తన చమత్కారానికి తానే మురిసిపోతూ పకపకా విరగబడి నవ్వసాగింది. మిసెస్ కైలాసం.
    "పాకుడు రాళ్ళు పాకవు. కాని ఆ రాళ్ళ మీద ఒకసారి కాలువేసి చూడండి- మీరు ఎంత దూరం పాకుతారో తెలుస్తుంది. కనీసం పదిగజాలకు తక్కువ లేకుండా పాకిపోతారు తెలుసా?" అంది వళ్ళు మండిన జానకి.
    అందరూ ఘోల్లున నవ్వారు. అంతలోనే మిసెస్ కైలాసం తమ ఆఫీసరని గుర్తురాగానే అందరూ బిగుసుకుపోయారు. మిసెస్ కైలాసం నిలువుగా కర్రలా బిగుసుకు నిల్చుంది. దూరంగా జరిగి . జానక్కి ఆమెను చూస్తుంటే మళ్ళీ జాలివేసింది. అంతవరకూ వెలిగిపోతున్న మిసెస్ కైలాసం ముఖంలో ఎవరో స్విచ్ ఆఫ్ చేసినట్లు వెలుగు ఆరిపోయింది.
    మిసెస్ కైలాసానికి జానకిని తుమ్మ చెట్టుకు కట్టి చింత బరికెతో కొట్టాలనిపించింది.
    ఆనాడు బస్ స్టాండు కు వచ్చిన మిసెస్ కైలాసం చాలా ఉత్సాహంగా వుండటాన్ని గమనించింది జానకి. అందరితో చాలా ఉత్సాహంగా కబుర్లు చెప్పసాగింది. ఆనాడు జానకితో కూడా ఆప్యాయంగా మాట్లాడసాగింది మిసెస్ కైలాసం 'తను ఇంగ్లాండులో వుండగా (నాలుగు నెలలు ఏదో కోర్సు చదివింది) అనే విషయాన్ని గురించి ఉపన్యాసం దంచుతూ వుంది.
    ఇంతలో జానకి ఒక కుంటి బిచ్చగాడికి రెండు నయా పైసలు ఇచ్చింది. దాంతో మిసెస్ కైలాసం గారి వాగ్దోరణి మరో వైపు తిరిగింది.
    "మీలాటి వాళ్ళుండబట్టే మనదేశంలో బెగ్గింగ్ నానాటికి పెరిగి పోతుంది. ఇదే ఇంగ్లాండులోనయితేనా?" అంటూ బిక్షావృత్తిమీద ఐదు నిమిషాలు అనర్గళంగా ఉపన్యాసం దంచింది.
    "శారీరకంగా బాగా ఉన్నవాళ్ళకు బిక్షపెట్టకూడదు- కాని కుంటివాళ్ళు , గుడ్డి వాళ్ళు ఎలా బ్రతకాలండీ?" వినయంగానే ప్రశ్నించింది రాజ్యం.
    "అసలు వాళ్ళూ ఎందుకు బ్రతకాలీ అంట? వాళ్ళ వల్ల దేశానికి ఏమిటి ఉపయోగం ?" నిలదీసి ప్రశ్నించింది మిసెస్ కైలాసం.
    "చావు బ్రతుకులు మన చేతుల్లో వున్నాయా? అయినా మనందరం బ్రతికి మాత్రం దేశాన్ని ఉద్దరిస్తుందేమిటో ?" అంది జానకి ఉద్రేకంగా.
    ఇంతలో బస్సు వచ్చింది. అ పళంగా మిసెస్ కైలాసం అడా - మగా , బాల - వృద్ద విచక్షణ లేకుండా బరబరా తోసుకుంటూ వెళ్ళి, బస్సు ఎక్కింది. బస్సు ఎక్కటం దిగటంలో ఆమెకు ఆమె సాటి. ఈ పాడు మాబ్ (నర) వాసన తనకు గిట్టదన్నట్లు , బస్సు స్టాండులో నిల్చున్నా రోడ్డు వెంట నడుస్తున్నా, బస్సులో కూర్చున్నా ఇంతలావు ముతక కర్చీపు ఒకటి ముక్కుకు అడ్డుపెట్టుకునే వుంటుంది.
    ఇలా జరుగుతుండగా మిసెస్ కైలాసం ఆ ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తున్న రమణి అనే అమ్మాయిని పక్క జిల్లాలకు బదిలీ చేయించింది. రమణి శ్రీమంతుల బిడ్డ. అందంగా వుంటుంది. పైగా చక్కగా ముస్తాబయి వస్తుంది. ఉత్సాహంగా పని చేసుకుంటూ అందరితో కలివిడిగా వుంటుంది. రమణి అంటే మిసెస్ కైలాసానికి పరమ అసహ్యం. అలాంటి ఆడపిల్లలు ఆఫీసులో వుంటే మగవాళ్ళేవ్వరూ పనులు చేయరని మిసెస్ కైలాసం అభిప్రాయం. ఆ అమ్మాయి బదిలీ ఆర్డర్ను చూసి తేలిగ్గా నిట్టూర్చింది మిసెస్ కైలాసం. కాని ఆమెకు ఈ అనందం ఎంతకాలమో దక్కలేదు. తెల్లవారే మంత్రిగారి నుంచి ఫోన్ రావటం వల్ల ఆ ఆర్డరు కాన్సిల్ చెయ్యాల్సి వచ్చింది.  మిసెస్ కైలసానికి మూర్చ వచ్చినంత పనయింది. ఎలాగో తన మూర్చ తానే తెలుపుకున్నదై మంత్రి గారికీ ఆ అమ్మాయికి మధ్య సంబంధాన్ని గురించి తలబద్దలు కొట్టుకొసాగింది. ఆ ఆఫీసులో తనకు తాళం వేసే కొందరిని పిలిపించి , ఆ విషయం మీద చర్చలు సాగించింది. కాని మిసెస్ కైలాసం మనస్సుకు శాంతి లభించలేదు. జానకి కోసం కబురు పంపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS